శాకంభరి
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
పూర్వం హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే వాడొకడు పుట్టాడు. వాడు పరమ రాక్షసుడు. అతనికి ఒక దురాలోచన వచ్చింది. అది - వేదాలను అపహరిస్తే వాటి బలంతో బ్రతుకుతున్న దేవతలు నశిస్తారు - అని. వెంటనే హిమాలయా పర్వతాలకు వెళ్ళి వెయ్యి సంవత్సరాలు ఉగ్ర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకుమ్మన్నాడు. వెంటనే దుర్గముడు - బ్రాహ్మణుల దగ్గర ఉన్న వేదములు, వేద మంత్రములు తనకు కావాలని, దేవతలకు అపజయం కలగాలని కోరుకున్నాడు. సరే అన్నాడు బ్రహ్మ. వేదాధ్యయనము, జపహొమాదులు వదలి వేశారు బ్రాహ్మణులు. హొమాదులు మానివెయ్యటం వలన, తమకు అందవలసిన హవిర్భాగములు అందక, దేవతలు శక్తి హీనులయ్యారు. యజ్ఞాలు, తపాలు, జపాలు లేక ప్రకృతి ధర్మం నశించింది. వానలు కురువలేదు. పంటలు పండలేదు. అనావృష్టి వలన పశుపక్ష్యాదులు, మనుష్యులు ప్రాణాలు వదిలారు. భూమి మృత కళేబరాలతో దుర్భరం అయింది. ఆ సమయంలో బ్రాహ్మణులు హిమవత్పర్వతానికి వెళ్ళి ఆ పరాశక్తిని ప్రార్థించారు. అమ్మవారు కరుణించి తొలకరి మబ్బు వంటి శరీరఛాయ, నూరు కన్నులు, కోటి సూర్యుల దివ్యతేజస్సు, లోకోత్తరమైన లావణ్యములతో ప్రత్యక్షమైంది. ఆ తల్లి చేతులలో మధుర రసభరితములైన ఫలాలు, రకరకాల భక్ష్య భోజ్య పదార్ధాలు ధరించి ఉండింది. ఆమె కండ్లు పూర్ణ కుంభాల్లాగా ఉండినాయి. ఆ కండ్ల నుంచి 9 రోజులు ఏకథారగా కారిని నీటితో ఓషధులన్నీ జీవకళతో ఒప్పినాయి. నదీనదాలు, చెరువులు జల సమృద్దములయ్యాయి. జగత్తు చల్లబడింది. ఆమె శరీరం నుండి ఫల శాక సమూహములు, అన్న పానామృతములు ఆవిర్భవించి లోకంలోని కరువు రూపుమాపబడింది. కనుక ఆమె 'శాకంభరి ' అని కీర్తింపబడింది (శ్రీదేవీ భాగవతం సప్తమస్కంధం). ఆ దేవి అనుగ్రహించిన 9 రోజులను ' శాకంభరీ ' నవరాత్రులుగా పూజ చేస్తున్నారు.