ద్వినామ నామకరణ

వికీపీడియా నుండి
(శాస్త్రీయ నామం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆధునిక టాక్సానమీ యొక్క పితగా భావించబడే కరోలస్ లిన్నేయస్.

జీవశాస్త్ర నియమానుసారంగా గుర్తించిన మొక్కలకు లేదా జంతువులకు సరైన పేరు పెట్టడాన్ని నామీకరణ (Nomenclature) అంటారు. ఇది వర్గీకరణ శాస్త్రం లో ఒక ముఖ్యాంశం. 18 వ శతాబ్దం ప్రారంభంలో మొక్కలకు పేర్లు బహునామీయం (Polynomial) గా ఉండేవి. ఈ పేర్లు చాలా పొడవుగా ఉండి, ఆ జీవుల లక్షణాలను సూచిస్తూ ఉండేవి. ఇటువంటి పేర్లను గుర్తుపెట్టుకోవడం కష్టం కనుక, తరువాతి కాలంలో ద్వినామీకరణ (Binomial) పద్ధతిని పాటించారు.

మొక్కల ద్వినామీకరణ

[మార్చు]

ద్వినామీకరణ పద్ధతిని గాస్పర్డ్ బాహిన్ (Gaspard Bauhin) 1596లో ప్రవేశపెట్టాడు. లిన్నేయస్ (Linnaeus) 1753లో తన మొక్కల జాతులు (Species plantarum)లో ద్వినామీకరణను అన్ని మొక్కలను అనుసరించాడు.

ద్వినామీకరణం ప్రకారం ప్రతిమొక్క పేరులోను రెండు లాటిన్ పదాలు లేదా లాటినీకరణం చేయబడిన ఇతర భాషల పదాలు ఉంటాయి. మొదటి పదం ప్రజాతి (Genus) పేరును, రెండవ పదం జాతి (Species) పేరును తెలుపుతుంది. ఒక మొక్క పూర్తి శాస్త్రీయనామంలో చివరగా ఆమొక్కను నియమబద్ధంగా వర్గీకరించిన కర్త (Author) పేరు ఉంటుంది.

ప్రజాతి పేరు : ఒక మొక్క ప్రజాతిపేరు లాటినీకరణం చేయబడిన నామవాచకరూపం ఇది పెద్ద అక్షరాల (Capital letter)తో ప్రారంభమవుతుంది. ప్రజాతి నామం ప్రముఖ లక్షణాన్ని బట్టిగాని, ఒక శాస్త్రవేత్త గౌరవసూచకంగా గాని, ఆ మొక్క ప్రబలంగా నివసించే ప్రదేశాన్ని బట్టిగాని పెడతారు.

జాతి పేరు : ఒక మొక్క జాతిపేరు ఆ మొక్కలోని ఒక ప్రముఖ లక్షణానికి సంబంధించిన విశేష రూపమై ఉంటుంది. దీనిని ఎల్లప్పుడు చిన్న అక్షరం (small letter)తో ప్రారంభిస్తారు.

కర్త పేరు : ఒక మొక్కపేరులోని ప్రజాతి, జాతి పదాల తరువాత కర్తపేరు ఉంటుంది. కర్తపేరు సంక్షిప్తంగా ఉండవచ్చు. తండ్రిపేరు, కుమారునిపేరు ఒకటే అయినప్పుడు 'ఫ్' అనే అక్షరం కుమారుని పేరు తర్వాత ఉండాలి.

అంతర్జాతీయ వృక్ష నామీకరణ

[మార్చు]

18 వ శతాబ్దంలో వృక్ష శాస్త్రజ్ఞులు అనేక రకాల కొత్త మొక్కలను కనుగొనటం, వాటికి పేర్లు పెట్టడం జరిగింది. ఈ నామీకరణ చేయటానికి ఒక నియమావళి లేకపోవటంతో, ఒకే మొక్కకు రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. అందువలన వృక్ష నామీకరణకు ఒక నియమావళి ఉండాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మొక్కల నామీకరణకు కొన్ని మూల సూత్రాలను మొదటిసారిగా లెన్నేయస్ ప్రతిపాదించాడు. అగస్టీన్ డీ కండోల్ 1813లో వృక్ష నామీకరణకు సంబంధించిన పూర్తిస్థాయి సూత్రాలను తన గ్రంధమైన థియెరి ఎలిమెంటైరి డి లా బొటానిక్ (Theorie elementaire de la botanique) లో ప్రతిపాదించాడు. వాటిని డీ కండోల్ సూత్రాలు (de CAndollean rules) అని అంటారు. అంతర్జాతీయ వృక్షశాస్త్ర సమావేశము (International Botanical Congress)లలో వృక్షనామీకరణ నియమావళులను పునఃపరిశీలన చేశారు. ప్రస్తుతము ఉన్న అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి (International Code of Botanical Nomenclature:ICBN) 1978లో అమోదించబడినది.