శివతాండవ స్తోత్రం

వికీపీడియా నుండి
(శివతాండవ స్తోత్రము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శివతాండవ స్తోత్రం రావణాసురుడిచే రచించబడింది.

శివతాండవ స్తోత్రం త్రిమూర్తులలో ఒకడైన శివుడిని ప్రస్తుతిస్తూ రాసిన సంస్కృత స్తోత్రం. దీనిని పరమ శివభక్తుడైన రావణాసురుడు రచించినట్లుగా భావిస్తారు.[1][2]

పాఠం, అర్థం

[మార్చు]

౧. జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకారచండతాండవంతనోతునశ్శివశ్శివమ్

- అరణ్యమును పోలు జటాజూటము నుంచి స్రవించు గంగానదీ ప్రవాహముచేత శుద్ధి చెందినా కంఠసీమను మాలవలె అలంకరించిన సర్పము కలిగినవాడు, తన డమరుకము నుండి డమ డమ శబ్దములు వెల్వడిరాగా ఆనంద తాండవమొనర్చుచున్నవాడు అయిన పరమశివుడు మనకు సమస్త శుభములను కలిగించుగాక

౨. జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ

విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీ

ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే

కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ

- (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) జటాజూటము నందు సురనదీ ప్రవాహమును కలిగినవాడు, ఆ ప్రవాహము పైకి ఎగబ్రాకుతున్న తీగలవంటి కురులు కలిగిన శిరోభాగము కలిగినవాడు, జ్వాలలతో వెలుగొందు అగ్నిని తన ఫాలప్రదేశమునందున్నవాడు, బాలచంద్రప్రభతో శోభిల్లునట్టివాడు అయిన పరమశివుని యందు నా మనస్సు ప్రతిక్షణమూ రమించుచున్నది.

౩. ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర

స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే

కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ

- (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) విలాసమైన పర్వతరాజపుత్రిక కు మగడు, ఎవని మనస్సు దిగంతములలోని సమస్త జనుల ఉనికితో నిండియున్నదో, ఎవని కృపాకటాక్షవీక్షణములు సోకితే సమస్త ఆపదలూ నశించునో, అట్టి దిక్కులే అంబరములుగా ఉన్నవానిపైన నా మనస్సు రంజించుచున్నది.

౪. జటాభుజంగపింగళ స్ఫురత్ఫణామణిప్రభా

కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే

మదాంధసింధురస్ఫుర త్వగుర్తరీయమేదురే

మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి

- (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) జటాజూటమును అలంకరించిన పచ్చని సర్పముయొక్క ఫణి మణికాంతులతో విరాజిల్లుచూ, దిక్కులను కదంబకుంకుమ కాంతులతో నింపుచుండగా, పైని గజచర్మముతో చేయబడిన ఉత్తరీయము ఎగసి మదపుటేనుగును పోలగా సమస్త భూతపతిగా శోభించుచున్న వాడు నా మనస్సును ఆనందముతో నింపుగాత

౫. సహస్రలోచనప్రభుత్యశేషలేఖశేఖర

ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూః

భుజంగరాజమాలయానిబద్ధజాటజూటకః

శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖరః

- అశేషమైన ఇంద్రాది దేవతలయొక్క పంక్తి మొక్కుటచే ప్రభవించిన ధూళిచేత కప్పబడిన పాదపీఠముకలిగి, వాసుకి అనెడు సర్పరాజముచేత బంధింపబడిన జటాజూటము కలిగి, చకోట పక్షులకు ప్రియుడైన చంద్రుని శిఖయందు ధరించినవాడు మాకు శ్రియములనొసగుగాక.

౬. లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా

నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకమ్

సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరమ్

మహాకపాలిసంపదేశిరోజటాలమస్తునః

- హోమాగ్నివలె ప్రజ్వరిల్లుచున్న లలాటాగ్ని కలిగి, ఆ అగ్నిలో పంచబాణుడైన మన్మథుని ధగ్ధము చేసినవాడు, లోకనాయకుడు, అమృతకిరణముల పంక్తిచేత విరాజిల్లుచున్న శిఖకలిగినవాడు మహాకపాలమును ధరించువాడు అయిన పరమేశ్వరునికి మ్రొక్కి మేము ఆయన శిఖలోని సంపదలకు ప్రాప్తులు కాగలము.

౭. కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల

ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే

ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక

ప్రకల్పనైకశిల్పినీ త్రిలోచనే రతిర్మమ

- భీకరమైన ఫాలప్రదేశమున ధగద్ధగాయమాన జ్వాలలతో వెలుగొందు అగ్నిచేత మన్మథుని దాహించినవాడు, పార్వతీదేవియొక్క కుచములపైని చిత్రములు రచించువాడు (ఆమె యందు అనురక్తి కలవాడు), మాహాశిల్పి (లోకసృష్టియందు) అయిన త్రిలోచనునియందు నా మనస్సున్నది.

౮. నవీనమేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్

కుహూనిశీధినీతమః ప్రబంధబద్ధకంధరః

నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః

- క్రొత్త మేఘముల సమూహము వంటిది, దురాపదలను నిర్మూలింపదగినదయి స్ఫురించునది, కుహూరాత్రియందు చీకటి మాదిరి భాసించు నల్లని కంఠము కలిగినవాడు, గంగానదిని ధరించువాడు, గజచర్మాంబరధారీ, చంద్రకళాధరుడు, జగత్కళ్యాణకర్త మాకు శ్రియములు చేకూర్చుగాక

౯.ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా

వలంబికంఠకందలీ రుచిప్రబద్ధకంధరమ్

స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదమ్

గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

- వికసించిన నీలసరోజ సమూహమువలె నల్లని ప్రభ తోచు కంఠసీమను అవలంబించినడి అను భ్రాంతి కలిగించువిధముగా సర్పాలన్కృత కంఠముచేత భాసిల్లువాడు, మన్మథారి, త్రిపురారి, భావారి, మఖారి, గజారి, అంధకారి, యమారి అగువానిని భజించెదను.

౧౦. అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ

రసప్రవాహమాధురీవిజృంభణామధువ్రతమ్

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకమ్

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే

- సమస్త మంగళములనూ పొడిగించువాడు, కదిమిపూల తేనెయందు అనురక్తి కలిగినవాడు, మన్మథారి, త్రిపురారి, భావారి, మఖారి, గజారి, అంధకారి, యమారి అగువానిని భజించెదను.

౧౧. జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస

ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాళఫాలహవ్యవాట్

ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగమంగళ

ధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవశ్శివః

- భుజంగోచ్చ్వాసనిశ్వ్వాసలు ఆకాశముచేయు జయజయధ్వానములు కాగా, బయటికి వెల్వడు ఫాలప్రదేశ విస్ఫులింగములు క్రమముగా చేకూర, ధిమిధిమి నాదములతో ఢమరుకము ఉచ్చమంగళరీతి మ్రోగగా వాటికి అనుగుణముగా ప్రచండతాండవము చేయు పరమశివుని ...

౧౨. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజో

ర్గరిష్ఠరత్నలోష్టయోః సహృద్విపక్షపక్షయో

తృణారవిందచక్షుషో ప్రజామహీమహేంద్రయో

సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్

- చూడగా, విచిత్రములైన లోకరీతులు - భుజంగహారము కానీ, ముత్యపుసరము కానీ, అమూల్యరత్నము కానీ, లేక మట్టి గానీ, తనవాడు కానీ లేక పెరవాడు కానీ, గడ్డివంటి కనులుండనీ, లేక అరవిందలోచనుడు కానీ, సామాన్యుడు కానీ మహారాజు కానీ, నేను సమముగా తలచి ఎప్పుడు మహేశ్వరున్ని సేవించగలను.

౧౩. కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్

విముక్తదుర్మతిస్సదాశిరస్థమంజలింవహన్

విలోలలోలలోచనో లలామఫాలలగ్నకః

శివేతిమంత్రముచ్ఛరన్ కదా సుఖీ భవామ్యహమ్

- ఎప్పుడు నేను సురనదీతీరమున గల సుందరవనములయందు వసించి దుర్మతిని వీడి, సదా శిరస్సుపైన అంజలి చేర్చి, వికలమైన చూపు లేక, ఫాలలలామునియందు మనస్సు చేర్చి, "శివ" అను మంత్రము జపించుచూ సుఖించెదను?

వికీసోర్సులో శివతాండవ స్తోత్రము యొక్క పూర్తి పాఠం ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Vālmīki; Menon, Ramesh (2004-05-26). The Ramayana: A Modern Retelling of the Great Indian Epic (in ఇంగ్లీష్). Macmillan. ISBN 978-0-86547-695-0.
  2. Ayres, Elizabeth (2005). Know the Way: A Journey in Poetry and Prose (in ఇంగ్లీష్). Infinity Publishing. p. 18. ISBN 9780741428257.

బయటి లింకులు

[మార్చు]