Jump to content

తేనె

వికీపీడియా నుండి


కెమీలీయా పూలనుండి స్రవిస్తున్న మకరందం
పూలనుండి మకరందాన్ని సేకరిస్తున్న తేనెటీగ

తేనెటీగలు పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండడానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టకముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానే. మొట్టమొదటగా మద్యాన్ని తయారుచేసిందీ తేనెతోనే. ప్లేటో, అరిస్టాటిల్, డిమొక్రటిస్... లాంటి తత్త్వవేత్తలంతా తేనె వైశిష్ట్యాన్ని తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. మన ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది. శుశ్రుతసంహిత తేనెను తాగేమందుగా వర్ణించింది, శ్వాసకోశవ్యాధులకు మధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది.

తేనె చరిత్ర

[మార్చు]

ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది, బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే వాటిలో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. ఇలా కృత్రిమంగా జరిగే ఈ తేనెటీగల పెంపకం, తేనె సేకరణ వల్ల తేనెపట్టుల్లో లభించే తేనె ప్రమాణం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇక అడవుల్లో లభించే కాడు తేనె సంగతి సరేసరి. ఇప్పటికే సగానికి క్షీణించిన ఈ అడవి తేనె మరి కొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగే అవుతుందేమోననే భయాన్ని ప్రకృతి ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందునుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. స్పెయిన్‌లోని వలెన్సియా అనే ప్రాంతంలోని గుహలో అడవి తేనె వేటకు సంబంధించిన చిత్రాలున్నాయి. ఇవి 8 వేల సంవత్సరాల నాటివని చారిత్రకులు నిర్ధారించారు కూడా.నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞ్రుడు హ్యూబర్‌కు దక్కుతుంది. రెండు వందల సంవత్సరాల క్రితం స్వతహాగా గుడ్డివాడయినప్పటికీ భార్య, సహాయకురాలి సాయంతో రాణిఈగ తన గూడుకు చాలా దూరంలో ఉన్న మగ ఈగతో ఎలా సంపర్కం పెంచుకుంటుంది? తేనెపట్టుపై ఉన్న రంధ్రాల సైజును చూసి కూలి మగ ఈగలను, వాటి సంఖ్యను ఎలా గుర్తించవచ్చో హ్యూబర్ వివరంగా తెలియజేసారు. సహజంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల్లో సాధారణంగా కనిపించే అడవి తేనెటీగల రకాల్లో ఎపిస్ దోర్సలా, అపిస్ సెరెనా ఇండికా, ఎపిస్ ఫ్లోరియా, డ్యామెస్ బీ లేదా స్ప్రింగ్‌లెస్ బీ అనేవి ముఖ్యమైనవి. వీటికి తోడు ఐరోపానుంచి దిగుమతి చేసుకున్న ఎపిస్ మెల్లిఫేరా విదేశీ జాతి. ప్రపంచవ్యాప్తంగా కనిపించే తేనెటీగ రకాలు ఇవి. వీటిలో మొదటి రకం తేనెను సేకరించే వారు చాలా ఎత్తయిన చెట్లకు నిచ్చెనలు కడతారు. పక్కచెట్టునుంచి ఇంకో చెట్టుకు పొడవాటి తాడు వేసి దాటుతూ పోతూ రాత్రిపూట తేనెపట్టులను కొడుతూ ఉంటారు. గతంలో ఇలాంటి పెద్ద తేనెటీగల తేనెపట్టునుంచి 70 కిలోల దాకా తేనె లభించిన సందర్భాలు కూడా ఉన్నాయని దాదాపుగా 45 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉండిన శ్రీపతి భట్ అంటారు. అప్పట్లో సగటున ఒక్కో తేనెపట్టునుంచి 15నుంచి 20 కిలోల దాకా తేనె లభించేది. అది ఇప్పుడు 5నుంచి 10 కిలోలకు తగ్గిపోయిందంటారాయన. మిగతా రకాల తేనెలదీ అదే పరిస్థితి. పాతికేళ్ల క్రితం తేనెకు గిరాకీదారులే ఉండేవారు కాదు. చాలా దూరంనుంచి ఒకరిద్దరు దళారీలు వచ్చే వారు. ఒక్క ఉత్తర కన్నడ జిల్లాలోనే ఏడాదికి 400 టన్నుల తేనె లభిస్తూ ఉండేదని చాలా ఏళ్లుగా అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేసే నాసిర్ ఖాన్ గతాన్ని గుర్తు చేసుకుంటూ అంటారు. ఉసిరి, తేనె యొక్క సాధారణ పేస్ట్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, ఇది కోవిడ్‌తో పోరాడటానికి చాలా అవసరం. ఉసిరి, తేనె సహజ రోగనిరోధక శక్తిని నిర్మించడంలో సహాయపడతాయి. మన శక్తి, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో మనం తినే ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుంది.

పూలనుండి మకరందము

[మార్చు]

మకరందము (నెక్టార్ (Nectar)) పూలలో ఉత్పత్తి అయ్యి స్రవించే తియ్యని ద్రవము. తేనెటీగలు పూలనుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి.

తేనె

తేనె లో రకాలు

[మార్చు]

తేనె సంపూర్ణ పోషక పదార్ధమని, తిరుగులేని ఔషధ గుణాలు కలిగి ఉన్నదని తెలుసుకున్నాక దానిని సేకరించిన తీరు, నిలువచేసేందుకు వాడిన విధానాలబట్టి పలు రకాలుగా విభజించారు.

అడవి తేనె: ఇది అత్యంత సహజమైనది. అడవిలో లభించే అన్నిరకాల పూలనుండి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి గకుక చాలా మంచిది.

ఒకే పూవు తేనె: ఇది తేనెటీగల పెంపకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒక్కొక్క తరహా పూల మకరందము ఒక్కో రుచిలో ఉంటుంది. తేనెటీగలకు ఏదో ఒక రకమైన పూలమొక్కలను మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా దీనిని తయారు చేస్తారు.

మిశ్రమ తేనె: మార్కెట్ లో అధికంగా అమ్మే తేనె ఇదే. నాలుగయిదు రకాల తేనెలను భిన్నరుచులు, రంగులు కలిగినవి కలిపేస్తారు ఈ మిశ్రం తేనెలో. రంగు, రుచిని బట్టి రకరకాల పేర్లు పెడతారు.

పుట్ట తేనె: ఇది తేనె పట్టులను అలానే తీసుకువచ్చి అందులోని తేనెను సేకరించి వెనువెంటనె అందించేది . దీనిని తాజా తేనెగా భావించాలి.

నిలువతేనె: తేనెను నిలువ చేసేందుకు భిన్న విధానాలు ఉన్నాయి. పాలను పాశ్చరైజ్ చేసిన తీరునే తేనెను పాశ్చరైజ్ చేస్తారు. దానిలోని సూచ్మజీవులను తొలగించి, దానిలోని ఎంజైమ్‌ ల చర్యలను పరిమితం చేయడం ద్వారా తేనె ఎక్కువకాలము నిలువ ఉంచేలా చే్స్తారు. ఈ ప్రక్రియలో తేనెను వేడిచేయడం జరుగుతుంది. వేడి చేయడం వల్ల కొన్ని నష్టాలున్నాయి. దానిని అధిగ మించేందుకు నేడు ఆల్ట్రాసొనిక్ తేనెను తయారుచేస్తున్నారు. దీనివలన తేనె పులియకుండా ఉంటుంది.

ఎండు తేనె: ఇది మరో ప్రత్యేకమైనది. తేనెను ఘన రూపమ్లో తయారుచేస్తారు. ఇది చిన్నచిన్న ముక్కలుగా వస్తాది. చేతికి అంటుకోదు.

చెడు గుణాలు

[మార్చు]

తేనే సుద్దిచేయకుండా వాడకూడదు. దీనిలో అనేక సుక్ష్మ జీవులు ఉంటాయి. తేనే లోగల 'బొటులినియం ఎన్దోసపొర్స్" చిన్నపిల్లలకు హానిచేయును ... ఒక సం. లోపు పిల్లలకు వాడకూడదు. తుతిన్ (tutin) అనేది విషపదార్దము - శరీరమునకు మంచిదికాదు.

వృక్షాల సంతానోత్పత్తికి ప్రకృతి ఇచ్చిన వరాలలో మకరందం ఒకటి. మొక్కలలోని పూలకు మధ్యభాగంలో గ్రంథులద్వారా స్రవిస్తూ ఉంటుంది. ఈ గ్రంథులు పూల కేసరాల మొదటి భాగంలో ఉంటుంది. కీటకాలు మకరందం కోసం పూలమీద వాలినపుడు కీటకాల శరీరానికి అంటిన పుప్పొడి సంపర్కం చేందటం ద్వారా మొక్కలలో సంతానోత్పత్తి జరుగుతుంది. మకరందం సామాన్యంగా మాంసాహార కీటకాలను ఆకర్షిస్తుంది కనుక అవి మకరందాన్ని సేవిస్తూ చుట్టుపక్కన తిరుగుతున్న మొక్కలను తినే పురుగులను తింటాయి దానివలన మొక్కలు నాశకారక కీటకాలనుండి రక్షింపబడతాయి. మకరందాన్ని సేకరించి తేనెటీగలు తేనె తయారు చేస్తాయి. మకరందంలో చక్కెర పాలు ఎక్కువగా ఉంటుంది. అదీ కాక మొక్కలలోని ఔషధ గుణాలు కూడా ఉంటాయి కనుక దీనిద్వారా తయారైన తేనెలో ఔషధ గుణం కలిగి ఉంటుంది.

తేనె కల్తీ అవుతుంది

[మార్చు]

ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ద ఔషధం "తేనె". తేనెలో ఉన్న ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు. మరి అలాంటి ఔషధం నేడు విషంగా మారిందా..?! అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. "అన్ని రోజులు ఒకలా ఉండవు" అన్న సామెత మాదిరిగా "అన్ని కంపెనీల తేనెలు ఒకలా ఉండవు" అని చెబుతున్నారు పరిశోధకులు. ప్రముఖ దేశీయ, విదేశీయ బ్రాండ్లు "ప్యూర్ హనీ" అంటూ విక్రయిస్తున్న తేనెలో అధికశాతంలో యాంటీబయొటిక్స్ ఉంటున్నాయని, వీటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) హెచ్చరిస్తోంది. కొన్ని భారతదేశపు బ్రాండ్‌లలో ఉండాల్సిన దానికన్నా అధికంగా రెండు నుంచి నాలుగు వరకూ యాంటీబయొటిక్స్ ఉన్నాయని సీఎస్ఈ కాలుష్య పర్యవేక్షణ ల్యాబొరేటరీ కనుగొంది. ఇవే కాకుండా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విదేశీ బ్రాండ్లు కూడా తేనెలో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడుతున్నారని సీఎస్ఈ తెలిపింది. ఇప్పటి వరకూ 12 కంపెనీలకు చెందిన తేనెలను పరిశీలించిన సీఎస్ఈ వాటిల్లో ఆరు రకాల యాంటీబయోటిక్స్ వాడినట్లు గుర్తించింది. "అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే. భారతీయ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసే తేనెలో మాత్రమే యాంటీబయోటిక్స్‌ను వీలైనంత వరకూ నియంత్రిస్తున్నాయి. కానీ మన దేశంలో ఉపయోగించే వాటిలో మాత్రం ఎటువంటి నియంత్రణ లేదు. ఇందుకు నిర్లక్ష్యం ఒక్కటే కారణం." ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో తేనె ఉత్పత్తులకు కఠినమైన, నిర్ధిష్టమైన నిబంధనలు ఉంటాయి. కానీ మన దేశంలో ఇవేమి ఉండవు. అందుకే చాలా వరకూ విదేశాల్లో భారతీయ తేనె ఉత్పత్తులను నిషేధిస్తున్నారని సీఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ చంద్రభూషణ్ అన్నారు. ఇందుకు పెద్ద ఉదాహరణే.. భారత ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ (ఈఐసీ) విదేశీ మార్కెట్‌లో విడుదల చేసే తేనె ఉత్పత్తులలో నిర్ణీత యాంటీబయోటిక్స్ మాత్రమే వాడాలని షరతులు పెట్టింది. కానీ దేశీయ మార్కెట్‌లో విక్రయించే తేనె ఉత్పత్తులకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు.

తేనె వాడకూడని సందర్భాలు

[మార్చు]
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి.
  • తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. (తేనెలో రకరకాల పువ్వుల మకరందాల అంశ ఉంటుంది. వీటిల్లో విష పుష్పాలు సైతం ఉంటాయి. .)
  • మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు.
  • తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.
  • తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది.
  • తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు (సంయోగ విరుద్ధం).

మకరందం నుండి తేనె

[మార్చు]
తేనె పట్టు
తేనె

అనేక రకాల చక్కెరపదార్థాల సమ్మిశ్రమమే తేనె. ఇందులో 38 శాతం ఫ్రక్టోజ్, 31 శాతం గ్లూకోజ్, ఒక శాతం సుక్రోజ్, 17 శాతం నీరు, 9 శాతం ఇతరత్రా చక్కెర పదార్థాలు, 0.17 శాతం బూడిద ఉంటాయి. కేవలం చక్కెర ద్రావణానికి అంత చిక్కదనం ఎలా వచ్ని చూస్తే - కూలీ ఈగలు మకరందాన్ని గ్రోలి తేనెపట్టు దగ్గరకు తీసుకువచ్చేటప్పుడు ఆ సమయంలో వాటిల్లోని కొన్ని ఎంజైములు, అందులో కలుస్తాయి. సేకరించడం పూర్తయ్యాక ఈగలన్నీ తేనెపట్టులోకి చేరతాయి. అవి అక్కడ అనేకసార్లు రెక్కలల్లార్చుకుంటూ ఎగురుతుంటాయి. దాంతో మకరందంలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది. ఫలితంగా చక్కెర గాఢత పెరిగి చిక్కని తేనె మాత్రం మిగులుతుంది.

తేనెటీగల రకాలు

[మార్చు]

తేనెలో నాలుగు రకాలు ఉన్నాయి - పట్టు తేనె, పుట్ట తేనె, కర్ర తేనె, తొర్ర తేనె. పట్టు తేనె ఈగలు పెద్దవిగా ఉండి, సాధారణంగా చెట్ల కొమ్మలకు, నగరాల్లో ఇళ్ళ పై కప్పులకు తెరలను నిర్మించుకుంటాయి. పుట్ట తేనె ఈగలు అడవుల్లో తమ తెరను గుహల్లోను, చీమల పుట్టల్లోను నిర్మించుకుంటాయి. కర్ర తేనె ఈగలు చిన్నవిగా ఉండి చెట్ల కొమ్మలకు తమ చిన్న తెరను నిర్మించుకుంటాయి. తొర్ర తేనె ఈగలు అడవుల్లో చెట్ల తొర్రల్లో నిర్మించుకుంటాయి. పట్టు తేనె రుచికి కొద్ది వగరుగా ఉంటుంది. మిగిలిన మూడు రకాల తేనెలు తీపిగా ఉండును. తేనె రకాల్లో పుట్ట తేనె శ్రేష్టమని చాలా మంది భావిస్తారు.

తేనె గుణాలు

[మార్చు]

తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనెల్లో రంగులూ రకాలూ ఉంటాయి. పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు... ఇలా భిన్నవర్ణాలతోపాటు కొన్ని తేనెలు వర్ణవిహీనంగానూ ఉంటాయి. అలాగే ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచినీ సుగంధాన్నీ వెదజల్లుతుంటుంది. అంటే తేనె రంగు, సువాసన, రుచి... అన్నీ మధుకీటకాలు సేకరించే పూలజాతుల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు యూకలిప్టస్, నిమ్మ, నారింజ పూల నుంచి మకరందాన్ని సేకరిస్తే అది ఘాటైన వాసననీ రుచినీ కలిగి ఉంటుంది. చాలామంది వంటలో పంచదార కన్నా తేనె వాడటానికి ఇష్టపడతారు. బేకింగ్ ఉత్పత్తులో తేనె వాడటంవల్ల రుచిగా ఉండటంతోపాటు అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. పైగా ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనెపట్టు నుంచి తీసిన జుంటి తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకుతాయి.

తేనెతో వైద్యం

[మార్చు]
  • కాలిన గాయాలకీ చర్మ క్యాన్సర్లకీ పుండ్లకీ హనీ పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇది 'యాంటీ మైక్రోబియల్' ఏజెంట్‌గా చక్కగా పనిచేస్తుంది.
  • చెడువాసనల్నీ వాపునీ మచ్చల్నీ కూడా మటుమాయం చేస్తుంది.
  • ఎలర్జీని నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అదెలా అంటే స్థానికంగా దొరికే తేనెనే మీరు తీసుకుంటే ఆయా కాలాల్లో వచ్చే ఎలర్జీలన్నింటినీ తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఎందుకంటే ఎలర్జీలు సాధారణంగా పరాగరేణువులవల్లే వస్తాయి. తేనెటీగలు మీ చుట్టుపక్కలున్న వెుక్కల నుంచే కదా తేనెను సేకరిస్తాయి కాబట్టి ఆ పరాగరేణువులు మీ శరీరంలో చేరి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నమాట.
  • ఊబకాయులు పరగడుపున రెండు టీస్పూన్ల నిమ్మరసంలో అరచెంచా తేనెను రంగరించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • తేనెలో ఔషధగుణాలున్న నూనెలు, ఫ్లేవోనాయిడ్‌లు, టెర్పీన్లు, పాలీఫినాల్‌లు ఉన్నాయి. ఇవి అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి.
  • ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు- క్యాన్సర్, హృద్రోగాల్ని అడ్డుకుంటాయి.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండిపదార్థాలను తినడం వీలయినంతగా తగ్గించాలి. అయితే వీళ్లు అందుకు బదులుగా తేనెను తిన్నా బ్లడ్‌షుగర్ ఎంతమాత్రం పెరగదు. తేనె రక్తప్రవాహంలో మెల్లమెల్లగా కలుస్తూ ఇన్సులిన్ తయారీని నిరోధిస్తుంది.
  • పూర్వం మశూచికం వల్ల ఏర్పడ్డ మచ్చలు త్వరగా తగ్గేందుకు చైనీయులు తేనెనే మందుగా వాడేవారు.
  • అమృతప్రాయమైన మధువులో రవ్వంత విషమూ ఉంటుంది. మకరందంలో సహజంగా ఉంటే బ్యాక్టీరియా బాట్యులిన్ అనే టాక్సిన్‌ను విడుదల చేస్తాయి. ఈ విషం క్యాన్సర్, మల్టిపుల్‌స్ల్కిరోసిస్‌కు మంచి మందు. ఇదే విషం ఏడాదిలోపు పసిపిల్లలకు హానికరం.
  • అజీర్తికీ విరేచనాలకీ తేనె దివ్యమైన మందు.
  • తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్లరసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.
  • రోజు ఉదయాన్నే (పరగడుపున) స్పూన్ నిమ్మరసం, మిరియాల పొడి, తేనే వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది...
  • తేనెను వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. అదే పాలులో కలుపుకొని తాగితే బరువు పెరుగుతారు.... ( ఉదయాన్నే)

ఉపయోగాలు

[మార్చు]
  • తేనె చాలా సులభంగా జీర్ణమై, ఇతర ఆహార పదార్థాలకంటే త్వరగా రక్తంలో కలుస్తుంది.
  • తేనె తింటే సున్నితమైన జీర్ణాశయం లోపలి పొరకు ఎలాంటి హాని కలగదు.
  • రక్తంలో కలిసిన తేనె మూత్రపిండాలు, ఇతర అంతర్భాగాలకు వినాశనకారి కాదు.
  • తేనె త్వరగా జీర్ణమై ఇతర ఆహారపదార్థాల కంటే ఎక్కువ శక్తి ఉత్పాదకతను కలిగి ఉంటుంది.
  • తేనెను గోరువెచ్చని నీటితో పరగడుపున సేవిస్తే అధిక బరువు తగ్గుతారు.
  • తేనెను గోరువెచ్చని పాలతో సేవిస్తే బరువు పెరుగుతారు.

సౌందర్యపోషణకు తేనె

[మార్చు]
  • 'జుట్టుకు తేనె రాస్తే తెల్లబడుతుంది. కాబట్టి పొరబాటున కూడా రాయవద్దు...' అనేది మన పెద్దవాళ్ల హెచ్చరిక ఎంతమాత్రం నిజం కాదు, తేనెవల్ల పొడిబారిన జుట్టు మృదువుగా అవుతుంది'!
  • చర్మంలోని తేమగుణాన్ని పెంపొందించే శక్తి తేనెకు ఉంది ఉంది.
  • పొడి జుట్టుకి తేనె, మందారం కలిపి మాస్క్ వేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.
  • తేనె లిప్‌బామ్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. పగిలిన పెదాల్ని సంరక్షిస్తుంది.
  • పాలు, తేనెల మిశ్రమాన్ని లేదా సెనగపిండిలో తెల్లసొన, తేనె కలిపి చర్మానికీ ముఖానికీ పట్టిస్తే అవి కాంతిమంతంగా మెరుస్తాయి.
  • మొటిమలు ఉన్న చోట తేనె రాసి ఒక అరగంట తర్వాత వెచ్చని నీటితో, తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే మొటిమలు తగ్గుతాయి.
  • కృష్ణ వృత్తాలకి తేనెతో మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి ఇలా ప్రతిరోజు చేస్తే కృష్ణ వృత్తాలు తగ్గుతాయి.

అవీ ఇవీ

[మార్చు]
  • సుమారు 20 వేల ఏళ్ల నుంచి మనిషి తేనెను సేకరిస్తున్నాడు.
  • ప్రపంచవ్యాప్తంగా అందరికన్నా న్యూజిలాండ్ వాసులు తేనె ప్రియులు. వీరిలో 88 శాతం మంది హనీని ఇష్టంగా తింటారు. ఒక్కొక్కరూ ఏటా 1.95 కిలోల తేనెని తీసుకొంటారు.
  • రంగు, రుచి ఆధారంగా అమెరికాలో 300లకు పైగా తేనెరకాలు తయారవుతున్నాయి.
  • గ్రీసులో కొత్తపెళ్ళికూతురు అత్తవారింట అడుగుపెట్టేటప్పుడు- చేతుల్ని తేనెలో ముంచి గోడలమీద ముద్రలు వేస్తుందట. వైవాహిక జీవితం తీయగా హాయిగా సాగిపోయేందుకే ఈ తేనెముద్రలు.
  • తేనె పంచదారకన్నా రెండురెట్లు తీపిగా ఘాటుగా ఉంటుంది. అందుకే తేనెలో ఎలాంటి బాక్టీరియా, ఫంగస్‌లాంటి సూక్ష్మజీవులు ఉండవు.
  • రోమన్లు బంగారానికి బదులుగా తేనెను ఆదాయపన్నుగా చెల్లించేవారట.
  • ఒక పౌండు తేనెకోసం తేనెటీగలు సుమారు 55 వేల మైళ్ల దూరం ప్రయాణించి 20 లక్షల పూలను సందర్శిస్తాయని తెలుసా.
  • విడిగా అమ్మే తేనెలో కొంత చక్కెరపాకాన్నీ కలుపుతుంటారు. అచ్చంగా పట్టు నుంచి తీసినదేదో తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు.
  • తేనే నిజమైనది అవునా కాదా అని తెలుసుకోవాలి అంటే ఒక స్పూన్ తేనెను తీసుకొని నీటిలో వెయ్యాలి. అది త్వరగా కరిగిపోతే మంచి తేనే కాదు. ఒరిజినల్ తేనే నీటిలో ఆలస్యంగా కరుగుతుంది.....

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తేనె&oldid=4322054" నుండి వెలికితీశారు