Jump to content

శుద్ధాద్వైతం

వికీపీడియా నుండి
వల్లభాచార్యుడు

వల్లభాచార్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని శుద్ధాద్వైతం అంటారు. అద్వైత సిద్ధాంతాన్ని ఆమోదిస్తూనే శంకరాచార్యుని మాయావాదాన్ని తిరస్కరించడంవల్ల దీనికి శుద్ధాద్వైతం అని పేరు వచ్చింది.

శుద్ధాద్వైత సిద్ధాంతం

[మార్చు]

పరబ్రహ్మము నిర్గుణం కాదు. సగుణమే పరబ్రహ్మము. సత్‌చిత్ ఆనంద స్వరూపుడు. సర్వవ్యాపి, సర్వాంతర్యామి; శాశ్వతుడు, సృష్టికర్త.

సృష్టికి కారణం ఏమిటి? ప్రేరణ ఏమిటి? "సవే నైవరేమే, తస్మాదేకాకీ న రమతే, సద్వితీయమైచ్ఛత్..." (అనగా పరమత్మ సంతోషంగా ఉండలేకపోయాడు. ఏకాకి అయినవాడు ఎవడూ సంతోషంగా ఉండలేడు. సహచారిణిని కోరుకున్నాడు...)అని బృహదారణ్యకంలో చెప్పినట్టు తానే తన లీల నిమిత్తం అనంతకోటి జీవులుగా, జడ జగత్తుగా పరిణమించాడు. సృష్టి భగవల్లీల. దాని నిమిత్త కారణం బ్రహ్మమే. ఉపాదాన కారణం కూడా బ్రహ్మమే. అందుచేత సమస్త సృష్టిలో పరమాత్మ నిండి ఉన్నాడు. తనలోనుంచి సమస్త జగత్తు ఉద్భవించినా అతని అనంతత్వానికి ఏ లోటూ రాదు.

పరమాత్మ సచ్చిదానంద స్వరూపం కాగా, జీవుడు సత్‌చిత్ రూపం మాత్రమే. అతడినుంచి ఈశ్వరుడు ఆనందాన్ని మరుగుపరిచాడు. అందుచేతనే జీవుడు అజ్ఞానవశుడై, సంసారబద్ధుడై దుఃఖితుడవుతున్నాడు. ఇక జడ జగత్తు సద్రూపం మాత్రమే. దాని నుంచి ఈశ్వరుడు తన చిత్, ఆనంద లక్షణాలను మరుగుపరిచాడు. అయినప్పటికీ పరమాత్మనుంచి పరణమించినవైనందున జీవాత్మలు, జగత్తు పరమాత్మతో తాదాత్మ్యం కలిగినవే.

జీవాత్మలు రెండు విధాలు. ఒకటి దేహాత్మ భావంతో అజ్ఞానంలో మునిపోయి జననమరణ పరంపరకు లోనైనవారు. రెండు - అజ్ఞానంనుంచి మోహంనుంచి విముక్తులై సత్సాంగత్యంవల్ల జ్ఞానోదయమై, వైరాగ్యంతో భక్తులై, భగవంతుని ప్రేమించి, ఆయన కృపతో మోక్షం పొందేవారు. వారిలో కొందరు మర్యాదా భక్తులు. వీరు భగవంతులో పూర్తిగా ఐక్యమైపోగోరుతారు. మరికొందరు పుష్టి భక్తులు. పుష్టి అంటే భగవదనుగ్రహం. వీరు సంపూర్ణ సాయుద్యాన్ని కోరరు. శాశ్వత భగవస్సాన్నిధ్యాన్ని, సాంగత్యాన్ని కోరుకుంటారు.

శ్రీకృష్ణుడే పరబ్రహ్మము, పరమాత్మ, ఈశ్వరుడు. అతడు సచ్చిదానంద శరీరుడు. దివ్యమంగళ విగ్రహుడు. అతడే పురుషోత్తముడు. శ్రీకృష్ణుని సత్వలక్షణం విష్ణుమూర్తి రూపం ధరిస్తుంది. అతడు సృష్టిని రక్షిస్తూ ఉంటాడు. రజస్సు బ్రహ్మదేవుడై సృష్టి కారణమవుతుంది. తమస్సు శివుడై లయకారకమవుతుంది.

విష్ణులోకమైన వైకుంఠంకంటే పైన శ్రీకృష్ణుని ధామం ఉంటుంది. అదే గోలోకం. శ్రీకృష్ణుడు భూలోకంలో లీలామానుష విగ్రహుడై సంచరించిన కాలంనాటి గోకులానికి, బృందావనానికి అది దివ్య ప్రతీక. దివ్య ప్రతిరూపం. గోకులంలో యమునా నదీ తటాన శ్రీకృష్ణుడు రాధాసమేతుడై గోపగోపీజన సహస్రంతో మురళీగానం చేస్తూ రాసలీలా వినోదియై విహరించినట్టు, గోలోకంలో శ్రీకృష్ణుడు రాధాసమేతంగా భక్తజన పరివేష్టితుడై లీలావినోదాలలో విహరిస్తాడు. పుష్టి మార్గావలంబులు ఆవిధంగా జనన మరణ నివృత్తి పొంది, గోలోకం చేరుకుని శ్రీకృష్ణుని సన్నిధానంలో శాశ్వతంగా నివసిస్తూ భగవత్కీర్తనంలో, రాసనర్తనంలో మునిగితేలుతూ శాశ్వత బ్రహ్మానందం అనుభవిస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భక్తులు అటువంటి శాశ్వతానందాన్నే కోరుకుంటారు. దానికోసమే జీవితమంతా పరితపిస్తారు.

సృష్టిలోని ప్రతి జీవిలో, ప్రతి వస్తువులో, అణువణువులో శ్రీకృష్ణుడినే అన్వేషిస్తూ ఒకనాటి బృందావనంలో గోపకాంతలు శ్రీకృష్ణునికై పొందిన విరహవేదనవంటి వేదనలో మ్రగ్గిపోతూ తన జీవిత సమస్తం కృష్ణార్పణంగా, తన ఆలోచన సమస్తం కృష్ణార్చనంగా గడుపుతాడు. అటువంటివాడు భగవత్కృపతో ముక్తుడై, మరణానంతరం గోలోకంలో శ్రీకృష్ణుని సన్నిధానం వేరుకుంటాడు.