Jump to content

శ్రీనివాస కధా సుధాలహరి

వికీపీడియా నుండి

వడ్డూరి అచ్యుతరామకవి శ్రీ శ్రీనివాస కథా సుధాలహరి అను శ్రీనివాస కళ్యాణం 1961 వ సంవత్సరంలో రచించారు. 01.01 .1 967 నుండి 10 .01 .1967 వరకు తిరుమలలో ఆర్ష సంస్కృతి విద్యా పీఠం నుండి చదివి స్వామి వారికి కృతి సమర్పణ చేసారు.

కథా సంగ్రహం

[మార్చు]

తొల్లి నైమిశారణ్యమున ముని వరేన్యులు నాముష్మిక ఫలప్రథమగు సత్ర యాగము గావించుచు విరామ సమయమున భగవత్కథా కాలక్షేపము గావింప కోరిక కలవారై సకలాగమ పురాణ తత్వ రహస్యార్ద వేదియు, భూత వర్త మానాగమ కథాకథన చాతురీ ధురీణుడగు సూతుని గాంచి మహాత్మా! మీ అనుగ్రహముతో అనేక ధర్మ రహస్యముల పురాణములు వినియుంటిమి మాకొక్క ధర్మ సంశయము కలదు ఏమన అచిర కాలమున భూలోకము కలిచే ఆవరింప బడుచున్నది కదా! కలి మాయా విశేషమున మానవు లెల్లరు అక్రమ మార్గముల, అన్యాయ పధముల సంచరించుచు పాపము లాచరించుచు పుణ్య కార్యములు చేయక సంసార దుఃఖములో ఉండి, రాజకీయ కలుషిత స్వాంతులై విషయ విబ్రాంతులై వర్తింతురని విందుము. అని పల్కిన ఆ మునులందరూ ఆశ్చర్య మందుచు సూతుని గాంచి యిట్లనిరి. మహాత్మా! తొల్లి శ్రీమన్నారాయణుడు మత్య కూర్మ వరహాది దివ్యావతారములు దాల్చి జగద్రక్షణ గావించెను. భావి కాలమున కలియుగమున కల్కి రూపము ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించి ధర్మమునుద్ధ రింపగలడని వినియుంటిమి కాని శ్రీ మన్నారాయణుని ఏకవింశత్యవతారంబుల శ్రీవేంకటేశ్వరుని అవతార మభివర్ణింపబడలేదని తలంతుము. శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడు ఎట్లయ్యే? ఎందులకయ్యే?ఎందు వసించె? ఏయే జగద్దితంబు లాచరించె? వివరింప వేడెదమనిన సూతుండు మునీంద్రులారా! శ్రీ మహావిష్ణువు నారసింహ, రామ కృష్ణాద్యవతారముల వలె కాక నిత్య సేవార్చనలు గావించు భక్తులనుద్ధరించు తలపున బ్రహ్మ దేవుని కోరికపై అర్చావ తారంబున మానవులకభీష్టఫల పదాయకుండును, కష్ట నివారకుండునునై కలి కల్మష ముల హరించుచు కలి యుగాంతము వరకు భూలోకమున శేషా చలమున ఉండు తలంపున అందు నివసించె. భక్తులు కోరిన చోటుల ఎల్లెడలా దర్శన మిచ్చె దనని బ్రహ్మదేవుని కోరికపై వివరించె. అనిన మునులందరూ సూతుని గాంచి మహాత్మా ! బ్రహ్మదేవుడు విష్ణుని యేమని కోరెను? విష్ణు వేమని వివరించెను? సాకల్యముగా దెల్ప గోరెదము.ఈ విధముగా బ్రహ్మ భూలోక వాసుల యెడ కారుణ్య భావముతో శ్రీ మన్నారాయణుని అర్ధింప హరి పరమా నంద భరితుడై కుమారా! జీవుల యెడ నీకు గల ఆదర భావమునకు మెప్పు వచ్చె నీవు వచించిన దంతయు సత్యము కలిలో పాపుల సంఖ్య పెరుగును కావున నీ వీ దివ్య మంగళ విగ్రహముతో భూలోకమున నివసించి జనులకు దర్శన మాత్రముననే, ప్రార్థనార్చనలకే సంతుస్టుడవై మనోభీస్టము లోసంగి వారి పాపముల నుండి విముక్తులను గావించి రక్షించ వలసినది. అనగా నీవు కోరినట్లు కల్పాంతము వరకు నేనిచ్చట నివసింతును.......వివరాలకు శ్రీ శ్రినివాసకదాసుధాలహరి చదవండి ....

విషయసూచిక

[మార్చు]
  1. వేంకటాచల వర్ణనము
  2. భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట
  3. లక్ష్మీదేవి అలిగి కరవీరపురంబరుగుట
  4. బ్రహ్మాదులు లక్ష్మీదేవిని ప్రార్థించుట
  5. వేదవతీ వృత్తాంతము
  6. శ్రీనివాసుడు వకుళమాలిక ఆశ్రమంబునకరుగుట
  7. శ్రీనివాసుడు వేటకరిగి పద్మావతిని మోహించుట
  8. పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ ఘట్టము
  9. లక్ష్మీస్తవము
  10. పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం
  11. శ్రీనివాసుడు లక్ష్మీదేవికై తపమాచరించుట
  12. శ్రీవేంకటాలము వేంకటేశ్వరుడు అని పేరువచ్చుట
  13. మాధవశర్మొపాఖ్యానము
  14. నారదగీత
  15. శ్రీనివాస దండకం
  16. శ్రీ వేంకటేశ్వర భక్తిమాల
  17. శ్రీ ఆంజనేయ దండకం
  18. శ్రీ లక్ష్మీనృసింహస్తోత్రం దండకం
  19. శ్రీనివాసుని జలక్రీడోత్సవము

కొన్ని పద్యాలు

[మార్చు]

శా !! శ్రీమద్వేంకట శైలమందు విభవ శ్రీమీరనాంచారియున్
    భామారత్నము మంగ మాంబయును సంభావించి సేవింప గా
    కామారాతి మహేంద్ర ముఖ్యులు నుతుల్ గావింప భక్తాలికిన్
    సేమంబుల్ సమ కూర్చు దేవు గొలుతున్ శ్రీ వెంకటేశ ప్రభున్ ‌!!

మ !! ఒక హస్తంబభయం బొసంగ మరి వేరొండొక్క హస్తంబుతో
    బ్రకట ఖ్యాతి సముద్ధ రింతు నిదె నా పాదార్చనల్ సేయుడం
    చ కలంక స్థితి జూపుచున్ వెలిగె దీ వార్తా వన ఖ్యాతి ,నం
    దక చక్రాదుల దాల్చి భక్త వరదాతా ! వెంకటేశ ప్రభూ !!
 
    స్వామీ !
    ఎన్ని మారులు చూచిన నే మొగాని
    తనివి దీరదు నీ దివ్య దర్శనంబు
    చూచినను చూచు చున్నను ,చూడగోరు
    చూపుమికెప్పుడు నీ దివ్య రూపమభవ !!

    దేవాది దేవా !
చ ! ఒకపరి నీయనంత మహిమోజ్వల దర్శన భాగ్య మీశ్వరా
   సు కవిత కల్గ జేసి యతి సుందరమౌ భవదీయ తత్వమున్
   బ్రకట మొనర్ప జేసె నవ పద్మ దళేక్షణ !సంతతంబు నీ
   యకలుష దివ్యనామ జప మద్భుత మెట్టి ఫలంబు లిచ్చు నో !
 
సీ ! కామించి సుందరాకారముల్ గనగోరు కనులు నిన్ గనుగొన మనసు పడవు
   వివిధ దుర్విషయముల్ వినగోరు చెవులు నీ విమల ప్రభావముల్ వినగరావు
   సంసార విషయమౌ స్వార్ధ చింతల నుండు చిత్తంబు నీదరి జేరబోదు
   కలుష సంకల్ప వికల్ప నిమగ్నమౌ మనము నిన్ ధ్యానింప మరులు కొనదు

ప్రముఖుల అభిప్రాయాలు

[మార్చు]

1. శ్రీ శ్రీ వైఖాన సకులాలంకార శ్రీ మద్వైయాకరణ పంచానన విద్వత్కవి సార్వభౌమ పండిట్ R. పార్ధసారథి భట్టాచార్య సెక్రటరీ శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్దనీ సభ. (తిరుపతి) ..శ్రీ వడ్డూరి అచ్యుతరామయ్య గారిని నేను ప్రప్రథమంగా తిరుమలలో కలియుట సంభవించింది. వారు శ్రీ శ్రీ నివాసమూర్తి సన్నిధిలో ఆర్ష సంస్కృతీ సదస్సు వేదిక యందు శ్రీ శ్రీనివాస కళ్యాణము చదివినప్పుడు అచ్చటి శ్రోతలు పలువురితో నేనునూ విని పరమానందము జెందితిని. వారి ఇతర కృతులను కూడా నేను చూచి వారి కవితా ప్రతిభకు కూడా ఆనందము చెందితిని. శ్రీ శ్రీ నివాస ప్రభువు శ్రీ అచ్యుతరామయ్య గారిని అధికమగు భక్తి శ్రద్ధలను, దీర్ఘాయురారోగ్యై స్వర్యములనిచ్చి యనుగ్రహించు గాక యని ప్రార్థించు చున్నాను. - (Sd) R. పార్ధసారథి అయ్యంగార్., ఆస్తాన విద్వాన్., తిరుమల తిరుపతి దేవస్తానములు. 05.01. 1967.

2. కళా ప్రపూర్ణ డాక్టర్ దివాకర్ల వేంకటావధాని, M.A, (ఆనర్స్) P.Hd, శ్రీ వడ్డూరి అచ్యుత రామకవి గారు రచించిన శ్రీ శ్రీనివాస కథాసుధాలహరి అను పద్య కావ్యమును పఠించి మందానమందితిని. ఇది జగత్ కళ్యాణ సంధాయకుడు, సర్వ జనారాధ్యుడు నైన శ్రీ వేంకటేశ్వరుని వృత్తాంత మగుటచే సుధా లహరి అను నామము సార్థక మొనరించు చున్నది. కవి గారి పద్యములు కూడా సుధా మధురములై యుండుటచే ఆ నామము సార్థకత్వమును ద్విగుణీ కృతము గావించుచున్నది. ఈ కథను సూత పౌరాణికుడు, శౌనకాది మహర్షులకు చె ప్పి యుండెను. బ్రహ్మదేవుని ప్రార్థన ననుసరించి శ్రీ మన్నారాయణుడు శ్రీ వేంకటేశ్వరునిగా శేషాద్రి పై అవతరించెను. భ్రుగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట, ద్వితీయ తరంగమందలి శ్రీ రామకథ, పద్మావతి పూర్వ జన్మ వృత్తాంతములు, తృతీయ తరంగమందలి శ్రీ కృష్ణావతార ఘట్టములు, పద్మావతి శ్రీనివాసుల వివాహ ఘట్టములు మిక్కిలి హ్రుద్యములుగా నున్నవి. కవి గారి వర్ణనలు సహజములును, భావ గంభీరములునైన దృశ్యములను సాక్షత్కరింప జేయుచున్నవి. - డాక్టర్ .దివాకర్ల వేంకటావధాని, హైదరాబాదు,01.02.198౦.