Jump to content

శ్రీరమణ పేరడీలు

వికీపీడియా నుండి
శ్రీరమణ పేరడీలు
ముఖచిత్రం
శ్రీరమణ పేరడీలు పుస్తక ముఖచిత్రం
కృతికర్త: శ్రీరమణ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: పేరడీ
విభాగం (కళా ప్రక్రియ): పుస్తకం
ప్రచురణ: నవోదయ
విడుదల: 1980
పేజీలు: 154
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు

ప్రముఖ హాస్యరచయిత, పత్రికా సంపాదకుడు శ్రీరమణ చేసిన సాహిత్య వ్యంగ్యానుకరణ (పేరడీ) ల సంకలనం శ్రీరమణ పేరడీలు.[1] తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన రచయితలు, కవులు, సంపాదకుల రచనలను శ్రీరమణ పేరడీలు చేశారు. మంచి సాహిత్యకారులకు అందరికీ ప్రత్యేకమైన శైలి, ఒరవడి ఉంటాయని, అలాంటివారినే అనుకరించగలమని ఆయన పేర్కొన్నారు. తెలుగు సాహిత్య పాఠకులకు, రచయితలకు ఈ పుస్తకం ఆసక్తిదాయకం.

రచన నేపథ్యం

[మార్చు]

శ్రీరమణ పేరడీలు సంకలన గ్రంథం 1980లో మొదటి ప్రచురణ పొందింది. ఈ గ్రంథం 2007లో రెండవ ముద్రణ పొందింది. పుస్తకరూపంలో సంకలనం పొందడానికి ముందు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. నవోదయ పబ్లిషర్స్ రెండవ ముద్రణను ప్రచురించారు. కినిగె సంస్థ డిజిటలైజ్ చేసి ఈ-బుక్‌గా అందుబాటులోకి తీసుకువచ్చింది.

విషయం

[మార్చు]

ఈ పుస్తకంలో శ్రీరమణ తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, చలం మొదలైన వైతాళికుల సాహిత్యాన్ని పేరడీ చేశారు. ఆ క్రమంలోనే సాహిత్యవేత్తలే కాక సాహిత్యంలోని పాత్రలైన మధురవాణి వంటివారిని కూడా పేరడీ చేయడం విశేషం. మధురవాణి ఇంటర్వ్యూలు, రైలుబండిలో వైతాళికులులో తెలుగు సాహితీవేత్తల్ని మధురవాణి అనే ఊహాత్మక పాత్ర ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో, రైలుబండిలో శ్రీశ్రీ, విశ్వనాథ, చలం వంటి వైతాళికులు టిక్కెట్టులేని ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో రచించారు. పద్య కవిత్వం, వచన కవిత్వం, గేయ కవిత్వం మొదలైన కవితా రీతులు, నాటక, నవల, కథాసాహిత్యాల్లోని వచనం, పీఠికలు, సంపాదకీయాలు మొదలైనవి ఎన్నింటినో ఆయన పేరడీ చేశారు. ఐతే వారిని హాస్యం చేసినా అగౌరవపరిచే ఉద్దేశం లేదంటూ శ్రీరమణ వాసి గల ప్రతి రచయితకూ స్వీయశైలి తప్పక ఉంటుంది, అలా లేని రచయితను అనుకరించడం అసాధ్యం అన్నారు.

ఉదాహరణ

[మార్చు]

ఈ ఉదాహరణ రైలుబండిలో వైతాళికులు అనే ప్రహసనంలోనిది:
శ్రీశ్రీ వంతు వచ్చింది. టిక్కెట్ లేదు. పైగా అందరికీ భరోసా ఇవ్వడం కూడాను. ఇదంతా గమనించి-
"ఎవరు మీరు" అన్నాడు టి.వాడు
"భూతాన్ని
యజ్ఞోపవీతాన్ని
వైప్లవ్య గీతాన్ని నేను"
"కవిత్వంలో దేనికి? తెలుగులో చెప్పరాదుటయ్యా" అన్నారెవరో.
"నేను శ్రీశ్రీని. ఈ శతాబ్దం నాది"
"కావచ్చు. కాని ఈ రైలు శ్రీ సర్కారు వారిది" అన్నాడు టి.టి.ఇ.
"మొన్నటి దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపింది. ఇప్పుడు దాన్ని నేను నడుపుతున్నాను..."
"అవచ్చు. కాని ఈ రైళ్ళని ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు"
"ఔను నిజం, ఔను సుమా నీవన్నది నిజం నిజం"
అనేసి శ్రీశ్రీ సీటుమీద కూచుని, నిట్టూర్చి మళ్ళీ హరీన్‌ఛట్టో లోకి వెళ్ళిపోయారు.

మూలాలు

[మార్చు]
  1. "నా అసమగ్ర పుస్తకాల జాబితా -2". Archived from the original on 2016-03-19. Retrieved 2016-04-29.