శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామివారి ఆలయం, భోగేశ్వరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామివారి ఆలయం, భోగేశ్వరం.

  • కొలిచే భక్తుల కొంగు బంగారం శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వమి. దక్షిణ కాశీగా పరసిద్ధి చెందినది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు, ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. శివరాత్రి ముందురోజు, అర్ధరాత్రి దాటిన తరువాత, శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు.
  • ఆలయ విశేషాలు:- మహాశివరాత్రి పర్వదినం నాడు నిర్వహించే కళ్యాణోత్సవంలో, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు, ప్రముఖులు పాల్గొని, స్వామివారికి విశేషపూజలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్ధం, పారిశుద్ధ్యం, మంచినీరు, భోజన వసతి, ఇతర సదుపాయాలతోపాటు, పోలీసు బందోబస్తు గూడా ఏర్పాటు చేస్తారు.
  • స్వామివారి చరిత్ర:- కలిదిండికి తూర్పు, ఆగ్నేయంలో వేంచేసియున్న అతి ప్రాచీనమైన శ్రీ పాతాళ భోగేశ్వరస్వామి ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. వేంగీరాజు రాజరాజ చోళుని కుమారుడు, రాజరాజ నరేంద్రుని కాలంలో ఒక రైతు పొలంలో దుక్కి దున్నుతుండగా, నాగలికర్రు తగిలి, భూమిలో నుండి నెత్తురు పారి, స్వయంభూ లింగం బయట పడిందని ఐతిహాసం. స్వయంభూలింగం ఆకారంలో ఉన్న స్వామివారిని బయటకు తీసిచూడగా, లింగాకారం ఒకవైపు విరిగినట్లుగా ఉండటంతో ఆ భాగాన్ని అతికించినట్లు ప్రచారంలో ఉంది. ఇప్పటికీ లింగాకారంలోని ఒకభాగం అతికించినట్లుగా స్పష్టంగా కనబడుచున్నది. అతికించిన భాగంలో చెమరుస్తున్నట్లుగా గోచరిస్తుంది.
  • కోడికూత, రోకటిపోటు వినలేనురా . . :- ఈ పురాతన ఆలయం కలిదిండికి 3 కి.మీ. దూరంలోని భోగేశ్వరం గ్రామంలో పొలాలమధ్య ఉంది. అక్కడినుండి లింగాకారాన్ని తీసుకొని వచ్చేందుకు ప్రయత్నించి విఫలమైనారు. "కోడికూత, రోకటిపోటు" వినలేనని స్వామివారు భక్తులకు కలలో దర్శనమిచ్చి సెలవిచ్చినట్లు పెద్దలు చెబుతారు. దీంతో లింగాకారం బయల్పడిన స్థలంలోనే ఆలయం నిర్మించారు.
  • పవిత్ర పంచబుగ్గల కోనేరు:- స్వామివారి ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన కోనేరు ఉంది. ఈ కోనేరులో పంచబుగ్గలు ఉండటంతో "పంచబుగ్గల కోనేరు"గా ప్రసిద్ధి చెందినది. భక్తులు కోనేరులో దిగి "హర హరా" అంటుండగా "బుడ బుడ" మంటూ నీరు పైకి లేవడం, నేటికీ కనిపిస్తుందని భక్తుల విశ్వాసం.
  • స్వామివారి పాదాల గుర్తులు:- పూర్వం వర్షాకాలంలో స్వామివారి నిత్యార్చనకు తీవ్ర జాప్యం జరిగేదట. ఒకసారి స్వామివారు ధ్వజస్తంభం పైకి ఎక్కి చూస్తూ, అర్చకుల రాక గమనించారు. ద్వజస్తంభం పైనుండి దూకడంతో, నేలపైకి స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయని, అవి నేటికీ వీక్షించవచ్చని, చరిత్ర ద్వారా తెలుస్తున్నది. నాటినుండి ప్రతిఏటా మాఘబహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకూ శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామివారికి ఇక్కడ పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలను అత్యంత కమనీయంగా నిర్వహించుచున్నారు. [1]

మూలాలు

[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2014, ఫిబ్రవరి-24, 9వ పేజీ.