యోగనృసింహ క్షేత్రం (ధర్మపురి)
| లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం | |
|---|---|
ఆలయ ప్రధాన ప్రవేశ గోపురం యొక్క పక్క దృశ్యం | |
| భౌగోళికం | |
| భౌగోళికాంశాలు | 18°57′01″N 79°05′50″E / 18.9504°N 79.0973°E |
| దేశం | భారత్ |
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | జగిత్యాల జిల్లా |
| ప్రదేశం | ధర్మపురి |
| సంస్కృతి | |
| దైవం | శ్రీ నరసింహ స్వామి మరియు లక్ష్మీ దేవి |
ధర్మపురి తెలంగాణాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం, తీర్థరాజం. శ్రీ లక్ష్మీనృసింహుడు యోగనారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం ఉంది. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది.[1] [2][3][4][5]
స్థల పురాణం
[మార్చు]పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. ఇక్కడ ఒక కవి అయిన కాకుత్సం శేషప్ప కవి శ్రీ నరసింహ శతకం రచించాడు.
స్కాంద పురాణములో ధర్మపురి క్షేత్రమహత్యము వర్ణింపబడియున్నది. పూర్వం బలివర్మ అనే రాజు ఉండేవాడు.అతనికి అల్పాయుష్కుడైన కుమారుడు కలుగగా దర్మయాగం జరిపినందువలన ఆ కుర్రవాడు చిరంజీవుడైనాడు.అతడే ధర్మవర్మ, ధర్మయాగం జరిపించిన గ్రామానికి ధర్మపురి అను పేరుపెట్టి, దాన్నే రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పాలించాడు. పూర్వం బ్రహ్మాది దేవతలు ధర్మవర్మ మహారాజును నృసింహుని గూర్చి తపస్సు చేయవలసినదిగా ప్రేరేపించారు.అతడు తపస్సు చేయగా స్వామి అక్కడ వెలిసారు. ఫాల్గుణ శుద్ధంలో స్వామి కల్యాణం జరుగుతుంది.ధర్మశర్మ, ధర్మవర్మ, ధర్మదాసుగా స్వామిని మూడు జన్మలలో అర్చించిన ధర్మజీవికి ఇది నెలవు. సాధ్వీమణి శ్రీసత్యవతీదేవి ఇక్కడ గోదావరీ తీర్ధమున స్నానమాడి తన్ జీవితేశ్వరుడగు ధర్మాంగద ప్రభువును సర్పరూపమునుండి విముక్తి గావించి సుందర మనిషి రూపము వచ్చునట్లు చేసిందిచ్చటనే. ఆ పతివ్రత తన పాతివ్రత్యమహత్యాన్ని నిరూపించడానికి ఇసుకతో నిర్మించిన స్తంభం ఇప్పటికీ భక్తులకు సత్యనిదర్శనముగాఉన్నది. బ్రహ్మాదిదేవతలు, మహర్షులు, ఋషులు, మునులు మహాభక్తులు ఇచ్చట స్వామిని అర్చించి తరించారు.
భూషణవికాసధర్మపుర నివాస!దుష్ట సంహార! నరసింహ! దురితదూర! అనే మకుటం తో శతకం ఉంటుంది.
చరిత్ర
[మార్చు]ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది. శాతవాహనులు, బాదామి చాళుఖ్యులు కళ్యాణి చాళుఖ్యులు, కాలంలో ఈ ఆలయం ఉన్నతి స్థితిలో వున్నట్లు తెలుస్తున్నది. నైజామ్ కాలంలో కూడా ఈ ఆలయం మంచి అభివృద్ధి పదంలో వుండేది. సా.శ. 1309లో అల్లాయుద్దిన్‌ఖిల్జి ధర్మపురి ఆలయాల పై దాడి చేసి నాసనం చేశాడని చరిత్ర వల్ల తెలుస్తున్నది.
మూలాలు
[మార్చు]- ↑ "Sri Lakshmi Narasimha Swamy Temple, Dharmapuri". Telangana Tourism. Retrieved 15 February 2026.
- ↑ "Dharmapuri Lakshmi Narasimha Swamy Temple". Telangana State Endowments Department. Archived from the original on 19 జూన్ 2024. Retrieved 15 February 2026.
- ↑ District Gazetteer: Jagitial District. Government of Telangana. 2016.
- ↑ "Archaeological Survey of India – Protected Monuments". Archaeological Survey of India. Retrieved 15 February 2026.
- ↑ Temples of Telangana. Department of Culture, Government of Telangana. 2018.