శ్రీ సప్తగిరీంద్రవాస శతకము
శ్రీ సప్తగిరీంద్రవాస శతకము, కవి పైడిపాటి మల్లయ్య, ఈ భక్తకవి సామాన్య కుటుంబీకుడు, నిరాడంబరుడు, నెల్లూరు నివాసి, ఎలిమెంటరీ స్కూల్ టీచరు, కవి నవులూరి మాలెకొండయ్య ప్రియ మిత్రుడు. ఈ శతకంలో ప్రాస నియమాలు చాలా క్లిష్టమైనవి. ప్రాస ఉండే పద్యాలలో ప్రాస పూర్వాక్షర నియమమూ ఉంది. అంటే పాదం మొదటి అక్షరం లఘువుగా ఉంటే నాలుగు పాదాలలోనూ లఘువే కావాలి. గురువైతే గురువే కావాలి. ప్రాసలో అచ్చు మారినా ఫర్వాలేదు గానీ, హల్లులు అదే వరుసలో అన్నీ రావాలి. 'డ్ర'తో ఎన్ని పదాలుంటాయి? దానికి తోడు ముందు సున్న రావాలి— అన్ని నియమాలు పెట్టుకున్నాడు ఈ కవి. "'డ్ర'ఏకప్రాస భక్తిరస భరితము" అని ముఖపత్రం మీద అచ్చువేసుకొన్నాడు.
పైడిపాటి మల్లన కవిపెద్దపెద్ద కావ్యాలు రాయగల శక్తి ఉన్నవాడే గానీ , భుక్తి కోసమే బతుకు గడిచిపోయింది. ఈ కవి తన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదనే బాధతో, సప్తగిరీంద్రుల నారాధించి, పద్యాలు రాశాడు. శతకం పూర్తి కాకముందే వారికి ఉద్యోగాలు వచ్చినట్లు ఈ శతకం ముందుమాటల్లో రాసుకొన్నాడు. కవితావేశంలో పద్యాలు దొర్లాయి. త్యాగయ్య, అన్నమయ్య , రామదాసు, పోతనల మాదిరే మల్లయ్యగారూ భక్త కవి.
ఈ శతకం తిరుమల, తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో 1986లో కవి సొంతంగా ముద్రించాడు. ఈయన కావ్యాలు మరేవీ వెలుగు చూడలేదు.
మూలాలు: పైడిపాటి మల్లయ్య శ్రీ సప్తగిరీంద్రవాస శతకము, 1986.