షాషావలి దర్గా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షేక్షావలి, షాషావలి దర్గా షేక్షావలి, షాషావలి దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ దర్గా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామంలో ఉంది. ఈ దర్గా ఆవరణంలో మాహబుబ్ సుబాని (జెండాకట్ట), దూదుపీర, దాదీమ దర్గాలు ఉన్నా.. షేక్షావలి, షాషావలి దర్గాగా ప్రసిద్ధి చెందాయి. జిల్లాలోని ప్రముఖ దర్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నవంబరు లేదా డిసెంబరు మాసాల్లో ఉరుసు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉరుసు ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ప్రతి గురువారం ఇక్కడ ప్రత్యేక ఫాతెహా నిర్వహిస్తారు. ఆ రోజు భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకొని రాత్రి వర్గాల సన్నిధిలో బస చేసి మరుసటి రోజు ఉదయం తమ ప్రాంతాలకు తిరిగి బయలుదేరి వెళ్లారు.

దర్గా చరిత్ర[మార్చు]

షేక్షావలి, షాషావలి తాతలు అరబ్ దేశానికి చెందిన వారుగా స్థానిక పెద్దలు[1] చెబుతున్నారు. భారతదేశంలో సంచరిస్తూ ప్రజలకు తోచిన సహాయం చేసేవారు. దేశంలో అనేక ప్రాంతాలు తిరిగిన తాతలు రాయచూరులో కొద్ది రోజులు గడిపి, అనంతరం చివరికి ఎల్లార్తి గ్రామ సమీపంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు అందించిన తాతలు మహిమలు కలిగి ఉన్నారని ప్రాచుర్యంలో ఉన్నారు. చివరికి దాదాపు 450 ఏళ్ల క్రితం వారు ఇక్కడే మరణించడంతో ఎల్లార్తి ప్రాంతం ప్రసిద్ధి చెందింది. దీంతో అప్పటి నుంచి ఎల్లార్తికి భక్తుల రాక మొదలై పెద్ద పుణ్య క్షేత్రంగా వెలుగొందుతోంది. ప్రతి ఏటా ఉరుసు నిర్వహిస్తున్నారు. నిత్యం సమస్యలతో సతమతమవుతూ మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారు ఎల్లార్తి తాతలను మొక్కుకుంటే అన్ని కష్టాలు తీరుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది. వీరి వారుసులుగా చెప్పుకుంటున్న సయ్యద్ తాజుద్దిన్ అహమ్మద్ ఖాద్రి గతంలో పీఠాధిపతిగా వ్యవహరించారు. అయితే, 2014 సంవత్సరం వరకు ఎల్లార్తికి చెందిన అబ్దుల్ రవూఫ్ అనే వ్యక్తి ముజావర్గా వ్యవహరిస్తూ దర్గాల నిర్వహణను చూసేవారు. 2014 ఏప్రిల్ 19 న షేక్షావలి, షాషావలి దర్గాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు తమ పరిధిలోకి స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి వక్ఫ్ అధికారులు పర్యవేక్షిస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి నిర్వహణ కోసం కాంట్రాక్టు ఇస్తున్నారు.

మత సామరస్యానికి ప్రతీక[మార్చు]

కర్నూలు జిల్లా ఎల్లార్తిలో వెలసిన షేక్షావలి, షాషావలి దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ దర్గాకు ముస్లిలతో పాటు హిందువులు, క్రైస్తవులు తదితర మతాల వారు దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కు తీర్చుకుంటారు. భక్తులు ప్రతి ఏటా జరిగే ఉరుసుతో పాటు ప్రతి గురువారం పాల్గొని దర్శనం చేసుకుంటారు .

ఇలా చేరుకోవాలి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని విజయవాడ నుంచి 471 కిలో మీటర్ల దూరం ఉండగా జిల్లా కేంద్రం కర్నూలు నుంచి 121 కిలో మీటర్లు, రెవెన్యూ డివిజన్ కేంద్రం ఆదోని నుంచి 32 కిలో మీటర్లు, నియోజకవర్గ కేంద్రం ఆలూరు నుంచి 19 కిలో మీటర్లు, మండల కేంద్రం హొళగుంద నుంచి 10 మీటర్లు, అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి 50 కిలో మీటర్లు, కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా కేంద్రం నుంచి 65 కిలో మీటర్లు, రాయచూరు జిల్లా కేంద్రం నుంచి 106 కిలో మీటర్లు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి 332 కిలో మీటర్ల దూరంలో దర్గా ఉంది. ఇక్కడికి చేరుకునేందుకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేసుకునేందుకు వీలు ఉంది . జిల్లా కేంద్రం కర్నూలు లేదా ఆదోని, గుంతకల్లు, బళ్లారి వరకు రైళ్లలో చేరుకొని అక్కడి నుంచి బస్సు, కారు, ఆటోలు, ప్రైవేటు వాహనాల ద్వారా ఎల్లారికి చేరుకోవచ్చు.

సధుపాయాలు[మార్చు]

దర్గా ఆవరణంలో దర్గాకు చెందిన 32 గదులు మంచినీరు, విద్యుత్సదుపాయం కల్పించబడి ఉన్నాయి. ఇందులో బస చేయాలంటే దర్గా నిర్వహకులను అనుమతి పొంది, రోజు వారి అద్దె చెల్లించి ఉండవచ్చు. ఇవి కాకుండా బయట ప్రైవేటు గదులు ఉన్నాయి. సదుపాయాలను బట్టి రోజు అద్దె చెల్లించి బస చేయవచ్చు.

ఎల్లార్తి గ్రామం గురించి[మార్చు]

ఎల్లార్తిలో 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామంలో 443 ఇళ్లు ఉండగా, 2603 జనాభాతో 2353 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1331, ఆడవారి సంఖ్య 1272. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 546 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 24 ఉంది. గ్రామ పిన్ కోడ్: 518395. భూమి వినియోగం అడవి: 867 హెక్టార్లు, వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 153 హెక్టార్లు, నికరంగా విత్తిన భూమి: 1333 హెక్టార్లు, నీటి సౌకర్యం లేని భూమి: 1316 హెక్టార్లు, వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 17 హెక్టార్లు. ఎల్లార్తిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. ఆటో సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచి నీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "Sakshi Telugu Daily Kurnool District, Tue, 2 Nov 21". web.archive.org. 2022-04-05. Archived from the original on 2022-04-05. Retrieved 2023-02-17.

https://epaper.sakshi.com/3276654/Kurnool-District/02112021#page/2/2 Archived 2022-04-05 at the Wayback Machine