Jump to content

షోడశకుమార చరిత్ర

వికీపీడియా నుండి

తెలుగు సాహిత్యంలో వెలువడిన ముఖ్యమైన కథాకావ్యాలలో షోడశకుమార చరిత్ర ఒకటి. దీనిని క్రీ. శ. 15 వ శతాబ్దపు ఉత్తరార్ద కాలానికి చెందిన వెన్నెలకంటి అన్నయ్య రచించాడు. తెలుగులో భేతాళ పంచవింశతి కథలపై వెలువడిన తొలి ప్రాచీన గ్రంథం షోడశకుమార చరిత్ర.

షోడశకుమార చరిత్ర-కావ్య విశేషాలు

[మార్చు]
  • భేతాళ కథలపై తెలుగులో వెలువడిన తొలి గ్రంథం అన్నయ్య 'షోడశకుమార చరిత్ర'
  • ఇది 15 వ శతాబ్దం ఉత్తరార్ధ భాగంలో రాయబడిన కథాకావ్యం. కృతికర్త వెన్నెలకంటి అన్నయ్య. కృతిపతి వెన్నెలకంటి సూరామాత్యుడు.
  • ఇది 8 ఆశ్వాసాలతో, చంపూ మార్గంలో, కావ్య శైలిలో రాయబడింది. పూర్తిగా లభ్యం కాలేదు.
  • కల్పిత ఇతివృత్తంతో కూడి వున్నఈ కథాకావ్యంలో కథా నాయకుడు కమలాకరుడనే రాజు. ఒక అనుకోని సంఘటనలో విడిపోయి చెల్లా చెదురైన 16 మంది స్నేహితులు కొంతకాలం తరువాత తిరిగి కలుసుకొని తాము పొందిన చిత్రమైన అనుభవాలను తమ రాకుమారునికి చెప్పిన కథలు ఇవి. దీనిలో అద్భుత, వీర రసాలు పోషించబడ్డాయి.
  • కావ్య శైలిలో రాయబడినప్పటికీ, దీనిలోని కథలు సరళసులభంగా, ధారాళంగా ఉన్నాయి.

కవి విశేషాలు

[మార్చు]

షోడశకుమార చరిత్రను వెన్నెలకంటి అన్నయ్య చక్కని కథాకావ్యంగా తెలుగులో రాసాడు. ఇతను 15 వ శతాబ్దపు ఉత్తరార్ద కాలానికి చెందిన కవి.[1] ఇతడిని దూబగుంట నారాయణ కవికి (క్రీ. శ. 1470) సమకాలికునిగా భావిస్తారు. అన్నయ్య తన షోడశకుమార చరిత్రను తన తండ్రి వెన్నెలకంటి సూరామాత్యునికే అంకిత మిచ్చాడు.

కావ్య మూలాలు

[మార్చు]

షోడశకుమార చరిత్రకు మూలం ఇది అంటూ నిర్దుష్టంగా చెప్పదగిన కావ్యం లేదు. అలా అని స్వతంత్ర రచన అని భావించనవసరం లేదు. సంస్కృత భేతాళ పంచవింశతి నుండి కొన్ని కథలను యథాతదంగా స్వీకరించి, సమకాలిక తెలుగు కథాకావ్యాలలోని కొన్ని కథలనుండి ప్రేరణపొంది అన్నయ్య తనదైన శైలిలో కథలల్లుతూ షోడశకుమార చరిత్రను రాయడం జరిగింది.

సంస్కృతంలో వున్న భేతాళ పంచవింశతిలో భేతాళుడు చెప్పే 25 అద్భుత సాహస కథలున్నాయి. చిక్కు ప్రశ్నలతో ముగిసే ఈ కథలకు ప్రతీ రాత్రి భేతాళుడు చెపుతుంటే వాటికి విక్రమసేనుడు సమాధానాలను చెపుతూ వచ్చి చివరకు 25 వ కథలోని చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతాడు. షోడశకుమార చరిత్రలోని జ్ఞానవిజ్ఞానశూరుల కథ, మదనమంజరి కథ, దేవసేనచరిత్రం వంటి కొన్ని కథలకు ఈ భేతాళ పంచవింశతి లోని కథలు మాతృకగా ఉన్నాయి. అందుచేతనే ఈ కథాకావ్యం చాలాకాలం వరకూ భేతాళ పంచవింశతి అనే పేరుతోనే ప్రసిద్ధమైంది. దీనిలోని కథలకు కేతన దశకుమార చరిత్ర లోని కొన్ని కథలతో పోలికలు, జక్కన విక్రమార్క చరిత్ర లోని కొన్ని సంఘటనలతోను అనుకరణలు కూడా కనిపిస్తాయి.[2] ఇంతేకాక కథాసరిత్సాగరం, మంచెన కేయూరబాహు చరిత్రల ప్రభావం ఈ కథాకావ్యంపై కనిపిస్తుంది.[2]

కావ్య ఇతివృత్తం

[మార్చు]

విడిపోయి చెల్లాచెదురైన 16 మంది స్నేహితులు (షోడశ కుమారులు) తిరిగి కలుసుకొని తాము పొందిన అనుభవాలను కథల రూపంలో రాకుమారునితో పంచుకోవడం ఈ కథాకావ్యంలో ప్రధాన ఇతివృత్తం. దీనిలో ప్రధాన నాయకుడు కమలాకరుడనే రాకుమారుడు. ఇతనికి 8 మంది మంత్రి కుమారులు (కరుణాకరుడు, చిత్రకారుడు, కాంతిమంతుడు, బుద్ధిసహాయుడు, వివేకనిధి, ప్రభాకరుడు, యశఃకేతుడు, నీతిమంతుడు), 4 గురు దండనాయక కుమారులు (భీమభటుడు, విక్రమకేసరి, దీర్ఘ బాహుడు, దృఢముష్టి) ముగ్గురు పురోహిత కుమారులు (వసంతకుడు, మతిమంతుడు, కళానిధి) - వెరసి మొత్తం 15 మంది స్నేహితులుంటారు. రాకుమారునితో కలుపుకొని వీరు మొత్తం 16 మంది- షోడశ కుమారులవుతారు.[3] ఈ 16 మంది స్నేహితులు ఒకరోజు అడవిలో అనుకోకుండా ఆపదలో చిక్కుకొని విడిపోయి చెల్లాచెదురవుతారు. కొంతకాలానికి ఒకరి తరువాత ఒకరుగా తిరిగివచ్చి తమ తమ విచిత్ర అనుభవాలను రాకుమారుడు కమలాకరునితో చెప్పిన కథలు ఇవి.

8 అశ్వాసాలు గల ఈ గ్రంథం పూర్తిగా లభ్యం కాలేదు. 3,4 అశ్వాసాలు దొరకలేదు. దొరికిన ఆశ్వాసాలలో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి.[4]

రెండవ ఆశ్వాసం: షోడశకుమారులు విడిపోవడం గురించి, కమలకరుడు, భీమభటుడు, కరుణాకరుడు, చిత్రకారుడు, కాంతిమంతుడు, బుద్ధిసహాయుడు, వసంతకులకు సంబంధించిన కథలున్నాయి.
మూడవ ఆశ్వాసం: అలభ్యం
నాలుగవ ఆశ్వాసం: అలభ్యం
ఐదవ ఆశ్వాసం: విక్రమకేసరికి సంబంధించిన కథలున్నాయి. దీనిలోనే భేతాళుడు చెప్పిన కథలున్నాయి. అవి భోజనవనితాశయ్యాచంగుల కథ, జ్ఞానవిజ్ఞానశూరుల కథ, మదనమంజరి కథ, దేవసేనచరిత్రం, వైశ్యకన్యకథ, ధర్మరాజుకథ.
ఆరవ ఆశ్వాసం: వివేకనిధి, ప్రభాకరులకు సంబంధించిన కథలున్నాయి.
ఏడవ ఆశ్వాసం: దీర్ఘ బాహుడు, దృఢముష్టి లకు సంబంధించిన కథలున్నాయి.
ఎనిమిదవ ఆశ్వాసం: రాకుమారుని వివాహ వివరాలున్నాయి

కావ్యశైలి

[మార్చు]

అద్భుత, వీర రసాత్మకమైన ఈ కథాకావ్యంలో అన్నయ్య చక్కని కల్పనా శక్తిని, కథా సంవిధాన కౌశలాన్ని ప్రదర్శిస్తాడు. దీనిలో కథాగమనం ధారాళంగా సాగుతుంది. వర్ణనలు రమణీయంగా వుంటాయి.

షోడశకుమారులు పొందిన చిత్ర విచిత్ర అనుభవాలను పరికల్పించడంలో, వారి సాహసాలను కథలుగా మలచడంలో కవి చక్కని నేర్పు ప్రదర్శిస్తాడు. ఈ కథాకావ్యంలో కథనం కేతన దశకుమార చరిత్ర పద్ధతిలో సాగుతుంది. అన్నయ్య కావ్య శైలి సరళసులభంగా, ధారాళంగా ఉంది. కథను కొనసాగిస్తున్నప్పుడు మధ్యలో ఆగి వర్ణనలు చేయడం, పాత్రల భావాలను చిత్రించడం తక్కువగా వుంటుంది. దీనివలన కథా గమనం ధారాళంగా సాగిపోతుంది. చేసిన కొద్ది పాటి వర్ణనలు కూడా రమణీయంగా చక్కని ఉపమానాలతో అలరారుతాయి.

వర్ణనలు

[మార్చు]

కథాగమనానికి ఆటంకం లేకుండా సందర్భానుసారం చేసిన వర్ణనలలో ఆనాటి పుర వేశ్యల వైభవ వర్ణన, రాజాస్థానంలోని ప్రతీహారకాంతల వర్ణన, శారదాపీఠం వంటి వర్ణనలు చెప్పుకోదగ్గవి.[5] ఉదాహరణకు ఈ కథా కావ్యంలో కారు మేఘాన్ని ప్రళయ తాండవమాడే ఉగ్ర నటరాజుతో పోలుస్తూ అధ్బుతంగా వర్ణించిన విధం ఇలా ఉంది. - (షోడశకుమార చరిత్ర- ఆరవ ఆశ్వాసం-102) [6]

 
వితతవర్ణవితీర్ణవిద్రుమవల్లులు పరగెడు ఘనజటాపంక్తి దొరయ
నంబుపానసమాగ తాంబుదపటలంబు దనరారు కుంజరాజినము గాగ
బ్రబలవాతోద్దూతభంగ సంఘంబులు విస్తరిల్లెడు హస్తవితతిబోల
ఘోరతరస్ఫురద్ఘమఘమాఘోషణం బారభటీభాతి నతిశయిల్ల
బ్రళయకాలతాండవలీల బ్రజ్వరిల్లు
ఫాలలోచను నుగ్రరూపంబువోలె
నంబరంబును దిక్కులు నాక్రమించి
యతిభయంకరమయ్యె నా యంబుదంబు

కావ్య పరామర్శ

[మార్చు]

భోజరాజీయం, పంచతంత్రం లవలె షోడశకుమార చరిత్ర నీతి భోదకమైన కథాకావ్యం కాదు. షోడశకుమారులనబడే 16 మంది స్నేహితులు పొందిన చిత్రాతి చిత్రమైన అనుభవాలకు ఇచ్చిన కథారూపం. అభూత కల్పనలతో సాగే వారి సాహసాద్భుతాలను ప్రతిబింబించే ఈ కథలు కేవలం ఉత్కంఠోల్లాసాల కొరకు అద్భుత, వీర రసానందం కొరకు చదివే కాలక్షేప కథలు మాత్రమే. కావ్య శైలికి నప్పని ఇటువంటి జనరంజకమైన కథలను కవి కావ్యశైలిలో రాసినప్పటికీ, దీనిలోని కథలు సరళసులభంగా, ధారాళంగా ఉన్నాయి. సంస్కృత భేతాళ పంచవింశతి కథలను తొలిసారిగా తెలుగులోకి తీసుకొనిరావడం ద్వారా షోడశకుమార చరిత్ర అప్పటివరకూ మౌఖికంగా జన ప్రచారంలో వున్న భేతాళ కథలను తెలుగులో లిఖిత బద్దం చేసింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

వెన్నెలకంటి అన్నయ్య

రిఫరెన్సులు

[మార్చు]
  • ఆరుద్ర. సమగ్ర ఆంద్ర సాహిత్యం - సంపుటి V (గజపతుల యుగం) (1965, ఆగష్టు ed.). మద్రాస్: యం. శేషాచలం అండ్ కంపెనీ.
  • ముదిగంటి సుజాతారెడ్డి. ఆంధ్రుల సంస్కృతి సాహిత్య చరిత్ర (తొలి ముద్రణ 1989, 2009 ed.). హైదరాబాద్: తెలుగు అకాడమి.

మూలాలు

[మార్చు]
  1. ముదిగంటి సుజాతారెడ్డి 2009, p. 56.
  2. 2.0 2.1 ఆరుద్ర, సమగ్ర ఆంద్ర సాహిత్యం, సంపుటి V & 1965, ఆగష్టు, p. 85.
  3. ఆరుద్ర, సమగ్ర ఆంద్ర సాహిత్యం, సంపుటి V & 1965, ఆగష్టు, p. 91.
  4. ఆరుద్ర, సమగ్ర ఆంద్ర సాహిత్యం, సంపుటి V & 1965, ఆగష్టు, p. 88.
  5. ఆరుద్ర, సమగ్ర ఆంద్ర సాహిత్యం, సంపుటి V & 1965, ఆగష్టు, p. 97-98.
  6. ఆరుద్ర, సమగ్ర ఆంద్ర సాహిత్యం, సంపుటి V & 1965, ఆగష్టు, p. 99.