సంకల్పం
హిందువుల పూజా సంప్రదాయంలో పూజ ప్రారంభానికి ముందు గృహస్థులు స్థలకాలాదుల విశేషాలను, తన స్వంత పరిచయాన్నీ చెప్పుకుంటారు. దీన్ని సంకల్పం అంటారు. సాధారణంగా పూజ ప్రధాన భాగం ఈ సంకల్పంతో ప్రారంభమౌతుంది. ఈ సంకల్పం సంస్కృతంలో ఉంటుంది.
సంకల్పం పాఠ్యం
[మార్చు]సంకల్పం పాఠ్యం కింది విధంగా ఉంటుంది:[1]
శుభే శోభనముహుర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేరీ మధ్య దేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన _____ సంవత్సరే _____ అయనే _____ ఋతౌ _____ మాసే, శుక్ల/కృష్ణ పక్షే _____ తిథౌ _____ వాసర సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్ శుభతిథౌ శ్రీమాన్ _____ గోత్రోద్భవస్య _____ నామధేయోహం
ఇందులో "అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే " అనే భాగం కాలాన్ని సూచిస్తుంది.
- ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే - ఈ బ్రహ్మ యొక్క జీవితపు రెండవ భాగంలో
- శ్వేతవరాహ కల్పే - శ్వేతవరాహ కల్పంలో
- వైవస్వత మన్వంతరే - వైవస్వతం అనే పేరున్న మన్వంతరంలో. ఒక్కో కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. ఈ కల్పంలో ఇది 7 వ మన్వంతరం.
- కలియుగే - కలియుగంలో. ఒక్కో మన్వంతరంలో ఉండే కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల్లో ఇది కలియుగం
- ప్రధమపాదే - ఆ యుగంలో ఉండే నాలుగు పాదాల్లో ఇది మొదటి పాదం
"జంబూద్వీపే భరతవర్షే భరతఖండే" అనేది స్థలాన్ని సూచిస్తుంది.
- జంబూద్వీపే - జంబూద్వీపంలో. ఇది యావత్తు భూగోళాన్ని సూచిస్తుంది
- భరతవర్షే - భరత వర్షంలో. ఇది భారతదేశంతో సహా భౌగోళికంగా మరింత విస్తారమైన ప్రాంతాన్ని (యూరేషియాను కూడా కలుపుకుని) సూచిస్తుంది
- భరతఖండే - భరత ఖండంలో. ఇది భారతదేశాన్ని సూచిస్తుంది
ఈ తరువాత గృహస్థు తానున్న స్థలాన్ని మరింత స్థానికంగా వివరిస్తాడు. అది కొన్ని స్థలాలకు ఇలా ఉంటుంది
- మేరోర్దక్షిణ దిగ్భాగే - మేరు పర్వతానికి దక్షిణ ప్రాంతంలో
- శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే - శ్రీశైల క్షేత్రానికి ఈశాన్యంలో
- కృష్ణా కావేరీ మధ్య దేశే - కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో
ఆ తరువాత, పంచాంగం ప్రకారం తిథి వివరాలను చెప్పి, గృహస్థు గోత్ర నామాదులను ఇలా చెప్పుకుంటారు.
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన _____ సంవత్సరే _____ అయనే _____ ఋతౌ _____ మాసే, శుక్ల/కృష్ణ పక్షే _____ తిథౌ _____ వాసర సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్ శుభతిథౌ శ్రీమాన్ _____ గోత్రోద్భవస్య _____ నామధేయోహం
ఈ విధంగా స్థల కాలాదులను స్వీయ గోత్ర నామాదులనూ చెప్పుకుని, తామందరి కోరికలు నెరవేరేందుకు గాను ఈ పూజ చేస్తున్నానని కింది విధంగా చెప్పుకుని పూజను మొదలుపెడతారు
మమ సహకుటుంబస్య,క్షేమ,స్థైర్య , వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివౄధ్యార్థం, పుత్రపౌత్రాభివౄధ్యార్థం, మమధర్మార్థ, కామమోక్ష, చతుర్విధ ఫలపురుషార్థం, సర్వ్వాభీష్ట సిధ్యర్థం శ్రీవరలక్ష్మీ దేవతా ముద్దస్య వరలక్ష్మీ దేవతా ప్రీతార్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడోపచార పూజాం కరిష్యే[2]
మూలాలు
[మార్చు]- ↑ "గణేష్ చతుర్థి: వినాయక పూజా విధానం, ఏం కావాలి, ఎలా చేయాలి?". వన్ ఇండియా. Archived from the original on 2024-04-09. Retrieved 2024-04-09.
- ↑ "నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-05-09. Archived from the original on 2023-01-28. Retrieved 2024-04-09.