Jump to content

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం విహార యాత్ర

వికీపీడియా నుండి
(సాగర్ టు శ్రీశైలం బోటు షికారు నుండి దారిమార్పు చెందింది)

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీ విహార యాత్ర కృష్ణానది లో నీటి మార్గంలో ప్రకృతి పచ్చదనంతో కప్పేసిన ఎత్తైన కొండల మధ్య సాగే ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులను మైమర్పిస్తుంది[1]. 8 గంటల బోటు యాత్ర చేసి శ్రీశైలం లోని మల్లిఖార్జునుడుని దర్శించుకోవటం భక్తులకు మరిచిపోలేని అనుభూతిని కల్లిస్తుంది. ప్రతి సంవత్సరం నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం 560 అడుగులకు చేరుకున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ లాంచీ విహార యాత్రకు ఏర్పాట్లు చేస్తారు.[2]

లాంచీ ప్రయాణం

[మార్చు]

కొండల మధ్య బోటులో ప్రయాణం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్యాటక ప్రాంతం పాపికొండలు. అయితే ఇప్పుడు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్-కు కూడా బోటు ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణం తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో అంతులేని ఆనందాన్ని అందిస్తోంది. ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు ఆధ్యాత్మికమైన వాతావరణం మధ్య ప్రయాణం హాయిగా సాగిపోతుంది. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను మిగులుస్తుందంటున్నారు పర్యాటకులు. నాగార్జునసాగర్ నుండి దాదాపు ఏడు గంటల పాటు క్రూయిజ్ టూర్ మొదలౌతుంది. అంటే అసలు అడ్వంచర్ జర్నీ ఇక్కడి నుండి ప్రారంభం అవుతుం ది. ఏడు గంటల పాటు సాగే ఈ జర్నీలో పక్షుల కిలకిలారావాలతో నీటి సవ్వడుల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ పచ్చటి కొండల చుట్టూ తిరుగుతు ఎగ్జైటింగ్-గా ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ ప్రయాణం ఒకేసారి దాదాపు ఐదు జిల్లాల పరిధిలో సాగుతుంది. పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మపై పకృతిని ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఎంతో బాగుంటుంది. సాగర్ నుండి మొదలై శ్రీశైలం వరకు సాగే ఈ ప్రయాణంలో మనకు తెలియని ఎన్నో కొత్త, వింతైన విషయాలను తెలిపేందుకు ఇక్కడ ఓ గైడ్ కూడా ఉంటాడు. అతను ప్రతీ ప్రదేశం ప్రత్యేకతను పర్యాటకులకు వివరిస్తుంటాడు.ఇక కృష్ణా నదిలో బోటు ప్రయాణం చేసినంత సేపూ మనకు ఇంకేం గుర్తుండదు. ఏ టెన్షన్స్ కూడా మన దరిచేరవు. అలా ఉంటుంది వాతావరణం. ఆ మనోహరమైన, ఆహ్లాదకరమైన వాతావరణానికి మనసు ఆనందతాండవం చేస్తుంది. కృష్ణా నదిలో దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత శ్రీశైలానికి బోటు చేరుకుంటుంది [3].

నాగార్జునకొండ మ్యూజియం

[మార్చు]

నాగార్జునసాగర్‌కు సమీపంలో కష్ణానది రిజర్వాయర్ మధ్యనున్న నాగార్జునకొండ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడికొచ్చిన పర్యాటకులు బుద్ధుడి ప్రతిమకు ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తుంటారు. ప్రపంచంలో మానవ నిర్మిత జీవి మ్యూజియంలో ఇది మూడోది. లాంచీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల మధ్య నీటిలో ప్రయాణం ఆ అనుభూతే వేరు. నాగార్జునకొండ చూడడానికి విజయపురి సౌత్ నుంచి కష్ణానదిలో 14కి.మీ లాంచీ ద్వారా ప్రయాణం ఇలా గంటసేపు ప్రయాణం చేసిన తరువాత రిజర్వాయిర్ మధ్యలో ఓ చిన్నపాటి ద్వీపకల్పంలా మనకు నాగార్జునకొండ కనిపిస్తుంది. ఈ కొండపైనే ఆచార్య నాగార్జునుడి విశేషాలు తెలిపేలా ఏర్పాటు చేసిన నాగార్జునకొండ మ్యూజియం ఉంది. నాగార్జున మ్యూజియంలో బుద్ధుడికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఇక్కడి శిల్ప కళ, శాతవాహనులు, ఇక్ష్వాకుల రాజవైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. మూడు, నాలుగు శతాబ్దాలకు సంబంధించిన శిల్పకళలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.[4] నారార్జునకొండలో సుమారు 400 వరకు శాసనాలు లభించాయి. వీనిలో చాలావరకు దానధర్మాలకు సంబంధించినవి. ఇవి ప్రాకృత, సంస్కృత, తెలుగు భాషలలో ఉన్నాయి. మహాయాన బౌద్ధ ప్రవక్త ఆచార్య నాగార్జునుడి మహా విశ్వవిద్యాలయం, బుద్ధుడి మహాస్తూపం, విశాలమైన వివిధ భిక్షు విహారాలు మొదలైన వాటితో ఇక్షాకుల రాజధానిగా విరసిల్లిన విజయపురి ప్రాంతం సాగర్ గర్భంలో ముంపునకు గురికాకుండా పురావస్తు శాఖ అక్కడి విశేష సామాగ్రిని పరిరక్షించి నాగార్జునకొండ మ్యూజియంలో భద్రపరిచింది. అందులోని రాజ్యచౌదాలు, సింహాల విహారం, పాతరాతి యుగం, నాటి సమాధుల మధ్య కొత్తరాతి యుగంలోని పరికరాలు ఆకాలంలో వాడుకలోని బంగారు నగలు, నాణేలు, ఇతర పనిముట్లు, శిలాశాసనాలు, తదితర వస్తువులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాగార్జునకొండ లోయలో బౌద్ధ శిథిల అవశేషాలు, ఇక్షాకుల విజయపురి శిథిలాలు ఏవిధంగా బయట పడ్డాయే వాటిని అదేవిధంగా పొందుపర్చారు. ఇక్షాకుల శిలాశాసనలు, వారి జీవిత విశేషాలు, చౌదా స్తంభాలు, తదితరమైనవి సైతం మ్యూజియంలో ఉన్నాయి. విరిగిపోయిన శిల్పాలను అతికించి వాటి పూర్వపు ఆకారాన్ని కళ్లకు కట్టడం ఈ మ్యూజియంలోని ప్రత్యేకత. ఇక్కడి శిలలు, గౌతమ బుద్ధుని జీవిత విశేషాలు, ఆయన జాతక కథలు, మొదలైన వాటిని విపులంగా విశదీకరిస్తాయి. ఇవి నాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలుస్తాయి. మ్యూజియం చుట్టుపక్కల ఉన్న కొన్ని కట్టడాలు వాటి పరిస్థితులను కళ్ల ముందు నిలుపుతాయి[5].

నాగార్జున విశ్వవిద్యాలయం

[మార్చు]

నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాల శేషాలు నాగార్జునకొండ లోయలో ఏవిధంగా ఉండేవో అదే విధంగా తిరిగి అమర్చారు. కష్ణానది తీరాన విశాల విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం ఉండేది. ఇది ప్రాచీన కాలపు గురుకులం. ఇక్కడ గురుశిష్యు నివాసాలు ఒకే దగ్గర ఉండేవి. సకల శాస్త్ర విజ్ఞాన కేంద్రమైన ఇది సమస్త విద్యలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ విశ్వ విద్యాలయంలో చైత్యగహానికి తూర్పున మూడు భాగాల ద్వారం ఒకటి ఉంది. ఒకే విహార భాగం ఐదు గదులు కలిగి మధ్య భాగంలో 55అడుగుల చతురాస్ర్తాకార మండపం ఉంది. దీన్ని విశ్వవిద్యాలయ లెక్చరర్ హాల్‌గా భావించేవారు. ఇక్కడ ఉన్న మరో మూడు గదులు బుద్ధ ధర్మ సంఘం, బౌద్ధ ఇక్షాక చిహ్నాలు కావచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో సర్క, తంత్ర, ఖనిజ, రసాయన, ఔషధ శాస్త్ర, శాస్ర్తాలు, మాధ్యమిక వాద, మహాయాన వాదాలను చిత్తశుద్ధులైన పండితులు, ఆచార్యులు బోధించే వారు. విశ్వ ఇక్షాక గ్రంథం, విషుధమగు రచయిత బుద్ధగోషుడు, ఆర్యదేవుడు, రాహువుడు, సిద్ధ నాగార్జునుడు మొదలైన వారు ఇక్కడ ఆచార్యులుగా పని చేసేవారు. ఇక్కడ విద్యను అభ్యసించేందుకు వివిధ దేశాల నుంచి తండోపతండాలుగా వచ్చేవారు.

హారతి దేవాలయం

[మార్చు]

విశ్వవిద్యాలయానికి కొద్ది దూరంలోనే హారతి దేవాలయం, దాని కింద చతురస్ర్తాకారంలో ఓ పెద్ద సరస్సు ఉంది. దీనికి నలు వైపులా మొట్లతో ఓడ్డు ప్రాంతాలు ఉన్నాయి. మెట్లపై గ్యాలరీ మాదిరిగా ఉండడంతో దీన్ని క్రీడాప్రాంతంగా భావించినా క్రీడా ప్రాంగణం మరో ప్రాంతంలో బయల్పడింది.

స్థాన వేదికం

[మార్చు]

నాగార్జున కొండపై ఇక్షాకుల రాజ్యసౌధ ప్రాగణ్యంలో కష్ణానదిని ఆనుకొని నిర్మించిన స్నానగట్టాల వేదికలు ఉన్నాయి. ఇది కేవలం స్నానాలకే కాక బస్సు సామాగ్రిని, నౌకల ద్వారా రవాణా చేయడానికి కాను రేవుగా సైతం వాడి ఉంటారని తెలుస్తుంది. ఈ స్నానపు గట్టాలు నునుపైన నాపరాళ్లతో చేయబడి నది స్నానానికి ఎంతో సౌకర్యంగా ఉండేవి.

కాకతీయ కట్టడాలు

[మార్చు]

మ్యూజియానికి సమీపంలోని కోట గోడలాంటి పెద్ద రాతి కట్టడం కాకతీయుల నాటి కట్టడంగా పరిగణిస్తున్నారు. కాకతీయులు ఈ ప్రాంతాన్ని సరిహద్దు సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నరు అనడానికి ఈకోట గోడలు ఇప్పటికి సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయి.

హిందూ దేవాలయాలు

[మార్చు]

కోట గోడలకు సమీపంలో పక్కపక్కనే రెండు హిందూ దేవాలయాలు ప్రాచీనమైనవి దర్శనమిస్తున్నాయి. కాకతీయుల కాలంలో వీటిని నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం వీటి ఆలనాపాలన లేకపోవడంతో పాడుబడ్డ గబ్బిలాలకు ఆవాసాలుగా మారాయి. <<మహా చైత్యం>> ఇది బుద్ధధాతువుపై కట్టిన అందాల చైత్యం. ఈ స్తూపం నుంచి తవ్వి తీసిన ధాతువును ప్రస్తుతం బుద్ధుడి మొదటి ప్రసంగం చేసిన స్థారానదిలో ఉంచి పూజలు చేస్తున్నారు. ఇది శరీరక స్థూప జాతికి చెందినది. దీన్ని అంతర్భాగంలో బుద్ధ భగవానుడి అస్తికలు అమర్చబడి ఉన్నాయి. ఇది ప్రాచీన శిల్ప నిర్మాణ ప్రావీణ్యానికి నిదర్శనం. చక్రం, దాని ఆకులను ఇటుక గోడల్లా నిర్మించి ఆకుల మధ్య ఖాళీ స్థలాన్ని మట్టితో కప్పి స్తూపాకారంగా తయారు చేసి ఉపరితల భాగాన్ని చుట్టుపక్కల పాలరాతి పలకలు కట్టి అర్థగోలాకారంగా ఆశ్చర్యపోయేంత అందంగా దీనిని నిర్మించారు.

సింహాల విహారం

[మార్చు]

మహాచైత్యం పక్కనే సింహాల విహారం శిథిలాలు ఉన్నాయి. ఈ విహారంలో బుద్ధుడి విగ్రహాన్ని స్థాపించారు. శాంతి సిరి ఈ విహారానికి ఎన్నో ధానధర్మాలు చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇవికాక ఇంకా కుర్మశతికుండ, ఇక్షాకుల రాజసైదాలు, పతీసహజమణగట్టం, ఆశ్వమేధ యాగశాల, తదితర కట్టడాలు సైతం నాగార్జునకొండలో నిక్షిత్తమై ఉన్నాయి.[6]

ఆద్యాత్మకం

[మార్చు]

కృష్ణా నదిలో దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత శ్రీశైలానికి బోటు చేరుకుంటుంది.సాగర్లో ప్రయాణించినంత సేపూ ఆహ్లాదంతో నిండిపోయిన మనసు కాస్తా శ్రీశైలంలో అడుగు మోపగానే ఒక్కసారిగా ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. అడుగు పెట్టగానే విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాథుడు సాక్షి గణపతిగా దర్శనమిస్తాడు. అక్కడి నుండి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన శ్రీశైలమల్లికార్జున స్వామి దర్శనంతో పాటు శిఖర దర్శనంతో మనసు దైవచింతనలోకి వెళ్ళిపోతుంది. మనసారా ఆ బోళా శంకరుణ్ని స్మరిస్తే కోరిన కోర్కెలు ఇట్టే తీరుస్తాడని భక్తుల విశ్వాసం.శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు అక్కడి నుంచి కైలాస శిఖరానికి చేరుకుంటారు. అక్కడ వెలసిన నందిపై నవధాన్యాలు వేస్తే సకల పాపాలూ తొలగుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ శిఖరం పైనుండి చూస్తే ప్రకృతి అందాలకు ఎలాంటి వారైనా ముగ్ధులు కావలసిందే.అక్కడి నుండి నేరుగా పాతాళగంగకు బయలుదేరతారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనుకుంటున్నారా? అక్కడి నుండి పాతాళగంగను చేరుకోవడానికి గాల్లో తేలుకుంటు వెళ్ళాల్సి ఉంటుంది. అదెలా అనుకుంటున్నారా? అక్కడి రోప్-వే ఉందిలెండి. మామూలుగా అయితే పాతాళగంగకు వెళ్ళాలంటే 721 మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళలేని వారి కోసం టూరిజం శాఖ రోప్-వే ఏర్పాటు చేసింది. రోప్-వేలో ఎక్కి నదీ జలాలను దగ్గరగా తాకుతూ, పచ్చని చెట్ల సోయగాలను ఆస్వాదిస్తూ పాతాళగంగకు చేరుకోవడం జీవితంలో మరిచిపోలేరెవ్వరు. కొద్దిపాటి భయంతో, కాస్త ఎగ్జయిట్-మెంట్-తో కూడిన ఈ రోప్ జర్నీ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంది.రోప్-వే ద్వారా పాతాళగంగకు చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక బోటులో పాతాళగంగలో సరదాగా బోటింగ్ చేసి అక్కడి నుండి పక్కనే ఉన్న ట్రైబల్ మ్యూజియంకి చేరుకుంటారు. ఆ మ్యూజియంలో శ్రీశైల పుణ్యక్షేత్ర విశిష్టతకు కారణమైన అనేక నిజాలు అక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియంలో నల్లమల్ల అడవుల్లో స్వామిని నెలకొల్పి నిత్యం పూజలు చేసిన మొదటి శ్రీశైల పూజారి అయిన మల్లన ప్రతిమ, అడవి జాతి అనవాళ్లను కాపాడే గిరిజనుల ప్రతిమలు సహజత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటాయి. వాటన్నింటినీ చూస్తుంటే స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి వాతావరణం ఉట్టిపడుతుంది[7].

యాత్ర ప్యాకేజీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://www.youtube.com/watch?v=h3wkb78fx3c
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-27. Retrieved 2014-11-29.
  3. https://www.youtube.com/watch?v=6ofuhWRtlg4
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-23. Retrieved 2014-11-29.
  5. http://namasthetelangaana.com/Districts/Adb/zoneNews.aspx?category=22&subCategory=13&ContentId=365623[permanent dead link]
  6. https://www.youtube.com/watch?v=3kpx8HDG8r8
  7. https://www.youtube.com/watch?v=6b7aZtxN3uQ&src_vid=KACrfL65_nk&feature=iv&annotation_id=annotation_3237754815