Jump to content

సాదత్ హసన్ మంటో

వికీపీడియా నుండి
సాదత్ హసన్ మంటో
జననం11 మే 1912
మరణం1955 జనవరి 18(1955-01-18) (వయసు 42)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
వృత్తికథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు1934–1955
పురస్కారాలునిషాన్-ఇ-ఇంతియాజ్

సాదత్ హసన్ మంటో (1912 మే 11 – 1955 జనవరి 18) బ్రిటీష్ ఇండియాలో జన్మించిన పాకిస్తానీ ఉర్డూ కథా రచయిత. పంజాబ్ రాష్ట్రంలోని లూధియానా జిల్లాలోని సామ్రా లా గ్రామంలో ముస్లిం కుటుంబంలో పుట్టాడు. ఆధునిక ఉర్దూ కథా సాహిత్యానికి మూల స్తంభాలయిన నలుగురు రచయితలలో మంటో ఒకడు. దేశ విభజన నేపథ్యంలో మానవీయ కోణంలో మంటో రాసిన కథలు దిగ్భ్రమ కలిగిస్తాయి. అధికారం, మతం ఎంత క్రూరంగా ఉంటాయో మనిషి ఎన్ని భిన్న స్వభావాల సమాహారమో చెప్పాలంటే మంటోని చదవాలి. 'రాద్దామని కూర్చుంటే నా మెదడు సహకరించదు. అయోమయంగా ఉంటుం ది. నాకు నేను సర్దిచెప్పుకుని ఎంత ప్రయత్నించినా ఇండియాను పాకిస్తా న్‌తో, పాకిస్తాన్‌ను ఇండియాతో విడదీయలేను. అసలు భారత ఉపఖండం విభజింపబడడమన్నది జరిగి ఉండాల్సిందే కాదు' -అని రాసుకున్నాడు మంటో. దేశ విభజనను చాలా తీవ్రంగా నిరసించిన మంటో కలం గొంతు 1940లలో తొలి 1950లలో ప్రముఖంగా వినిపిస్తూ ఉండేది. మంటో చరిత్రకారుడు కాడు కానీ, చరిత్రకారుడి కన్నా లోతైన అవగాహనతో రచనలు చేశాడు. ముఖ్యంగా ఆయన కథలు చారిత్రక నేపథ్యంలోంచి వెలువడి చరితార్థమయ్యాయి. చరిత్రలో సంఘటనలు మాత్రమే ఉంటాయి. ఈయన రచనల్లో సంఘటనల్లో పాత్రధారులైన మానవుల హృదయ ఘోష కూడా ఉంటుంది.

బాల్యం

[మార్చు]

మంటో తండ్రి అమృత్‌సర్‌లో బారిస్టర్. ఆయనకు ఇద్దరు భార్యలు. మంటో చిన్న భార్య కుమారుడు. పెద్ద భార్యకు ముగ్గురు కొడుకులు. వారిలాగా మంటోకు స్కూల్లో మంచి రికార్డు లేదు. ఎప్పుడూ అత్తెసరు మార్కులే వచ్చేవి.

చదువు

[మార్చు]

మంటోకు చదువు అచ్చిరాలేదు. అమృతసర్‌లోని ముస్లిం హైస్కూల్‌లో విద్యాభ్యాసం జరిగింది. మెట్రిక్యులేషన్‌లో రెండుసార్లు తప్పాడు. అతను తప్పిన సబ్జెక్టు ఉర్దూ. విచిత్రమేమంటే ఉర్దూలో పదునైన వాక్యాలు అతని కథల్లో కన్పిస్తాయి. అవి కత్తి కన్నా పదునుగా ఉంటాయి. ఇంగ్లిషు నవలల పట్ల మక్కువ ఉన్న మంటో మెట్రిక్యులేషన్ పాసయ్యి 1931లో హిందూసభ కాలేజీలో ఎఫ్‌ఎ’లో చేరినాడు. కానీ అందులో కూడా ఉత్తీర్ణుడు కాలేదు. ఆ తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చేరాడు. మంటోకి 21ఏళ్లు ఉన్నప్పుడు అబ్దుల్ బారీ అలిఘ్‌తో పరిచయమైంది. అతను ప్రగతిశీల భావాల ఉన్న కార్యకర్త. ఫ్రెంచి, రష్యన్ నవలా రచయితలను మంటోకి పరిచయం చేశాడు. విక్టర్ హ్యుగో రాసిన ‘ది లాస్ట్ డేస్ ఆఫ్ కండెమ్న్‌డ్ మాన్’ను ఉర్దూలోకి అనువదించాడు. అది లాహోర్‌లోని ఓ ప్రచురణ కర్త ప్రచురించాడు. ఆ తరువాత లూధియానా నుంచి వస్తున్న ‘ముసాదత్ దినపత్రికలో చేరాడు. అస్కార్‌వైల్డ్ ‘వీరా’ను ఉర్దూలోకి అనువదించాడు. మంటో మొదటి కథ జలియన్ వాలాబాగ్ ఉదంతం నేపథ్యంలో రాసిన 'తమాషా'.

రచనలు

[మార్చు]

రకరకాల ప్రదేశాల్లో ఉద్యోగాలు చేసి మంటో బొంబాయి చేరుకున్నాడు. జీవితాంతం బొంబా యి నగరాన్ని ప్రేమించాడు. దేశవిభజన తర్వాత బొంబాయిని వదిలిపెట్టాడు. పాకిస్తాన్ వలస వెళ్ళాక లాహోర్‌లో చివరిదశలో చాలా ఇబ్బందుల పాలైనాడు. కానీ సాహిత్య పరంగా గొప్ప రచనలు చేసింది ఈ కాలంలోనే. దేశ విభజన చరిత్ర వాస్తవానికి భారత - పాకిస్తానీ మహిళ శరీరాలపైన మాత్రమే రాయబడ్డ చరిత్ర. ఈ సత్యాన్ని రక్తం కలగలసిన భాషలో మనకు మొట్ట మొదట తెలియజేసిన రచయిత మంటో. దక్షణ భారతదేశంలో దేశ విభజన సమయంలో ప్రజలు పడ్డ కష్టాలు పెద్దగా తెలీదు. ఆనాటి నిజ చిత్రాలను మంటో కథల్లో మనం చూడొచ్చు. అతని కథల్లో ఎక్కడా ఒకవైపు మొగ్గు చూసినట్టుగా అన్పించదు. ఒక్క మానవత్వం వైపే పక్షపాతంతో ఉంటాడు. 'ఖోల్ దో' 'కాలీ షల్వార్' 'బూ' (వాసన) లాంటి కథలు దేశ విభజన నేపథ్యంలో జరిగిన లైంగిక అపరాధాలకు సంబంధించినవి. 1948లో అచ్చయిన 'సియాహాష్యి'లో దేశ విభజన పూర్వాపరాలు, నష్టపోయిన వ్యక్తుల, సమూహాల అభిప్రాయాలు, స్వగతాలు, మనోగతాలు, అన్నీ అక్షరబద్దం చేశా డు మంటో. ఆ పుస్తకాన్ని ఖాలిద్ హసన్ ఇంగ్లీషు లోకి (BLACK MARGINS) అనువాదం చేశాడు.

మంటో జీవితకాలంలో పుంఖానుపుంఖంగా రాశి, వాసి తగ్గని రచనలు చేశాడు. కథక చక్రవర్తిగా పేరు గడించినా ఐదు రేడియో నాటికలు, మూడు వ్యాస సంపుటాలు, రెండు స్కెచ్‌లు, కొన్ని సినిమా స్క్రిప్టులు రాశాడు. 1936లో ఉర్దూలో వెలువడే ఒక సినిమా పత్రికకు సంపాదకుడిగాపని చేశాడు. ఒక రెండేళ్లు ఢిల్లీ-ఆలిండియా రేడియోలో పనిచేయడం మినహా అతను ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రేమించిన నగరం బొంబాయిలోనే జనవరి 1948 వరకు జీవించాడు. అసంఖ్యాకంగా స్నేహితుల్ని తయారుచేసుకున్న మంటో అప్పుడప్పుడు పేదరికం చవిచూశాడు. ఏదైనా ఫిల్మ్ స్క్రిప్టు రాసే అవకాశం దొరికితే చాలా డబ్బు వచ్చేది. దాన్ని అవసరంలో ఉన్న మిత్రులకు కూడా పంచేవాడు. రచనల్లో మహోన్నతమైన మానవీయ విలువల్ని ఎలా నిలిపాడో, నిజ జీవితంలో కూడా మానవత్వమున్న మనిషిగా మసలుకున్నాడు. బొంబాయిలో ఉన్నప్పుడు రాజేందర్ సింగ్ బేడి, కిషన్‌చందర్, ఇస్మత్ ఛుక్తాయి, అలీ సర్దార్ జాఫ్రీ వంటి ఉర్దూ, హిందీ అభ్యుదయ రచయితలంతా ఆయన మిత్రులు.

లాహార్ నుండి వెలువడే అన్ని రకాల పత్రికలకు, మంటో వ్యక్తి పరిచయాలు (వ్యాసాలు) రాసేవాడు. ఊరించి ఊరించి విషయం చెప్పే పద్ధతి పాఠకులకు ఎంతగానో నచ్చేది. హిందీ సినీ నటులు శ్యామ్, అశోక్ కుమార్‌ల గురించి రాసిన పరిచయ వ్యాసాలు ఆ రోజుల్లో వారి స్థాయిని అమితంగా పెంచాయి. అశోక్ కుమార్ సెక్యులర్ భావాల్ని మంటో ఎంతగానో ప్రశంసించాడు.

మంటో ప్రసిధ్ధ కథ ‘తోబా టేక్ సింగ్’ ఇందులో ఇతివృత్తం "దేశ విభజన జరిగిన మూడేళ్లకి ఇరు దేశాలలో ఉన్న పిచ్చివాళ్లని కూడా బదలాయించుకోవాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ పిచ్చివాళ్లలో ఒకడు బిషన్ సింగ్. తన వాళ్లందరూ వదిలేసి వెళ్లిపోయినా తనను పట్టించుకునే వాళ్లు ఎవరూ లేకపోయినా తను పుట్టి పెరిగిన ప్రదేశం పాకిస్తాన్‌లోనే ఉందని తెలిసినా జ్ఞాపకాలు వదలుకోలేక ఆ దేశం వదలటం ఇష్టం లేక సరిహద్దులలో ముళ్ల తీగ మీద పడి ప్రాణం తీసుకున్న ఒక పిచ్చివాడి దీన కథ".

మనిషిలోని అమానవీయతకీ మతానికీ సంబంధం లేదు. రక్షించి తీసుకు వసారనుకున్న వాళ్లే అతి హీనంగా ప్రవర్తించి, మనిషిలోని చీకటి కోణాన్ని బయట పెట్టిన కథ - ఖోల్ దో. నన్ను నమ్ముకున్న వాళ్లు వేరే మతం వాళ్లయినా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ప్రాణాలు కోల్పోయిన సహాయ్‌లాంటి మానవతా మూర్తులు ‘1947 కథ’లో కనిపిస్తే ఎంతటి మానవ విషాదాన్నైనా సంపాదనా మార్గాలుగా మలుచుకునే వ్యాపార వర్గాల వారు ‘అమరత్వం’ కథలో కనపడతారు. ఇక ‘థండా ఘోస్త్' (చల్లని మాంసం) అనే కథ రాసినందుకు మంటోకు హైకోర్టు 300 రూపాయల జరిమానా విధించింది. నేడు ఈ కథ చదువుతుంటే జుగుప్సతో మనం గడ్డ కట్టుకుపోతాము.

మంటోని కేవలం ఓ వివాస్పద రచయితగానే గుర్తుపెట్టుకున్నవారు ఎక్కువగా ఉన్న్నారు. ఆయన రచనల్లో మాలిన్యం ఎక్కువని వాదించేవారూ ఉన్నారు. ఒక రచనలో మాలిన్యం ఏ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి ఉందో కూడా గమనించుకోవాలి. మంటోకు సమకాలీన రచయిత్రి, స్నేహితురాలు రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి, తన ఆత్మకథ “కాగఝీ హై పైరహన్”లో లాహోర్ కోర్టు అప్పట్లో మంటో మీద, ఆమె మీద ఏకకాలంలో వేర్వేరు కేసులు బనాయించటం, దాన్ని వీళ్ళు సమర్థవంతంగా ఎదురుకోవటం గురించి రాశారు. కేసు నెగ్గేశాక, ఇస్మత్‍ను కోర్టు వెనుకకు పిల్చి,

“మీ కథలు చదివాను. “లిహాఫ్” కూడా చదివాను. వాటిలో మాలిన్యం లేదు. కానీ మంటో రాసే కథల్లో మాలిన్యం ఎక్కువగా ఉంటుంది.” అని జడ్జ్ అన్నారు.

“ప్రపంచం కూడా మాలిన్యంతో నిండి ఉంది కదా?” అని ఈవిడ అడిగారు.

“అందుకని? దాన్ని చెదరగొట్టడం అవసరమా?”

“చెదరగొట్టడం వల్ల అది ఉందని గ్రహిస్తాం. శుభ్రపరచడానికి ప్రయత్నిస్తాం.”

మంటో చేసిన పని అదే!

ఇతని కథలను మంటో కథలు పేరుతో ఎ.జి.యతిరాజులు తెలుగులోనికి అనువదించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మంటో చనిపోయేనాటికి భార్య, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు.

మరణం

[మార్చు]

మంటో చివరి దశలో పేదరికం, అనారోగ్యంతో బాధపడ్డాడు. చివరి రోజులలో కుటుంబ పోషణ కోసం, మద్యం కోసం కూడా పత్రికలకు కొన్ని కథలు రాశాడు. పత్రిక కార్యాలయానికి వెళ్ళి కలం కాగితం తీసుకుని అక్కడిక్కడే కథ రాసి ఇచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవాడు. అలా 26 రోజుల్లో రాసిన 26 కథలు ప్రసిధ్ధి పొందాయి. తాగుడుకి బానిసవ్వటం వల్ల కాలేయం దెబ్బ తిని సిర్రోసిస్ వ్యాధితో నలభై రెండేళ్ళ వయసులో కన్ను మూశాడు.

2005 జనవరి 18 న మంటో యాభయ్యవ వర్ధంతి సందర్భంగా పాకిస్తానులో ఆయన చిత్రంతో స్టాంపు విడుదల చేశారు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]