సిరియా సంక్షోభం
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
అంతర్యుద్ధంతో సిరియా మండిపోతోంది...... బాత్ ప్రభుత్వ దళాలు., ఫ్రీ సిరియన్ ఆర్మీ మధ్య 18 నెలలుగా సాగుతున్న పోరు చల్లారేలా కనిపించట్లేదు. అల్ అసద్ గద్దె దిగాలంటూ మొదలైన ఆందోళనల్లో వేలాది అమాయకులు పిట్టల్లా రాలిపోతున్నారు. అరబ్ ప్రపంచాన్ని కుదిపేసిన స్వతంత్ర ఉద్యమాల బాటలో 2011 మార్చి 15న మొదలైన ఆందోళనలు ఏకథాటిగా కొనసాగుతున్నాయి. సిరియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు నిరసనకారులపై విరుచుకుపడుతున్నాయి. మరో వైపు ఆందోళనకారులకు టర్కీ, సౌదీ అరేబియా, ఖతార్, అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌లు మద్దతుగా నిలిస్తే బాత్ పార్టీ ప్రభుత్వానికి ఇరాన్, రష్యాలు బాసటగా నిలిచాయి. మూడున్నర లక్షల సైన్యమున్న సిరియన్ ప్రభుత్వ దళాలతో లక్షలోపు బలమున్న తిరుగుబాటుదారులు, ముజాహిదీన్లు తలపడుతున్నారు. ఏడాదిన్నరగా సాగుతున్న పోరులో ఇరువైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. ఆందోళనలు, నిరసనలతో సంబంధం లేని అమాయకులు కూడా మిలిషియా దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. భీకరంగా సాగుతున్న పోరులో 8వేల మంది ప్రభుత్వ సైనికులు ప్రాణాలు కోల్పోతే అంతకురెట్టింపు సంఖ్యలో తిరుగుబాటుదారుల హతమయ్యారు. నిరసనలు తెలుపుతూ వీధుల్లోకి వచ్చిన ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుడంటంతో భారీ ప్రాణనష్టం జరుగుతోంది. మరోవైపు 30వేల మంది తిరుగుబాటుదారుల్ని సిరియా ఆర్మీ యుద్ధ ఖైదీలుగా బంధించింది. మొత్తం మీద ఏడాదిన్నర పోరులో 30వేల మందికి పైగా ప్రజలు ఇరువైపులా ప్రాణాలు కోల్పోయారు. లక్షలమంది ఇళ్లు, వాకిళ్లు కోల్పోయి చెల్లచెదురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు లక్షలాది మంది పొరుగున్న ఉన్న ఇరాకీ కుర్దిస్తాన్, జోర్డాన్, లెబనాన్, టర్కీలకు శరణార్దులుగా తరలిపోతున్నారు. శరణార్దుల తాకిడి తట్టుకోలేక ఇరాక్ సరిహద్దుల్ని కూడా మూసేసింది. దీంతో పొరుగుదేశాల బోర్డర్లలో ఆశ్రయం కోసం తలదాచుకుంటున్న వారి సంఖ్యకు లెక్కే లేదు. ప్రభుత్వ-తిరుగుబాటు దళాలు అమాయక పౌరుల్ని కవాచాలుగా వాడుకుంటూ దాడులకు దిగుతుండటంతో జనం దిక్కుతోచక అల్లాడిపోతున్నారు. ఆందోళనకారులపై సిరియా ప్రభుత్వ దాడుల్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాన్ని చైనా, రష్యాలు తోసిపుచ్చాయి. సిరియా అల్లర్లు అంతర్గత సమస్యని తేల్చి చెప్పాయి. మరోవైపు అరబ్‌లీగ్‌లో సిరియా సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నా అల్ అసద్ దిగిరావట్లేదు.
పరాయి పాలనలో ఉన్న సిరియాకు 1946లో స్వాతంత్ర్యం వచ్చింది. 1949 మార్చి అమెరికా అనుకూల ప్రభుత్వం సిరియాలో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో మిలిటరీ అధికారులు పాలన చేజిక్కించుకోవడం వారికి వ్యతిరేకంగా సిరియాలో తిరుగుబాట్లు చెలరేగడంతో 1954లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అధికారాన్ని బదలాయించడానికి మిలటరీ పాలకులు అంగీకరించారు. 1955లో తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఈజిప్ట్ సైనికుల ప్రేరణ, సహకారంతో సిరియాలో మిలటరీ పాలన మొదలైంది. మిలటరీ గ్రూపుల నాయకత్వంలో సాగిన సిరియా పాలన చివరకు 1963లో బాత్ పార్టీ ఆవిర్భావానికి దారి తీసింది. రాజకీయ ప్రత్యర్థులు, తిరుగుబాటు దారుల ఊచకోతలతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న బాత్‌పార్టీ 50ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని చెలయిస్తోంది. అంతర్యుద్ధాలు, దాడులు-ప్రతిదాడులు, హత్యాయత్నాలను తట్టుకుని బాత్ పార్టీలో ప్రస్తుత అధ‌్యక్షుడిగా అల్ అసద్ కొనసాగుతున్నారు. 1970లో అధికారంలోకి వచ్చిన హఫీద్ అల్ అసద్ వారసత్వాన్ని కొనసాగించడంలో అసద్ ముందున్నారు. 50ఏళ్లుగా మానవహక్కుల మాటన్నది లేకుండా పాలన సాగించడంతో గత ఏడాది అరబ్ ప్రపంచాన్ని కుదిపేసిన తిరుగుబాటు ఉద్యమాలు సిరియా ప్రజలకు కొత్త ప్రేరణ ఇచ్చాయి. టునిషియా, లిబియా, ఈజిప్ట్., యెమెన్‌లను కుదిపేసిన ఉద్యమాలపై సానుకూలంగా స్పందించిన అసద్ సిరియా ఆందోళనల్ని మాత్రం అగ్రరాజ్యాల కుట్రగా అభివర్ణిస్తున్నారు.
సిరియా సైనిక పాలనకు నిరసనగా అల్ హసక్కా సంస్థకు చెందిన హసన్ అలీ గ్యాసోలిన్ మంటల్లో ఆత్మార్పణం చేసుకోవడంతో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో సైనిక పాలనకు ముందు 1958నాటి సిరియా జాతీయ జెండాను చేతబట్టి వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. అది కాస్త కార్చిచ్చులా దేశమంతటా విస్తరించడంతో సిరియా అగ్నిగుండంలా మారింది. 2011 ఫిబ్రవరి 4,5 తేదీల్లో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల సాయంతో దేశం మొత్తం ఆందోళనలు విస్తరించాయి. అవి కాస్త చినికిచినికి అరబ్‌దేశాల్లో సిరియా ఎంబసీల ముందు ఆందోళనల వరకు వెళ్లాయి. ఆందోళనల్ని అదుపు చేసేందుకు సైన్యం కాల్పులకు దిగడంతో నిరసనలు హింసాత్మకమయ్యాయి. అదే సమయంలో రాజకీయ ఖైదీలు జైళ్లలో నిరసనలకు దిగడంతో దేశంలో అస్థిరత మొదలైంది. దేశమంతటా ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది.
మొదట శాంతియుతంగా మొదలైన ఆందోళనలు క్రమంగా హింసాత్మకమయ్యాయి. మార్చి 15 నాటికి దేశం మొత్తం వీధుల్లోకి వచ్చింది. అల్‌అసద్ ప్రత్యర్థులంతా ఏకతాటిపైకి రావడంతో సిరియా అంతర్యుద్ధం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. సిరియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆందోళనలు మిన్నంాయి. బాత్ పార్టీ ప్రభుత్వానికి కాలం చెల్లిందంటూ నిరసనలు వెల్లువెత్తాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ ఆందోళనలు ఊపందుకున్నాయి. సిరియా పాలకుల గుప్పిట్లో ఉన్న డమాస్కస్ వంటి నగరాల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. మార్చి 18 శుక్రవారం ప్రార్థనల తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కారులు డమాస్కస్, బనియాస్, అల్ హస్సకే, దారా, జోరా, హమా నగరాల్లో ఆందోళనలు విస్తరించాయి. లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు, వాటర్ క్యానన్లతో పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీసు కాల్పుల్లో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. దీంతో డారా నగరం కేంద్రంగా తిరుగుబాట్లు మొదలయ్యాయి. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. 2011 మార్చి 25నాటి ఘర్షణల్లో తొలిసారి భారీ హింస చోటు చేసుకుంది. హమ్స్, హమా, బనియాస్, జస్సేం, అలెప్పో, డమస్కస్, లటకియా నగరాల్లో తిరుగుబాట్లు మొదలయ్యాయి. నిజానికి అల్లర్లు మొదలైన నెలరోజులకే దేశంలో నూతన రాజ్యాంగాన్ని ప్రవేశపెడతామని అల్ అసద్ ప్రకటించారు. దేశంలో పాలనా పగ్గాలు ఎన్నికల ప్రక్రియ ద్వారా సంక్రంమించేలా రాజ్యాంగ సవరణ చేస్తామని సైనిక పాలకులు హామినిచ్చారు.
సిరియాలో ఆందోళనలు అంతకంతుకు పెరుగుతుండటంతో వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బాత్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. శాంతియుత అధికార మార్పిడికి కట్టుబడి ఉన్నామని, రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని గత ఏడాది ఏప్రిల్ మొదట్లో లండన్‌లో అధ్యక్షుడు అల్ అసద్ ప్రకటించారు. ప్రభుత్వోద్యుగులకు వేతనాలు పెంపు, పత్రికా స్వేచ్ఛ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని, అవినీతిని నిర్మూలిస్తామని, ఎమర్జెన్సీని ఎత్తివేస్తామిన హామి ఇచ్చారు. వాటిని నెరవేర్చారు కూడా......2011 ఏప్రిల్ 19న సిరియాలో అత్యవసర పరిస్థితిని తొలగించారు. కుర్దూ శరణార్దులకు సిరియా పౌరసత్వం మంజూరు చేయడం, సున్నీలకు రాయితీ ఇవ్వడం వంటి ప్రయత్నాలు కూడా చేశారు. సిరియాలో రాజకీయ, రక్షణ, న్యాయ వ్యవస్థల్లో సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు పాలనను మెరుగుపరిచేందుకు ఆర్థిక, ప్రభుత్వ విభాగాలను ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. అయితే ఇవేమి బాత్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తొలగించలేకపోయాయి. దేశంలో ఎమర్జెన్సీ ఎత్తేశాక ఆందోళనలు ఊపందుకున్నాయి. దేశమంతటా ఆందోళనలు విస్తరించాయి. దీంతో నిరసనకారులపై సైన్యాన్ని ప్రయోగించారు. దీంతో ఆందోళనలు కాస్త హింసాత్మకమయ్యాయి. అన్ని నగరాలకు విస్తరించిన నిరసనలకు జిహాదీ ఉద్యమం జత చేరడంతో సిరియా విముక్తి ఉద్యమం కాస్త అంతర్యుద్ధంగా మారింది.
సిరియా ఆందోళనలు కాస్త విముక్తి ఉద్యమంగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ బుజ్జగింపులకు తలొగ్గకుండా ఆందోళనకారులు దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేయడం సైనిక పాలకులకు అసహనం కలిగించింది. అదే సమయంలో నిరసనల్ని అణగదొక్కేందుకు సిరియన్ ఆర్మీ నగరాల్లో కవాతు ప్రారంభించింది. దేశద్రోహుల పేరుతో ఊచకోతలు మొదలు పెట్టింది. నిరసనకారులపై ఎలాంటి హెచ్చరికలు లేకుండానే తుపాకుల గర్జించాయి. దేశంలోని అన్ని నగరాల్లో విద్యుత్, ఆహార సరఫరా నిలిపివేశారు. డారా, హామ్స్, బనియాస్, తలకలాహ్, డమస్కస్ వంటి నగరాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేశారు. ఇది ప్రజల ఆగ్రహానికి కారణమైంది. వీధుల్లో జనం గుమిగూడితే ఆర్మీ తుపాకులు గర్జించేవి. అల్వైతే షబితా మిలిషియా సభ్యులు సున్నీ ముస్లింలపై దాడులకు దిగారు. దీంతో ఆత్మరక్షణ కోసం సున్నీలు లెబనాన్ నుంచి పెద్దఎత్తున ఆయుధాలు దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. అదే సమయంలో అమాయకులపై ఊచకోతలకు పాల్పడటాన్ని వ్యతిరేకించిన ఆర్మీ అధికారులపై ప్రభుత్వం వేటు వేయడంతో వారు తిరుగుబాటు చేశారు. జూలై 29న సిరియా విముక్త దళం పేరుతో అల్‌అసద్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించారు. వారికి సిరియా ఆందోళనకారులు జతకలిశారు. ప్రతిపక్షాలు, రాజకీయ ఖైదీలు, అల్ అసద్ ప్రభుత్వ బాధితులు విముక్తి దళాలకు బాసటగా నిలిచాయి. బాత్ పార్టీని, అల్ అసద్‌ను గద్దె దింపే వరకు ఆందోళన ఆగదంటూ సాయుధ పోరు ప్రారంభించారు. ఇది కాస్త సిరియాను సంక్షోభంలోకి నెట్టింది.
ఏడాది క్రితం 20వేల మందితో ఏడాది క్రితం మొదలైన సిరియా విముక్తి దళం సంఖ్య ప్రస్తుతం 60వేలకు చేరింది. దీంతో ఫ్రీ సిరియన్ ఆర్మీ లక్ష్యంగా ప్రభుత్వ దళాలు నగరాలపై గత ఏడాది ఆగస్టులో దాడులు ప్రారంభించింది. సిరియా అల్లర్లలో వేలాది అమాయాకులు ప్రాణాలు కోల్పోవడంతో అరబ్ లీగ్, గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్‌లు సిరియా ప్రభుత్వ తీరును తప్పు పట్టాయి. వీటిని పట్టించుకోని ప్రభుత్వం అన్ని ప్రధాన నగరాలపై దాడులు కొనసాగించింది ఆరు నెలలకు పైగా సాగిన పోరులో సిరియాలో ప్రధాన నగరాలైన డమస్కస్, అలెప్పో వంటి నగరాలకు మాత్రం అల్లర్లు చేరలేదు. అల్ అసద్ ప్రభుత్వానికి బాసటగా డమస్కస్, అలెప్పో ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. దీంతో సిరియాలో ప్రధాన నగరాల భాగస్వామ్యం లేకుండా అధికార మార్పిడి అసాధ్యమని తిరుగుబాటుదారులు కూడా ఓ దశలో ఆశలు వదిలేసుకున్నారు. సిరియాలో పోరు ఏడాది దాటిన తర్వాత డమస్కస్, అలెప్పోల్లో కూడా అల్లర్లు మొదలయ్యాయి. గత జూలై 18న డమస్కస్‌లో జరిగిన బాంబు దాడిలో రక్షణ మంత్రి దావూద్ రజా, మాజీ మంత్రి హసన్ తుర్కమనీలు ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళనలు అక్కడకు విస్తరించాయి. దాడులు తమ పనేనని సిరియా విముక్తి దళం ప్రకటించడంతో బాత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలినట్లైంది. సిరియా అల్లర్లు శృతి మించుతుండటంతో అక్కడ జరుగుతున్న మారణహోమంపై చర్యలు తీసుకోవాలన్న ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని చైనా, రష్యాలు జూలై 19 వీటో చేశాయి. దీంతో సిరియా వ్యవహారంపై అంతర్జాతీయ సమాజం రెండుగా చీలిపోయినట్లైంది. సిరియా విముక్తి సైన్యానికి పరోక్షంగా మద్దతిస్తోన్న అమెరికా, టర్కీ, సౌదీ అరేబియా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడాలకు చైనా, రష్యాలు గట్టి షాకే ఇచ్చాయి. సిరియాతో వాణిజ్య సంబంధాలున్న రెండు దేశాలు అల్ అసద్ ప్రభుత్వంపై ఐరాస సైనిక చర్యల్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అగ్రరాజ్యాలు ఎటూ పాలుపోవడం లేదు.
సిరియా అల్లర్ల విషయంలో అమెరికా మిత్రదేశాల వైఖరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న పాలస్తీనా అరబ్బుల్ని ఉగ్రవాదులుగా చిత్రిస్తున్న పశ్చిమ దేశాలు., సిరియా ప్రభుత్వ వ్యతిరేక మూకలను స్వాతంత్ర్య ఉద్యమకారులుగా గుర్తించి ఆయుధాలు, డబ్బు, ఇతర అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్నాయి. సిరియా ఆందోళనల్ని ముందుండి నడిపిస్తున్న విముక్తి దళాల్లో సౌదీ అరేబియా, కతార్ నుంచి సాయం పొందుతున్న కిరాయి మూకలు కూడా ఉన్నాయి. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ జోక్యానికి వ్యతిరేకంగా అమెరికా, సౌదీ అరేబియాలే బిన్‌లాడెన్ వంటి వారిని ప్రోత్సహించి ముజాహిదీన్‌ల పేరుతో తాలిబాన్ ఉగ్రవాదులను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి వారిని సిరియాకు పంపారు. మరోవైపు అమెరికా మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ ఎత్తుగడలను కూడా మార్చింది. స్వేచ్ఛ, విముక్తిపేరుతో అరబ్ దేశాల్లో అంతర్యుద్ధాలకు ఆజ్యం పోస్తోంది. నిజానికి అమెరికా సాయుధ జోక్యం చేసుకున్న దేశమేదీ ప్రశాంతంగా లేదు. ఇరాక్‌ను ఆక్రమించింది. దాన్ని సర్వనాశనం చేసింది. ప్రజలు ఈతిబాధలకు గురయ్యారు. అక్కడి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి కొంత సైన్యాన్ని వెనక్కు రప్పించింది. ఇప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక ఘటనలోలో జనం మరణిస్తూనే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికన్లు చావుదెబ్బలు తింటున్నారు. అటు తాలిబాన్లు, ఇటు అమెరికన్ల మధ్య సామాన్య జనం నలిగిపోతున్నారు. తాలిబాన్లను అంతంచేసే పేరుతో మానవరహిత విమానాలతో పాక్ ప్రాంతంలో కూడా దాడులు జరుపుతూ అమాయక పౌరుల్ని బలిగొంటోంది. లిబియాలో గడాఫీని అంతం చేసిన తరువాత అక్కడి చమురు సంపదను కొల్లగొట్టడం తప్ప జనాన్ని గాలికి వదిలారు
మరోవైపు తిరుగుబాటు దారులపై జీవరసాయన ఆయుధాలను ఉపయోగించేందుకు సిరియా అధ్యక్షుడు అసద్ సంసిద్ధుడవుతున్నాడనే సాకుతో సిరియాపై ప్రత్యక్ష సైనిక చర్య చేపట్టనున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామ సంకేతాలిచ్చారు. దీనిని ఇరాన్ ఖండించింది. పశ్చిమాసియా పరిణామాలలో సిరియాకు గట్టి మద్దతుదారుగా ఉన్న ఇరాన్‌పై అమెరికా కాలుదువ్వుతోంది. అణ్వాస్త్ర సామర్ధ్యమున్న ఇరాన్‌పై ప్రత్యక్ష దాడి చేయడం అంతసులువు కాదు. సిరియా పరిణామాల్లో అమెరికా మిత్రదేశాలు జోక్యం చేసుకుంటే దాన్ని ఎదిరించేందుకు ఇరాన్ సిద్ధమవుతుందని., ఆ వంకతో దాడి చేయడానికి ఇజ్రాయిల్, అమెరికాలు కాచుకొని ఉన్నాయి. అందుకే సిరియాను రణరంగంగా మార్చుతున్నాయి. అందుకే రష్యా, చైనాలు అడ్డుకున్నాయి. అమెరికా చేతిలో కీలుబొమ్మలా మారిన ఐక్యరాజ్య సమితి సహకారంతో సిరియాపై యుద్ధానికి దిగాలనుకున్న అగ్రరాజ్యాల పన్నాగాన్ని రష్యా, చైనాలు వీటో చేసింది ఈ కారణంతోనే........ మొత్తం మీద ఈ పోరులో సిరియా సర్కారు నిలబడుతుందా......పడిపోతుందా అన్న ప్రశ‌్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే తరువాత కొంత కాలం వరకు అంటే సామ్రాజ్యవాద ఫ్రెంచ్ ఏలుబడిలోనే సిరియా మనుగడ సాగింది. అమెరికా, ఇతర ఐరోపా మిత్ర దేశాల ప్రస్తుత చర్యలు పైకి రాజకీయంగా చట్టబద్దంగా కనిపిస్తున్నా వాటి అసలు లక్ష్యం మాత్రం సిరియాలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. ఏచిన్న ఆర్థిక, ఆయుధ అవసరానికైనా తమ మీదనే సిరియా పూర్తిగాఆధారపడి వుండాలనేది అమెరికా మిత్ర దేశాల కుట్ర అని సిరియాకు బాసటగా నిలుస్తున్న ఇరాన్ ఆరోపణ. అందులో భాగంగా ఐక్యరాజ్యసమితి భద్రత మండలి తీర్మానాన్ని ఉల్లంఘించి సిరియాపై అమెరికా మిత్రదేశాలు దాడులకు దిగినా సందేహం లేదు. సిరియా విషయమై మండలి చేసిన తీర్మానాన్ని రష్యా, చైనాలు ఇప్పటికే వీటో చేసివున్నాయి. ఐరాస భద్రత మండలి తీర్మానాన్ని అతిక్రమించి 2003లో ఇరాక్ మీద అమెరికా దురాక్రమణకు పాల్పడిన సంగతిని నిపుణులు గుర్తు చేస్తున్నారు. భద్రతా మండలిలో పశ్చిమదేశాల ప్రమేయంతో పెట్టిన తీర్మానం వీటో కావడంతో దానికి అనుకూలంగా ఉన్న దేశాలు అసలు భద్రతామండలితో పనిలేకుండా ఒక కూటమిగా ఏర్పడి ముందుకు పోవాలని కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. దీనిని చూస్తుంటే మొదటి ప్రపంచ యుద్ధం తరువాత నానాజాతి సమితిని ఏర్పాటు చేసిన దేశాలే దానిని నిర్వీర్యం చేసి చివరకు రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన ఉదంతం గుర్తు చేసుకోవాలి.
ట్యునీషియా నుండి ఈజిప్టు వరకూ కొనసాగిన ప్రజాస్వామిక విప్లవ పోరాటాల క్రమం సిరియాలో పోరాటం వద్దకు వచ్చేటప్పడికి అత్యంత హింసాత్మకంగా మారిపోవడం వెనుక ఏ కారణాలున్నప్పటికీ భారీ స్థాయిలో ప్రాణనష్టం జరగటం అందరిని కలవరపరుస్తోంది. సిరియా సైన్యంసొంత దేశంలో తన పౌరులమీద విచక్షణారహితంగా పాల్పడుతున్న హింసకు విరుగుడు ఏమిటనే అంశంపై ఎవరివద్దా సమాధానం లేదు. ప్రజల ఆకాంక్షల కోసం ప్రజాస్వామికంగా తిరుగుబాటు చేస్తున్న వారిపై ప్రభుత్వం యుద్ధట్యాంకులతో దాడిచేయటాన్ని చూస్తూ కూడా ఐక్యరాజ్యసమితి మిన్నకుండటం, ప్రజల్ని కాపాడే మిషతో అమెరికా సిరియాపై యుద్ధానికి దిగడం ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. సిరియాలో అస్సద్ పారిస్తున్న నెత్తురు టేరులపై ఐరాసలో ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో అమెరికా దుందుడుకు చర్యలను నిరసిస్తూ రష్యా, చైనా ఐరాసలో వీటో అధికారాన్ని ప్రయోగించాయి. తనకు అనుకూలంగా ఉండే నియంతలకు సైనిక తోడ్పాటునివ్వడం, లేదా అస్థిర ప్రభుత్వాలకు తిప్పలు తెచ్చిపెట్టేందుకు స్ధానిక తీవ్రవాద గ్రూపులకు ఆయుధాలివ్వడం వంటి కుట్రల్ని చెంపపెట్టులా ఐరాస సమావేశంలో తమ వీటో అధికారాన్ని ప్రయోగించాయి. సిరియా ప్రభుత్వానికి అనుకూలంగా ఐరాస రక్షణ మండలి తీర్మానం చేసే క్రమంలో నిరసన వ్యక్తం చేయడం ద్వారా చైనా, రష్యాలు.., అమెరికా జేబు సంస్థలా వ్యవహరిస్తున్న ఐరాసకు కూడా గట్టి షాకిచ్చాయి.
సిరియాలో అమెరికా కొనసాగిస్తున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం పశ్చిమాసియా మొత్తాన్ని అస్థిరతకు గురి చేస్తోంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధంతో పశ్చిమాసియా దేశాలలో అంతర్యుద్ధాలు చెలరేగే ప్రమాదం వుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈశాన్య సిరియాలోని కుర్దిష్ దళాలను మట్టుపెట్టేందుకు అవసరమైతే తాము సిరియాను ఆక్రమించేందుకైనా వెనుకాడబోమంటూ టర్కీ చేసిన హెచ్చరికపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. టర్కీ ఈ చర్యకు పాల్పడితే అది ప్రత్యక్ష యుద్ధానికే దారి తీస్తుందంటూ బదులిచ్చింది. అదే సమయంలో సోవియట్ పతనానంతరం అమెరికా నిర్మించిన న్యూ వరల్డ్ ఆర్డర్‌ను తిరగరాయాలని రష్యా, చైనాలు ప్రయత్నిస్తున్నాయి. తమ ముఖ్య వ్యాపార భాగస్వామియైన సిరియాను వదులుకుని అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించడానికి అవి సుముఖంగా లేవు. అలా అని సైనిక జోక్యంతో అసద్ ప్రభుత్వాన్ని నిలబెట్టగల శ క్తి కూడా వాటికి లేదు. అందుకే విప్లవానంతర ఎత్తుగడలను సిద్ధం చేసుకొని వేచి చూస్తున్నాయి. వాటి ఎత్తులకు ముందే అడ్డుకట్ట వేయడం కోసం ప్రత్యక్ష సైనిక జోక్యంతో సిరియాలో తిష్ఠ వేసుకు కూచోవాలని అమెరికా తహతహలాడుతోంది.
మరోవైపు సిరియాలో సాగుతున్న అంతర్యుద్ధంపై భారత ప్రధాని విచారం వ్యక్తం చేశారు. సిరియా సమస్యలో బయటి దేశాల జోక్యం తగద సూచించారు. ఇజ్రాయెల్ దురాక్రమణకి వ్యతిరేకంగా డెబ్భై సంవత్సరాలనుండి పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు కూడా మన్మోహన్ మద్దతు ప్రకటించారు.సిరియాలో తలెత్తిన అంతర్గత సంక్షోభ పరిష్కార దిశగా ప్రపంచ దేశాలు కృషి చేయాలని భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. సిరియా అంతర్గత సమస్య ఇపుడు అంతర్జాతీయ సమస్యగా మారిందని చెప్పుకొచ్చారు. ఇరాన్‌లో జరుగుతున్న అలీన దేశాల కూటమి నామ్ సదస్సులో పాల్గొనేందుకు టెహ్రాన్‌లో ఉన్న మన్మోహన్ . సిరియా సంక్షోభాన్ని అంతర్జాతీయ సమస్యగా భావించి పరిష్కారం కనుగొనేందుకు కృషిచేయాలని కోరారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్....... ప్రజాస్వామ్య, బహుళపక్ష వ్యవస్థ కోసం వ్యక్తమయ్యే ప్రజల ఆకాంక్షలకు మద్దతు ఇస్తుందని., అయితే అలాంటి మార్పులు విదేశీ జోక్యం ప్రేరణతో జరగడానికి వీలు లేదన్నారు. సిరియాలో క్షీణిస్తున్న పరిస్ధితి ప్రత్యేకంగా ఆందోళనకరం. సార్వత్రికంగా ఆమోదించబడిన సూత్రాలను దృష్టిలో ఉంచుకుని అలీన దేశాలు ఒక నిర్ణయానికి రావాలని పిలుపునిచ్చారు.
ట్యునీషియా, ఈజిప్టు పాలకులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమించిన ఫలితంగా ప్రభుత్వాలు కూలిపోయాయి. నిజానికి అక్కడి పాలకులు అమెరికన్ల తాబేదారులే. అరబ్బు దేశాల ప్రజాస్పందనను ఊహించని పశ్చిమ దేశాలు వెంటనే తేరుకొని పనిలో పనిగా తమకు కొరకరాని కొయ్యలుగా ఉన్న పాలకులను కూల్చివేసేందుకు పూనుకున్నాయి. లిబియాలో గడాఫీని అంతం చేశాయి. సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక మూకలకు ఆయుధాలిచ్చి గత 16 మాసాలుగా దాడులు చేయిస్తున్నాయి.