సీ.పీ.బ్రౌన్ గ్రంథాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Charles Phillip Brown
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ చిత్రపటం

సీ.పీ. బ్రౌన్ గ్రంథాలయం పరిశోధకులకు అనుకూలంగా, పాఠకులకు విజ్ఞానాన్ని పంచుతూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. 2006 నవంబరు 1వ తేదీన 20 వేల పుస్తకాలు, 20 లక్షల రూపాయల నిధి, 3 అంతస్తుల భవనంలో ఉన్న గ్రంథాలయం యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోనికి వచ్చింది. అప్పటి నుంచి దీని అభివృద్ధిలో వేగం పెరిగింది. సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంగా రూపాంతరం చెంది వివిధ వర్గాల నుంచి, విద్యాంసుల నుంచి ఆరు సంవత్సరాల్లో పుస్తకాల సంఖ్య 50 వేలకు పైగా పెరిగింది. దీంతో పాటు 200 తాళపత్ర గ్రంథాలను సేకరించి, శుద్ధిచేసి, స్కాన్ చేసి భద్రపరిచారు.

వివిధ విశ్వవిద్యాలయాలకు పరిశోధకులు సమర్పించే సిద్ధాంత గ్రంథాల రాతప్రతులను దాదాపు 200 ప్రతులను సేకరించి పరిశోధకుల కోసం భద్రపరిచారు. ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో సర్వేయర్ జనరల్‌గా పనిచేసిన కల్నల్ మెకంజీ సేకరించిన కైఫీయత్తులు అనబడే స్థానిక చరిత్రలను, కడప జిల్లాకు సంబంధించిన వాటిని ఇప్పటి వరకు 5 సంపుటాలను ప్రచురించారు. ఈ నెల 10 న 6వ సంపుటిని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో పాటు గ్రంథాలయ వికాస చరిత్రను తెలిపే ‘మొండిగోడల నుంచి మహాసౌధం దాక’ అన్న గ్రంథాన్ని ప్రచురించారు.

ఈ గ్రంథాలయానికి వివిధ సంస్థలు, వ్యక్తులు వందలాది పుస్తకాలను అందజేస్తుండటం విశేషం. జిల్లాలోని వల్లూరు గ్రామంలోని సీతారామచంద్ర గ్రంథభాండాగారాన్ని నిర్వహిస్తున్న పోలేపల్లి వెంగన్నశ్రేష్టి 2,750 పుస్తకాలను అందజేశారు. టీటీడీ, మైసూరులోని సీఐఐఐఎల్, కలకత్తాలోని ఆర్‌ఆర్‌ఎల్.ఎఫ్ వంటి సంస్థలు కూడా పుస్తకాలను అందజేస్తున్నాయి.

ఈ గ్రంథాలయాన్ని ఏబీకే ప్రసాద్, మంత్రి పొన్నాల, హిందీ అకాడమీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వకులాభరణం రామకృష్ణ వంటి ప్రముఖులు దర్శించి దీని ప్రగతిని ప్రశంసించారు. అన్ని రకాల పత్రికలు, మ్యాగజైన్లు, సాహిత్యపుస్తకాలు, ప్రముఖుల రచనలు, సైద్ధాంతిక గ్రంథాలు ఉన్నాయి. కాగా రాష్ర్టంలోని ప్రముఖ గ్రంథాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ గ్రంథాలయాన్ని విశ్వవిద్యాలయ పరిశోధకులతో పాటు పాఠకులు విశేషంగా ఉపయోగించుకుంటూ బ్రౌన్ గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

వివిధ కార్యక్రమాలు

[మార్చు]
  • బ్రౌన్ పేరున వెలసిన ఈ గ్రంథాలయం ఆయన జన్మదినమైన నవంబరు 10న ఆయన జయంతి వేడుకలు నిర్వహిస్తోంది.
  • ' నెల నెలా మనజిల్లా సాహిత్యం’ అన్న పేరుతో ప్రతినెలా ఒక ఆదివారం సాహిత్య రంగాల్లోని నిష్ణాతులతో ప్రసంగాలు నిర్వహిస్తున్నారు.
  • జిల్లాలోని రచయితలు రాసిన నవలలు, కథానికలలో లభించే పదజాలాన్ని సేకరించి పదకోశం తయారుచేస్తున్నారు.
  • ఇప్పటి దాకా వేమన మీద వచ్చిన విమర్శ వ్యాసాలను సేకరించి సంపుటిగా రూపొందిస్తున్నారు.
  • వీటితో పాటు మెకంజీ కైఫీయత్తుల ఏడవ సంపుటాన్ని, బ్రౌన్ లేఖలను సంపుటిగా ప్రచురించబోతున్నారు.