సుమో యోధులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోటీలో తలపడుతున్న సుమో యోధులు

సుమో యోధులు జపాన్కు చెందిన భారీ శరీరం కలిగిన మల్ల యోధులు.వీరిని జపనీస్ భాషలో రిషికీలు అని పిలుస్తారు. ఆ దేశంలో వీరికున్న ప్రజాధరణ సినిమా హీరోలకు కూడా ఉండదు .అందుకే అక్కడ ఈ క్రేజ్ ఇంకా కొన సాగుతోంది. తకమిక జుచి, తకమిక నత ఇద్దరూ దేవతలే. జపాన్ ద్వీపాలు ఎవరి వల్ల పుట్టాయో తేల్చుకొనేందుకు హోరాహోరి తలపడ్డారు. అలా పుట్టుకొచ్చిందే ఈ సుమో .ఈ క్రీడ పుట్టుక గురించి జపనీయులు చెప్పుకొనే పురాణ కథనమిది. క్రమంగా ఇదో సంప్రదాయం గామారింది. పూర్వకాలంలో పంటలు బాగా పండాలని ఈ పోటీని నిర్వహించేవారు. వేడుకల వేళ సుమో వీరులు తలపడేవారు. సంగీత నృత్య కార్యక్రమాలతో కలిపి ఈ పోటీలు కొనసాగేవి. సా.శ. 8 వ శతాబ్దం నుండి ఈ క్రీడ వాడుకలో ఉంది. 17వ శతాబ్దం నాటికి పూర్తి వినోద క్రీడగా ఆరంభమై జాతీయ క్రీడగా ఎదిగింది. నియమ నిbfDభందలని ఏర్పరుచుకొన్నది.

సుమోగా మారడం[మార్చు]

సుమోలు ఆరాధించే దేవుడు

సుమోగా మారాలంటే అంత సులభం కాదు. అందుకు కఠినమైన శిక్షణ అవసరం. చాలా చిన్న వయసులో మొదలవుతుంది. మానసిక, శారీరక సామర్థ్యాల్ని పరీక్షించాకే సుమో బడిలోకి ప్రవేశం. వీళ్ళకి శిక్షణ ఇచ్చే కేంద్రాలను స్టేబుల్స్ అంటారు. పదవీ విరమణ చేసిన సుమోలే ఉపాధ్యాయులు. తిండీ నిద్ర అన్నీ అక్కడే. ఉదయం ఐదు గంటలకే నిద్ర లేవాలి. ఖాళీ కడుపుతో నాలుగైదు గంటల సాధన చేయాలి. ఒట్టి చేతులతో చెక్క మీద గుద్దాలి. పెద్ద మొద్దుల్ని ఎత్తాలి. సరిగ్గా చెయ్యకపోతే ఎర్రటి దెబ్బల వాతలు తప్పవు. ఆ తరువాత రెండు మూడు గంటలు ఆరామంగా వేడి నీళ్ళ స్నానం. అప్పటికే సమయం మధ్యాహ్నం 12 గంటలై ఉంటుంది. ఆకలి దంచేస్తుంటుంది. అప్పుడు తినడం మొదలెడతారు. అదే రోజుకి మొదటి ఆహారం. లక్ష్యం ఒక్కటే. ఎంత ఎక్కువ తినగలిగితే అంత తినడం, అంతగా లావవ్వడం. కానీ సుమోలు రోజంతా తినరు. కేవలం రోజుకి రెండు సార్లే. అయితే సగటు మనిషి తీసుకొనే ఆహారానికి సుమారు పది రెట్లు.

కొత్త వారు సుమో శిక్షణలో చేరగానే చేయవలసిన మొదటి పని జుట్టు బాగా పెంచి ముడివేయడం. ఎవ్వరూ పుట్టుకతో అతిగా తినలేరు. అలా తయారవుతారంతే. సుమోలుగా మారదలుచుకున్న వాళ్ళు క్రమంగా ఆహారాన్ని పెంచి, శిక్షణతో అలా భారీ కాయులుగా తయారౌతారు. పొట్టకు మసాజ్ చేయించుకోవడం వలన పేగులు సాగి మరింత ఎక్కువ ఆహారం తీసుకోగలుగుతారు. నెమ్మదిగా తింటారు. ఇంకాస్త ఎక్కువ పడుతుంది. నిండినా తింటూనే ఉంటారు. అలా మెల్లమెల్లగా పరిమాణాన్ని పెంచుకుంటూ సుమోలుగా మారుతారు. లావు అవ్వడానికి వీళ్ళకో పద్ధతుంది. పొట్ట, పిరుదల దగ్గర ఎక్కువ లావవ్వాల్సి ఉంటుంది . ఎందుకంటే ఆటలో కిందపడకుండా ఈ కొవ్వు ఆపుతుంది. పడినా అది పరుపులా ఉండి శరీరానికి దెబ్బ తగలకుండా కాపాడుతుంది. తిన్న వెంటనే మూడు నాలుగు గంటలపాటు నిద్ర. ఫలితంగా క్యాలరీలు కరిగిపోకుండా కొవ్వు రూపంలో పేరుకుంటాయి. కండరాలు పెరుగుతాయి. ఇంతే బరువు ఉండాలన్న నిబంధనలేమీ లేవు. 200 పౌండ్లున్న వాళ్ళు 400 పౌండ్లవాళ్ళతోనూ తలపడవచ్చు. గెలుపు సాధారణంగా భారీ బరువున్న వాళ్ళదే. క్లుప్తంగా చెప్పాలంటే శిక్షణ, తినడం, నిద్ర. ఈ మూడింటి చుట్టూనే వీళ్ళ జీవితం నడుస్తుంది. ఇలా అలవాటు పడలేకే చాలామంది మొదటి నెలలోనే తిరిగి వెళ్ళిపోతారు.

జపాన్లో ఈ సుమో పోరాటాలు చాలా ప్రాచీనమైనవి. ఇప్పటికి కూడా ప్రాచీన ఆచారాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సుమోల జీవితం చాలా కట్టుదిట్టమై ఉంటుంది. వీరు సుమో అసోసియేషన్ విధించిన నిభందనలకు లోబడి జీవించాల్సి ఉంటుంది. ఈ సంఘంలో పదవీ విరమణ చేసిన మల్లయోధులు ఉంటారు. వీరు మాత్రమే కొత్త సుమో యోధులను తయారు చేయడానికి అర్హులు.

ఆహారం[మార్చు]

వీరు తినే ఆహారంలో పంది మాంసం, క్యాబేజీ, గుడ్ల్లు, చేపలు, కోడి మాంసం, సముద్రపు చేపలు, అన్నం, కూరలు అన్నీ ఉంటాయి. ప్రధానమైనది చంకో-నబె దీన్ని రకరకాల కూరలు, కోడి మాంసం, లేదా చేపలతో తయారు చేస్తారు. సుమో ఒక్క పూటకి సుమారు పావు కిలో పరిమాణం ఉండే 50 అన్నం ముద్దల్ని అవలీలగా తినేయగలడు. సుమారు వంద బీరు సీసాలనూ అవలీలగా లాగించేయగలడు.రాత్రి పూట కూడా అంతే. మాంసం, కూరల రకాలు మారతాయి గానీ తినేది ఇదే. రోజూ ఇదే భోజనం. అందులో ఉప్పు, కొవ్వులు తక్కువే. అంటే ఇది ఆరోగ్యకరమైన ఆహారమే. పరిమాణం మాత్రం ఎక్కువ.

విభాగాలు[మార్చు]

సుమో వీరుల్లో ఆరు విభాగాలు ఉంటాయి. జొనొకుచి ప్రాథమికమైనది. తరువాతవి జొనిడాన్, సాన్ డాన్మే, మకుషిత, జురియొ లు. చివరిది మాకూచి. మాధ్యమాలు పరుగులు పెట్టేది వీళ్ళవెనకే. జనాలు నీరాజనాలు పట్టేది వీళ్ళకే. చివరి రెండు దశల్ని సెకిటొరి అనీ కింది దశల్ని రికీషీ లనీ పిలుస్తారు. అంటే శిక్షణ పూర్తయిన సుమోలంతా రిషికీలే. ఎక్కువ టోర్నమెంట్లు గెలిస్తే వారిని యొకజునా అంటారు. అంటే గ్రాండ్ చాంపియన్ అన్నమాట.

పోటీకి ముందు ఆటగాళ్ళంతా ఒక వేడుకలో పాల్గొంటారు. ఒక్కోక్కరూ వచ్చి షింటో సంప్రదాయంలో అభివాదాలు విన్యాసాలు చేస్తారు. పోటీ పడేవాళ్ళిద్దరూ డోహ్యో (రింగు) లోకి వస్తారు. వెళ్ళే ముందు నోట్లోకి నీళ్ళు పోసుకుని పుక్కిలిస్తారు. చేతులు కలుపుతారు. మళ్ళీ ఎవరి మూలలకు వాళ్ళు వెళ్ళి గుప్పెట నిండా ఉప్పు తీసుకుని రింగులోకి చల్లుతారు. శుద్ధి చేయడమన్న మాట.

యుద్ధం[మార్చు]

రెఫరీ చుట్టూ నిల్చున్న సుమోయోధులు

ఈ యుద్ధంలో కిందపడినా లేదా రింగు దాటినా అవుటయినట్లే లెక్క. చాలా సందర్భాల్లో మ్యాచ్ లు కొన్ని సెకన్లలోనే ముగుస్తాయి. చాలా అరుదుగా మాత్రమే కొన్ని నిమిషాల వరకూ సాగితాయి. ప్రతీ మ్యాచ్ కి ముందు వెనకా వేడుక తప్పని సరి. ఏడాదికి ఐదు గ్రాండ్ టోర్నమెంటు (భాషో) లు జరుగుతాయి. ఏ టోర్నమెంటయినా పదిహేను రోజులపాటు ఉంటుంది.మాకుషి విభాగంలో ఎక్కువ మ్యాచ్ లు గెలిచిన వాళ్ళకే చాంపియన్ షిప్. మిగిలిన వాళ్ళకీ బహుమతులు ఉంటాయి. ఇలా టోర్నమెంట్ ల వారీగా సుమో ల స్కోరు పెరగడం, తగ్గడం జరుగుతుంది. ప్రమోషన్లూ, డిమోషన్లూ ఉంటాయి. ఈ అధికారిక ర్యాంకుల లిస్టును (బంజూకె) జపాన్ సుమో అసోసియేషన్ రూపొందిస్తుంటుంది. ప్రస్తుతం జపాన్ లో 54 స్టేబుల్స్ ఉండగా 700 మంది సుమోలు ఉన్నారు. ప్రవర్తన సరిగా లేకపోతే భారీగా జరిమానాలూ ఉంటాయి. సుమోలు జనంలోకి వెళితే సంప్రదాయ జపనీస్ దుస్తులే ధరించాలి. ర్యాంకును బట్టి ఇవి మారుతాయి. రికిషీలు పలుచని నూలు వస్త్రాన్నే ధరించాలి. చలికాలంలోనూ అంతే. ఇక మకుషిత, సాన్ డాన్మే ర్యాంకుల వాళ్ళకి సాంప్రదాయ కోటు, గడ్డి శాండల్స్. మనసుకు నచ్చిన సిల్క్ వస్త్రం ధరించే స్వేచ్ఛ ఒక సెకిటోరికే. ఆడేటప్పుడు అందరూ ధరించేది మావాషి. నడుం చుట్టూ కట్టే సిల్కు గోచీ.

నిద్ర లేవడం లోనూ తేడాలున్నాయి. రికిషీలు ఉదయం 5 గంటలకు లేవాలి. సెకిటోరిలు 7 గంటలకు లేవచ్చు. రికిషీలు వంట చేయాలి. సెకిటోరిలు స్నానానికి సిద్ధం చేయాలి.టవ్ల్ పట్టుకుని రెడీగా ఉండాలి. లంచ్ లోనూ ఇంతే. పాత్రలను శుభ్రపరచడం కూడా రిషికీల బాధ్యతే. సాయంత్రాలు సెకిటోరిలు బయటకు వెళ్ళొచ్చు. రికిషీలు స్టేబుల్ లోనే ఉండాలి.

సమస్యలు[మార్చు]

వీరి లావు వల్ల వీరికి ప్రమాదం చాలానే ఉంది. సుమోల ఆయుప్రమాణం 65 సంవత్సరాలే. ఇది సగటు జపనీయుడికన్నా పదేళ్ళు తక్కువ . చాలామంది పదవీ విరమణ తరువాత మామూలు బరువుకి వచ్చేస్తారు. అందుకు నాలుగైదేళ్ళు సమయం పడుతుంది. అయితే అప్పటికే మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. హైబీపీ, మధుమేహం వంటి వ్యాధులన్నీ శరీరంలోనే తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఒకరకంగా సుమోల శరీరం వ్యాధులకు కొలువే డబ్బునీ, కీర్తినీ పక్కన బెడితే షరతులతో కూడిన జీవితం, అనారోగ్యం సుమోల్ని వెంటాడే సమస్యలు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • 2008 ఆగస్టు 3 ఈనాడు ఆదివారం సంచికలోని శీర్షిక ఆధారంగా...