Jump to content

సూక్ష్మజీవి

వికీపీడియా నుండి
(సూక్ష్మజీవులెక్కడుండును నుండి దారిమార్పు చెందింది)


A cluster of Escherichia coli Bacteria magnified 10,000 times.

సూక్ష్మజీవి కంటితో నేరుగా చూడలేని జీవి. ఇవి ఏక కణ జీవులు లేదా బహుకణ జీవులు కావచ్చు.

పురాతన కాలం నుంచి కంటికి కనబడని సూక్ష్మ క్రిములు ఉండవచ్చునని ఊహించారు. ఉదాహరణకు భారతదేశంలో సా.పూ 6వ శతాబ్దానికి సంబంధించిన జైన సాహిత్యంలోను, సా.పూ 1 వ శతాబ్దంలో మార్కస్ టెరెన్షియస్ వెరో రాసిన గ్రంథాలలోను వీటి గురించి ప్రస్తావన ఉంది. 1670లో ఆంథోనీ వాన్ లీవెన్ హుక్ సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించడం మొదలుపెట్టడంతో వీటిమీద శాస్త్రీయ పరిశోధన మొదలైంది. 1850లో లూయీ పాశ్చర్ ఆహారం చెడిపోవడానికి సూక్ష్మజీవులే కారణమని తేల్చాడు. 1880 దశకంలో రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ, కలరా, ఆంథ్రాక్స్ మొదలగు వ్యాధులు సూక్ష్మజీవుల వల్లనే కలుగుతాయని నిరూపించాడు.

ఇవి సామాన్యముగా మానవ శరీరము మీదను, జంతువుల/మనుష్యుల పేగుల లోపలను, మన ఇంటి లోపలను, గాలి యందును, నీటి యందు వుండును. వాటిని గూర్చి తెలియని వారికి అవి ఎలా ఉంటాయో, వానిని చూచుటెట్లో తెలియక పోవుట చేత అవి కనపడవు. ఎక్కడెక్కడ అశుభ్రత, క్రుళ్ళు చుండిన పదార్థములను, ఎక్కువగా నుండునో అక్కడ సూక్ష్మ జీవు లధికముగ నుండును. మన ఇండ్లలో మన కాళ్ళ క్రింద పడి దొర్లుచుండు చీమలకును, కల్మషమును తిని బ్రతుకు ఈగలకును తెలిసిన కొన్ని విషములు మనకు తెలిసిన యెడల, ఎంత ప్రశస్తమైన నీళ్ళు తెచ్చినను దాని నిండ పురుగులున్నవని మనము చెప్పుదుము. ఎంత శుభ్రమయిన దుస్తులు తెచ్చినను వాని నిండ మైల వున్నదని త్రోసి వేయుదుము. ఈగ కండ్లు మనము పెట్టుకొని ఇంటి ప్రక్కను క్రుళ్ళు చుండు ఆవు పేడను ఒక్క సారి చూసినచో ఆరునెలల వరకు మనకు అన్నహితవు చెడి పోవును.

సూక్ష్మజీవుల ఆవాసాలు

[మార్చు]

ఈగలు సూక్ష్మజీవుల వాహకాలు

[మార్చు]

మనమొక అయిదు నిమిషములు ఒక ఈగ చేయు పనులను పరీక్షించి నేర్చుకొనగల విషయము లనేకములు గలవు. పండ్లు, ఆవు పేడ మురుగు చుండు వాన కాలములో అవి మెండుగ నుండును. దీనికి ఒక గ్రామం గాని ఒక ఇల్లు గాని శుభ్రముగా నున్నదా యని తెలిసి కొన వలెనన్న అక్కడ నుండు ఈగల జనాభాను ఎత్తు కొనిన చాలును. ఈగలు ఎంత తక్కువగ నున్న అంత పరిశుభ్రత గలదని చెప్పవచ్చును.

ఈగలు నూతుల దగ్గరను, వంటి యింటి ప్రక్కలను, కాళ్ళు చేతులు కడుగు కొను చోట్ల బురబుర లాడు చుండు చల్లని నేలందును, ఇచ్చ వచ్చినట్లు ఆడి ఆడి తుదకు ఒక గడప మీదనో కిటికీ మీదనో వ్రాలును. ఇది ఇక్కడ ఏమి చేయునో చూడుము. ఇది తిరిగిన అన్ని చోట్లనుండి రెక్కలమీదను తలమీదను పెట్టుకొని మోయ గలిగినంత బరువును మోసికొని వచ్చింది. తెచ్చిన దానిని తినుటకై ఇది యిక్కడ చేరినది. ఇది తన నాలుగు ముందు కాళ్ల మీదను వంగి నిలుచుండి వెనుక ప్రక్కనుండు రెండు కాళ్ళతో రెక్కలను వీపును అనేక సార్లు మిక్కిలి శ్రద్ధ్యతో తుడుచును. ఇట్లు తుడిచి తుడిచి దీని వీపు మేద మోసికొని వచ్చిన సరకుల నన్నిటిని వెనుక కాళ్ళతో నెత్తి, దానిని తన ఆరుకాళ్లతో త్రొక్కి ముద్ద చేసి ముందరి రెండు కాళ్ళతో నోటిలో పెట్టుకొని మ్రింగి వేయును. ఇట్లే వెనుక ప్రక్క కాళ్ళ మీద నిలువబడి ముందరి కాళ్ళతో తల, మెడ మొదలగు ప్రదేశముల మీదనున్న సామా నంతయు దింపి చిన్న చిన్న ఉండలుగా జేసికొని మ్రింగును. ఈ ఉండలు సూక్ష్మజీవుల ముద్దలుగాని వేరుగావు. ఇవియే దీని కాహారము.

శుభ్రము చేసికొనుటకు దులుపు కొనుచున్నదని వారు అను కొనవచ్చును. కాని ప్రయాణము చేసి వచ్చిన తరువాతను, అంతకు పూర్వమును, ఈ యీగ కాలి నొకదానిని సూక్ష్మ దర్శని అను యంత్రములో పెట్టి పరీక్షించిన యెడల రహస్యము తెలియగలదు. 5, 6 పటములు చూడుము. ఈ యంత్రము ఒక దానిని వేయి రెట్లు పెద్దదిగా కనబరచు శక్తి గలది. ఈగ నొక దానిని, నీ మనసొప్పిన యెడల, చంపి దాని పొట్ట లోని పదార్థమును సూక్ష్మ దర్శినిలో పెట్టి పరీక్షించిన అందులో పుట్టలు పుట్టలుగా నున్న సూక్ష్మ జీవులను చూచిన యెడల నీ యంశ మింకను దృఢము కాగలదు. లేదా మనము తినబోవు అన్నము మీద అది వాలి నప్పుడు ఏదేని ఒక అన్నపు మెతుకు మీద నల్లని చుక్క బొట్టు నొక దానిని పెట్టి పోవును. ఆబొట్టు నెత్తి సూక్ష్మ దర్శనితో పరీక్షించిన యెడల రకరకముల సూక్ష్మ జీవులు కనబడును. ఈ బొట్టే ఈగ విసర్జించు మలము. దానిని తెలిసియు తెలియకయు కూడా మనము తినుచున్నాము.

ఈ ప్రకారము ఈగలచే, చీమలచే, దోమలచే కూడా వ్వాపించు సూక్ష్మజీవు లెక్కడ గలవో ఇంకను వివరముగ తెలిసి కొనవలె ననిన మీరు మిక్కిలి దూరము వెదుక నక్కర లేదు. మన కంటికి కనబడకుండ మనచుట్టును క్రుళ్ళు చుండు అల్ప జంతువుల కళేబరములను, మనము పారవేయు కాయగూరల తొక్కలు, ఆకులు మొదలగు శాక పదార్థములును నిరంతరము సమృద్ధిగ సూక్ష్మజీవుల కాహార మొసగుచుండును. మన ఇండ్లలో సామాన్యముగ నశుభ్రత యెక్కడెక్కడుండునో ఆ స్థలముల నొక్కటొక్కటిగ పేర్కొనిన యెడల సూక్ష్మ జీవుల యునికి పట్టు చక్కగ మీ మనస్సు లందు నాటు కొనునని తలచి కొంత వరకు వివరించు చున్నాము.

వీధి గడప

[మార్చు]

అరుగు మీద నుండి గాని, గడప మీద నుండి గానీ, ఇంటి లోని వారలందరును భోజనమునకు పోక పూర్వమును, భోజనమయిన తరువాను కాళ్ళు చేతులు కడుగుదురు. ఆ నీళ్ళు ధారాళముగా వీధి వెంబడి పోవుటకు తగినన్ని యుండక పోవుట చేత పోసినప్పుడెల్ల అక్కడనే నిలిచి ఇగిరి పోయి గడప ప్రక్కను బురద బురదగా నుండును. ఛీడీల మీద నిలుచుండుట వలన మన కాళ్ళకు బురద అంటదు గనుక అంతటితో మనము తృప్తి జెందుదుము. ఇక్కడనే చీమిడి చీదుదుము. గొంతుకలోని కళ్ళెను ఉమ్మి వేయుదుము. ఇది యంతయు బురదలో పడి క్రుళ్ళును. సామాన్యముగా పల్లె టూళ్లలో మండువాలో నుండి తూము కాలవ కూడా ఇక్కడకే వచ్చి చేరును. ఈ తేమ నాశ్రయించి యుండు దోమలు, పగలంతయు తూముల లోవలో నుండు చీకటిలో దాగి యుంది రాత్రుల యందు మండువా మార్గమున మన ఇండ్లలో ప్రవేశించును.

మండువా:

[మార్చు]

పిల్లలు తిన్న మామిడి పండ్ల తొక్కలు, టెంకలు, దాసీది మండువా చుట్టు నుండి ఊడ్చుకొని వచ్చిన దుమ్ము, తుక్కు అంతయు అందులో చేరును. కొన్ని చోట్ల ఎలుకలు దూరునంత సందులు గల బల్లలతో కూర్చిన తలుపులు మండువాలోని రహస్యములను బయటకు కనబడ నీయవు. ఒక్కసారి దానిని తీసిన యెడల బొద్దింకలు, కుమ్మర పురుగులు, నలుద్రిక్కుల క్రమ్ముకొనును.

పడక గది

[మార్చు]

ఇందు ఒక మూల మంచము; ఒక మూల బట్టలు వ్రేలాడు దండెము; మరియొక మూల బోషాణము; ఇవి ముఖ్యముగా నుండును. ఇవి గాక పెట్టెలు మొదలగు సామానులు క్రిక్కిరిసి యుండును. చదువు కొనిన వారిండ్లలో ఒక వైపున బల్ల మీద పుస్తకములును కాగితపు కట్టలును పరచి యుండును. నెలల నాటిదో, సంవత్సరముల నాటిదో దుమ్ము పుస్తకము మీద కాక పోయినను సందుల యందైన నుండక మానదు. పుస్తకములలో చిమ్మెట లెగురు చుండుటయు, నల్లులు ప్రాకు చుండుటయు మన మెరుగనిది కాదు. ఇంగ బోషాణము తెరచి చూతము. పాత కాగితముల దస్త్రములు, అక్కడక్కడ తాటాకుల పుస్తములు, తాతల నాటి నుండి చేరిన మకిలతో దళసరెక్కి బరువైన నిలువుచెంబులు, తప్పెలలు, నాజూకు తప్పిన సందుగ పెట్టెలు, కలందానులు, ఆడ కత్తెరలు, ఇత్తడి చిక్కంటెలు, బల్లులు, బొద్దింకలు, తేళ్ళు ఇవి అవి అన నేల ఒక్కొక్కప్పుడు పాములు కూడా ఆ బోషాణములో చేరి యుండును. బోషాణము చాటున నుండు ఎలుక పెంటలను మరవ కూడదు. ఇక మంచముల క్రింద క్రిక్కిరిసిన సామానులను, గంపలు, చాటలు, బుట్టలు, కాళ్ళూడి పోయిన పీటలను పీకి దాసులను గూర్చి మేము వ్రాయ నక్కర లేదు.

వంట ఇల్లు

[మార్చు]

పడక గదిలో నుండి వంట యింటి లోనికి పోవుదము. ఒక ప్రక్కను చద్ది అన్నముల గూడు: ఈ గూటి లోనికి పిల్లులు కుక్కలు దూరకుండ చిన్న తలుపు; ఈ తలుపును తీసిన తోడనే ఒక విధమైన వాసన ముఖము మీదికి కొట్టును. ఈ గూటిలో చారు పులుసు మొదలగునవి అప్పుడప్పుడొలుకు చుండును. బాగుగ వెదికిన ఈ గూటిలో పది దినములనాటి మెతుకులును, కూర ముక్కలను, మూలల యందు క్రుళ్ళు చుండునవి, ఒకటి రెండయినను కనబడక మానవు. ఈ గూడును ఎన్నడును కడుగరు. బ్రాహ్మణుల యిల్లయిన ఎడల భోజనము చేయు స్థలము, పంక్తి పంక్తికిని ఆవు పేడ నీళ్ళతో శుద్ధి చేయుట చేత నిరంతరము ఈగలు ముసురు చుండును. వాన కాలములో బొత్తిగా ఆరుటకు వీలు లేక కాలు జారు చుండుట వింత కాదు.

దస్త్రం:3.JPG
మురుగు నీటి బొట్టులో గల సూక్ష్మ జీవులు. సూక్ష్మ దర్శిని బొమ్మ

వంట గది

[మార్చు]

ఈ గదిలో ఒక మూల పాలదాలి; బూడిద కుప్ప అరగజముఎత్తైయనను పెరుగు వరకు ప్రక్కెనే యుండును. దాని ప్రక్కను చిట్టటక బల్ల. దాని క్రింద నూనె డబ్బాను పెట్టుకొను గూడు లేక నూనె సీసాను తగిలిచు చిలక కొయ్య, దీని నుండి కారి కారి గూడి మైనము ఏర్పడును. ఆ బల్ల వద్ద కంపు ప్రతి దినము అక్కడ నుండి వారి ముక్కులకు తెలియదు. క్రొత్త వార లక్కడకు వెళ్ళిన యెడల దానిని భరింప జాలరు. మిరప కాయల గింజలు, ధనియాలు, మెంతులు చింత పండు, ఇంగువ మొదలగునవి జిగురు జిగురుగా నుండు మట్టితో గూడి మిళితమై ఈ చిట్టకబల్ల నంటి యుండును. ఇప్పుడిప్పుడు గదుల పెట్టెలు గలవు. వానిలో నొక్కొక్క ఆరలోని సామానుల మీద బొద్దింకలను, చిమ్మెటలను పెంకి పురుగులును ఆడుకొను చుండును. చిన్న పిల్లలను బూచి బూచి అని జడిపింప వలెనన్న నీ గదుల పెట్టెను వారి ముందర పెట్టి దాని మూత తటాలున తీసినచాలును. వారడిలి పోవుదురు. చిట్టట బల్లకు ఎదురుగా ప్రక్కన నీళ్ళ బిందెలు పెట్టికొను తిన్నె. ఇప్పిడిప్పుడు గచ్చు చేసిన అరుగులు కొన్ని ఇండ్లలో గలవు. కాని సామాన్యముగా నీళ్ళ బిందెల క్రింద నుండు నేల రెండు మూడడుగుల లోతు వరకు బాగుగ నాని బందబందగా నుండి చితచిత లాడు చుండును. చెదలకును తెల్ల పురుగులకూ, ఎఱ్ఱ చీమలకూ ఈ చల్లని నేల నివాసము. ఈ మూలను ఆ మూలనుండు ఎలుక కన్నముల మాట చెప్పనక్కర లేదు. రెండు వైపుల పోగా మూడవైపున పోయ్యిలును, పదినాళ్ళు సున్నము వేసిసను దాని నంతయు మ్రింగి వేయు మసి గోడయును ఉండును. ఈ ప్రక్కనే ఒకటి రెండు వారములకు కావల్సిన పిడకలు పుల్లలు., ఒక మూలను, గడచిన దినము నాటి బూడిద, బొగ్గులు మరియొక మూలను ఉండును. ఇక నాలుగవ తట్టున గడ మంచె మీద బియ్యపు గంప లేక గంగాళమును, ఊరగాయల కుండలును, పప్పుప్పులును విస్తరాకులును, ఉండును. గడ మంచె క్రింద చిల్లులు పడ్డ పాత్ర సామానులు, దినదినము ఉపయోగము లేని బలువైన పాత్రలు మొదలగునవి వుండును. వీని చాటున పడి యుండు పప్పు గింజలను ఏరు కొనుటకు జేరెడి పంది కొక్కులకును ఎలుకలను మసలుటకు సందిచ్చి ఇవి మిక్కిలి సహకారులగును. కొంచెము బద్ధకముగా నున్నప్పుడు కూరగాయల తొక్కలును మిరపకాయల తొడిమలను ఇంటి వారలూడ్చి వేయుటకీ సందనుకూలపడును.

వరసందు

[మార్చు]

ఇంతట వంట యిల్లు విడచి దాని ప్రక్కను చేతులు కడుగు కొనుటకును, గంజి పార బోసి కొనుటకును ఉపయోగ పడు చిన్న సందు లోనికి పోవుదము. ఈ సందును కొందరు మడి సందనియు మరికొందరు వర సందనియు చెప్పుదురు. సామాన్యముగా ఈ సందు లోనికి వంట ఇంటి లోనుండియే గంజి, కూర నీళ్ళు, రాతి చిప్పలు కడిగిన నీళ్ళు వచ్చుటకు దారి ఉండును. లేదా వంట అయిన తోడనే లోపలి నుండి శ్రమపడి తెచ్చి ఈ సందులో పార బోయుదురు. అక్కడనే రుబ్బు రోటి స్థలము. ఈ సందులోనే యొక ప్రక్కన కుడితే గోలెముండును. నాలుగు నాళ్ళవరకు గొడ్లవాడు తీసికొని పోక పోయిన యెడల గోలెములో నుండు పుచ్చు వంకాయ ముక్కలు, గుమ్మడి కాయలోని బొరుజు, ముదిరి పోయిన ఆనపకాయ, బెండ కాయ ముక్కలు నూరు చుండగా దాని రుచియు కంపును పశువులకే తెలియవలెను. ఈ సందులో ఎదురు గోడ దరిని సాధారణంగా బురదగ నుండు నొకమూల నుండి వెలువడు కంపు వర్ణిప నలవికాదు. గంజి వాసనయ, కుడితి వాసనయా, పేడ నీళ్ళు వాసయా, ఏదియో చెప్పలేము. కంచములు, కూర కుండలు కడుగు నీళ్ళు ఇక్కడనే చేరును. అలుకు గుడ్డయు చీపురు కట్టయు ఇక్కడ యెండు చుండును. చేతులు కడుగు కొనుటకు నీళ్ల బిందెలును చెంబులును, ఇక్కడ నుండును.

నూతి దొడ్డి

[మార్చు]

ఇల్లంతయు గచ్చు చేయించిన వారిండ్లలో కూడా నూతి వద్ద ఉండు క్రుళ్ళు తప్పదు. కుంకుడు కాయ త్రొక్కులు, తల వెంట్రుకల చిక్కులు; ప్రాత గుడ్డ పేలికలు, చింకిరి చేదలు, పాత త్రాటి ముక్కలు వీని నన్నిటిని నూతి చుట్టూ ఎల్లప్పుడు చూడ వచ్చును. ఈ నూతి దగ్గరనే స్నానములు, తలంట్ల నాడు పది బిందెల నీళ్ళతో స్నానము చేసిన యెడల రెండు మూడు బిందెల కంటే ఎక్కువ బయటికి పోవు. మిగిలిన దానిలో సగమయినను తిరిగి నూతిలో చేరును. నూతిలోని నీళ్ళన్నియు, తోడి పోసినను మా నీరు మా నూతిలోనే చేరు చున్నదని కొందరు సంతోషింప వచ్చును. ఇక్కడనే కుమ్మరి పురుగులను, ఏలుగు పాములను, చక్కని ఎరుపు రంగు గలిగిన మిసమిసలాడు చుండు కుంకుడు కాయ పురుగులను మిక్కిలి తరుచుగ చూడనగును. బురబుర లాడు బురద స్నానము చేసిన వారి కాలికంటి కొనకుండ అక్కడక్కడ అరగజమున కొకటి చొప్పున రాళ్ళు గాని ఇటుక ముక్కలుగాని పరచి యుండును. ఇక్కడ నుండి అప్పుడప్పుడు మించి పాకి పోవు బురుదనీరు వీధిని పడకుండ కట్టిన మురుగు కుండును చూడవలెను.

మురుగు కుండు

[మార్చు]

దాని పేరే దానిని వర్ణనాతీతముగ జేయు చున్నది. దాని మీద చీకి పోయిన పాత తలుపున్నను వుండ వచ్చును. దాని లోని నీటినెత్తి దినదినము పారబోసి, బురద మట్టి నెత్తి వేసి శుభ్రపరచ వలెనని దానిని కట్టిన వారి యుద్దేశము. అది నిజముగ గజము లోతున్న యెడల ముప్పాతిక గజము వరకు కుళ్ళు మట్టి దిమ్మ వేసికొని పోయి యుండును. పైనుండు పాతిక గజముతోని నీటిని ఎత్తు వారు లేక, గొయ్యి నిండి పోయి, వీధిని బడి పొర్ల బారు చుండును. ఇక్కడ ననేక రకములగు దోమలు మొదలగు వేర్వేరు జాతుల పురుగులు, చల్ల దనమునకును ఆహారమునకును జేరును. ఇంక దొడ్డిలో రెండు చోట్లను మనము వెదుక వలసి యున్నది.

పెంటగొయ్యి

[మార్చు]

ఒకటి పెంట గొయ్యి. పొలము లోనికి మట్టి తోలు కొనుటకై ఏమూలనో యొక మూల పెద్ద గొయ్యి నొక దానిని పెట్టుదురు. అది త్రవ్విన క్రొత్త రోజులలో నది పెద్ద గుండముగా నుండును. వెడల్పుగా త్రవ్వుటకు దొడ్డిలో నంతగా చోటుండదు. వేసవి కాలములో ఇంటి లోని చెత్త, ఎంగిలి విస్తరాకులు, దొడ్లలో రాలిన ఆకులు, దుమ్మ మొదలగు నదంతయు చేరి అర్థ సంవత్సరములోనే గొయ్యి రమారమి పూడి పోవును. ఇంతట వాన వచ్చి గోతని నింపి వేయును. దీని యొక్క కంపును ఇప్పుడు చూడ వలెను. ఒక కఱ్ఱతో ఈ తుక్కును లేవనెత్తిన దానిలోపల ఆవిరెత్తుచు వేడిగ నుండును. దాని వాసనను చూసిన వారు మరచి పోరు. పిమ్మట వర్షాకాలము రాగానే గొయ్యి నిండి పోయి పెంట కుప్ప నెలనెలకు నేలపై గజము చొప్పున పెరుగు చుండును. ఒక వేళ పశువుల పేడ, పెంటయు కూడా ఇంటి దొడ్డిలోనే చేరవలసి యున్న యెడల అడుగు నక్కరలేదు.

మరుగు దొడ్డి

[మార్చు]

దొడ్డిలో శోధించుటకు ఇంకొకటి మిగిలి యున్నదని చెప్పియున్నాము. అది అన్నిటి కంటెను అసహ్యమైనది. అయినను చెప్పక తీరదు. ఒక వేళ గాదులు, పురులు, మెదలగు చాటు స్థలము లున్న యెడల పల్లెటూళ్ళ లోని అడువారును, బద్ధకస్తులగు మగ వారును కూడా అక్కడనే మలమూత్రములు విడుతురు. యూనియనులున్న గ్రామంలలో తప్ప కట్టిన మరుగుదొడ్ల పద్ధతి లేదు. ఆ పెంటను ఎవ్వరును శుభ్ర ప్రచు వారు లేక ఏ వాన దేవుడో తీసికొని పోవు వరకు పెరుగుచునే యుండును. అందుకును గూడ దారి లేనిచో, ఆ యేటి కాయేడు అక్కడనే నేలను బలపరు చుండును.

కోళ్ళకు,ఈగల వలన జాగ్రత్తలు

[మార్చు]

మా యిల్లు మిక్కిలి శుభ్రముగా నున్న దనుకొను వారి యిండ్లలో కూడా పైని చెప్పిన వానిలో ననేకములు సామాన్యముగా కానవచ్చును. కావున నింతగా వివరించినాము. ఒక కోడి వీధిలోని పెంటల మీద తన ఆహారమును వెదికికొని తినుచుండుట ఎప్పుడయినను చూచిన యెడల వారి కొక్క విషయము గోచరము కాక మానదు. కోడి ఏమియు లేని చోట కాళ్ళతో గీరి, ఏదో యొక వస్తువును ముక్కుతో పట్టుకొను చుండును. 'దీనికి మంటిలో ధాన్యపు గింజలు దొరుకునా, తవుడు దొరుకునా ఏమియు లేదే, యెందుకిది వట్టి శ్రమపడుచున్నదని తోచవచ్చును. ఒక్క పెంట మీద ఎన్నిదినములైనను ఇది పొట్ట పోసికొన గలదు. ఇది మన్ను తినదని మనకందరకు తెలియును. ఇది మన కంటికి కాన రాని పురుగులని ఏరి తినును. దీనీని బట్టి మన కండ్ల కంటే దాని కండ్లు మిక్కిలి తీక్షణమైనవని మాకు తెలియగలదు. కావున మన కంటికి తెలియక, మనము మిక్కిలి శుభ్రముగా నున్నదని గర్వించు చున్న ఇంటిలో మనకు కానరాని సూక్ష్మ జీవు లనేకములు మనచుట్టు నున్నవని కోడిని చూచియు, ఈగను చూచియు, తెలిసికొని, ఈగలకు కోళ్ళకు తగిన ఆహారము మన ఇండ్లలో చిక్కకుండ మనము కాపాడు కొనవలెను. ఈ యీగలే యొక ఇంటి యొక్క శుభ్రతను కొలుచు పరిమాణములని పైని వ్రాసి యున్నాము. మీ ఇంటిలో ఈగలు ముసురు చున్న యెడల ఎక్కుడనో మయిల యున్నది నిశ్చయముగా అతెలిసి కొనుము. నివారింపుము. ఈగ లన్నియు నశించిన యెడల అప్పుడు మీయింట సూక్ష్మజీవులు తగ్గి యున్నవని నమ్మవచ్చును.

ఇరుగు పొరుగులు

[మార్చు]

మీయిల్లు శుభ్రముగ నుంచు కొనినంత మాత్రమున సూక్ష్మజీవుల వలని భయము లేదనిన ప్రయోజనము లేదు. సూక్ష్మ జీవులు మిక్కిలి అల్పమైనవి. గాలిలో నెగిరి పోగలవు. పక్కవాని ఇల్లుగాని, ప్రక్కనుండు వీధి గాని మలినముగ నున్న యెడల మీ ఇల్లు శుభ్రముగ నుండినను ఏమి ప్రయోజనము? గాలి వచ్చి యంతయు ఏకము చేయును. కాబట్టి ఇరుగు పొరుగు వారలకు గూడ నీకు తెలిసి నంతవరకు బోధించి వారి వారి ఆవరణములను, వీధులను కూడా శుభ్రముగ నుంచుటకు సహాయపడుము.

తొమ్మిది సూత్రములు

[మార్చు]
  1. అమెరికా దేశములో సర్కారుచే నియోగింప బడిన కొన్ని సామాన్య సూత్రములను చూచిన యెడల ఈగలను రూపు మాపుట యందు వారికి గల శ్రద్ధ తెలియ గలదు.
  2. రోగి వద్దకు ఈగను రానియ్యవద్దు.
  3. ఈగ రోగి గదిలోనికి వచ్చిన యెడల దానిని విడువక పట్టి చంపి వేయుము. దానిని సులభముగ పట్టుటకు జిగురు కాగితములు బజారులలో దొరుకును.
  4. క్రుళ్ళుచుండు పదార్థమును ఇంటి లోపలను, చుట్టు ప్రక్కలను చేరనీయకుము. అనుమానముగల చోటులందెల్ల పొడిసున్నమును గాని కిరసనాయిలుని గాని చల్లుము.
  5. ఆహార పదార్థముల మీద ఈగ వ్రాలకుండ మూసి పెట్టుము. భోజనము కాగానే ఎంగిలాకులను, కంచములను తెరిచి యుంచకుము. వెంటనే శుభ్రము చేయుము.
  6. పనికి రాని పదార్థములన నెప్పటికప్పుడు కాల్చి వేయుము. లేదా పూడ్చి వేయుము.
  7. పశువుల వెంట నెప్పటికప్పుడు గోతులలో పూడ్చి పెట్టుము. లేదా గోతులకు తలుపులమర్చి మూసి యుంచుము. లేదా కిరసనాయిల్ చల్లుచుండుము.
  8. బజారులలో అమ్మెడు ఆహార పదార్థముల నన్నిటిని కప్పి యుంచుము. లేదా అద్దముల బీరువాలలో పెట్టి యుంచుము.
  9. ఈగను చూడగనే దాని పురిటిల్లు ఎక్కడనో దగ్గరనే పెంటలో నున్నదని జ్ఞాపకముంచు కొనుము. ప్రక్కనే తలుపు చాటున గాని, పెట్టె క్రింద గాని, గోడ మీద గాని ఈ పెంట యుండును.
  10. కల్మషము లేని చోట ఈగ యుండదని గట్టిగ నమ్ముము.

సూక్ష్మజీవుల జాతి భేదములు

[మార్చు]

సూక్ష్మ జీవులలో 1. సూక్ష్మజంతువులు (Protozoa) 2.శిలీంద్రములు (Fungi) 3. బాక్టీరయములు (Bacteria) అను నీ మూడు ముఖ్య విభాగాలు ఉన్నాయి.

సూక్ష్మజీవుల ప్రవేశం

[మార్చు]

అంటు వ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. అదేవిధంగా కొన్ని జంతువుల వలన కూడా అంటు వ్వాధులు వ్యాపించును. వీటినే అంటు వ్యాధులు అని అంటారు.

మరికొన్ని అంటు వ్యాధులు రోగులు గల చోట్ల నివసించి నంత మాత్రముననే అంటు కొనును. మన శరీరములోని రక్తములోనికి గాని, ఇతర ద్రవముల లోనికి గాని సూక్ష్మ జీవులు దిగువ నాలుగు

  1. విధముల ప్రవేశ మగునని చెప్పవచ్చును.
  2. గాయము గుండ ప్రవేశించుట (Inoculation)
  3. పలుచని పొరల గుండ ఊరుట ( Absorbtion)
  4. ఊపిరితో పీల్చుట (Inhalation )
  5. మ్రింగుట (Ingestion )

కొన్ని వ్యాధులిందొక మార్గముననే ప్రవేశించును. మరి కొన్ని వ్యాధులు పైని చెప్పిన మార్గములలో రెండు మూడు మార్గముల ప్రవేశింప వచ్చును.

సూక్ష్మజీవులు - వ్యాధి కారకాలు

[మార్చు]

సూక్ష్మ జీవులు మన శరీరములో ప్రవేశించిన తోడనే మన శరీరములోని రక్షణ వ్యవస్థతో జరుగు సంఘర్షణ వల్ల వ్యాధులు సంక్రమించును.సూక్ష్మ జీవులు గాయము గుండా గాని, నోరు ముక్కు మొదలగు మార్గముల గుండ గాని ఏదో యొక విధమున మన శరీరమున ప్రవేశిచును.

ఇవి ప్రవేశించిన తోడనే మన రక్తమునదుండు తెల్ల కణములకును వీనికి యుద్ధము ప్రారంభమగును. మనకొక చిన్న కురుపు లేచినప్పుడు మన శరీరములో పోరాటము జరుగును. తెల్ల కణములను ఎల్లప్పుడు సిద్ధముగ నుండి వెనుదీయక తాము చచ్చు వరకును పోరాడు మన భటులని చెప్ప వచ్చును. ఇందు కొన్ని సూక్ష్మ జీవులను మ్రింగి నశింపజేయును. కొన్ని సూక్ష్మ జీవులను నశింప జేయు విష పదార్థములను పుట్టించును. మరి కొన్ని ఈ సూక్ష్మ జీవులను యుద్ధ రంగము నుండి మోసికొని పోయి ఖైదీలుగ బట్టి యుంచును. కొన్ని సూక్ష్మజీవుల విషములకు విరుగుడు పదార్థములను పుట్టించును. ఇంకను కొన్ని ఆ యాస్థలముల నుండెడి యితర భటులకు ఆహారమును దెచ్చి యిచ్చును. యుద్ధము ప్రార్తంభమయిన తోడనే సూక్ష్మ జీవుల వుద్రేకమును బట్టి తెల్ల కణముల క్రొత్త పటాలములు నిముష నిముషము నకును యుద్ధ స్థలమునకు వచ్చు చుండును. వీనితో పాటు వీని కాహార పదార్థమగు రసియు, రక్తము మొదలగు నితర పదార్థములను హెచ్చుగ యుద్ధ రంగమునకు వచ్చు చుండును. ఈ పదార్థముల యొక్కయు సూక్ష్మ జీవుల యొక్కయు కూడికనే మనము వాపు అని చెప్పు చున్నాము. సూక్ష్మ జీవుల యొక్కయు తెల్ల కణముల యొక్కయు మృత కళేబరములును యిద్ధము యొక్క ఉద్రేకము చేత నశింపయిన కండ రక్తము మొదలగు ఇతర శరీర భాగములను, రసియు, సూక్ష్మ జీవులచే విసర్జింప బడిన విషయమును, బ్రతియున్న కొన్ని తెల్ల కణములను చేరి యేర్పడు దానినే మనము చీము అని చెప్పుదుము. సూక్ష్మ జీవులు కోటాన కోట్లుగా పెరుగు చుండుట చేత రోగి యొక్క శరీర బలము సూక్ష్మజీవుల బలము కంటే తక్కువగ నున్న యెడల సూక్ష్మ జీవులే జయము నొంది శరీరములోనికి చొచ్చుకొని పోవును. శరీర బలము హెచ్చుగ నుండి సూక్ష్మ జీవుల బలము తక్కువగ నున్న యెడల సూక్ష్మ జీవులు నశించి పోవును. లేదా, వెలుపలకు గెంటి వేయబడును. ఇట్లు గెంటి వేయ బడుత చేతనే కురుపు చితికి చీము భయడ బడు చున్నది. సూక్ష్మ జీవుల బలము తక్కువగ నున్న యెడల కురుపు లోలోపలకు పోవును. అట్టి సమయములో శస్త్రము చేసి చీము బయటకు వచ్చుటకు మార్గ మేర్పరచిన గాని కురుపు మానదు. చీము బయటకు పోవుటకు దారి యేర్పడగానే మన దేహము లోని తెల్ల కణములకు సూక్ష్మ జీవుల విషమంతగా నంటదు. అందుచే నవి కొంచెము తెప్పరిలి క్రొత్త బలమును పొందినవై సూక్ష్మ జీవులను బయటకు తరిమి వేయును. అందు వలన పుండు శీఘ్రముగా మానును.

సూక్ష్మ జీవులలో కొన్ని అంటిన స్థలముననే పెరుగుచు తమ విషమును మాత్రము శరీరము నందంతటను ప్రసరింప జేసి వ్యాధి కలుగ జేయుననియు మరికొన్ని సూక్ష్మ జీవులు మన శరీరములో ప్రవేశించిన తోడనే శరీరమునందన్ని భాగములకు వ్యాపించు ననియు పైన వ్రాసి యున్నాము. పైన వర్ణించిన కురుపులో సూక్ష్మ జీవులు సామాన్యముగా ప్రవేశించిన చోటనే వృద్ధి పొందును. ధనుర్వాయువు (Tetanus) లో నిట్లే సూక్ష్మ జీవులు ఎక్కడ ప్రవేశించునో అక్కడ కొంత వాపు పోటు మొదలగు గుణములు కలిగించుచు ఆ ప్రదేశమునందే యని నివసించి యుండును. ఈ సూక్ష్మ జీవులు తా మక్కడనుండి కదలక తాము తయారు చేయు విషమును మాత్రము శరీరమంతటను వ్వాపింప జేసి మరణము కలిగించును. చలి జ్వరము మొదలగు కొన్ని వ్వాధులలో వాధి కలిగించు సూక్ష్మ జీవులు ప్రవేశించిన చోటనే యుండక రక్తము గుండ శరీర మంతను వ్యాపించును. రోగి యొక్క నెత్తురు చుక్క నొక్క దాని నెక్కడ నుండి యైనను తీసి పరీక్షించిన యెడల సూక్ష్మ జీవులు కానవచ్చును. దొమ్మును కలిగించు సూక్ష్మ జీవులు నెత్తురు ద్వారాను, ధనుర్వాయువు కలిగించు సూక్ష్మ జీవుల విషములు నరముల ద్వారాను వ్యాపించును.

ఒకానొక వ్యాధి ప్రారంభమైన తరువాత సూక్ష్మ జీవుల లెల్ల తమ సైన్యములను, విషములను నలు దిక్కులకు ఎట్లు ప్రసరింప జేయు చుండునో అట్లే మన శరీరమందలి వివిధాంగములును సూక్ష్మ జీవుల కపాయకరములగు వివిధ పదార్థములను పుట్టించుచు తమ యుద్ధ భటులను వృద్ధి చేసికొను చుండును. మన శరీర బలము సూక్ష్మ జీవుల బలము కంటే మించిన యడల వ్యాధి కుదురును. లేదా వ్యాధి ప్రకోపించును. అతి మూత్రము మొదలగు కారణములచే శరీర బలము తగ్గి యున్న వార లిందు చేతనే రాచపుండు మొదలగు వానికి సులభముగ లోంగుదురు.

మూలాలు

[మార్చు]
  • అంటువ్యాధులు రచయిత ఆచంట లక్ష్మీపతి అను గ్రంథమునుండి గ్రహింప బడినది

ఇతర లింకులు

[మార్చు]