స్వామి అభేదానంద
స్వామి అభేదానంద | |
---|---|
జననం | కాళీప్రసాద్ చంద్ర 1866 అక్టోబరు 2 కలకత్తా, బెంగాల్, బ్రిటిష్ ఇండియా |
నిర్యాణము | 1939 సెప్టెంబరు 8 కలకత్తా, బెంగాల్, బ్రిటిష్ ఇండియా | (వయసు 72)
గురువు | రామకృష్ణ పరమహంస |
తత్వం | అద్వైత వేదాంతం |
స్వామి అభేదానంద (1866 అక్టోబరు 2 - 1939 సెప్టెంబరు 8) రామకృష్ణ పరమహంస సన్యాసాశ్రమ శిష్యుల్లో ఒకడు. ఈయన జన్మనామం కాళీప్రసాద్ చంద్ర. ఈయన రామకృష్ణ వేదాంత మఠం వ్యవస్థాపకుడు. 1897లో స్వామి వివేకానంద ఈయన్ను వేదాంతాన్ని వ్యాప్తి చేసేందుకు, వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్ కు అధ్యక్షత వహించమని అమెరికాకు పంపించాడు. వేదాంతం మీద ఈయన పలు పుస్తకాలు రచించాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]స్వామి అభేదానంద జన్మనామం కాళీప్రసాద్ చంద్ర. ఈయన 1866 అక్టోబరు 2 న బెంగాల్ ప్రావిన్సు లోని కలకత్తాలో జన్మించాడు.[1] ఈయన తండ్రి రసిక్ లాల్ చంద్ర, తల్లి నయనతార దేవి. 1884 లో 18 సంవత్సరాల వయసులో కలకత్త విశ్వవిద్యాలయం కింద స్కూలు ఫైనల్ పరీక్షల కోసం చదువుతుండగా ఒకసారి దక్షిణేశ్వర్ వెళ్ళి రామకృష్ణ పరమహంసను కలిశాడు. 1885 ఏప్రిల్ న ఆయన ఇల్లు విడిచి వచ్చేసి మొదటగా శ్యాంపుకూర్ లోనూ, తర్వాత కలకత్తాకు సమీపంలోని కోశీపూర్ గార్డెన్ హౌస్ లో ఉన్న రామకృష్ణ పరమహంసకు సేవలు చేయడం కోసం అక్కడే ఉండిపోయాడు.
సన్యాసి జీవితం
[మార్చు]1886 లో గురువు రామకృష్ణులు మరణించగానే బారానగర్ మఠంలో ఒక గదిలోకి ప్రవేశించి తీవ్రమైన ధ్యాన సాధనలో మునిగిపోయాడు. అందువల్ల అతనిని సహచరులు కాళీ తపస్వి అని పిలిచేవారు.[1] స్వామి వివేకానందతో పాటు ఈయన కూడా స్వామి అభేదానంద పురి అనే పేరుతో సన్యాసం స్వీకరించాడు.[2]
1896 లో స్వామి వివేకానంద లండన్ లో ఉపన్యసిస్తూ ఈయనను కూడా తనతో కలిసి పాశ్చాత్యదేశాల్లో వేదాంతాన్ని వ్యాప్తి చేయమని కోరాడు. 1897 లో ఈయన అమెరికా పర్యటనకు వెళ్ళినపుడు వివేకానంద ఈయనను న్యూయార్కులోని వేదాంత సొసైటీకి అధ్యక్షత వహించమని కోరాడు. ఆయన అక్కడి నుంచి సుమారు 25 ఏళ్లపాటు అమెరికాలోనే కాక, కెనడా, మెక్సికో, జపాన్, హాంగ్‌కాంగ్ లాంటి దేశాలు పర్యటించి అక్కడ వేదాంతపరమైన ఉపన్యాసాలు ఇచ్చి తమ గురువు సందేశాన్ని వ్యాప్తి చేశారు. 1921 లో మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చాడు.
1922లో హిమలయాలు దాటుకుని టిబెట్ చేరుకుని అక్కడ కొంతకాలం పాటు టిబెటన్ బౌద్ధమతాన్ని అధ్యయనం చేశాడు. 1923 లో కోల్‌కత లో రామకృష్ణ వేదాంత సొసైటీని స్థాపించాడు. దీనిని ప్రస్తుతం రామకృష్ణ వేదాంతమఠం అని పిలుస్తున్నారు. 1924 లో డార్జిలింగ్ లో కూడా రామకృష్ణ వేదాంత మఠాన్ని స్థాపించాడు. 1927 లో ఈయన విశ్వవాణి అనే పేరుతో ఒక ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించాడు. 1927 నుంచి 1938 దాకా ఆయన దానికి సంపాదకత్వం వహించాడు. ఇది నేటికీ ప్రచురితమవుతూ ఉంది.[3]
ఈయన 1939 సెప్టెంబరు 8 న రామకృష్ణ వేదాంతమఠంలో మరణించాడు. ఆయన చనిపోయే నాటికి రామకృష్ణ పరమహంస సన్యాసాశ్రమ శిష్యుల్లో ఆయనే ఆఖరివాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Biography Archived 14 మే 2011 at the Wayback Machine Belur Math Official website.
- ↑ Bagchi, Moni (1960). Swami Abhedanananda A apritual Biography (PDF). Calcutta: Ramakrishn Vedanta Math. p. 113. Retrieved 21 February 2022.
- ↑ Bhowmik, Dulal (2012). "Abhedananda, Swami". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
- ↑ Swami Abhedananda Biography[permanent dead link] The Ramakrishna Mission Institute of Culture