హిజ్రాల పండగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్త్రీ, పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని నపుంసకులు లేదా హిజ్రాలు అని అంటారు. సభ్యసమాజం అనాదరణకు గురైన వీరు బిక్షాట మొదలైన వృత్తులలో జీవనం సాగిస్తుంటారు. ఆడ మగ పెళ్ళి చేసుకున్నట్లు వీరుకూడ ఉత్తిత్తి పెళ్ళి చేసుకుంటారు. ఆ వేడుక వీరికెంతో ఆనందాన్నిస్తుంది. ఆ కథా కమామీషే ఈ వ్యాసం.

కువాగం గ్రామం[మార్చు]

తమిళనాడులోని విల్లుపురం జిల్లా, కవాగం గ్రామంలో చైత్రమాస పౌర్ణమి రోజున పలు ప్రాంతాలనుండి హిజ్రాలు వేలాదిగా వచ్చి కతాండవర్ (అరవన్) దేవత జాతరలో పాల్గొంటారు. (దేవత దృశ్య చిత్రం)

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని కువాగం ఒక చిన్న గ్రామం. కాని చైత్రమాస పౌర్ణమి రోజున ఆ గ్రామంలో అతి పెద్ద ఉత్సవం జరుగుతుంది. పలు ప్రాంతాలనుండి హిజ్రాలు వేలాదిగా ఈ గ్రామం వస్తారు. కుతాండవర్ అనే ఆలయం ఈ గ్రామంలోనే ఉంది. కుతాండవర్ అనగా అర్జునుని కొడుకు ఐరావంతుడు.

పురాణ గాద[మార్చు]

హిజ్రాల కథనం ప్రకారం:మహాభారత యుద్ధం పాండవులు గెలవాలంటే ఒక మహా వీరుని బలిదానం ఇవ్వాలట. అలాంటి వీరులు పాండవులలో వున్నారు గానీ, వారిని బలి ఇవ్వడం శ్రీకృష్ణునకు ఇష్టం లేదు. అలాంటి వీరుడు అర్జునునికి నాగకన్యకు జన్మించిన ఐరావంతుడు గుర్తుకు వస్తాడు శ్రీకృష్ణునకు. ఈ విషయాన్ని ఐరావంతునకు చెప్పి అతన్ని ఒప్పిస్తాడు శ్రీ కృష్ణుడు. కాని ఐరావంతుడు ఒక షరతు పెడతాడు. అదేంటంటే బలికి ముందు తనకు వివాహం జరగాలని. బలికాబోయేవానికి పిల్లనెవరిస్తారని ఆలోచించిన శ్రీకృష్ణుడు తానే మోహినీ అవతారమెత్తి ఐరావంతున్ని పెండ్లాడతాడు. అలా మోహినీ అవతార అంశతోనే తాము పుట్టామని హిజ్రాల నమ్మిక. అందుకే ఐరావంతుణ్ణి తమ దేవునిగా కొలుస్తారు. ఆ దేవుడినే పెండ్లాడుతారు. ఆ సందర్భంగా జరిగే జాతరే కుతాండవర్ ఆలయ ఉత్సవం.

హిజ్రాలు పెళ్ళికూతురైన వేళ[మార్చు]

ఈ రోజుకొరకు హిజ్రాలందరూ ఏడాదిపొడుగునా ఎదురుచూస్తుంటారు. వారం ముందునుండే పలు ప్రాంతాలనుండి హిజ్రాలు విల్లుపురం చేరుకొని పూటకో విధంగా అలంకరించుకొని వీదులలో నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ఆనందిస్తారు. ఆ సందర్భంగా హిజ్రాలకు నృత్యం, అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఆతర్వాత హిజ్రాలందరూ ఆలయమున్న కువాగం గ్రామం చేరుకొని ఐరావంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కళ్యాణోత్సవ రోజున హిజ్రాలందరూ పట్టుచీరలు ధరించి పెళ్ళికూతురులాగ అలంకరించుకొని ఐరావంతుని దర్శనానికి వెళ్ళి పూజారులతో పసుపు తాడును తాళిగా కట్టించు కుంటారు.

అంతలోనే వైదవ్యం[మార్చు]

అలా తాళికట్టించుకున్న హిజ్రాలు ఆ రాత్రంతా ఆలయంలోనే ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపుతారు. చెక్కలతో చేసిన ఐరావంతుని విగ్రహాన్ని ఊరంతా ఊరేగిస్తారు. తెల్లవార జామున ఐరావంతుని బలికి సూచనగా విగ్రహం తలను తీసేస్తారు. అంతవరకు ఆనందోత్సవాలతో ఆడిపాడిన హిజ్రాలందరూ ఐరావంతుడు బలైనాడని గుండెలు బాదుకొంటూ జుట్టు విరబోసుకొని హాహాకారాలు చేస్తూ తమ విచారాన్ని వెలుబుచ్చుతారు. ఆ తరువాత తాళిని తెంపేసి, గాజులను పగులగొట్టి స్నానంచేసి వైవిధ్యానికి చూచికగా తెల్లని చీర కట్టుకొని ఆ ఊరు విడిచి తమ తమ స్వగ్రామాలకు చేరుకుంటారు. ఆ విధంగా ఆ ఉత్సవం ముగుస్తుంది. ప్రతియేడు చైత్ర పౌర్ణమి నాడు ఈ వుత్సవం జరుగుతుంది. ఆ వుత్సవం కొరకు హిజ్రాలందరూ ఎదురుచూస్తుంటారు. హిజ్రాలకు ఇదే అతి పెద్ద పండగ.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

  • ఈనాడు ఆదివారం: 2013 ఏప్రిల్ 21.