Jump to content

హిప్సోగ్రాఫిక్ వక్రం

వికీపీడియా నుండి
(హిప్సోగ్రాఫిక్ రేఖ నుండి దారిమార్పు చెందింది)

భూగోళం మీద నిమ్నోన్నతాలను సగటు సముద్ర మట్టం ఆధారంగా సూచించే రేఖా చిత్రాన్ని హిప్సోగ్రాఫిక్ వక్రం/రేఖ (Hypsographic Curve/line) అంటారు. ఈ వక్రం సగటు సముద్ర మట్టం (Mean Sea Level) నుండి ఖండ భాగాలు, సముద్ర భాగాల యొక్క నైసర్గిక స్వరూపాన్ని సూచిస్తుంది. హిప్సోగ్రాఫిక్ వక్రాన్నే హిప్సోమెట్రిక్ వక్రం (Hypsometric Curve) అని కూడా వ్యవహరిస్తారు.[1] ఖండ భూతలం (continental floor), సముద్ర భూతలం (sea floor) ల యొక్క స్థలాకృతి (topography) లను శాస్త్రీయ పద్ధతిలో వివరించడానికి హిప్సోగ్రాఫిక్ వక్రం ఉపయోగపడుతుంది. ఈ వక్రం మీద జరిపిన విశ్లేషణలు సముద్ర పటలం, ఖండ పటలం ల యొక్క సాంద్రతలు విభిన్నంగా ఉన్నాయన్న సిద్ధాంతానికి మద్దతు నిస్తాయి.

భూగోళపు హిప్సోగ్రాఫిక్ వక్రం
భూగోళపు హిప్సోగ్రాఫిక్ వక్రం
Earth elevation histogram

హిప్సోగ్రాఫిక్ వక్రాన్ని భూగోళానికే కాక రిజర్వాయర్లు, చెరువులు, సరస్సుల వంటి ఇతర సంవృత వ్యవస్థలకు (closed systems) కూడా అనువర్తించి వాటి స్థలాకృతులను కూడా శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించవచ్చు.

హిప్సోగ్రాఫిక్ వక్రం ఒక గ్రాఫ్ మాదిరిగా సూచించబడుతుంది. ఒకానొక ప్రదేశం ఆక్రమించే విస్తీర్ణాన్ని శాతంలో X-అక్షం మీద, ఆ ప్రదేశం యొక్క ఉన్నతి (Elevation) ని Y-అక్షం మీద సూచిస్తారు. ఈ వక్రం ద్వారా ఖండ లేదా సముద్ర భూతలంపై గల వివిధ నైసర్గిక స్వరూప ప్రాంతాలు (పర్వతాలు, ఖండతీరపు ప్రాంతాలు, అభిసల్ మైదానాలు, ట్రెంచ్లు మొదలైనవి)
a) సగటు సముద్ర మట్టం నుండి ఎంతెంత లోతులలో లేదా ఎత్తులలో ఉన్నాయి.
b) ఆయా లోతులలో/ఎత్తులలో మొత్తం భూగోళపు ఉపరితల విస్తీర్ణంలో ఎంతెంత వాటాలను (శాతాలలో) ఆక్రమించి వున్నాయి అనే విషయం గ్రహించవచ్చు.
ఈ వక్ర రేఖ యొక్క వాలు (slope) లో కనిపించే మార్పు, ఆ ప్రదేశం యొక్క నైసర్గిక స్వరూపంలో కనిపించే మార్పును ప్రతిఫలిస్తుంది.

ఉదాహరణకు భూగోళం యొక్క హిప్సోగ్రాఫిక్ వక్రంలో ఖండతీరపు ప్రాంతాలను (Continental margins) పరిశీలిస్తే ఈ భాగం యొక్క వాలు దాదాపుగా నిట్రంగా (steep slope) వున్నట్లు గమనించవచ్చు. Y- అక్షం మీద చూస్తే ఈ ఖండతీరపు ప్రాంతాలు 0 నుండి 4000 మీటర్ల సముద్ర లోతులో ఉంటాయని తెలుస్తుంది. X- అక్షం మీద చూస్తే భూగోళం మొత్తం ఉపరితల విస్తీర్ణంలో 20 శాతం వరకూ ఖండతీరపు ప్రాంతాలు ఆక్రమించాయని తెలుస్తుంది. ఈ విధంగా సముద్ర భూతలంపై గల వివిధ నైసర్గిక స్వరూప ప్రాంతాలు ఎంతెంత సముద్ర లోతుల్లో వున్నాయి, ఆయా సముద్ర లోతుల్లో ఎంతెంత విస్తీర్ణ శాతాన్ని ఆక్రమించి వున్నాయి అనే విషయం తెలుస్తుంది.

అదే విధంగా ఖండ భూతలంపై గల వివిధ నైసర్గిక స్వరూప ప్రాంతాలు సగటు సముద్ర మట్టం నుండి ఎంతెంత ఎత్తులలో (elevations) వున్నాయి, ఆయా ఎత్తులలో అవి ఎంతెంత వాటాలను (మొత్తం భూగోళపు ఉపరితల విస్తీర్ణంలో శాతం అవి ఆక్రమించే శాతం) ఆక్రమించి వున్నాయి అనే విషయాలు కూడా హిప్సోగ్రాఫిక్ వక్రం నుండి గ్రహించవచ్చు.

అభివృద్ధి

[మార్చు]
1896 లో Hermann Wagner రూపొందించిన హిప్సోగ్రాఫిక్ వక్రం

1883 లో మొట్టమొదటిసారిగా హిప్సోగ్రాఫిక్ వక్ర నమూనాను ఆల్బర్ట్ అగస్టీ డీ లాపరెంట్ (Albert Auguste de Lapparent) అనే ఫ్రెంచ్ జియాలజిస్ట్ చిత్రించాడు.[2] ఆ తరువాత 1933 లో ఎర్విన్ కోసినా (Erwin Kossina) అనే జర్మన్ భూగర్భ శాస్త్రజ్ఞుడు దానిని అభివృద్ధి చేసాడు. సోనార్ ధ్వని తరంగాల ద్వారా మహా సముద్రాల లోతులను కచ్చితంగా అంచనా వేయడంతో ఈ వక్రం యొక్క డేటా గణాంకాలలో మార్పులు వచ్చాయి. వి.ఎన్. స్తెపనోవ్ (V.N. Stepanov) 1959 లో మొత్తం డేటాను తిరిగి లెక్కించి, పాత వక్రంలో సమూలమైన మార్పులు చేయడం ద్వారా హిప్సోగ్రాఫిక్ వక్రాన్ని మరింత అభివృద్ధి చేసాడు.[2]

ఉపయోగాలు

[మార్చు]

1) హిప్సోగ్రాఫిక్ వక్రం ద్వారా భూగోళం మీద గల ఖండ భూతలం (continental floor), సముద్ర భూతలం (sea floor) యొక్క స్థలాకృతి (topography) లను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించవచ్చు.
ఉదాహరణకు

  • హిప్సోగ్రాఫిక్ వక్రం ద్వారా, సముద్రాలు 3,795 మీటర్ల (12,450 అడుగులు) సగటు లోతుతో మొత్తం భూగోళం యొక్క ఉపరితల వైశాల్యంలో 71% ఆక్రమించాయని, మిగిలిన 29% భూగోళపు ఉపరితల వైశాల్యాన్ని బహిర్గత ఖండ భాగాలు (exposed land) సుమారు 840 మీటర్ల (2,755 అడుగులు) సగటు ఎత్తు (elevation) తో ఆక్రమించాయని తెలియవస్తుంది.[3]
  • ఈ వక్రం ఆధారంగా ఖండ భాగాల మీద అత్యధికంగా సుమారు మొత్తం భూగోళంలో 13% (అంటే 26 మిలియన్ చరపు కిలోమీటర్లు) 200-1000 మీటర్ల (600-3000 అడుగులు) ఎత్తులో వున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా భూగోళం మీద 41 % వైశాల్యం సముద్రాలలో 4000-6000 మీటర్లు (12000-18000 అడుగులు) లోతులో ఉంది.
  • సముద్రాల సగటు లోతు 3,795 మీటర్ల (12,450 అడుగులు) కాగా సముద్రాలలో ఈ సగటు లోతు కంటే తక్కువ లోతు కల్గిన భాగాలు కేవలం 8% మాత్రమే ఉన్నాయి. మిగిలిన సముద్ర భాగం అంతా అభిసల్ మైదానాల రూపంలో సగటు లోతు కంటే ఎక్కువ లోతులో ఉంది.

2) హిప్సోగ్రాఫిక్ వక్రం ద్వారా కొంతవరకు భూ సమతాస్థితిని (Isostacy) వివరించవచ్చు.

హిప్సోగ్రాఫిక్ వక్రంలోని ఖండ, సముద్ర భాగాల యొక్క నిమ్నోన్నతాలు, మొత్తం భూగోళ వైశాల్యంలో వాటి వాటాలను పరిశీలిస్తే దీనికి, ఆయా ఖండ, సముద్ర భాగాల క్రింద వున్న శిలల యొక్క సాంద్రతలకు దగ్గర సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది. సముద్రాల క్రింద వున్న పటలం SiMa పొరను కలిగివుంటుంది. peridotitic పదార్ధంతో కూడిఉన్న ఈ సీమా పొర యొక్క విశిష్ట గ్రావిటీ (specific gravity) 3.3 [4] (గతంలో సీమా పొర బసాల్ట్ శిలలతో నిర్మితమై వున్నదని భావించడం చేత దాని విశిష్ట గ్రావిటీ 3.0 గా లెక్కించారు).[4] అదే విధంగా ఖండాల క్రింద వున్న పటలం SiAl పొరను కలిగివుంది. గ్రానైట్ నుండి గాబ్రోయిక్ శిలలతో నిర్మితమైన ఈ సియాల్ పొర విశిష్ట గ్రావిటీ (specific gravity) 2.7.[5] కనుక సముద్ర పటలం (Oceanic crust) లోని శిలల సాంద్రత 3.3 కాగా ఖండ పటలం (continental crust) లోని శిలల సాంద్రత 2.7 గా ఉంది. ఖండ, సముద్ర భూ పటలాల (earth crust) లోని శిలల సాంద్రత వలన ఏర్పడే అసమతుల్యతను తొలగించి భూ సమతాస్థితిని పాటించుట కొరకై, వివిధ భాగాలలో వివిధ రకాలైన నిమ్నోన్నతలు ఏర్పడినట్లుగా రుజువవుతున్నది. ఈ రకంగా భూ సమతాస్థితిని వివరించడానికి హిప్సోగ్రాఫిక్ వక్రం కొంతవరకు ఉపయోగపడుతుంది.

3) హిప్సోగ్రాఫిక్ వక్రాన్ని భూగోళానికి, వివిధ సముద్రాలకు మాత్రమే కాక రిజర్వాయర్లు, చెరువులు, సరస్సుల వంటి ఇతర సంవృత వ్యవస్థలకు (closed systems) కూడా చిత్రించవచ్చు. తద్వారా వాటి స్థలాకృతులను కూడా శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించవచ్చు.

ఉదాహరణకు ఒక సరస్సుకు సంబంధించి ఈ వక్రాన్ని గీయడానికి వివిధ లోతులలో ఒక సరస్సు యొక్క విస్తీర్ణాన్ని (x-అక్షం మీద), సరస్సు లోతుని (Y-అక్షం మీద) తీసుకొని తద్వారా సరస్సు యొక్క హిప్సోగ్రాఫిక్ వక్రాన్ని చిత్రిస్తారు. దీనివలన ఒక సరస్సు యొక్క లోతుకి, ఆ సరస్సు యొక్క వక్రత (curvature) కి మధ్య గల సంబంధం తెలియవస్తుంది. తద్వారా ఆ సరస్సులో నీటి మట్టం తగ్గినపుడు (ఉదాహరణకు 10 అడుగులు తగ్గినపుడు) ఆ సరస్సు యొక్క ఉపరితల వైశాల్యం ఎంతమేరకు తగ్గవచ్చు అనే అంచనాకు వస్తారు.[6] అదే విధంగా సరస్సులోనికి వర్షాకాలంలో వర్షపునీరు చేరుతూవుండి తద్వారా ఆ సరస్సులో నీటి మట్టం క్రమేణా పెరుగుతన్నపుడు, (ఉదాహరణకు 3 అడుగులు పెరిగినపుడు) ఆ సరస్సు యొక్క ఉపరితల వైశాల్యం ఎంత మేరకు పెరగవచ్చు, ఎంత ఘనపరిమాణం మేరకు నీరు బయటకు పొంగి పొర్లవచ్చు లాంటి అంచనాలు చేస్తారు.

రిఫరెన్స్‌లు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

సూచికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Hypsometric curve". Encyclopedia Britanica.
  2. 2.0 2.1 "Hypsographic Curve". The Free Encyclopedia Dictionary. Archived from the original on 2016-12-23. Retrieved 2017-02-05.
  3. "Ocean". Encyclopedia Britanica.
  4. 4.0 4.1 "Definition of sima". Mindat.org.
  5. Donald L. Blanchard. "Buoyancy and Floating Continents". Archived from the original on 2016-08-17. Retrieved 2017-02-05.
  6. "Bathymetric Maps and Hypsographic Curves".[permanent dead link]