Jump to content

హ్యూమన్ మెటాన్యూమోవైరస్

వికీపీడియా నుండి

హ్యూమన్ మెటాన్యూమోవైరస్
హ్యూమన్ మెటాన్యూమోవైరస్, నమూనా
Scientific classification
Kingdom:
ఆర్తోనవైరే
Family:
న్యూమోవిరిడే
Genus:
మెటాన్యూమోవైరస్
Species:
హ్యూమన్ మెటాన్యూమోవైరస్

హెచ్.ఎం.పి.వి. హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV లేదా hMPV) అనేది శ్వాసకోశ సంక్రమణ కలుగ చేసే వైరస్. అంటే ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV), ఫ్లూ వంటివి (జలుబు) వంటి వ్యాధులకు కారణం. ఇది సాధారణంగా శీతాకాలంలో, వసంత ఋతువు ప్రారంభంలో సంభవించే కాలానుగుణ (సీజనల్) వ్యాధి.[1] ఈ వైరస్ న్యుమోవిరిడే కుటుంబానికి చెందిన నెగటివ్ సెన్స్ కలిగిన ఒకే-పోగు ఉన్న RNA వైరస్. RSV కూడా ఇదే కుటుంబానికి చెందినది. దీనికి ఏవియన్ మెటాన్యూమోవైరస్ అంటే పక్షులకు సోకే వైరస్ కు (AMPV) దగ్గరి సంబంధం కలిగి ఉంది.[2][3][4]

లక్షణాలు, వ్యాప్తి

[మార్చు]

సాధారణంగా ఈ వైరస్ వలన జలుబు, ముక్కు దిబ్బడ, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కలుగుతాయి, ఇది దాదాపు 2-5 రోజుల తరువాత వెళ్లిపోతుంది. కానీ ఈ లక్షణాలు తగ్గకపోయినా ఉధృతమైనా వైద్యుని సంప్రదించవలసి వస్తుంది.[1] ఈ HMPV సంక్రమణాలు 3 నుండి 6 రోజుల వ్యవధిలో ఏర్పడతాయని, లక్షణాలు తేలికపాటి జలుబు నుండి తీవ్రమైన శ్వాసకోశ బాధల వరకు పెరగవచ్చని యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పేర్కొంది.[4]

hMPV వైరస్ అన్ని వయసుల వారిలో కూడా ఎగువ, దిగువ శ్వాసకోశ వ్యాధులకి కారణం అవవచ్చు. అయితే ముఖ్యంగా చిన్నపిల్లల్లో, వృద్ధులలో, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో, కీమోథెరపీ, అవయవ మార్పిడి చేయించుకున్న వారిలో వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. hMPV బారిన పడిన చాలా మంది పిల్లలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. వీరిలో బ్రోన్కి యోలైటిస్, బ్రోన్కైటిస్, న్యుమోనియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 5-16% మందిలో న్యుమోనియా వంటి శ్వాసకోశ సంక్రమణ కూడా అభివృద్ధి అవుతోందని తెలుస్తోంది.[1]

హెచ్.ఎం.పి.వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధం ద్వారా లేదా వైరస్ తో కలుషితమైన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వ్యాపిస్తుంది. వారు దగ్గడం, తుమ్మడం వలన వెదజల్లే తుంపర్ల వలన, వారు తాకిన వస్తువులు తాకడం వలన వైరస్ వ్యాప్తి చెందుతుంది. [1]

వైరస్ నిర్ధారణ

[మార్చు]

శ్వాసకోశ సంక్రమణను నిర్ధారించడానికి శారీరక లక్షణాలు రోగ చరిత్రను తెలుసుకుంటారు. అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ రకాన్ని నిర్ధారించడానికి ప్రయోగశాల పరీక్షలను నిర్వహిస్తారు. అరుదుగా వైద్యశాలలో చేరితే బ్రోంకోస్కోపీని చేయవచ్చు, అక్కడ ద్రవం నమూనా తీసి వైరస్లు పరీక్షిస్తారు.[1] ఈ వైరస్ ప్రాబల్యం ఉన్న చోట్ల నాట్ (న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ - NAAT) ద్వారా వైరస్ జన్యువు ఉనికి కనుగొనడం, ఇమ్యునోఫ్లోరోసెన్స్ లేదా ఎంజైమ్ ఇమ్యునోఅస్సే ఉపయోగించి శ్వాసకోశ స్రావాలలో వైరస్ యాంటిజెన్‌లను నిర్ధారించడం వంటి ప్రక్రియల ఉపయోగిస్తారు.[4]

నివారణ, చికిత్స

[మార్చు]

hMPV సంక్రమణం సోకిన వ్యక్తులను తాకకుండా దూరంగా ఉండడము, వారు ఉపయోగించిన వస్తువులు వాడకపోవడము, వారు తాకిన స్థలాలు శుభ్రపరచడం, తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా, ఇంకా దగ్గు జలుబు ఉన్నప్పుడు ముక్కు నోటిని కప్పి ఉంచడం ద్వారా ఈ సంక్రమణాన్ని నివారించవచ్చు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు బయట ప్రదేశాలలో తిరగకూడదు. COPD, ఆస్తమా, పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ hMPV, ఇంఫ్లూఇన్ జా, వంటి అంటు వ్యాధుల నుండి రక్షణ కొరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని టీకాలు సమయానికి తీసుకున్నామని వారు నిర్ధారించుకోవాలి.[4][1]

ప్రస్తుతానికి దీనికి చికిత్స, టీకాలు లేవు.[4] సాధారణంగా చికిత్స ఎక్కువగా లక్షణాలను తగ్గించే విధంగా ఉంటుంది. నొప్పి, జ్వరం, ముక్కు దిబ్బడ ను నియంత్రించడానికి ఎసిటమైనోఫెన్, ఇబుప్రోఫెన్ వంటి ఔషధాలను ఉపయోగించడం, అలాగే శ్వాసలో తీవ్రమైన గురక, దగ్గు ఉన్న రోగులకు తాత్కాలికంగా ఇన్ హేలర్ ఉపయోగించవలసిన అవసరం కావచ్చు, [1]

వైరస్ ఆవిష్కరణ

[మార్చు]
జెనస్ మెటాన్యూమోవైరస్ జాతులు, వాటి వైరస్లు [2][5]
జెనస్ జాతులు వైరస్ (సంక్షిప్త రూపం) ఎన్.సి.బి.ఐ .

వర్గీకరణ ఐడి

మెటాన్యూమోవైరస్ ఏవియన్ మెటాన్యూమోవైరస్ ఏవియన్ మెటాన్యూమోవైరస్ (AMPV) 38525
హ్యూమన్ మెటాన్యూమోవైరస్ మానవ మెటాన్యూమోవైరస్ (హెచ్.ఎం.పి.వి.) 162145

హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ను మొట్టమొదట 2001 లో నెదర్లాండ్స్ కి చెందిన బెర్నాడెట్ జి. వాన్ డెన్ హూగెన్ ఆమె సహచరులు కనుగొన్నారు.[6][7][8][9] ఈ HMP వైరస్ ను మొదట నెదర్లాండ్స్లోని 28 మంది చిన్న పిల్లల శ్వాసకోశ స్రావాలలో కనుగొన్నారు. పరిశోధకులు వైరస్ జన్యు శ్రేణుల జన్యు లక్షణాలు ఇంకా భాగాలను గుర్తించగల అణు జీవశాస్త్ర పద్ధతులను ఉపయోగించడం ప్రారంభించే వరకు ఈ పద్ధతుల్లో యాదృచ్ఛికంగా ప్రాధమిక పి.సి.ఆర్. ఆధారిత సాంకేతికత ఉంది. దీనివలన ఈ కొత్త వైరస్, ఏవియన్ న్యుమోవైరస్ మధ్య స్పష్టమైన సంబంధాన్ని కనుగొనడానికి అవసరమైన పరిమిత శ్రేణి డేటా లభించింది.[6] AMPVతో కనుగొనిన ఈ సన్నిహిత సంబంధం వలన ఈ కొత్త వైరస్కు హ్యూమన్ మెటా న్యూమోవైరస్ అని పేరు పెట్టారు.[6]

ప్రాబల్యం

[మార్చు]

2016 నాటికి అమెరికాలో ఇది 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆరోగ్యకరమైన పిల్లలలో తీవ్ర శ్వాసకోశ అనారోగ్యం కలిగించే వైరస్ లలో మొదటిది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) కాగా, ఇది రెండవదిగా గుర్తించారు.[10] ఎక్కువగా 6-12 నెలల మధ్య హెచ్.ఎం.పి.వి. ఉన్న శిశువులు వైద్యశాలలలో చేరడం సంభవిస్తుంది. అయితే ఆర్.ఎస్.వి. (Respiratory syncytial virus) ప్రభావం సుమారు 2 నుండి 3 నెలలు మధ్య వయస్సు శిశువులపై ఉంటుంది. హెచ్.ఎం.పి.వి. వ్యాధి లక్షణాలు తీవ్రత ఆర్.ఎస్.వి. ని పోలి ఉంటాయి. పెద్దవారిలో ఈ శ్వాసకోశ సంక్రమణం సోకడానికి హెచ్.ఎం.పి.వి. కూడా ఒక ముఖ్యమైన కారణం. ఈశాన్య ఆసియాలో 2024 చివరిలో హెచ్.ఎం.పి.వి. వ్యాప్తి గమనించారు.[11]

హెచ్.ఎం.పి.వి. కారణంగా చైనాలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల సంభవిస్తోంది. అధికారికముగా అత్యవసర పరిస్థితి ప్రకటించనప్పటికీ, దేశ ఆరోగ్య అధికారులు డిసెంబర్ 2024 నుండి వ్యాధికారకాలను నివారించడానికి తగిన పద్దతులను (ప్రోటోకాల్‌లను) అమలు చేశారు. [12] ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చైనాలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తోంది, పరిస్థితిని నియంత్రించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.

భారతదేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతొందుతున్న HMPV తో ప్రభావితమైన శ్వాసకోశ వ్యాధుల కేసులు కనుగొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) 2025 జనవరి 6 నాటికి కర్ణాటకలో రెండు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులను గుర్తించినట్లు ధృవీకరించింది. ఇవి బ్రోంకో న్యుమోనియా చరిత్ర కలిగిన శిశువులలో కనుగొనబడింది, అయితే వీరికి అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులను పర్యవేక్షించడానికి ICMR చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా వివిధ శ్వాసకోశ వైరస్‌ల సాధారణ నిఘా ద్వారా ఈ కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంకా భారతదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) నెట్‌వర్క్ వారి సమాచారం ప్రకారం, ఇన్ఫ్లుఎంజా-వంటి అనారోగ్యం (ILI) లేదా తీవ్రమైన తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (SARI) కేసులు గణనీయంగా పెరగలేదు. [13]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Human Metapneumovirus (hMPV)". American Lung Association. 2024-10-24. Retrieved 2025-01-05.
  2. 2.0 2.1 "ICTV Online (10th) Report".
  3. van den Hoogen, Bernadette G.; Jong, Jan C. de; Groen, Jan; Kuiken, Thijs; Groot, Ronald de; Fouchier, Ron A.M.; Osterhaus, Albert D.M.E. (2001). "A newly discovered human pneumovirus isolated from young children with respiratory tract disease". Nature Medicine. 7 (6): 719–724. doi:10.1038/89098. PMC 7095854. PMID 11385510.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "Human metapneumovirus". US Centers for Disease Control and Prevention (U.S. flag An official website of the United States government). 2024-04-11. Retrieved 2025-01-06.
  5. . "Taxonomy of the order Mononegavirales: update 2017".
  6. 6.0 6.1 6.2 (July 2006). "Epidemiology of Human Metapneumovirus".
  7. "Human Metapneumovirus". Centers for Disease Control and Prevention. 13 April 2023.
  8. "Human Metapneumovirus (HMPV): Causes & Treatment". Cleveland Clinic.
  9. (Oct 2011). "Human Metapneumovirus: Lessons Learned over the First Decade".
  10. Williams, John V.; Harris, Paul A.; Tollefson, Sharon J.; Halburnt-Rush, Lisa L.; Pingsterhaus, Joyce M.; Edwards, Kathryn M.; Wright, Peter F.; Crowe, James E. Jr. (2004-01-29). "Human Metapneumovirus and Lower Respiratory Tract Disease in Otherwise Healthy Infants and Children". New England Journal of Medicine. 350 (5): 443–450. doi:10.1056/nejmoa025472. ISSN 0028-4793. PMC 1831873. PMID 14749452.
  11. Singh, Vikrant (2025-01-03). "HMPV outbreak in China? Amid viral videos and govt ambiguity, know symptoms and precautions". Wion (in ఇంగ్లీష్). Retrieved 2025-01-03.
  12. "HMPV in China: Is it similar to Covid-19 virus?". India Today. 2025-01-04. Retrieved 2025-01-06.
  13. "HMPV virus cases: Health ministry confirms two Karnataka infants tested positive". ది హిందుస్తాన్ టైమ్స్. 2025-01-06. Retrieved 2025-01-06.