Jump to content

అగానొ నది

అక్షాంశ రేఖాంశాలు: 37°57′47.6″N 139°7′46.4″E / 37.963222°N 139.129556°E / 37.963222; 139.129556
వికీపీడియా నుండి
(Aga river నుండి దారిమార్పు చెందింది)

37°57′47.6″N 139°7′46.4″E / 37.963222°N 139.129556°E / 37.963222; 139.129556

అగానొ నది (阿賀野川)
అగా నది, ఒకావా నది
నది
అగానొ నది (ఆగా ప్రాంతం వద్ద)
దేశం జపాన్
రాష్ట్రం హోక్కయిడో దీవి
ఉపనదులు
 - ఎడమ నిప్పాషి నది, తడామి నది, హయాదే నది, కొఅగానో నది
Source అరాకై పర్వతం (ఫుకుషిమా , టోచిగి ప్రాదేశిక భూభాగాల సరిహద్దు ప్రాంతం)
 - ఎత్తు 1,581 m (5,187 ft)
Mouth జపాన్ సముద్రం
 - ఎత్తు 0 m (0 ft)
పొడవు 210 km (130 mi)
పరివాహక ప్రాంతం 7,710 km2 (2,977 sq mi)
Discharge
 - సరాసరి 451 m3/s (15,927 cu ft/s)

అగానొ నది (阿 賀 野 川 అగానొ-గావా) జపాన్‌లోని హోన్షు దీవిలో ఉన్న హొకురికు (Hokuriku) ప్రాంతంలో ప్రవహించే ఒక నది. ఇది 210 కిలోమీటర్ల దూరం ప్రవహించి జపాన్ సముద్రంలో కలుస్తుంది. ఫుకుషిమా (Fukushima) ప్రాంతంలో ఈ నదిని అగా (Aga) నది లేదా ఒకావా (Okawa) నది అని కూడా పిలుస్తారు.

ఉనికి-విస్తరణ

[మార్చు]

జపాన్‌లోని హోన్షు దీవిలోని ఫుకుషిమా, టోచిగి ప్రాదేశిక భూభాగపు సరిహద్దులలో వున్న అరాకై (Arakai) పర్వత సమీపంలో పుట్టిన ఈ నది ప్రారంభంలో ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. ఇనావషిరో సరస్సు (Lake Inawashiro) నుండి బయటకు ప్రవహించే నిప్పాషి (Nippashi) నదిని షివొకవా వద్ద తనలో కలుపుకొంటుంది. తరువాత తడామి నదిని (Tadami) నదిని ఐజు బేసిన్‌లో యమాట వద్ద తనలో కలుపుకొంటుంది. తరువాత పశ్చిమంగా ప్రవహించి చివరకు నిగాట నగరం వద్ద జపాన్ సముద్రంలో కలుస్తుంది. జపాన్‌లోని ఇతర నదులతో పోలిస్తే, ఈ నదీ ముఖద్వారం అత్యధిక పరిమాణంలో నదీ జలాలను సముద్రంలోనికి విడుదల చేస్తుంది. 1951 నుండి 2002 వరకు గల కాలంలో సగటున 451 ఘనపుమీటర్లు/సెకను చొప్పున నదీజలాలను సముద్రంలోనికి డిశ్చార్జ్ చేస్తూ వచ్చింది. సుమారుగా 210 కిలోమీటర్ల దూరం ప్రవహించే ఈ నదీ పరీవాహక ప్రాంతం 7,710 చదరపు కిలోమీటర్లు మేరకు విస్తరించి ఉంది.[1] విస్తీర్ణం పరంగా ఈ నది జపాన్‌లో 8 వ అతిపెద్ద బేసిన్‌ను కలిగివుంది.[2]

ఉపనదీ వ్యవస్థ

[మార్చు]

ఆగానో నదికి అగా, నిప్పాషి, తడామి, హయాదే, కొఅగానో మొదలగు ఉపనదులున్నాయి. వీటిలో అగా, తడామి ఉపనదులు ముఖ్యమైనవి. ఈ రెండు ముఖ్య ఉపనదులు ఫుకుషిమా భూభాగంలోనే ఉన్నాయి.

  • అగా నది (Aga) : ఫుకుషిమా ప్రాదేశిక భూభాగంలో ప్రవహించేటప్పుడు అగానొ నదిని అగా నదిగా వ్యవహరిస్తారు. నిప్పాషి, తడామి నదులను కలుపుకొంటూ పోతుంది.
  • నిప్పాషి నది (Nippashi) : ఇనవాషిరో సరస్సు (Lake Inawashiro) నుండి బయటకు ప్రవహించే ఈ ఉపనది 'షివొకవా' వద్ద ఆగానో నదిలో కలుస్తుంది.
  • తడామి నది (Tadami) : ఒజానుమ (Ozenuma) ప్రాంతంలో పుట్టిన ఈ నది ఐజు (Aizu) బేసిన్ లో ప్రవహించి 'యమాట' వద్ద ఆగానొ నదిలో కలుస్తుంది. ఈ నది జలవిద్యుతుత్పత్తికి ప్రసిద్ధిగాంచింది.
  • హయాదే నది (Hayade) : అగానో పట్టణ పొలిమేరలలో ఇది అగానో నదిలో కలుస్తుంది.
  • కొఅగానో నది (Koagano) : షినానో, అగానో నదులను కలుపుతూ నిగాటా భూభాగంలో ప్రవహించే చిన్న నది.

నదీతీర పట్టణాలు

[మార్చు]

అగానొ నది ప్రవాహతీరం వంబడి నెలకొన్న ముఖ్య పట్టణ/నగర ప్రాంతాలు

  • ఐజు-వకామత్సు (Aizuwakamatsu) నగరం
  • నిషిఐజు (Nishiaizu)
  • ఆగా (Aga)
  • గోసియన్ (Gosen) పట్టణం
  • అగానో (Agano) పట్టణం
  • నిగాటా (Nigata) నగరం

జల విద్యుత్పత్తి

[మార్చు]
ఇనావషిరో పవర్ ప్లాంట్‌
నుమాజవనుమా పవర్ స్టేషన్

అగానో నది జలవిద్యుతుత్పత్తికి అనువైనది. అగానొ, దాని ఉపనదులపై పలు జలవిద్యుత్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. జపాన్ దేశపు మొట్టమొదటి హై-వోల్టేజ్, లాంగ్ రేంజ్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ వేయబడిన తొలి జల విద్యుత్కేంద్రం అయిన ఇనావషిరో పవర్ ప్లాంట్‌ను (107.5 మెగా వాట్స్) నిప్పాషి నదిపై 1899-1940 మధ్యకాలంలో అనేక దశలలో నిర్మించారు. జపాన్ లో తొలి పంప్డ్-స్టోరేజ్ పవర్ ప్లాంట్ అయిన నుమాజవనుమా పవర్ స్టేషన్‌ను (43.7 మెగా వాట్స్) 1952 లో తడామి ఉపనది పైనే నిర్మించారు. తడామి ఉపనదిపై ఒకుతడామి (Okutadami) డామ్ (560 మెగావాట్లు), టాగోకురా (Tagokura) డామ్ (380 మె.వా.), ఒటోరి (Otori) డామ్ (182 మె.వా.), మియాషిటా (Miyashita) డామ్ (94 మె.వా.), టాకి (Taki) డామ్ (92 మె.వా.), హొన్నా (Honna) డామ్ (78 మె.వా.), ఉవాడా (Uwada) డామ్ (63.9 మె.వా.) మొదలగు డామ్‌లు నిర్మించడం ద్వారా పది జలవిద్యుత్కేంద్రాలు నిర్మించారు. ఈ పది కేంద్రాల మొత్తం జలవిద్యుత్పాదన సామర్ధ్యం 1,650 మెగావాట్లు.

నీటి పారుదల

[మార్చు]

శీతాకాలంలో భారీగా మంచు కురిసే ప్రాంతంలో తడామి నది ప్రవహిస్తుంది. అందువలన అగానొ నదీజలాలలో ఎక్కువభాగం తడామి ఉపనది నుండే సమకూరుతున్నాయి.[2] ఈ నికర జలాల లభ్యతతో అగానొ నది దిగువ భాగంలో నిగాట ప్రాదేశిక భూభాగంలో ఈచిగో (Echiigo plains) మైదానం గుండా ప్రవహిస్తుంది.[2] నీటి లభ్యత పుష్కలంగా వుండటంతో సారవంతమైన ఈ ఈచిగో మైదానం వరిసాగుకి ప్రసిద్ధిగాంచింది. జపాన్‌లో ఉత్పత్తి అయ్యే మొత్తం వరిలో ఈ ప్రాంతం ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తుంది.[2]

నదీజలాల కాలుష్యం

[మార్చు]

1964-1965లో, నిగాటా ప్రాదేశిక భూభాగంలోని కానోస్ (Kanose) గ్రామంలోని ఒక రసాయన కర్మాగారం "మిథైల్ మెర్క్యూరీ' కలిసిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా అగానో నదిలోకి విడుదల చేసింది. అత్యంత విషపూరితమైన ఈ రసాయన సమ్మేళనం వల్ల ఈ నదీజలాలు తీవ్రంగా కలుషితమై, ఆహారగొలుసులో విషపూరిత పదార్ధాలు పేరుకుపోవడం జరిగింది. దీని ఫలితంగా ఈ నదీ జలాల్లోని చేపలు విషపూరితమై వాటిని ఆహారంగా స్వీకరించిన 690 మంది స్థానిక ప్రజలకు "నిగాటా మినామటా" అనే నరాల సంబంధిత వ్యాధి సంక్రమించింది.[3] [4] ఇది జపాన్ యొక్క నాలుగు పెద్ద కాలుష్య వ్యాధులలో ఒకటిగా గుర్తించబడింది. తిరిగి 2012 లో పర్యావరణ జపనీస్ మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ నదీ జలాలలో వున్న మెర్క్యురీ సాంద్రత 0.0005 మి.గ్రా./లీ.కంటే తక్కువగా వుందని తేలిన తరువాతనే ఈ నదీజలాలను సురక్షితమైనవిగా పరిగణిస్తున్నారు.

చిత్రమాలిక

[మార్చు]
అగానొ నది (కిటాకాట ప్రాంతం వద్ద)
అగానొ నది విహంగ దృశ్యం. ఎడమ పై భాగంలో హయాదే నది, అగానొ నదిలో సంగమించే దృశ్యం

వెలుపలి లింకులు

[మార్చు]
  • "Table Major Rivers in Japan". Ministry of Land, Infrastructure. Transport and Tourism, Japan. Retrieved 3 December 2017.

మూలాలు

[మార్చు]
  1. "Agano River". Tourist Link. Retrieved 4 March 2013.[permanent dead link]
  2. 2.0 2.1 2.2 2.3 "Hydrological response to future climate change in the Agano River basin, Japan". Researchgate. Retrieved 9 December 2017.
  3. Ceccatelli, Sandra; Aschner, Michael (23 March 2012). Methylmercury and Neurotoxicity. Springer Science & Business Media. p. 5. ISBN 978-1-4614-2382-9.
  4. Official government figure as of March 2001. See "Minamata Disease: The History and Measures, ch2"
"https://te.wikipedia.org/w/index.php?title=అగానొ_నది&oldid=4102200" నుండి వెలికితీశారు