చర్చ:గుంటూరు శేషేంద్ర శర్మ
సహస్రాబ్ది దార్శనిక కవి కవిర్విశ్వో మహాతేజా గుంటూరు శేషేంద్ర శర్మ Seshendra: Visionary Poet of the Millennium http://seshendrasharma.weebly.com/
జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ భార్య / జానకి పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు) సౌందర్యమే ఆయనకు అలంకారం, సౌందర్యమే ఆయనకు జీవితం కవి : విమర్శకుడు ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ….. – ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, (21 ఆగస్టు, 2000)
- * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు. నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు. కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు, వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు. బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. ఒకానొకశైలీనిర్మాత. – యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం) అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999 Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/
శేషేంద్ర కవిత ప్రస్థానం
[మార్చు]ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్లు కార్వాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి ఋణం తీర్చుకోవాలి బ్రతకటానికి ఋరుజై మనిషి విజయానికి జెండా అయేఎగరాలి
ఇరవైయవ శతాబ్దపు అత్యంత ప్రతిభాశాలురైన కవుల్లో గుంటూరు శేషేంద్ర శర్మ ప్రముఖులు లోకశాస్త్ర కావ్యాలను శేషేంద్ర నింశితంగా అధ్యయనం చేశారు నవ్య కవిత్వానికి ఒక నూతన శైలిని మార్గాన్ని ఈయన ఏర్పరిచారు దేశవిదేశాల సాహిత్య రీతులను కవిత్వపోకడలను బాగా ఆకళించుకున్నారు వాల్మీకి కాళిదాసు భవభూతి శ్రీహర్షుడు బాదలేక లోర్కా నేరూడ శ్రీనాథుడు మొదలగు కవులు నిర్మాణ శిల్పం గురించి సాధికారికంగా తెల్పిన విజ్ఞులు -----------
గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్య ప్రస్థానం - కాలరేఖలు
తెలుగు దేశంలో సుప్రసిద్ధ విద్వాంసులు చాలామంది జన్మించారు. అనేకమంది మహాకవులు అద్భుత కవితా ఖండాలను సృష్టించి ఖ్యాతిగడించారు. కాని విద్వత్కవులుగా కీర్తి ప్రతిష్ఠ లార్జించినవారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అట్టివారిలో గుంటూరు శేషేంద్ర శర్మ గారొకరు. శ్రీశర్మగారు బహుముఖ ప్రజ్ఞాశాలి, భాషాపరశేషభోగి. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషా సాహిత్యాలలో నిష్ఠాతులేగాక, హిందీ, ఉర్దు సాహిత్యాలలో సహితం గణనీయమైన కృషి చేశారు.
శ్రీశేషేంద్రశర్మగారు, ఎంత గొప్ప కవియో, అంతటి గొప్ప విద్వాంసుడూ, విమర్శకుడు అనుటలో ఎలాంటి భిన్నాభిప్రాయము లేదు. ప్రముఖ కవిగా, మహాపండితునిగా, గొప్ప విమర్శకునిగా శర్మగారు ప్రదర్శించిన ప్రతిభ అనన్య సామాన్యము. వీరి 'శ్రీవిద్యారహస్యనేతృత’ సర్వం కష్టమని పేర్కొనుట అతిశయీక్తి కాదు. "భారత రామాయణ ములను కలిపి శ్రీశర్మగారు చదివి నట్లుగా చదివిన వారి సంఖ్య లేదనియే చెప్పవలెను" (విశ్వనాధ సత్యనారాయణ). ప్రపంచ సాహిత్య ధోరణులను అవగాహన చేసుకొని, విస్తృత దృక్పథాన్ని అలవరచు కొని, కవితారంగంలోను విశ్వజనీన ప్రవృత్తిని ప్రకటించారు. నూతన కవితా ‘వాహిక’ చేబట్టి కవితా రంగంలో నూతన శకాన్ని సృష్టించారు. ఆధునిక కవితా రంగంలో ‘మండేసూర్యుని’ గా అభివర్ణించారు శ్రీశ్రీగారు శ్రీశేషేంద్రశర్మగారిని. తన కాలం వరకు ఉన్న కవితా ధోరణులను పూర్తిగా అకలింపు చేసుకొని, నాటికి లేనిదాన్ని సృజించి అభివృద్ధి చేయడమే వినూత్న శక్తిగా పరిగణిస్తారు శేషేంద్రశర్మగారు. శ్రీశర్మగారి కలం నుండి అనేక రచనలు ప్రవహించాయి. రచనలన్ని కలిపి దాదాపు 40కి పైగా ప్రచురిత మయ్యాయి.
శేషేంద్రశర్మగారి సాహిత్య ప్రస్థానం:
శేషేంద్రశర్మగారు వృత్తి రీత్యా ప్రభుత్వోద్యోగి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనరుగా పని చేశారు) ప్రవృత్తి మాత్రం సాహిత్యం. వారి సాహిత్య జీవితం అత్యంత మహోన్నతమైనది. శ్రీనాథ మహాకవి వలె నూనూగు మీసాల నాడే అంటే 20వ ఏటనే (1947లో) రచనా వ్యాసంగం మొదలెట్టారు. అనువాద కావ్యం "సొరాబు" తో ఆయన సాహిత్య ప్రస్థానం ఆరంభ మయింది. తర్వాత 1961వ సంవత్సరం లో శర్మగారి "చంపూవినోదిని" పద్య కావ్యం ప్రచురిత మయింది. ఆ కావ్యం శర్మగారి ఆశు కవిత్వ పటిమకు, పాండిత్య ప్రకర్షకు అద్దం పడుతుంది. శ్రీ శేషేంద్రశర్మ గారు 11 పద్య కావ్యాలు, 12 విమర్శనా గ్రంథాలు రచించి పేరు ప్రతిష్ఠలు ఆర్జించారు. వారి ప్రముఖ రచనలను గూర్చి సంక్షిప్త వివరణ పాఠక మహాశయుల నిమిత్తం ఇందు పొందు పరచడ మైనది. విజ్ఞులు దీనిని సహృదయంతో స్వీకరిస్తారని ఆశిద్దాం!
ప్రసిద్ధ రచనలు :
శ్రీ శేషేంద్రశర్మగారి నాదేశం - నాప్రజలు, శేషజోత్స్న, రక్తరేఖ, ఆధునిక మహాభారతం, జనవంశం, స్వర్ణహంస, షోడశి - రామయణ రహస్యాలు, మండే సూర్యుడు, కవిసేన మేనిఫెస్టొ విశిష్ఠ రచనలుగా పేర్కొంటారు పండితులు. ఆయా రచనల లోని విశేషాలను తెలుసు కొనే ప్రయత్నం చేద్దాం.
నాదేశం - నాప్రజలు:
సాహిత్య వ్యాసంగం లో ప్రయోగాలు చేయుట శేషేంద్రశర్మగారికి అత్యంత ప్రీతి కరమైన విషయం. ఆధునిక సాహిత్యంలో కావ్యేతిహాసాలు లేని లోటును తీర్చే ఉద్దేశ్యంతో శేషేంద్రశర్మగారు "ఆధునిక మహాభారతము (నాదేశం-నాప్రజలు) రచించారు. విలక్షణ ప్రక్రియ అయిన "వచన కవితా వాహిక" ద్వారా ఒక అద్భుత కావ్యాన్ని సృష్టించి ప్రపంచ స్థాయి రచయితగా నిలచారు శేషేంద్రశర్మగారు. సామాజిక చైతన్యాంశాలను సాహిత్యంలో ప్రవేశ పెట్టి విలువలను పెంచడమే కాక, ఒక నూతన ప్రక్రియ ఆధునికులకు పరిచయం చేశారు. ఇతిహాస నిర్మాణానికి బాధానుభూతి పూర్వక బలి కావాలి. నేనే ఆబలి! నా వయస్సు నా పాండిత్యం, నా ప్రతిభ, నా అనుభవం సర్వస్వం పిండి, మాటల గొంతుల్లో పోసిన నా రక్తం ఈ ఇతిహాసం. ప్రపంచ మానవుల్ని, వాళ్ళ చరిత్రల్నీ, వాళ్ళ జయాప జయాల్నీ, వాళ్ళ భూత భవిష్యద్వర్తమానాల్నీ, అన్నిటినీ అనుభవ జ్ఞాన నేత్ర ద్వయంతో అవలోకన చేసి, ఆ విశ్వ దృశ్యం నుంచి ఈ తాత్పర్యం పిండాను" అంటారు శర్మగారు నాదేశం-నాప్రజలు గురించి ప్రస్తావిస్తూ!
వర్తమాన తెలుగు కవిత్వంలో ఇతిహాసం ఒక అచుంబిత మైన ప్రక్రియ. "ఇప్పుడు నేను ఈ ఇతిహాసం సమర్పిస్తున్నాను, దేంట్లో ఒక సామాన్య కర్షకుడు నాయకుడో ... కర్షకుడి జీవితంలో ఏం గాథ లుంటాయి ... ఈ ఇతిహాసంలో కథ కోసం చూడకూడదు... ఆధునిక యుగంలో పాశ్చాత్య దేశాల్లో కథా రూపం ఇతివృత్తం లేని ఇతిహాసాలే వస్తున్నాయి". ఈ పుస్తకం ద్వారా కవిత్వంలో విలువల్ని, వస్తు రూపాల్లాంటి కవితా సామాగ్రిని, కవి అలోచనలే నిర్దేశిస్తాయని, ఋజువు చేశారు శ్రీశర్మగారు.
శేషజ్యోత్స్న :
శ్రీశేషేంద్రశర్మగారు "వేదనా జీవితం నుండి ప్రేమోప జీవిగా మారిన తరుణంలో రచించిన రచన "శేషజ్యోత్స్న". ఇది ఇరువది కవితల ఖండ కావ్యం. దీనికి శేషేంద్రశర్మగారు రచించిన ఉపోద్ఘాతం "నేనూ - నా నెమిలీ లేక నెమిలీ - నా నేనూ" విశేషించి పేర్కొన దగినది. ప్రేమ కూడా ఒక తపస్సే! విరహావస్థలో కంటే, సాఫల్యంలో దాన్ని తపస్సుగా, దర్శనంగా, ఆత్మ సంస్కారంగా, అనుభవించుట గొప్ప సంస్కార వంతుల విశేషం. అట్టివారు అరుదుగా వున్నారు. సాధారణంగా ప్రేమ తపస్వులైన కవులు విరహులే! శేషజ్యోత్స్న కవితా ఖండికలలో ఎక్కడ చూచినా ప్రేమ సాఫల్యానుభూతి కవితా మధు స్రవంతిగా ప్రవహిస్తుంది! మచ్చుకు :
"ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నీవు" అన్నాయి - నా పెదవులు మృదువులైన అక్షరాలుగా మారిన
జన్మాంతర నిరీక్షా మధువుతో తడిసి - ... బహు జన్మల సమూహాలకు పూర్వం
నాలో నీవు, నీలో నేనూ ఉన్నాను కాబోలు ... (ఆమె రెండు కళ్ళు)
"నిన్నూహించి రెండు ముక్కలు చెపితే -అవే రెండు రెక్కలయి - ఊహ
విహాయసంలో కెగిరి పోతుంది -అదే ఒక గీతం అవుతుంది - ..." (ఏవో చినుకులు).
ఇందు లోని మిగతా కవితా ఖండికలు ముఖ్యంగా, పడవలూ-తెరచాపలూ, నూతన తీరాలు, నీవు, ఆరోజు, మనసే ఒక మధుమాసం, చీకటి దయ్యాలు, వెన్నెల వ్యధ, ఇత్యాదులు చదివి ఆనందింప తగినవి. ఈ కవితా సంకలనం 1972 లో ప్రచురిత మైనది. ఇది ఇంగ్లీషు, ఊర్దూ, హిందీ భాషల లోనికి అనువదించ బడినదంటే, దీని ప్రాముఖ్యత, ప్రభావం ఎలాంటివో ఊహించు కోవచ్చు!
రక్తరేఖ (నాడైరీ) :
ఈ పుస్తకం శేషేంద్రశర్మగారు తన స్వంత ఉపయోగం కోసం వ్రాసుకొన్న చిత్తు పుస్తకం (Writers Note Book). దాన్ని యథా తధంగా ప్రచురించటం జరిగింది. ఇందులో తత్వ విచారమూ, తెలుగు దేశంలో కవిత్వం పట్ల ప్రబలిన అపోహల ఖండనమూ ప్రథాన భాగాలు. కవిగా భావకుడుగా శేషేంద్రశర్మ లో జరిగిన పరివర్తన తెలుసు కొనుటకు "రక్తరేఖ" ఉపకరిస్తుంది. శేషేంద్రశర్మగారిలో ఏ మార్పు వచ్చినా - ఆయనకు చిన్న పిల్లల మీద, పక్షుల మీద ఉదయాస్తమయల మీద, ఉండే మోజు పెరుగుతుంది! "ఎందుకు వస్తున్నాయి ఈ చక్కని భావాలు నిశ్శబ్ద బంధురమైన నా మందిరము లోకి" అని తన్ను తానే ప్రశ్నించు కొంటాడు. "నీలాకాశంలో తెలి మబ్బులై పొండి, సాగరాల్లో నావల తెరచాపలై పొండి,దూర తీరాలకు తరలి పోయే పవనాలై పొండి, రేపటి గులాబీల తోటల్లో ఉషస్సులై పొండి!" అంటూ పాఠకుల పైకి తన భావాల్ని గుప్పిస్తారు శేషేంద్రశర్మ. ఆయన హృదయ పరిణతిని "రక్తరేఖ" కావ్యం వివరంగా చిత్రిస్తుంది. ఈ పుస్తకం 1974వ సంవత్సరంలో ప్రచురిత మైనది. సాహిత్యం గురించి, సమాజాన్ని గురించి ఎన్నో ఆలోచనాత్మక మైన విషయాలను పొందు పరచారు రచయిత ఈ పుస్తకంలో.
ఋతుఘోష :
శేషేంద్రశర్మగారి కవితా ప్రతిభను విశ్వనాథ మొదలు పుటపర్తి నారాయణాచార్యుల వరకు ప్రశంసించని వారు లేరు. శర్మగారి కవితలో శ్రీనాథ మహాకవి చందో బద్ధత, ముక్తచ్ఛంద రచనలో బాలగంగాధరతిలక్ తో సాదృశ్యము కని పిస్తుంది. భాషా సౌందర్య రహస్యం ఆధునికుల్లో శేషేంద్రశర్మకూ, తిలక్ కూ తెలిసి నంతగా మరెవరికి తెలియదని ఆర్.యస్.సుదర్శనం వంటి విమర్శకుల అభిప్రాయం. కొందరు విశేషజ్ఞులు ఋతుఘోషను శేషేంద్ర హృదయ వేదంగా అభివర్ణించారు. ఒక విధంగా ఆలోచిస్తే "ఋతుఘోష" పేరులోనే కనిపిస్తున్న "ఘోష" దీనికి అంతస్సూత్రం. ఒకానొక "ఆర్తి" దీనికి జీవనాడి! శరీరాన్ని "కారాగారంగా" భావించి ఎక్కడికో ఎగిరి పోవడానికి ఆకాంక్షించే తత్త్వం. అది అసాధ్యమైన నిర్వేదం దీనిలో కనిపిస్తాయి.
"ఆసల్ తీరునే దృష్టిచే, మహిత ఘాడాలింగ నాయుక్తిచే
నా సంయోగ నిరంత వేదనము లేయద్వైత సంసిద్ధికో
నైసర్గంబగు నేయగాధకుహరాంతకః, ప్రజ్వలానంద కీ
లానంతర్పణకో శరీర మొక కారాగారమై తోచగన్".
అంటూ ప్రగాఢ తాత్త్విక రేఖను ఆవిష్కరిస్తాడు. ప్రణయాన్ని "ఆనంద" భూమికకు ప్రచోదనం చేస్తాడు. శేషేంద్ర ప్రణయ తత్త్వం శరీరావధి కాదు, "ఆనందావధి". అంతేకాదు, "శరీర మొక కారాగారమై తోచగన్" అనే మాట అత్యంత కీలకంగా తోస్తుంది. కవి ప్రతి కవితా ఖండికలోనూ, ఎగిరి పోవాలనే ఆకాంక్షను ఏదో విధంగా వ్యక్తం చేస్తాడు! పక్షులూ, ఎగరడం, ఆకాశం - ఇవే తరచుగా శేషేంద్రశర్మగారి కవితలో మన కెదురయ్యే కవితా సామాగ్రి! ఋతుఘోష లోనిదే మరో పద్యం పరికించండి:
"ఎవడో చాకలి ఆకలిన్ మరచి తానే వన్యె మల్లీలతా
నివహక్రోడపుటీ తటాకముననో నిత్యాశ్రమా జీవన
వ్యవసాయం బొనరించు చున్న ధ్వనియే వ్యాపించే ప్రాపంచిక
వ్యవహార ప్రవిహీన విశ్వహృదయ వ్యాపార మేమో యనన్".
నిశ్శబ్ద మావహించిన మధ్యాహ్న వేళ చాకలి వాడు బట్టలుతికే ధ్వని "విశ్వ హృదయ వ్యాపార" మన్నట్లు వినిపించిందట! అంతర్ముఖుడైన ఋషి ధ్యాన నిష్ఠతో కూర్చున్నప్పుడు మనస్సు ఇంద్రియ వ్యాపారముల నుంచి నివర్తిత మయ్యే స్థితిలో వినిపించే హృదయ స్పందనాన్ని ధ్వనిస్తూ, ఋషికి విశ్వానికి ఏర్పడే తాదాత్మ్యాన్ని సూచించే తీరున సాగిన పై పద్యం "ఋతుఘోష" లో ఆణిముత్యం లాంటిది. కావ్యమంతా ఇటు వంటి ఆణిముత్యాల మాల! ఈ కావ్యం లోని మరో విశేషం కవి ఒక వంక ఋతువుల సౌందర్యాన్ని వివరిస్తూనే అది పేదలకు, దీన జనులకు అందడం లేదనే ఆవేదనను వ్యక్తం చేస్తాడు. పాఠకుల దృష్టిని అందం మీది నుండి లోక భోగ వ్యత్యాసం వైపు మళ్ళిస్తాడు! అదే శేషేంద్ర ప్రత్యేకత!
స్వర్ణహంస:
ఈ వ్యాస సంపుటి 1968వ సంవత్సరంలో వెలువడింది. ఇది సంస్కృతంలో హర్షభట్ట (శ్రీ హర్షుని) ని విరచిత మైన "నైషధ మహాకావ్యం" యొక్క విశ్లేషణాత్మక విమర్శ. సాహితీ లోకం హర్ష నైషధంను కావ్యముగా పరిగణించి పఠించు చున్నది. "హర్షుని కేవలము సారస్వతేయునిగా మాత్రమే లోకము తలచు చున్నది. అది పొరపాటు. హర్షుడపర శంకరుడు. శాంకర సాంప్రదాయము కాంతా సమ్మితముగా జెప్పుట కీ గ్రంథము వ్రాసెను" అంటారు శేషేంద్రశర్మగారు. ఇంకా "హర్షనైషధం లో హంస దానెవరో యెనిమిది వందల సంవత్సరముల నుండి చెప్పు చున్నప్పటికిని ఇంత వఱకు ఎవరును గుర్తింప లేదు".! ... నైషధము మంత్ర శాస్త్రము; నైషధము యోగశాస్త్రము; నైషధము వేదాంతశాస్త్రము". ఈ విషయమును శేషేంద్రశర్మగారు సమన్వయ పూర్వకముగా సమర్థించి ఈ విమర్శనా గ్రంథము (స్వర్ణహంస) లో చూపించారు (నిరూపించారు). శ్రీశర్మగారి విశ్లేషణ ప్రకారం నలుడు జీవాత్మ; భీముడు పరమాత్మ లేక నిర్గుణ బ్రహ్మము; దమయంతి శ్రీ మహాత్రిపురసుందరి. హర్షనైషధం లో మొదటి మూడు సర్గలలో గ్రమముగా అజప మంత్రాధి దేవతగా, జీవాత్మగా, పరమాత్మగా వర్ణింప బడినది. ఈ విషయం ఉపనిషత్తుల నుండి ఉదాహరణలు తీసుకొని సమర్థించారు శర్మగారు. ఈ సిద్ధాంతాన్ని పూర్వ పక్షం చేయుట సులభ కార్యం కాదు.
నైషధ వ్యాఖ్యాత, మల్లినాథసూరి గాని, నైషధాన్ని తెలుగు జేసిన శ్రీనాథ మహాకవి గాని, ఈ విషయములను విశద పరచలేదు. అదే విధంగా, నైషధము నందలి సరస్వతి నలుని కుపదేసించిన చింతామణి మంత్ర పరమగు "ఆవామావామార్థే" అను శ్లోకమునకు మల్లినాధుడు దేవతా, మంత్ర యంత్రాణాం త్రయాణామపి ప్రకృతత్వాత్" అని మూడర్థములను, ప్రకృతములని చెప్పగా, శ్రీశర్మగారు ఆ మూడర్థములే గాక బ్రహ్మ విద్యా రహస్య పరమగు నాల్గవ యర్థము కూడా కలదని, అది ప్రకృతము గాకున్నను బ్రకృత మైన మంత్ర శాస్త్రార్థము కన్న పరమ రమణీయ మైనదని పేర్కొన్నారు.
నైషధ కావ్యం ధ్వని కావ్యం. కాని, ఈ కావ్యం లోని ధ్వని గూఢ ధ్వని. హర్షభట్టు వ్యాస వాల్మీకాదుల వలె ఆధ్యాత్మిక యోగమంత్ర శాస్త్ర రహస్యములను ఆ కావ్యము నందు నిక్షేపించి అపార ప్రతిభ ప్రదర్శించారని శ్రీశర్మగారి వాదన. శ్రీ శేషేంద్రశర్మగారికి యోగమంత్ర శాస్త్ర ములందుగల అభినివేశము అపారం. ఆ శాస్త్రములలోని రహస్యములన్నియు వారికి కరతలామలకము. అందుచే సహేతుక మైన వారి వాదన ఖండింప జాలనిది. "స్వర్ణహంస" శర్మగారికి, తంత్ర, మంత్రయోగశాస్త్రాదులలో గల అపార జ్ఞానానికి నిదర్శనము.
పక్షులు:
పక్షులు అనే కవితా సంపుటి 1970వ సంవత్సరంలో ప్రకటిత మైనది. ఈ సంపుటికి వ్రాసిన మున్నుడిలో "కవిత్వ మంటే పద్యమే నని కొందరు, కాదు గేయమని కొందరు; కాదు వచన కవితేనని కొందరు ... కవిత్వమనే ఆ ఆనంద స్వరూపిణి ఏఒక్క రూపంలో మాత్రమే ఎందుకుంటుంది? ... అన్ని ప్రక్రియలు ఉండ వలసిందే ..." అంటారు శేషేంద్రగారు. "కవిత ధరించే బాహ్య వేషం చంధస్సు ... అంతరదృష్టితో పరిశీలిస్తే దాని నెట్లా చెప్పాలంటే - యుగయుగాల పొరల క్రింద అణగి నూతన వ్యక్తీ కరణ కోసం తహతహ లాడుతూవున్న, మానవాత్మ సాహిత్య బంధాలన్నీ ఛేదించుకొని సముజ్వల భావ లావాగా ప్రవహించింది. పశ్చిమ దేశాల్లో ఛందస్సు విగళితం కావడం కవితలో రూపానికి ప్రాధాన్యం నశించడానికి సంకేత మైతే, మన దేశంలో ఒక రూపాన్ని తోసేసి, మరొక రూపాన్ని స్వీకరించడం మాత్రమే అయింది. ...అందుచేత కవిత్వం ఎలా వ్రాయాలి అనే విషయం మీద గంతులు వేయడం కంటే, కవిత్వం ఎలా వుంటుంది అని వివేచన చేయడం లాభదాయకం" అంటారు శేషేంద్ర.
ఈ సంపుటం "చెరుకువిల్లు" అనే కవితతో ప్రారంభించారు శేషేంద్ర. భావకుడైన సహృదయుడు, ఈ కవితను చదివితే ఆనంద జీవన మధూళిలో స్నాతుడౌతాడు! చెరుకువిల్లు అనేది మన్మథ ప్రతీకమైన కవి సమయం. కాని, దీనిని శేషేంద్ర కవి మన్మథ ఆయుధంగా చిత్రించ లేదు. మనసులో చైతన్య జ్వాలగా మెదిలే కవితా మహేంద్ర చాపానికి ప్రతీకగా ప్రయుక్తం చేశాడు. గమనించండి.!
అక్షరాల ఇసుకతో కవిత కడతారామరి – తలపుల నెత్తావులు చిమ్మే మృదు హృదయ
సుమ ధూలి కావాలి; జీవన మధూళి తో తడపాలి - చెఱకువిల్లు విరిచిన వాడే చిగురు కైత చెపుతాడు
ఎదల పొరదిళ్ళ మీద మల్లెలు విరియిస్తాడు. . . .
జీవితంలో లేని కవితా కాగితంలో వస్తుందా - తునక మబ్బు లేకుండా చినుకు నేల బడుతుందా. . . .
సుందర భావ జగత్తు సృష్టించ లేని వాడు - ముసలి పదాలతో మురిపేలాడుతూ సరి పుచ్చుతాడు
ఊహకు రెక్క లున్న వాడు ఉదధులు దాటుతాడు - ఉత్తుంగ శిఖరాలకు ఎగురుతాడు. ...
వాడే, చైతన్యం - చరిత్రను సృష్టిస్తాడు - చరిత్ర భారాన్ని జ్ఞాన నేత్రాగ్ని జ్వాలా దగ్ధం చేస్తాడు.
ఇందులోని కవితలు మనోహర మైనవి. పద్య రచనలు చక్కగా నుండి, కవి నిష్టా తత్త్వాన్ని వేనోళ్ళు చాటుతున్నాయి. పద్యం, నిన్నటి కవితా వాహకం, నేటి తొందర జీవితానికి పద్యాలు మాత్రమే అనవద్య సాధనాలను కోవడానికి, ఈ యుగం అగీకరించదు. (ఆవంత్స సోమసుందర్).
షోడశి - రామాయణ రహస్యాలు:
షోడశి అనే పేరు "శ్రీ విద్య" కు సంబంధించినది. శ్రీవిద్య మహాతంత్రానికి సంబంధించిన గొప్ప విద్య. గ్రంథ మంతటి లోను మంత్ర విద్య, యోగములకు సంబంధించిన వివరములు చర్చించ బడినవి. ఈ పుస్తకానికి వ్రాసిన మున్నుడిలో విశ్వనాథ సత్యనారాయణ గారు చివరి అధ్యాయము లోని దేవి స్తోత్ర శ్లోకమును పేర్కొని, దానికి శర్మగారు వ్యాఖ్యానించిన విధానాన్ని ప్రశంసించి, వ్యాఖ్యానము లోని విశేషాలను గూర్చి విశదీకరించారు. "శివః" అన్న శబ్దమును పుంలింగముగా పేర్కొని, అయినప్పటికీ, విశేషణ విశేష్యములకు తత్ర తత్ర భిన్న లింగత్వము యొక్క కలిమిని తగినట్టుగా నిరూపించారు శ్రీశర్మగారని పేర్కొన్నారు. శర్మగారు అనుసరించిన పద్ధతిని "నిగమాగమ" సంప్రదాయమని చెప్పుట సమంజసమని అభిప్రాయ పడ్డారు. శివశక్తుల కబేధ ప్రతి పత్తి కనుక, మరియు శివుడు శక్తి యొక్క ప్రతి బింబము గనుక శివశక్తు లిద్దరు అన్యోన్య ప్రతి బింబములని వక్కాణించారు. గ్రంథ మంతట అనేక విషయములు నిక్షిప్తమై ఉన్న వనియు, శ్రీశేషేంద్రశర్మగారు చేసిన పరిశోధన, వారు దృఢ పరచిన విశేషాలు అత్యంత ఆశ్చర్య జనకము లనియు, శర్మగారి మేధా విశేషము మెచ్చుకొన దగినదని చెప్పారు.
షోడశి గ్రంథంలో ప్రధాన విషయములలో మొదటిది రామాయణం లోని "సుందరకాండకు" ఆ పేరు ఎందు వలన వచ్చిందన్న ప్రశ్న, దానికా పేరు వచ్చుటకు కారణం ఆ కాండంలో కుండలినీ విద్య ప్రతిపాదించ బడినదని చెప్పుట. రెండవది సుందరాకాండంలో త్రిజటా స్వప్న వివరాలు చర్చింప బడుట. త్రిజటా స్వప్న వివరణకు పూర్వం వానిని గురించిన రహస్యములను శేషేంద్రశర్మగారు ఎత్తి చూపి, ఋజువు చేసిన విధానము విజ్ఞుల అభిమానాన్ని ఆకట్టు కొన్నది. సుందరాకాండంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడి యున్నదన్న విషయం పండితులకు తెలియనిది కాదు. కాని ఎచ్చట నున్నదీ ఎవ్వరూ విశద పరచ లేదు. కాని, శేషేంద్రశర్మగారు ఈ విషయాన్ని సాపేక్షతా సహితంగా నిరూపించారు. ఐతే, సుందరాకాండం పేరు విషయం. అమ్మవారు సౌందర్య నిధి. నిధి కాదు ఆమెయే సౌందర్యము. శ్రీదీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల యొక్క యర్థము దేవి యందు పర్యవసించునట్లు సౌందర్య మనగా దేవి - అందుచేత ఈ కాండమునకు "సుందరకాండం" అని పేరు వచ్చిందని శేషేంద్రశర్మగారి ప్రతిపాదన.
మరోవిషయం:
రామాయణం భారతము కన్న ఆధునాతన మన్న వాద తిరస్కారము. దీనికై శర్మగారు అశేష కృషి సల్పారు. రామాయణము లోని కొన్ని శ్లోకాలను యథా తథంగా భగవాన్ వ్యాసులు మహాభారతం లో చొప్పించిన వివరాల విశ్లేషణ. ఇది మహాభారతము వాల్మీకి రామాయణానికి ప్రతిబింబ మనే సిద్ధాంతానికి బలమును చేకూరుస్తుంది. షోడశిని గూర్చి చివరి మాటగా "మొత్తము మీద ఒకటి నిస్సంశయముగా చెప్ప వచ్చును. వీరి పాండిత్యం చాలా లోతు గలది. వీరి శ్రీవిద్యా నేతృత సర్వం కష్టమని చెప్పుట కభ్యంతర ముండ కూడదు. భారత రామాయణములను కలిపి వీరు (శ్రీశేషేంద్రశర్మ) చదివి నట్లు చదివిన సంఖ్య ... భారత దేశమున ఒక రిద్దరుందురేమో?" అని అభిప్రాయ పడినారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు! అందుచే షోడశిని చదివి విజ్ఞులైన పాఠక మహాశయులు రామాయణ భారతాదులలో నిక్షిప్తమైన తంత్ర, మంత్ర యోగ సిద్ధాంతములను గూర్చి వివరాలను, విశేషాలను గ్రహిస్తారని ఆశిద్దాం. షోడశి తొలిసారి 1967వ సంవత్సరంలో ప్రచురిత మైనది. 16 శీర్షికల క్రింద వివరాలన్ని చర్చించబడినవి.
షోడశి, స్వర్ణహంస గ్రంథాలలో శ్రీశేషేంద్రశర్మగారు వివరించిన అంశాలు పరిశోధనాత్మక మైనవి. మంత్ర, తంత్ర శాస్త్రాలలో శర్మగారికి గల ప్రావిణ్యం విశద పరుస్తాయి. ఎక్కువ మందికి తెలియని విషయాలని చర్చించడం వలన ఈ రెండు పుస్తకాలకు మంచి పేరు వచ్చింది. వీటిని "శాస్త్రానుస్యూతవర" విమర్శగా పేర్కొన్నారు శ్రీ ఆచార్య సంపత్కుమారవర్యులు. వీనిని తెలుగు సాహిత్య విమర్శలో ప్రామాణిక విమర్శ గ్రంథాలుగా పేర్కొన వచ్చును.
విహ్వల:
శేషేంద్రశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం పద్య రచనలూ, విమర్శా యుక్తమైన వ్యాసాలే కాక మిగతా సాహిత్య ప్రక్రియలలో సహితం అందెవేసిన చేయి. చిన్న కథా ప్రక్రియా రచనలో ప్రయోగాలు చేశారు. ఆయన ప్రచురించిన కథా సంపుటి "విహ్వల" పాఠకుల ఆదరాభిమానాలు చూర గొన్నది. ఈ సంపుటిలో ఐదు కథలను సమకూర్చారు రచయిత. దీనిలో "రంగుల చేప" అనే కథానిక కథా శిల్పానికి చెప్పుకో దగిన ఒక విలక్షణ రచన. మానవీయతలో పాత్ర అంతరంగిక కల్లోలం, ఆ కల్లోలం మధ్య ఆర్థ్రంగా ఎగురుతున్న నీటి తుంపరలు -సమస్తమూ క్లుప్తతతో విరిసినై. సముద్రం మీదికి వెళ్ళి తిరిగి రాని తండ్రికై నిరీక్షిస్తూ నిలచిన జాలరి పసిబాలుని చిత్రణ హృదయ విదారకంగా ఉంది. మరువలేని, మరపు రాని సంఘటన అద్భుతంగా వర్ణిత మైనది. సంపుటి లోని మిగతా నాలుగు కథలూ ఆస్వాద నీయాలు, పఠితలను ఆలోచింప చేస్తాయి.
మబ్బుల్లో దర్బారు:
ఈ రచన శర్మగారి మరో రూపాన్ని (నాటక కర్తగా) ప్రదర్శిస్తుంది. వారి బహుముఖ ప్రజ్ఞకు మరో ఉదాహరణగా పరిగణింప దగినది. కొందరు ఏపని చేసినా శోభిస్తుంది. శేషేంద్రశర్మగారు పద్యం వ్రాస్తే, పాడితే "స్కాచ్" పుచ్చుకున్నంత (శర్మగారి అత్యంత ప్రీతి కరమైన చర్య) పరమానందం, జెట్ ఎక్కినంత సంబరం. ఈనాడు ప్రచలిత మౌతున్న అన్ని బ్రాండుల కవిత్వాన్ని ఆయన పద్య మంటాడు. అందుకేనేమో శేషేంద్ర కవితని "పద్యమా లేక ఫ్రెంచి మద్యమా" అన్నారు శ్రీశ్రీ.
ప్రస్తుత రచన "మబ్బుల్లో దర్బారు" ఒక ఊహ చిత్రం(ఫేంటసీ). దీనిని విప్లవ నాటికగా పేర్కొన్నారు రచయిత. చదివి ఆనందింప తగినది. పాఠక మహాజనులను బాగా ఆక ర్షిస్తుంది. దీనిని తొలిసారి 1968వ సంవత్సరంలో ప్రచురించారు.
మండే సూర్యుడు (కవితా సంపుటి):
మండే సూర్యుడు అనే శేషేంద్ర కవితా సంపుటి 1974 లో వెలువడింది.. శేషేంద్ర కవిగారు వాడిన - చెమట బిందువు, కండల కొండలు, పిడికిలి. ఆక్రోశిస్తున్న అడవులు, వ్రేలాడిన శిరసు, వంతెనలు, వంటి ప్రతీకలు పుంఖాను పుంఖాలుగా మన హృదయం పైన జలపాతంలా విరుచుక పడతాయి! ప్రతి పేజీలో విశ్వమంత రహస్యాన్ని ఇముడ్చుకొన్న పద చిత్రాలతో వెలితి లేని గీతికా భోగపదం అలరారు తుంది. ప్రతి శబ్ద దళమూ మనలను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. మండేసూర్యుడు సంపుటి లోని కవిత లన్నీ ప్రధానంగా అత్యాధునిక మైన Imagist symbolist సంవిధానలకు చెందినవి. నేడు అంతర్జాతీయంగా ప్రచలిత మౌతున్న కవితా ధోరణిని పుణికి పుచ్చు కొన్నవి.
ఇక ఈ సంపుటి శీర్షికను (పేరును) నిర్ణయించిన తొలి కవిత మండేసూర్యుడు. ఈ కవిత హైద్రాబాదు రేడియో కవి సమ్మేళనంలో మొదటి సారి ప్రసార మయింది. ఆ సమయంలో గొప్ప సంచలనం రేపింది. దీనినే ఆంధ్రప్రభ వారపత్రిక (13-11-1974) సంచిక "మనిషిని చెక్కిన శిల్పి" అనే శీర్షికతో ప్రచురించింది.
సూర్యుడు అనే ప్రతీక పూర్వం చాలామంది కవులు ప్రయుక్తం చేశారు. అయితే, మహత్తర శక్తి సంపన్నంగా ఈ కవితలో ప్రచలితం కావడం వల్ల ఈ ప్రతీక చాలామంది యువ కవులను ప్రభావితుల్ని చేసింది. ఇంతకీ ఈ మండేసూర్యుడు అనే కవిత లోని విశిష్టత ఏమిటి? పద చిత్ర బాహుళ్యముతో ధగధగ లాదుటయేనా? లేక, ప్రతీకవాద శిల్పంతో శిఖరాగ్రం అందుకొనడమేనా? మరేమైనానా? శేషేంద్రశర్మ చమటబిందువు స్వగతాన్ని ఇతివృత్తంగా ఎన్నుకొన్నాడు. ఆసాంతం స్వాత్మక ధోరణిలో చెమటబిందువు స్వగతంగా ఈ కవిత సాగుతుంది. అయితే ఈ చమటబిందువు ఎలాంటిది? "కండల కొండల్లో ఉదయించే లోకబంధువు"; అంటే లోకబాంధవుడు సూర్యుడని వేరే చెప్పనక్కర లేదు. సూర్యుడే లేకపోతే ఈ భూమిమీద జీవన సర్వస్వమంతా నిర్జీవ మవుతుంది. అంతేకాదు, శ్రమైక జీవనానికి సమస్త వస్తూత్పత్తికీ ఈ చెమట బిందువు ప్రతిష్ఠించ బడింది. దీని నుంచే సమస్త భాగ్య భోగ్యాలు రూపొందు తున్నవి. అయినా లోకం ఈ చమటబిందువుని ఖాతరు చేయుట లేదు. స్వేదశక్తి పరిగణన పొంద లేదు. శ్రమబిందువు శ్రమశక్తికీ, సృజనశక్తికీ ప్రతీక. కనుక, తాను సంఘీ భావంతో ఏ ఘనకార్య మైనా సాధించ గలదు. ఈ జగత్తు రూపు రేఖల్ని పూర్తిగా మార్చివేయ గలదు. ... ఒక ప్రతీకను నెలకొల్పి ప్రథమపురుషలో దాని పరంగా కవితను వెలార్చే ధ్యానంలో సాధారణంగా కవులకీ తమ ప్రతీకలకీ మధ్య పేచీలు వచ్చుట సహజమే. ... ప్రతీకను దురాక్రమించి ఆరోపితం కావడం వలన రసభంగం జరుగుతుంది.
"సూర్యుడు ఉదయించకపోతే - మండే నాగుండె చీల్చి దానిమీద పెడతా"
సూర్యుడు కాంతి హీనుడయితే ప్రజ్వలించే తన గుండెనే చీల్చి సూర్యుడి స్థానంలో నెల కొల్పుతా నంటుంది చేమటబిందువు!
"ఎఱ్ఱటి నా కండలతో ఎండలు కాయిస్తా" అన్న వ్యాక్యంతో ఈ కవిత పరాకాష్ఠ నందుకొంటుంది. ఈ ముగింపు వాక్యం తోనే మండేసూర్యుడు అనే కావ్య నామం సార్థక్యత పొందుతుంది.
ఇంతవరకూ "కేవలం పదాల పోహళింపు ద్వారా శబ్ద శక్తి పై ఆధార పడిన సౌందర్యానికి కవితా శిల్పం కాణాచిగా రూపొందింది. "మండేసూర్యుడు" కవితా సంపుటిలో ఈ లక్షణానికి మారుగా పదచిత్ర రచన ప్రాధాన్యం సంతరించు కొంది, ప్రతీకలు అతి ధారాళంగా నెలకొల్ప బడ్డాయి. నూతన సంవిధానం ద్వారా ప్రతి వాక్యమూ ఒక మనోహర భావ చిత్రంగా (Ideogram) రూపొందింది. ఒక సమగ్ర తేజశ్శక్తిని స్వాయత్తం చేసుకొంది. ఈ సంపుటి లోని ప్రతి కవితకు శేషేంద్ర శర్మగారు స్వయంగా ఆంగ్లానువాదాన్ని పొందు పరచారు. పుస్తకం చదువు తుంటే పాఠకునికి చెమట బిందువు స్వగతాన్ని కవి చెబుతు న్నాడన్నది సుబోధక మవుతుంది.
"నేను చమట బిందువుని - కండల కొండల్లో ఉదయించిన లోక బిందువుని"
ఈ కవిత పాఠకుల హృదయాల్లో యోచనా కిరణాలను ప్రసరిస్తుంది. కావ్యాన్ని పూర్తిగా చదివిన రసజ్ఞునికి మానసికంగా విచిత్రానుభూతిని కల్పిస్తుంది.
రాత్రి నేను కనే కలలు – దినాల మీద కట్టే వంతెనలు –
నా భాష తన నిండా బాధలు నింపు కొంది.
చీకట్ల లాస్యం - ఛేదించు కొని - చుక్కలు నా వాక్యాలై
సూర్యుడిలో కలసి పోతున్న - చిట్ట చివరి రాత్రి . . .
రోజూ ఉదయాద్రి శిఖరం మీద - రక్త కాంతులు చిందే గుండ్రని పాటని!
కవిసేన మేనిఫెస్టో:
శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారు విమర్శా ప్రస్థానంలో సాగించిన అతి ముఖ్య మజిలీ ఈ గ్రంథ రచన. తెలుగులో అభ్యుదయ సాహిత్య ఉద్యమం వచ్చి ఉండక పోతే ఇలాంటి విమర్శనా గ్రంథం వెలుగు చూడక పోవునేమో?! ఈ కవిసేన మేనిఫెస్టో చదివే వారికి శ్రీశేషేంద్రశర్మ పై పాశ్చాత్యుల ప్రతీక వాద ప్రభావం బలంగా కనిపిస్తుంది.
అరిస్టాటిల్, ప్లేటో ఇత్యాది గ్రీకు పండితుల యొక్క Poetics ని, లూనాషార్కే, ప్లెఖనోవ్, గోర్కి, మాయాకోవస్కీ వంటి మార్కిష్టుల కళా వివేచననీ, భామహ, అభినవ గుప్త, శారదా తనయాది భారతీయ మేధావుల అలంకార శాస్త్రము లోని విశేషాలను సమన్వయ పరుస్తూ రూపొందించారు కవిసేన మేనిఫెస్టోన్ని శ్రీశర్మగారు. ఇలాంటి తులనాత్మక చర్చ ఇంతకు పూర్వం తెలుగు విమర్శా గ్రంథాలలో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి పరి శోధన శ్రీశేషేంద్రశర్మ వంటి మహా పండితులకే సాధ్యం. "కేవలం సామాజిక చైతన్యం తో సాహిత్యం ఉత్పన్నం కాదు. సామాజిక చైతన్యాన్ని సాహిత్య చైతన్యం గా మార్చుకొనుట ఎంతో అవసరమని గట్టిగా చెబుతుంది "కవిసేన మేనిఫెస్టో" అలాంటి శక్తి లేని ఆకవిత్వాన్ని కవిత్వంగా పరిగణించుట నిరసిస్తుంది కవిసేనలోని వాదనా పటిమ. ఆకాలంలో అనుభూతి ఆప పదంగా, పెడ ధోరణిగా పరిగణించ బడింది. ఆ సమయంలో మేనిఫెస్టో అనుభూతి అనే భావనను పునః పరిశీలించింది. కవిత్వానికి అతి ముఖ్యమైన అంశం అనుభూతి అనీ, అనుభూతి అనేది మెదడు ద్వారా, తర్కం ద్వారా కాక, ఇంద్రియాల ద్వారా ఆర్జించు కొనిన జ్ఞానం అని నొక్కి వక్కాణించింది. అనుభూతి అనేది జీవితంలో పూర్తిగా మునిగితే గాని సిద్ధించే వస్తువు కాదని ఉద్ఘాటించింది. "సచేతనంగా. సబుద్ధికంగా, సంకల్ప సహితంగా జీవితాన్ని ఆచమనం చేయటమే అనుభూతి కళగా అభ్యసించడం అంటే" అని పేర్కొన్నది. అంతేగాక, పాండిత్యం పట్ల ఉన్న వ్యతిరేకతా భావాన్ని, వ్యుత్పన్నత పట్ల ఉన్న అలక్ష్య తత్త్వాన్ని ఖండిచింది. మరియు, "కవి అన్నవాడు పుడతాడు తప్ప తయారు కాడు " అన్న నానుడిని కవిసేన మేనిఫెస్టో ఆమోదించదు. కాని, వ్యుత్పన్నత అంటే బహు విషయ పరిజ్ఞానమని స్పష్టీకరించి, జడమైన జీవితాన్ని ఉజ్వలిత అనుభవాలుగా మార్చడానికి ఆపరిజ్ఞానం అత్యంత అవసరమని వివరించింది. వ్యుత్పన్నత వలన అనుభవం సంపన్నమూ, గాఢమూ అవుతుందని చెప్పింది మేనిఫెస్టో.
మరో విశేష మేమిటంటే రొమంటిక్ ఆత్మాశ్రయ కవిత్వం అనే పదాలు నిందా వచనాలుగా భావించే వారికి ఆ పదాల అంతరార్థాన్ని వివరించి పరాశ్రయాన్ని, ఆత్మాశ్రయము చేసుకొనుట వలనే కవిత్వం పుడుతుందని చెప్పారు. Feelings అనేవి ఆత్మాశ్రయాలే నని, అవి లేనిదే కవిత్వం జనించుట కష్ట తరమని వెల్లడించారు. ఈ విషయంలో మార్క్సిష్టు సాహిత్య కారుడైన గోర్కీని ఉల్లేఖించారు.
ప్రాచీన అలంకారికులు చెప్పిన హృదయ సంవాదం, ప్రీతి మొదలగు శబ్దాలు కవిలో వస్తువు కలిగించే ఉద్వేదన, తత్ఫలితమైన నిర్మగ్నత (Reaction and involvement) లను ప్రతిపాదిస్తున్నాయి. కమిట్మెంట్ అనేది పైపై ప్రకటనలకు, నినాదాలకు అతీత మైనదని శేషేంద్రగారి అభిమతము. అంతేకాక, అనుభూతీ, కావ్య ప్రయోజనమూ, ప్రతిబద్ధతా ఐక్యం కావాలంటారు శేషేంద్ర.
కవిసేన మేనిఫెస్టో తో పోల్చ దగిన రచనలు తెలుగు లో అరుదుగానే కనిపిస్తాయి. అట్టివానిలో శ్రీ కట్టమంచి వారి కవిత్వ తత్వ విచారం, రాచమల్లు వారి సారస్వత వివేచనా పేర్కొన దగినవని విజ్ఞుల అభిప్రాయం. పైన పేర్కొన్న మూడు రచనల లోనూ ఆవేశం, అభిక్షేపం, శైలిలో వాడీ వేడినీ గమనించ వచ్చును. పైన ఉదహరించిన రెండు పుస్తకాలలో విస్తృత కొటేషన్లు మాత్రం కనిపించవు. అలాగే శేషేంద్ర శర్మగారి రచన ఏ సృజనాత్మక రచనను కేంద్ర బిందువుగా వాడుకొన లేదు.
అలాగే, తెలుగు సాహిత్యంలో కొత్తగా వచ్చిన అనుభూతి వాదానికి కవిసేన మేనిఫెస్టో ఒక విధమైన శాస్త్రీయ పునాది కల్పించిందంటే, ఏమాత్రం అతిశయోక్తి కానేరదు. ఈ సందర్భములో కవిసేన మేనిఫెస్టోను గురించి ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు వ్యక్త పరచిన అభిప్రాయాలను విజ్ఞులందరూ గమనించాలి.
కాలరేఖ:
ఈ పుస్తకం ఈ శతాబ్ది చింతన తులనాత్మక సాహిత్య వ్యాస సంపుటి. ఇందు శేషేంద్రశర్మగారు రచించిన దాదాపు 24 వ్యాసాలు పొందు పరచ బడ్డాయి. వీనిలో సంస్కృత సాహిత్య సంబంధమైన విమర్శ వ్యాసాలు ఎక్కువ. మహర్షి వాల్మీకిని, వ్యాసుణ్ణి, మయూరుణ్ణి, కాళిదాసుని గురించిన వ్యాసాలున్నవి. వాటిలో శేషేంద్రశర్మగారు అత్యంత నిపుణతతో వారి కవితా హృదయాలను చిత్రించారు. కథా కావ్యాల మీద, నాటకాల మీద తన వ్యతిరేకతను వ్యక్త పరుస్తూ, కాళిదాసుని మేఘదూతం రసయుగాన్ని అంతం చేసిందని, లక్షణకారుడు భామహుడు ఆ ప్రభావం వల్లనే అలంకార యుగాన్ని ప్రారంభించారని శేషేంద్రశర్మగారు అభిప్రాయ పడ్డారు. ఈ వ్యాస సంపుటిలోనే సావిత్రి అనే వ్యాసం, సూర్యశతకం పై విశ్లేషణ పరిశీలింప దగినవి. ఇందు పొందు పరచిన మిగతా వ్యాసాలు సహితం అత్యంత ప్రశంసనీయ మైనవి. కాలరేఖ అనే వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు 1994వ సంవత్సరపు జాతీయ పురస్కారానికి ఎంపికచేశారు. శేషేంద్రశర్మగారికి కవిగా కాక, విమర్శకునిగా ఈ పురస్కార ప్రదానం పండిత లోకాన్ని సంతోషంతో నిపింది. కాలరేఖ లోని విశేషాలు పాఠకుల ముందుంచడమే ఈ వ్యాసం యొక్క ప్రధానోద్దేశ్యం. ఈ వ్యాసాన్ని చదివిన పిమ్మట కాలరేఖను విజ్ఞులైన పాఠకులు తప్పక చదువుతారని ఆశిద్దాం.
కాలరేఖ లోని విశేషాలు:
ఇదివరలో పేర్కొనిన విధంగా కాలరేఖ (The Arc of Time) విమర్శనా సాహిత్యంలో ఉల్లేఖనీయమైన రచన. ఇందులోని మొదటి తొమ్మిది వ్యాసాలు శ్రీశేషేంద్రశర్మ సాహిత్య విమర్శనా ప్రతిభను, వారి కవితాశక్తిని ప్రశంసిస్తూ ఇతర రచయితలు వ్రాసినవి. వీనిలో శ్రీశర్మగారి జీవిత విశేషాలను ముఖ్యంగా వారి సాహితీ ప్రస్థానం స్థూలంగా, చర్చించ బడినది. ఇది వారి స్వీయ వ్యాసాలను చదివి అవగాహన చేసుకొనుటలో పాఠకులకు ఉపకరిస్తుంది. కాలరేఖ సంపుటిలో తొలి వ్యాసం "వాల్మీకి కవిత . ఈ వ్యాసాన్ని క్రింది కవితతో మొదలెడతారు శర్మగారు.
"నదులు కవులు భూగోళపు రక్త నాళాలు - నదులు ప్రవహిస్తాయి కవితల్లా
పసువుల కోసం పక్షుల కోసం మనుష్యుల కోసం - నదులు కంటున్న కలలు పొలాలో ఫలిస్తాయి
కవులు కంటున్న కలలు మనుష్యులలో ఫలిస్తాయి" (ఆధునిక మహాభారతము).
"మనమందరం ఈ దేశంలో కవుల కలలం. కవులకు మూల పురుషుడు వాల్మీకి. ఆయన కావ్యం రామాయణం నుంచి వ్యాసుడి భారతం పుట్టింది! రామాయణ భారతాదుల నుండి భాస కాళిదాసులు పుట్టారు. ఇది ఈదేశపు కవుల వంశ వృక్షం. ఆ వృక్ష ఛాయల్లో మనం పుట్టి పెరిగి మన పరమార్థం చేరుకుంటున్నాము".
సాధారణంగా ఉపమలకు కాళిదాసును పేర్కొంటున్నారు. కాని, "వాల్మీకి పెదవి కదిపితే చాలు చిలుక కొరికితే దానిమ్మ గింజలు రాలినట్లు రాలుతాయి ఉపమలు" అంటారు శర్మగారు. ఈ విషయాన్ని అనేక ఉదాహరణలతో అత్యంత మనోహరంగా ప్రదర్శిస్తారు పాఠకులకు. "రాముడు జలాల్లోకి దిగి ఆచమనం చేశాడు. జరిగింది ఇంత మాత్రమే. కాని వాల్మీకి యొక్క వర్ణమయ దృష్టికి ఈ సాధారణ విషయంలో ఎన్నో రమణీయతలు కనిపిస్తాయి. ... "ఉపా స్పృశత్ సుశీతేన జలేనోత్పల గంధినా" వట్టి ఆచమనం కాదు, కలువ పూల వాసనలు గుబాళించే శీతల మైన జలాలతో ఆచమనం చేశాడు అంటాడు వాల్మీకి. ... ఆ వర్ణనకు రాముడి ఆచమనం మాట అటుంచి మన నోరు లాలాజల మయం అవుతుంది!
వాల్మీకి ప్రతిభను వర్ణిస్తూ "పిపీలికాది బ్రహ్మపర్యంతమైన సృష్టిలో వాల్మీకి జ్ఞాన నేత్ర పరిధిలో రానిది ఏదీ లేదు. గుడిసె తెలుసు, మహలు తెలుసు, మద్య మాంస మహిళామయ ప్రపంచమంతా తెలుసు. ... ఋషిత్వం తెలుసు వేట తెలుసు, పాట తెలుసు, ఇది తెలుసు ఇది తెలియదు అని చెప్పడానికి వీలు లేదు. జ్ఞానం చేత ఆశ్చర్యం కలిగించే సర్వజ్ఞుడు! వాల్మీకి సౌందర్య సింధువు" అంటారు శేషేంద్రశర్మ. ...
చంద్రోదయాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి, "ప్రజగామ సభశ్చంద్రః" (సుందరాకాండ) చంద్రుడు ఆకాశంలో ప్రవేశించాడు. అంతిటితో ఆపడు ... అదికోట్లాది కళ్ళకు కనిపించే సాధారణ దృశ్యం ... వాల్మీకికి మాత్రమే మరొకటి కనిపిస్తుంది - నీలి జలాల్లోకి హంస ప్రవేశించడం ... కవికంటికి మాత్రమే కనిపించే రెండో దృశ్యం పరోక్షం. అది మన ఎదుట లేదు. ... వాల్మీకి మాటలన్నీ ఇలాంటి మాణిక్యాలే. ఆయన నోరు కదిపితే అలంకారాలు ప్రతీకలు బింబాలు . . . చివరకు ఆ మూర్ఛావహమైన చాంద్రీ మయ నిశా శిల్పిని చంద్రుడ్ని చూచి ఋషి చేతులు జోడించి "రరాజ చంద్రో భగవాన్ శశాంకః" అంటాడు.
"రావణుడు అపహరించి లంకకు తెచ్చిన సీత రామ వియోగం సహించ లేక . . . ప్రాణత్యాగం చేద్దామనే నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో హనుమ అశోకవన ప్రవేశం . . . సీతకు ఎడమ కన్ను అదిరింది . . . "ప్రాస్పంద తైకం నయనం సుకేశ్యాః మీనా హతం పద్మ మివాభి తామ్రం". వాల్మీకి టెక్నిక్ సర్వత్రా ఒక్కటే! - సీత ఎడమ కన్ను అదిరింది, ఎలా - పూచిన తామర కొలనులో ఈదుతున్న చేప తోక తగిలి కదిలిన తామర పువ్వులా కదిలింది! కాని ఆయన పంక్తి పొడవు ఒక్క అంగుళమే, కాని దాని గర్భంలో ఉన్న చిత్రాన్ని - మన శబ్దజాలంలో చెప్పాలంటే ఇన్ని మాటలు తెచ్చు కోవాలి." ఈ విధంగా వాల్మీకి ప్రతిభను, ఉపమలను విశ్లేషిస్తూ వ్యాసాన్ని ముగిస్తారు శర్మగారు. వాల్మీకి ఘనత అద్దం లోని హిమాలయంగా మన ముందుంచారు ఈ వ్యాసం ద్వారా రచయిత!
కాలరేఖ లోని రెండో వ్యాసం కాళిదాసుని మేఘసందేశమును గురించినది. శ్రీశేషేంద్రశర్మగారి దృష్టిలో మేఘసందేశం ఒక కావ్యం కాదు! కుమారావస్థలో దానిని చదువుకున్న వాళ్ళకు అది జీవితాంతం వెంటాడే ఒక బలీయ స్మృతి! "ఏది వృద్ధుల్నీ, ప్రౌఢుల్నీ, కుమారుల్నీ బాలుర్నీ చేసి వయః ప్రవాహాన్ని వెనక్కి మళ్ళిస్తుందో, ఏది మృత్యుబోధ వైపు ప్రవహించే మనిషికి ఆనకట్ట కడుతుందో, ఆ ఆశ్చర్య జనక మైన కావ్యం మేఘసందేశం".
వాల్మీకి రామాయణంలో ఎక్కడో అరణ్యంలో ప్రచ్ఛన్నంగా పడి ఉన్న విప్రలంబ శృంగార లక్షణ యుక్తము, కరుణ రస బిందు స్పందమానము అయిన శ్లోకం -
"ఇతి వైశ్రవణో రాజా రంభాసక్తం పురానఘ! - అనుపస్థీయ మానోమాం సంకుద్ధ్రో వ్యాజహారహ"
అనేదాన్ని తీసుకొని మేఘసందేశం వ్రాశాడు మహాకవి కాళిదాసు.
పై శ్లోకమే -: "కశ్చిత్కాంతా విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తః \ శాపేనా స్తంగమిత మహిమా వర్ష భోగ్యేణ భర్తుః
యక్షశ్చక్రే జనక తనయా స్నాన పుణ్యోద కేషు \ స్నిగ్ధ చ్ఛాయా తరుషు వసతిం రామగిర్నాశ్రమేషు"
శ్లోకంగా రూపమెత్తింది. "కాళిదాసులో ఈ దేశపు మట్టి వాసన ఘ్రాణేంద్రియాల్ని దేశవాసుల్నిగా పిలుస్తుంది! కాళిదాసు పితృపితామహమైన సారస్వతీయ సామ్రాజ్యానికి చక్రవర్తి! వ్యాసుడిలో వాల్మీకి కనిపించడు, వ్యాసుడి అంగాంగాన వాల్మీకి తేజస్సు మండలీకరిస్తున్నప్పటికీ. కాళిదాసులో మాత్రం పంక్తి పంక్తిలో కనిపిస్తుంది! కాళిదాసు శరీరంలో ప్రవహించే వాల్మీకి అంతర్లీనత . . . భారతీయ కావ్య సామ్రాజ్యంలో వాల్మీకి, వ్యాస, కాళిదాసులు సగర, దిలీప, రాఘవుల వంటి ఆదిమ చక్రవర్తులు" అంటారు శేషేంద్రశర్మగారు.
కాలరేఖలోని మరో ముఖ్య వ్యాసం "అరవింద సావిత్రి". వాల్మీకి వ్యాసులు దృశ్య వస్తువైన మానవుడి భౌతిక జీవయాత్రను గురించి కావ్యాలు రచిస్తే, అరవిందుడు ప్రధానంగా మానవుడి మరణాంతర జీవనాన్ని గూర్చి, అంటే, మానవుడి అభౌతిక జీవయాత్రను గురించి కావ్య నిర్మాణం చేశాడు. అంటే, అరవిందుల ఇతివృత్తం అదృశ్య వస్తు ప్రధానం. ఒక విషయం మనం గమనించాలి. వ్యాస వాల్మీకుల్లో అధ్యాత్మిక సంబంధమైన మిధకీయ సృష్టి కొంత ఉన్నప్పటికీ దానికంటే వారిలో ప్రధానం మానవుడు భూగోళం మీద చేసిన జీవయాత్ర. సావిత్రి వ్యాసుడి మహాభారతంలో ఉపాఖ్యానం, ఆఖ్యానం కాదు. కాని అరవిందుడు దానిని ఆఖ్యానంగా వికసింప జేశాడు. అందువలన అరవిందుని కావ్య సృష్టి అదృశ్య వస్తువుని దృశ్యమానం చేయడం అనే విచిత్ర ప్రక్రియ! ఒక విధంగా చెప్పాలంటే, వాల్మీకి, వ్యాసుల సరరన కూర్చో బెట్టగలిగిన మహావ్యక్తి అరవిందులు. అందుచేత మన దేశంలో రామాయణ, మహాభారత ఇతిహాస మహాగ్రంథాల తర్వాత మూడవ ఐతిహాసిక కావ్యం సావిత్రి, అంటారు శేషేంద్రగారు.
సావిత్రి లాంటి ప్రాచీన కథల్లో ముఖ్యమైనది స్వర్గ నరకాన్ని గురించి చేయబడిన మానవీయ ఊహ! మానవుడు ఇహలోకం లో చేసే దుష్కర్మలు ఫలరహితంగా ఉంటాయని మనిషి ఒప్పుకోలేని దశ చేరినప్పుడు జన్మించిన ఒక ప్రతీకాత్మక తత్వచింతన ఇది. 20వ శతాబ్దంలో ఇంత మహత్తర ఆధ్యాత్మిక కావ్యం మరొకటి లేకపోవడం చేత, అరవిందుని సావిత్రి కావ్యం అత్యంత విశిష్ట గ్రoథంగా పరిగణింప బడుతుంది. శేషేంద్రశర్మగారి దృష్టిలో సావిత్రి ఒక భాషకు సంబంధించినది కాదు - మూలం ఇంగ్లీషులో ఉన్నప్పటికీ, అన్ని భాషలలోకి పోయి అది ప్రజల కావ్యంగా పరిగణించ బడవచ్చును. "అరవిందులు యోగి కావడం చేత ఈ కావ్యం కావ్యతలో పరాకాష్ట పొందింది. అయోగులు, అర్థ యోగులు అయిన లౌకిక కవులు ఈ మూర్ఛా మహామాయను ఉత్పాదన చేయలేరు. సృజనాత్మక శిఖరాలైన వాల్మీకి, వ్యాస, హోమర్, వర్జిల్, దాంతే . . . మహానుభావుల్ని కావ్యమర్మ దృష్టికి గురి చేస్తే తెలుస్తుంది, వాళ్ళందరూ యోగులు, లేక భక్తులు అని. యోగి కాని కవి వాస్తవంగా లేనేలేడు".
వ్యాసుడెవరు?
"సముద్రంలో కలిసిపోయిన వాడ్నయినా పట్టుకోవచ్చు గాని కాలంలో కలిసిపోయిన వాడ్ని పట్టుకోవటం మహాకష్టం. వాల్మీకి, వ్యాసులు అలాంటి వారు" అంటారు శ్రీశేషేంద్ర వ్యాసుడు అనే వ్యాసంలో. వ్యాసుడెవరు అన్న ప్రశ్నకు జవాబు అంత సులభం కాదు. ఎందుకంటే, ఏ వ్యాసుడు అన్న ప్రశ్న కూడా దానితోనే ఉత్పన్న మౌతుంది. జయం వ్రాసిన వ్యాసుడా? భారతం వ్రాసిన వ్యాసుడా? వేదవిభజన చేసిన వ్యాసుడా? బ్రహ్మ సూత్రాలు వ్రాసిన వ్యాసుడా? పురాణాలు వ్రాసిన వ్యాసుడా? పతంజలి యోగసూత్రాలకు భాష్యం వ్రాసిన వ్యాసుడా? బృహస్పతి, నారదా, కాత్యాయనాది స్మృతికర్తల్లో ఒకడై స్మృతి వ్రాసిన వ్యాసుడా?
మహాభారత, బ్రహ్మసూత్ర, అష్టాదశ పురాణాలు వ్రాసిన వ్యాసుడు ఒక్కడే అని సంప్రదాయం. ఈ విషయమే వివాద గ్రస్థం. అయినప్పటికీ వ్యాసుడు ఒక్కడే అన్న విశ్వాసం దేశంలో బలంగానే వున్నది. వ్యాసుడు భారతీయ సాహిత్యానికి చేసిన ప్రధానం ఏమిటని మరొ ప్రశ్న. ఈ ప్రశ్నకు కూడా జవాబు క్లిష్టతర మైనదే! కవిగా, కావ్య నిర్మాతగా మహాకవి వాల్మీకిని మించిన వారు బహుశా లేరనే ఎక్కువ మంది కావ్య మీమాంసకుల అభిప్రాయము. అయితే, వాల్మీకిని అడుగడుగునా అనుసరించిన ప్రథమ కవి వ్యాసుడేనని శర్మగారి అభిప్రాయం. దీనికి ఆధారంగా మహాభారతాన్నే ఉల్లేఖిస్తారు శేషేంద్రగారు.
ఈ వ్యాసంలో అనేక విషయాలను (చాలా వరకు వ్యాస సంబంధిత మైనవి) విస్తృతంగా చర్చించారు శేషేంద్రశర్మగారు. వ్యాసుడ్ని గురించి అనేక రకాల ఆలోచనలు వెదజల్లారు. కచ్చిత మైన నిష్కర్ష తెలియ పరచ లేదు. వ్యాసుడు వ్యక్తియా? వ్యవస్థా పరంపరా అనే సంశయాన్ని అలాగే వదిలేశారు. ముగింపుగా "పురాణాల విషయం వచ్చేసరికి ప్రపంచం అంతా చర్చా పరిధి లోకి వస్తుంది. కనుక వేదాల పూర్వం నుంచి సర్వత్రా, వ్యాపించి ఉన్న పురాణాలను క్రోడీకరించి అక్షరబద్దం చేసి అష్టాదశ పురాణాలుగా విభజించి మనదేశానికి అనుగ్రహించిన ఆ వ్యాస మహర్షి ఎవరో ఆ వ్యాస సాంప్రదాయానికి నా నమస్కారము" అంటారు శేషేంద్రశర్మగారు! వివాద గ్రస్థమైన విషయానికి గల అనేక పార్శాలను చూపెట్టారు శర్మగారు పాఠకులకు ఈ వ్యాసం ద్వారా.
తులనాత్మక సాహిత్యము :
కాలరేఖ వ్యాస సంపుటిలోని ప్రముఖ వ్యాసాలలో పేర్కొనదగినది తులనాత్మక సాహిత్యమనే వ్యాసం. తులనాత్మక సాహిత్యమంటే కంపారెటివ్ లిటరేచర్ (comparative literature) అంటే ఒకటి కంటే ఎక్కువ భాషల సాహిత్యాన్ని కలిపి పోలుస్తూ పరిశీలించే సాహిత్య విమర్శ ప్రక్రియ. తులనాత్మక సాహిత్యానికి స్వతంత్ర రచనలే సామాగ్రి. ఆ రచనలు సహజ జాతములై ఉండాలి. అప్పుడే అవి తులనాత్మక సాహిత్యానికి లాభదాయక మౌతాయి. తులనాత్మక సాహిత్యంలో ప్రధానతః సిద్ధమయ్యే సత్య మేమిటంటే మనుష్యులు ఈ భూగోళంపై ఎక్కడ ఉన్నాసరే వాళ్ళ భావాత్మక సంఘటనలు సుఖ దుఃఖాలు సామాజిక స్థితి గతులు, చరిత్ర, ఇతిహాస పురాణావళీ ఇత్యాది మానవీయతా జన్య జీవన చిత్రాలు సందర్భాలు ఎన్ని భేదాలున్నప్పటికీ సాధారణతః సమానంగా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రీకు, సంస్కృత, ఫ్రెంచి, ఆంగ్ల సాహిత్యాల నుండి అనేక ఉదాహరణ లిస్తూ దృఢ పరచారు శేషేంద్రశర్మగారు.
అన్య భాషా సాహిత్యాధ్యాయనం చేత మన భాషలో సాహిత్యకారుల స్థాయి ఏమిటో మనకు తెలుస్తుంది. మన అల్పిష్టి కవిని చూచి వీడే మహానుభావుడనే మూర్ఖత్వానికి లొంగే ఆవశ్యకత ఉండదు. అంతేకాదు, విజ్ఞులకు తెలుస్తుందితెలుస్తుంది ఏ ఒక్క భాషసాహిత్యమూ సమగ్రం కాదని. ఆ ప్రజల సాంప్రదాయ, సంస్కృతి, చరిత్ర, అనుభూతి ఇత్యాదుల్లో ప్రవేశించే వైకల్యాల మూలంగా అసమగ్రత సంభవించుట సహజం. ఒక్కో భాషలో, ఒక్కో సాహిత్య ప్రక్రియ ఉజ్వలంగా ఉంటుంది. జీవనానుభూతులు సహితం ఒక్కో సాహిత్యంలో ఒక్కో విధంగా సంపూర్ణతను పొందుతాయి. ఈ విషయంలో తులనాత్మక సాహిత్య వేత్త హెన్రీ జిప్ఫర్డ్ ఏమంటారో గమనించండి “Is any one literature enough to the end of providing in itself a true education? We are bound to admit that some parts of European experience hardly entered into English literature. Certain kinds of writing were better alone elsewhere”. కనుక, బహు భాషా సాహిత్యాల అధ్యాయనం ఆధునిక మానవుడికి అనివార్య కర్తవ్యం అంటారు శేషేంద్రశర్మ.
తులనాత్మక సాహిత్యం పాశ్చాత్యదేశాల్లో పరిశీలన శాస్త్ర రూపంలో ఇటీవలనే ప్రారంభ మయింది. కాని భారత దేశంలో తులనాత్మక సాహిత్యం ప్రాచీన కావ్య శాస్త్రంలో ఒక భాగంగా ఉండేదని అందులోను ప్రధమ భాగంగా పరిగణించ బడేదనీ, దండి, వామన, రాజశేఖరాదుల గ్రంథాలు చదివితే తెలుస్తుందంటారు శ్రీశర్మగారు. దీనికి కారణం సంస్కృత సాహిత్యమే ఒకే ఒక భాషకు సంబంధించిన సాహిత్యం కాదు. మన దేశంలో ఉన్న అనేక భాషల మిశ్రమ ప్రయోగం జరిగిన ఒక విచిత్ర సాహిత్యం సంస్కృత సాహిత్యం అంటారు శర్మగారు. అంతేకాదు, దండి ప్రథమ పరిచ్ఛేదంలో, మాగధ్యాది ఏడు పాకృత భాషలు అపభ్రంశ, పైశాచిక భాషలు అన్నింటినీ కలిపి, సర్గబంధ ఆఖ్యాయిక కథ నాటకాదుల కావ్య విభజన చేసిన తరువాత అంటాడు "తదేత ద్వాఙ్మయం భూయః సంస్కృతం ప్రాకృతం తథా! అపభ్రంశ మిశ్రం చేత్యాహురా ర్యాశ్చతుర్విధం ". అని కనక, సంస్కృత సాహిత్యం అనగా దేశంలో ఉన్న అన్నిభాషల మిశ్రమ సాహిత్యం అని ఆనాటి భావన! ఈ విధంగా నానా భాషా సాహిత్య సమైక్య దృష్టి ఈ దేశంలో మూలతంగా ఉండటం చేతనే అన్ని భాషల సాహిత్యాల అన్యోన్య పరిశీలన సహజంగానే సంభవించింది" అంటారు శేషేంద్రశర్మ.
మనదేశపు ఒకనాటి వలస రాజ్య స్థితి మూలంగా మనకు సంక్రమించిన సాహిత్య సంస్కృతిచేత మనం ఆంగ్ల భాష గవాక్షం ద్వారా ఆధునిక సాహిత్యాన్ని మూలంగా చూడటంలో ఒక సౌలభ్యం ఉంది. అది ఇలాంటి సందర్భాలలో లాభదాయకం. ప్రపంచ భాషల్లోని (గణనీయమైన) సాహిత్యం ఆంగ్ల భాషలోనికి అనువదించ బడుతుంది కనుక ఆంగ్ల విద్య మనకు లాభసాటి.
మరొక ముఖ్య విషయ మేమిటనగా, ఆధునిక ప్రపంచానికి తులనాత్మక సాహిత్యం అనివార్యం. హింసా పీడితమైన వర్తమాన ప్రపంచానికి తులనాత్మక సాహిత్యం ఒక విధమైన మతం. ఆధునిక మానవుడు అన్ని మతాలు విడిచి, ఈ సాహిత్య మతాన్ని స్వీకరించి ప్రజల్లో విశ్వవిద్యాలయాల్లో ప్రచారం చేయాలి. ఒక విధమైన నూతన అంతర్జాతీయ సాహిత్య చైతన్యాన్ని ఉత్పన్నం చేయాలి అని అంటారు శేషేంద్రశర్మ. అంతేకాదు, నానా భాషల్లో ఖైదీలుగా పడివున్న సాహిత్యాల్ని ఆభాషా జైళ్ళు బద్దలు కొట్టి విడుదల చేయ్యాలి. దానికి ముఖ్యమార్గం అనువాదం, అని వక్కాణిస్తారు శర్మగారు. ఈ ప్రక్రియ ఐరోపాలో భారీ ఏత్తున జరుగుతున్న విషయమని విశద పరచారు శేషేంద్రగారు. ఐరోపా ఒక ఐక్య బౌద్ధిక సమితిగా మారుటకు అదే ముఖ్య కారణమంటారు వారు. నేషనల్ బుక్ ట్రష్టు వంటి సంస్థలు ఈ విషయంలొ ఉల్లేఖనీయమైన సేవ చేయు చున్నారని శర్మ గారి నమ్మకం. అనువాద ప్రక్రియమీద ఈనాడు ఇండియాలో ఉన్న అపనమ్మకం అత్యంత గర్హనీయ మంటారు శేషేంద్రగారు.
సాహిత్యం ఎక్కడ ఉన్నా అది మనదే! సాహిత్యము ఏకము, అవిభాజ్యము. కళ విశ్వజనీనము, సృజనాత్మక కళ అయిన సాహిత్యం ఏభాషలో కైనా ప్రవేశించ గలదు. ఆ భాష ప్రజల సంపదగా ప్రతిష్ఠ కాగలదని గట్టిగా వాదిస్తారు శేషేంద్ర్శర్మగారు ఈ వ్యాసం ద్వారా! అలాగే ప్రాచీన గ్రీకు, భారతీయ నాటకాల తులనాత్మక పరిశీలన వివరాలను విశ్లేషించారు శర్మగారు మరో వ్యాసంలో. పాఠకులందరు చదువదగిన వ్యాసం ఇది.
కాలరేఖ సంపుటిలో సంకలితమైన మరో ముఖ్య రచన ఇద్దరు ఋషులు ఒక కవి అన్న వ్యాసం. ఇందు ఉల్లేఖించ బడిన ఇద్దరు ఋషులు - ఒకరు వాల్మీకి మహర్షి, రెండవ వారు వ్యాస భగవానులు. రామాయణంలో కనిపించే భారతీయ సంస్కృతిని విస్తృత పరుస్తూ వ్యాస మహర్షి వాల్మీకి అడుగు జాడల్లో పయనిస్తూ, కావ్య తంత్రాన్ని, కావ్య వస్తువును, నిర్మాణ సామాగ్రిని, భాషను తన కావ్య సృజనా ప్రక్రియకు వాడుకొన్నారు అనే భావన వ్యక్త పరచారు శ్రీశర్మగారు. అదే విధంగా వ్యాస మహర్షిని అనుసరించాడు మహాకవి కాళిదాసు. ఈ విషయాన్ని సృష్టీకరించారు వారు. వాల్మీకి వ్యాస మహర్షులు దేశానికి వారసత్వంగా యిచ్చి పోయిన సాహిత్య సంస్కృతికి కాళిదాసు చివరి కాపలాదారు, అంటారు శేషేంద్రశర్మగారు. కాళిదాసు తదనంతరం, ప్రవాహమాన భాషగా ఉన్న సంస్కృతం జడత్వం పొందుట, ఆ భాషలో కృత్రిమత్వం, నిరర్థకత, పాండిత్య ప్రకర్ష ప్రవేశించడం కారణాన, సంస్కృత సాహిత్య వాహిని ఒక పిల్ల కాలువగా మారి, చివరకు బిందు బిందువుగా కారే బలహీన ధారగా మిగిలి పోయింది. అని ఆందోళన వ్యక్త పరుస్తారు శర్మగారు. ఉత్తర రామచరితము, మృచ్ఛకటికము, కర్పూర మంజరి, లాoటి కాళిదాసానంతర కాలపు కృతులను నిర్లక్ష్యం చేయలేము కాని, ఆ కాలపు దోషాలు ఆ కావ్యాలలో లేవని చెప్పలేము. ఒక విధంగా చెప్పాలంటే, కాళిదాసు తర్వాత మరి అలాంటి కవులు జన్మించ లేదంటే, అది అతిశయోక్తి మాత్రం కాదు. కాళిదాసుపై ప్రసిద్ధ వ్యక్తులు చాలామంది కృషి చేసి, అనేక విశేషాలు వెల్లడించారు. అయినప్పటికీ వారి దృష్టి కందని విశేషాలు వెల్లడించారు శేషేంద్రశర్మగారు.
ముఖ్య విశేషాలు :
శేషేంద్రశర్మగారి ఉద్దేశ్యంలో కాళిదాసు మూలస్థానాలు ప్రత్యక్షం కాకపోతే, కాళిదాసీయ కళ, దాని పాత్ర ఔచిత్యం అర్థం కాదు. అలాంటి సమగ్ర అవగాహన ఒక క్లిష్ట సాహస యాత్ర! అది నిర్వహించడానికి వాల్మీకి పాత్రను సరైన దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి.
వాల్మీకి ఇతిహాసం స్వయం కల్పిత బాధ్యతల మూలంగా అంతకు ముందు కాలం లో లేని అభివ్యక్తులని సృష్టించి దానితో శ్రోతలని ఆశ్చర్య పూర్వక ఆహ్లాదంతో ముంచి వేసింది. ప్రకృతి, నదీ నదాల వర్ణనలు, అభివ్యక్తులు అందరి కవుల చేత ఆయా సందర్భాలలో వాడుకో బడ్డాయి.
వ్యాస మహర్షి కథన కళా విధానంలో వాల్మీకిని అనుసరించారు. వాల్మీకిని అనుసరించిన మొట్ట మొదటి కవి వ్యాసుడే! తరువాతనే కాళిదాసు ఆయన అడుగుజాడల్ని అనుసరించి వాల్మీకి వారసత్వాన్ని నిష్ఠతొ నిర్వహించాడు. వాల్మీకి ఉపదేశించిన ముఖ్యమైన మానవ విలువలలో రాజు, ఋషి మూలతః సమానులు అనేది, ఒకటి. అంటే, ప్రభుత్వానికి బుద్ధి జీవులకు మధ్య ఉండవలసిన సంబంధం. ఈ మానవీయ విలువల్ని వ్యాసుడు, కాళిదాసు సందర్భం వచ్చి నప్పుడల్లా సమగ్రంగా పాటించారు. ఉదాహరణకి రామాయణంలో రాజు ఋషి ముందు వినమ్రుడుగా ఉంటాడు. ఋషి కూడా రాజుకు తన కంటే ఉన్నత స్థానమిస్తాడు. ఈ విషయాన్ని దృధ పరచడానికి శేషేంద్రశర్మగారు రామాయణం నుండి అనేక సందర్భాలు సూచిస్తారు. అలాగే వ్యాసుడిని గురించి కూడా అనేక సందర్భాలు వివరిస్తారు. అదే విధంగా కాళిదాసు విషయంలో అనేక ఉదాహరణలు పొందు పరచారు శర్మగారు. కాళిదాస కృతి మేఘదూతం భారతీయ సాహిత్యంలో ఒక బ్రహ్మాండ మైన మలుపుగా అభివర్ణించారు వారు. మేఘదూతం మూలంగా భారతీయ సాహిత్యంలో ఒక గొప్ప యుగ కర్తృక సంఘటన జరిగింది అంటారు శేషేంద్ర గారు. ఈ వ్యాసం ద్వారా భారతీయ కావ్యశాస్త్రం మీద మేఘదూతం చూపిన ప్రభావాన్ని విశదీకరించ ప్రయత్నించారు శర్మగారు. ఈ విషయమై మర్మజ్ఞులైన కావ్య వేత్తలు పరిశీలిస్తారని ఆశిద్దాం!
శేషేంద్రశర్మగారు కాలరేఖ వ్యాస సంపుటిలో పొందు పరచిన వ్యాసము లన్నియు వివరింప దగినవే! దేనికది నూతన ఆలోచనలు పాఠకునిలో ప్రేరేపిస్తుంది. సరికొత్త వ్యాఖ్యా విధానాన్ని సృజిస్తుంది. ఉదాహరణకు "శాకుంతల నాందీ శ్లోకము దేవీస్తోత్రమే" అన్న దాన్ని గురించిన వ్యాఖ్యను పరిశీలిద్దాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన "అభిజ్ఞాన శాకుంతలమున గల నాందీ శ్లోకమును ఇంత వరకు కేవలము ఈశ్వర స్తోత్రముగానే భావించు చున్నారు. దానిలో మంత్ర శాస్త్రార్థ ప్రతీతి గలదన్న సత్యాన్ని శేషేంద్రగారు వెలికి తెచ్చారు.
యా సృష్టి స్స్రష్టురాద్యా, వహతి విధిహుతం యా హవిర్యా చహోత్రీ,
యే ద్వే కాలం విధత్తః శ్రుతి విషయాగణా యా స్థితా వ్యాప్య విశ్వం,
యా మాహుః సర్వభూతప్రకృతి రితి, యయా ప్రాణినః ప్రాణవంతః,
ప్రత్యాక్షాభిః ప్రపన్నస్తనుభి రవతు వ స్తా భి రష్టాభి రీశః.
ఈ శ్లోకానికి మామూలుగా చెప్పబడుతున్న అర్థం - అష్ట తనువుల చేత ప్రసన్నుడై ఈశుడు మిమ్ములను రక్షించుగాక. శాకుంతల శ్లోకము ఒక కవియొక్క సాధారణమగు ఒక ఊహపై గాక శాస్త్ర సిద్ధాంతము పై నాధార పడియున్నది. అది తెలిసినచో ఈ శ్లోక మేట్లుద్భవించినదో తెలియ గలదు. 1) పంచ భూతాద్యష్టతన్వాకమగు సృష్టి, సమాహారమున శక్తియే అనియును, 2) శక్తి శివుని తనువనియును, 3) శివ శక్తులు అభిన్నములు లింగ రహితములనియును, 4) అట్టి శక్తి అభేదము చేత అష్టమూర్తి మత్వాది సర్వ శివ లక్షణములు కలిగి యున్నదనియును నిగమాగములు సిద్ధాంతము చేసినవి.
నిగమాగములకు పరమార్థమైయున్న ఈశాస్త్ర విషయమునే మన శ్లోకము చెప్పుచున్నది. అందును ప్రథమాంశమైన శక్తి యొక్క సర్వకర్త్రిత్వమును ప్రతిపాదించుటయే దేవీ ఉపాసకుడగు కాళిదాసుని యొక్క ఆశయము. అందుచేత ఈ విషయము జగత్ప్రసిద్ధమగు నాటకముయొక్క నాందీ శ్లోకమునకు వస్తువుగా గైకొనెను. ఈ శ్లోకములో శాస్త్రవేత్తయగు మహాకవి కాళిదాసు మూడు విషయాలను ప్రతిపాదించాడు: 1) పరాశక్తి సర్వకర్త్రి : అందుచేత శ్లోకమంతయు శక్తి పరముగా అన్వయమగును. అప్పుడు ఆది పూర్వక విశేషము లన్నియు శాస్త్రోక్త వివిధ శక్తి లక్షణములను ధ్వనింప జేయును. ఈశః శబ్దము ప్రతిబింబ మాత్ర తత్వము చేత శక్తినే ప్రతిపాదించు నట్టి శాస్త్రము ఇందు నిక్షిప్త మైనది. 2) పరాశక్తి శివుని తనువు అని : ఈ పక్షమున యాదిపూర్వవిశేషణములు అష్టమూర్తులను వ్యష్టిగా ప్రతిపాదించి, ఆది సర్వనామముల చేతను తను శబ్దము చేతను సమిష్టిగా శక్తిని ధ్వనింపజేసి అట్టి శక్తి చేత ప్రసన్నుడైన శివుడు అని అన్వయము నిచ్చును. అనగా అట్టి తనువు లేనిచో శివుడు కార్య సమర్థుడు గాడనియు, 3) శివశక్తులు అభిన్నములనియును, కనుక అష్టమూర్తి యగు శివుడు మిమ్ములను రక్షించుగాక అను సామాన్యార్థమునకు అన్వయమగును.
ఇలాంటి శ్లోకమున శబ్దములు యాదృచ్ఛికముగా ఆశుకవిత్వమల్లే దొర్లినవికావు. భావము ఏదో ఒక "మానుషానంద" దృష్టితో గైకొన్నదికాదు, భావము బ్రహ్మానంద బంధురము, భాషాశ్రౌత లక్షణసంపన్నము. దీనిని మహాకవి కాళిదాసు పరమార్థ స్పృహతో శబ్ద సామాగ్రిని, భావప్రపాదానా పద్ధతిని, భాషా మర్యాదను శాస్త్ర సాంప్రదాయం నుండి గైకొని ఈ విధంగా రూపొందించాడు.
సంస్కృత సాహిత్యంలో అత్యంత ఖ్యాతి నార్జించిన పుస్తకం మయూరిని సూర్యశతకము. ఈ పుస్తకము అనేకమంది విద్వాంసుల దృష్టి నాకర్షించింది. సూర్యశతకానికి వ్యాఖ్యానాలు హెచ్చు సంఖ్యలోనే ఉన్నాయి. ఈ శతకానికి తెలుగు సేతలు దాదాపు ఎనిమిది వరకు ఉన్నాయి. వానిలో మహాకవి శ్రీ దాసుశ్రీరాములుగారి అనువాదం ప్రసిద్ధి గాంచింది. కవి సౌర్వభౌమ శ్రీనాధమహాకవి, జగన్నాధపండితరాయల వంటి వారిని యెంతో ఆకర్షించిన గ్రంథం సూర్యశతకము. దీనిలో కొన్ని పద్యాలు పింగళిలక్ష్మీకాంతం వంటి విద్వాంసులు తెలుగు చేశారు. ఈ పుస్తకం శేషేంద్రశర్మ లాంటి విద్వత్త్కవులను ఆకర్షించుటలో ఆశ్ఛర్య మేమిలేదు! "వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అనే గనుల్నుంచి త్రవ్వితీసిన మణులతో చెక్కిన మహత్తర శిల్పం సూర్యశతకం" అంటారు శేషేంద్రశర్మగారు. సూర్యశతకములోని విశేషాలను కొన్ని ఎత్తిచూపించారు పాఠకులకు. "సూర్యశతకము - ఒక అధ్యయనము" అను వ్యాసం ద్వారా. ఈ శతకంలో అక్కడక్కడా దర్శనమిచ్చే కాళిదాసమహాకవి ప్రభావాన్ని మనకు ఎత్తి చూపారు శేషేంద్రగారు.
విప్లవ కవిత్వము - సాహిత్య విమర్శ అనే వ్యాసంలో వ్యక్త పరచిన అభిప్రాయాల లోని సారాంశాన్ని పాఠకులీ విధంగా గ్రహింప వచ్చు. సాహిత్య విమర్శ కేవలం సాహిత్యాన్ని గురించి మాత్రమే కాని సాహిత్య కర్తను గూర్చి కాదు. విమర్శించే కావ్యంలో విమర్శకుడు మూడు విషయాలు పరిశీలించాలి. అవి : భాషా, అలంకారము, వస్తువు. వస్తువు అంటే కవి చెప్పదలచినది. కవి చెప్పే విషయ మేదైతే ఉందో, దేన్ని వస్తువంటున్నామో అదే అలంకారంగా మారుతుంది. దీనినే కావ్య మర్మ మంటారు. వస్తువు కావ్యానికి రంగు నిస్తుంది. విప్లవాత్మక వస్తువు తీసుకుంటే విప్లవ కావ్యం రూపొందుతుంది. కవికి కావ్యానికి చెందిన విశేషణాల్ని తగిలించడం శాస్త్రీయం కాదు. విప్లవ కవిత్వం వ్రాయటానికి షరతులు పాలించాల్సిన అవసరం లెదు. కవిత్వ మనేది రెండు విధాలుగా ఉత్పన్న మౌతుంది - స్వానుభూతిచేత, సహానుభూతిచేత. ఒక్కోసారి సహానుభూతే, అనుభూతి కంటే తీవ్రంగా సిద్ధిస్తుంది. నిత్య జీవనంలో అన్యాయం మీద చేసే తిరుగుబాట్లే అసలు విప్లవం! అన్యాయాన్ని, అసమానతను ఎదుర్కొనే చైతన్యం వలన పుట్టిన కవితయే నిజ మైన విప్లవ కవిత్వం. సాహిత్య విమర్శకుడి పాత్ర స్వప్రయోజనా పేక్ష విసర్జించి విప్లవ కావ్యాన్ని నిర్ధ్వంద్వంగా ప్రోత్సహించడం. సాహిత్య విలువలమీదా, సాహిత్య సూత్రాలమీద ఆధార పడి విమర్శ వ్రాయాలంటారు శేషేంద్రశర్మ.
గ్రీకు, భారతీయ నాటకాలలోని సామ్య వైషమ్యాలని తెలిపే వ్యాసం, గజల్ కవిత్వాన్ని గురించిన విశ్లేషణాత్మక వ్యాసాలు శెషేంద్రశర్మగారి పాండిత్య విస్తృతికి నిదర్శనలుగా పేర్కొన వచ్చును. తెలుగు కవుల గూర్చి వారు వ్యక్త పరచిన విశేషాలు పాఠకులు తెలుసుకొన దగినవి. తెలుగు కవులలో తిరుపతి వెంకటకవులు, గురజాడ అప్పారావు, పానుగంటి లక్ష్మీనరసింహారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహారావు, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, రాయప్రోలు సుబ్బారావు గార్లను గురించి విశ్లేషణాత్మక వ్యాసాలు వ్రాశారు.
ఈ వ్యాసాల్లో గమనించదగ్గ విశేషమేమిటంటే రాయప్రోలు సుబ్బారావుగారు తప్పక, మిగిలిన కవులు తమతమ నాటకముల ద్వారా, ఉద్యోగ విజయాల ద్వారా తిరుపతి వెంకటకవులు, పాదుకా పట్టాభిషేకం, గయోపాఖ్యానాల ద్వారా పానుగంటి, చిలకమర్తి వారు, అనేక నాటకాల ద్వారా ధర్మవరం రామకృష్ణాచార్యులు, కన్యాశుల్కం ద్వారా గురజాడ అప్పారావు గారు, ఆంధ్రదేశ మంతటా మారుమూల గ్రామాలలో సహితం పేరు ప్రఖ్యాతులు గడించారు. తిరుపతి వేంకటకవులు తమ అష్టావధాన, శతావధానముల ద్వారా రాజస్థానములలో సహితం అత్యంత ప్రఖ్యాతి గడించారు. వారిని గూర్చి " సాహిత్య రాజసూయంచేసిన దుర్ధర్ష ప్రతిభా దురంధరులు . . . వారి అపూర్వ కవితా శక్తి ముందు ఎవరూ నిలవలేక పోయారు. వారి పాండవ ఉద్యోగ విజయాల్లోని పద్యాలు ఒకటి రెండన్నా కంఠతా రాని తెలుగు వాడు లేడంటే అది అతిశయోక్తి కాదు" అంటారు శర్మగారు.
రాయప్రోలు సుబ్బారావుగారు కవిత్వంలో ఒక నూతన పద్ధతిని ప్రవేశ పెట్టారు. దానినే ఆ రోజుల్లో భావ కవిత్వంగా పేర్కొన్నారు. శేషేంద్రశర్మగారి దృష్టిలో రాయప్రోలు వారి కవిత్వంలో కీలకం వ్రక్రోక్తి. వాచ్యార్థం ఏక్కడా కనిపించదు. రాయప్రోలు వక్రోక్తి ఆత్మ కళ. ఒక కృత్రిమ కల్పన కాదు. "అమృతాం ఆత్మనః కళాం" అన్న భవభూతి మాటకు రాయప్రోలువారు రక్తమాంసాకృతి. రాయప్రోలు కవిత్వాన్ని గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే - ఆయన పద్యాలే మంత్రాలుగా జపించుకొంటూ వాటి మద్య మాధురిలో మునిగిపోయి, మళ్ళీ పునర్జన్మ లేనట్లుగా మనిషి తరించి పోవచ్చు" అంటారు శ్రీ శేషేంద్ర .
ముగింపు :
శ్రీశేషేంద్రశర్మగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ వ్యాసంలో చర్చించిన విషయాలన్నీ ఆ విషయన్ని దృఢ పరుస్తాయి. శర్మగారి ప్రతిభా విశేషాలు చర్చించేటప్పుడు మనం వారిని గూర్చిన కొన్ని అంశాలను విశేషంగా పేర్కొనక తప్పదు. శేషేంద్రశర్మగారికి సంస్కృత భాషా సాహిత్యలలో గల పాండిత్యం అసాధారణం. ముఖ్యంగా వారు మంత్ర తంత్ర శాస్త్రాలలో ఆర్జించిన జ్ఞానం అనితర సాధ్యమంటే, అది సత్య విదూరము కాదు. సమకాలీన ప్రపంచ సాహిత్య రీతులను గూర్చి శర్మగారి అవగాహన అత్యంత విస్తృత మైనది. తెలుగు భాషా సాహిత్యాల పైనేగాక శర్మగారు ఆంగ్లభాషా సాహిత్యాదులలో, హిందీ - ఉర్దూ భాషా సాహిత్యాలలో ఆర్జించిన జ్ఞానం శ్లాఘనీయం. శర్మగారి కవిత్వ తత్వం పేర్కొన దగినది. కవిత్వానికి వస్తు స్వరూపాన్ని బట్టి రూపం, రూపాన్ని అనుసరించి స్వభావం ఉంటుందని వారి నమ్మకం. అదే కవిత్వమని శేషేంద్ర ప్రకటించారు. అయితే శర్మగారు మనిషి తత్వాన్ని కవిత్వతత్వంగా మలచిన మహాకవి. దేశ పౌరుని ఆత్మ కథే ఆదేశ చరిత్ర అవుతుందని నిరూపించడానికే వారు ఆధునిక మహాభారతం వ్రాశారు. శర్మగారు శబ్దశక్తి తెలిసిన అలంకారికుడు. అందుకే "నేను శబ్దాల అణువులతో పద్యాలు చేస్తా, ఇసుక రేణువులతో చేసిన గ్లాసుల్లా మధుర ధ్వనులు పలికిస్తా" నంటారు శేషేంద్ర. రచనలో రస నిష్పన్నతలొ ప్రగతిని సాధించారు. శబ్దసౌందర్యముతోపాటు వాగార్థాలకు సన్వయాన్ని సాధించారు. శబ్దశక్తిని పూర్తిగా గ్రహించిన వారగుటచే శర్మగారు కవితా ప్రక్రియ లన్నిటినీ పద్యాలుగానే పేర్కొన్నారు. శేషేంద్రశర్మగారిలో మనం ఒక విధమైన దార్శనికత్వం పసికట్ట వచ్చు. ఆయనకు Modernity మీద ఒక గొప్ప విజన్ ఉంది. ఆయన రచించిన ఆధునిక మహాభారతం ఈ విషయాన్ని రూఢి చేస్తుంది. ఉపదేశాల వలన, ప్రబోధాల వల్ల సాహిత్యానికి ఎలాంటి మేలు జరుగదు అని ఆయన గట్టి నమ్మకం. అందుకే శర్మగారు నూతన కవితా ప్రక్రియా ప్రయోగానికి పూను కొన్నారు. వచన కవితా వాహికని ఉపయోగించి కావ్యాన్ని సృజించారు. ఆధునిక మహాభారత మనే కావ్యేతిహాసం మనలని మరోశకం ముందుకు నడిపించింది.
వారి రచనలు - స్వర్ణహంస, సాహిత్య కౌముది, షోడశి, కవిసేన మేనిఫెస్టో, కాలరేఖ విమర్శా సాహిత్యంలో కొత్త పంథాలను సృజించాయి. శేషేంద్రశర్మగారి సాహిత్య మీమాంస శక్తిని, పాండిత్య లోతుపాతులను పుటపర్తి నారాయణాచార్య, విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఉద్దండులతో పాటు ఆంవత్స సోమసుందర్ లాంటి ఆధునికులు ప్రశంసించారు. శేషేంద్రశర్మగారిని 21వ శతాబ్దిలోని గొప్ప సాహిత్య వేత్తగా చిత్రించుట సమంజసమని ఈ వ్యాస రచయిత అభిప్రాయము. ఈ వివరణాత్మక వ్యాసం తయారు చేయుటలో శర్మగారి రచనలే కాక, అనేకమంది ఇతర రచయితల రచనలు చదువుటయేగాక, ఆయా రచయితల భావ సంపదను స్వేచ్ఛగా ఉపయోగించు కొన్నాను. దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు పరిశోధక విద్యార్థి
dasarismsrao
Sunday, October 14, 2018
----------- హనుమంతుడు ఒక శ్రీవిద్యోపాసకుడిగా........ .... - వాడ్రేవు చినవీరభద్రుడు ------------- MARCH 2, 2024BY VADREVU CH VEERABHADRUDU సమాశ్వాస సౌందర్య గాథ
మొన్న ఒక రోజు కూచుని మొత్తం సుందరకాండ మరోసారి చదివేను. మనశ్శాంతికోరుకునేవారు, తాము తలపెట్టిన పనుల్లో విజయం సిద్ధించాలనుకునేవాళ్ళూ, తమ మనసుని నిర్మలం చేసుకోవాలనుకునేవాళ్ళూ, తమ ఆత్మని ఒక ఔన్నత్యం వైపుగా తీసుకుపోవాలనుకునేవాళ్ళూ, సుందరకాండ పారాయణం చెయ్యడం ఈ దేశంలో తరతరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. 68 సర్గల ఆ కాండ దానికదే ఒక కావ్యంగా, పవిత్రగ్రంథంగా, రామాయణసారంగా పరిగణనకు నోచుకుంది. మహాభారతం నుంచి విడివడి భగవద్గీత ఎలా ఒక ఆధ్యాత్మిక, యోగవిద్యాగ్రంథంగా గుర్తింపు పొందిందో, సుందరకాండ కూడా రామాయణంతో సమానంగా గౌరవం పొందిందని నేను కొత్తగా చెప్పనక్కర్లేదు.
కాని ఆ కాండ చదివిన ప్రతి ఒక్క పాఠకుడికీ ఒకే రకమైన అనుభూతి సిద్ధిస్తుందని చెప్పలేం. గుంటూరు శేషేంద్ర శర్మకి ఆ కాండ మొత్తం శ్రీవిద్యాసారంగా కనిపించింది. సీతమ్మవారు శ్రీవిద్యగానూ, హనుమంతుడు ఒక శ్రీవిద్యోపాసకుడిగానూ ఆయనకు కనబడ్డారు. తనకి కలిగిన దర్శనాన్ని ఆయన ‘షోడశి,రామాయణ రహస్యాలు’ అనే పుస్తకంగా రాసారు కూడా. ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ సుందరకాండను శేషేంద్ర చదివినపద్ధతి చూసి నిలువెల్లా చకితుడైపోయాడు కూడా. షోడశిలో గొప్ప విషయమేమిటంటే, శేషేంద్ర తన దర్శనం మొత్తాన్ని వాల్మీకి శ్లోకాల ఆధారంగానే వివరించడం. ఎక్కడా ఒక్క మాట, ఒక్క భావన శేషేంద్ర అదనంగా చెప్తున్నట్టు ఉండదు. చూడబోతే షోడశి చదివాకనే వాల్మీకి సుందరకాండ రాసాడా అనిపిస్తుంది మనకి!
--------------- వందేమాతరం
--------
వందేమాతరం
శకలాం వికలాం బహుకుల సంకులాం
శోకం వ్యాకులాం మాతరం
భూరి నిరాశా నామక యామినీం
జీర్ణద్రుమ జీవిత శోభినీం
విలాపినీ విచార ప్రాపిణీమ్
భయదామ్ జ్వరదామ్ మాతరం
అభ్రంకష నిష్ఫల నినాద సనాధకరాళే
పీడిత జన బాష్ప ధారా విహార మరాళే
విభ్రాజిత్ ప్రాభవ దుర్మద జనాళే
దుర్భర దారిద్రానలకాతరాం మాతరం
- శేషేంద్ర
-------
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com
-------
నవ దార్శనిక మహాకవి
శేషేంద్ర
శేషేంద్ర దార్శనిక దృష్టిని మరొక కోణం నుండి కూడా చూడాల్సి ఉంది. ఎట్టి త్యాగాలు చేసి సంపాదించిన ఎంతటి మహత్తర శుభపరిణామమైనా శాశ్వతంగా నిలువదు. అది ఎలాగో క్రమక్రమంగా క్షీణిస్తుంది. మళ్ళీ త్యాగాలు చేసి మరొక సత్‌పరిణామాన్ని సాధించుకోవలసిందే.
నిర్మల హృదయ లతాంతమే నిఖిల కళాలతల పరమ ప్రయోజనం. కవితా కళ పరమ ప్రయోజనం నిర్మల హృదయాన్ని ఘటించటం. నిర్మల హృదయమంటే ప్రధానంగా సహానుభూతి హృదయం, సమతా వాంఛా హృదయం, పరపీడకులకు ప్రగాఢ క్రోధ హృదయం. ఏ కాలపు సత్కవిలోనైనా ఈ మూడు ప్రధాన విషయాలు గోచరిస్తయ్. కిరాతుడు క్రౌంచపక్షిని వధించినప్పుడు అది చూచిన వాల్మీకిలో క్రౌంచపక్షి యెడల సహానుభూతీ, కిరాతుని యెడల క్రోధమూ పెల్లుబికి శ్లోకరూపం ధరించాయ్. పక్షివధను చూచి తల్లడిల్లే సత్కవి కవితలో ప్రవహింపక ఏం చేస్తాడు!
అధర్మాన్నెదిరించటానికి, బహుజన హిత బహుజన సుఖాలు ఘటించటానికి విభన్న యుగాలలో విభిన్న మార్గాలు అనుసరణీయాలైతయ్. అప్పటి భౌతిక విజ్ఞాన మనో విజ్ఞాన పరిధుల అవగాహన ననుసరించి అప్పటి మార్గం ఏర్పడుతుంది. యుగావశ్యక మార్గాన్ని ఎత్తిచూపే మహాకవి ‘దార్శనిక మహాకవి’ ఔతాడు.
నేటి పీడిత ప్రపంచ మానవులకు తరణోపాయం ‘మార్క్సిజమ్’ (మార్క్సీయ దర్శనశాస్త్రం) అనేది గణనీయ సంఖ్యాక మేధావులు అంగీకరించిన విషయం.
వీరిలో ‘శేషేంద్ర’ (గుంటూరు శేషేంద్రశర్మ) హిమధరోన్నతుడు. మహాకవి శేషేంద్ర అత్యంత కవితామయంగా, ప్రతిభావంతంగా, ధ్వనియుతంగా మార్క్సిస్ట్ దృక్పథంతో వ్రాశాడు.
‘కులగోత్రమ్ములు లేవు మాకు, ధనిక క్రూరక్రియా పీడిత
జ్వలిత ప్రాణిచమూసమూహ మొకటే సత్యంబు, ఉహాభుజా
ర్గళముల్ విప్పిన విశ్వమూర్తియయి శంఖారవముం జేయుడో
దళితశ్రామిక జీవులారా! భువనద్వారంబు ఖేదిల్లగన్’
‘ప్రపంచ కార్మికులారా! ఏకం కండి!’ అనేదాన్ని ఇంత కవితామయం చేసిన రచన మరొకటి లేదు.
‘నా గీతి నిశ్శబ్దాల కుట్ర
అశ్రువుల తిరుగుబాటు
అవమానితుల భాషాసమితి,
ఒకనాడు నా ఛాతిలో ఉన్న కోళ్ళన్నీ అరుస్తాయి,
విప్తవాలన్నీ ఉదయిస్తాయి–’
‘మరణించే లోపుగా తన మాట చెప్పలేని
నిస్సహాయ మానవుడి గొంతు పేరే కవి’
కవి పీడిత జన పక్షపాతి అనీ, విప్తవ సూర్యోదయానికి ఉదయసంధ్యా పూర్వదశ అనీ అంటున్నాడు శేషేంద్ర.
‘ఎన్నాళ్ళో పెంచి పోగుచేసిన వాళ్ళు
ఎండల తలపాగాలతో వెళ్ళి పోతుంటే
మిలియన్ల గొంతులెత్తి ఏడుస్తున్నవి
ధాన్యపు రాసులు’
పీడననూ దోపిడినీ వర్ణిస్తున్నాడు శేషేంద్ర.
‘... వ్యథితానేక మనుష్య బాష్పజలముల్ వారాశిౖయె పొంగుచో
నుదయించున్ సముదగ్ర విప్తవము తానుచ్చైశ్రవంబో యనన్’
క్షీరాబ్ధి మథనవేళ ‘ఉచ్చైశ్రవం’ అనే అశ్వం ఉద్భవించినట్లు పీడితజన దుఃఖాశ్రు సముద్రం నుండి విప్లవం ఉదయిస్తుంది.
‘రైతు నాగలి మోస్తున్నాడు/ క్రైస్తు శిలువ మోసినట్లు’
అతని వృత్తియే అతనికి శిక్ష (దండన) ఐనంతగా దేశంలో రైతుకు అన్యాయం ఘటిల్లుతోంది.
‘అతడి పోరు పాడిన పాటలు / ప్రవహించే నదులు ఆగి ఆలకించేవి / చావులేని వాడ్ని చంపే మూర్ఖులకు తెలీదు/ ఏ మృత్తిక పువ్వును మనిషికి కానుకగా ఇస్తుందో/ అది వాడి నిర్మాణంలో ఉందని’. గద్దర్‌పై హత్యాయత్నం జ్ఞప్తికి రావటం లేదా?
శేషేంద్ర మార్క్సిజమ్ ఎడల గొప్ప గౌరవం కలవాడు. మార్క్స్‌కు ఈ శతాబ్దమంతా రుణపడి ఉన్నదంటాడు. కమ్యూనిజం తనలో పలికే ఏక్‌తారా అంటాడు.
‘ఇచట చరాచరమ్ములుదయింపకమున్ను, విదూర తారకల్
విచికిలకాంతులన్ గగనవీధుల దోచకమున్ను విశ్వ సం
కుచిత నిశీథిలో తిమిరకోణములో గల ఆది తేజమీ
రుచిర తనూలతల్ దొడిగె లోకపురోపరిణామ ధోరణిన్’
అన్నప్పుడు శేషేంద్రలో ఆధ్యాత్మికతా వాసన గోచరించింది. ‘దీనిని మార్క్సిజమ్‌తో సమన్వయించటం ఎలా?’ అనే సంశయం కలిగింది. పెన్నా శివరామకృష్ణ 1985 ఏప్రిల్‌లో ఇంటర్వ్యూ చేసినప్పుడు శేషేంద్ర చెప్పిన ఒక జవాబుతో ఈ విషయంపై కాంతి ప్రసరించింది.
‘మార్క్సు తొలుత ప్రతిపాదించిన ఆర్థిక సిద్ధాంతం రష్యా విప్లవం నాటికి మార్పు పొందింది. ఆ తర్వాత చైనా విప్లవంతో మరింత మార్పు పొందింది. విశేషతః చైనాలో మావ్–సే–తుంగ్ కమ్యూనిజాన్ని చైనీకరించాలి అనే గట్టి నినాదం స్వీకరించాడు. అలాగే మన దేశచరిత్రకు, మన సంస్కృతికి, మన ప్రజల పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్క్సిజాన్ని సవరించాలి’.
డయలెక్టికల్ మెటీరియలిజం, సైంటిఫిక్ సోషలిజం అనే రెండు పాదాల మీద మార్క్సిజమ్ నిలబడుతుంది. మొదటిది మెటీరియలిజం అనే జడపరిణామ సిద్ధాంతం. రెండవది మానవ సమాజం ప్యూడలిజం, కేపిటలిజం, కమ్యూనిజం అనే దశల్లోకి అంచెలవారీగా పరిణమిస్తూ చేరుతుంది అనే భావం. మన దేశానికి అనుగుణంగా సూచించిన మార్పు ఏమిటంటే– కమ్యూనిస్టు సమాజ స్థాపన కోసం ఏ చర్యాబద్ధ కార్యక్రమాన్నయితే చేపట్టాలో దాన్నిమాత్రం స్వీకరించి, మెటీరియలిజంను నిర్బంధ అంశం చెయ్యకుండా వ్యక్తి ఇష్టాధీనంగా విడిచెయ్యాలి. అంటే– కమ్యూనిస్టు సమాజ స్థాపనకు కావలసిన చర్యాబద్ధ కార్యక్రమమే నిర్బంధము. భారతదేశంలో మార్క్సిజమ్ బహుళ జనామోదం పొందటానికి ఈ మార్పు అవసరమూ, సముచితమూ అనిపిస్తోంది. ఈ విషయంలో మార్క్సిస్ట్ మేధావులలో శేషేంద్ర ఏకాకి కాడు.
రావిశాస్త్రి విరసం సభ్యత్వానికి రాజీనామా చేయటానికి – అతని విశ్వాసాలు కొన్ని డయలెక్టికల్ మెటీరియలిజంకు విరుద్ధం కావటం కూడా ఒక కారణమని మిత్రుల వలన విన్నాను. ఐనా రావిశాస్త్రి ‘సైంటిఫిక్ సోషలిజం’కు నిబద్ధుడు, విఖ్యాత ప్రజారచయిత. (రావిశాస్త్రి ఈ సందర్భంలో తన భావానికి దార్శనిక వివరణ నివ్వలేదు.)
శేషేంద్ర దార్శనిక దృష్టిని మరొక కోణం నుండి కూడా చూడాల్సి ఉంది. ఎట్టి త్యాగాలు చేసి సంపాదించిన ఎంతటి మహత్తర శుభపరిణామమైనా శాశ్వతంగా నిలువదు. అది ఎలాగో క్రమక్రమంగా క్షీణిస్తుంది. మళ్ళీ త్యాగాలు చేసి మరొక సత్‌పరిణామాన్ని సా«ధించు కోవలసిందే.
‘స్వర్ణంలాంటి రక్తంతో కూడా
స్వప్నాలు శాశ్వత వాస్తవాలుగా మారలేదు
మూర్ఖులే గ్రహించలేరు
పరిణామం కూడా పరిణామగ్రస్తం అని’
ఇక్కడ ‘వాస్తవాలుగా’ అనక, ‘శాశ్వత వాస్తవాలుగా’ అనటం గమనించదగింది.
‘జీవితమనే పద్మపత్రం మీద ఉన్న చంచలమైన జలబిందువు జ్ఞానం. అది శాశ్వతం కాదు, పరిణామగ్రస్తం. భూగోళం మీద అంకురించిన మానవ జన్మలో సహజంగా ఉన్న దోషాలూ, సృష్టి సిద్ధమైన హద్దులూ ఉన్నాయి. అవి మానవాతీతమైనవి. మానవుడు ఆర్జించే జ్ఞానం మీద వాటి శాసనం ఉంటుంది. కనుకనే యుగయుగాన పూర్వపూజిత సిద్ధాంతం అనంతరం పూజిత సిద్ధాంతం చేత త్రోసివేయ బడుతుంది. ఇలా ఒక యాతాయాత సిద్ధాంత పరంపరా వలయం మానవేతిహాసంలో నిరంతర భ్రమణం చేస్తూ ఉంటుంది. వాస్తవంగా ఈ జీవన సంగ్రామాన్ని ఎదుర్కొనే శక్తి మనిషికి కావాలి.
జీవన సంగ్రామాన్ని ఎదుర్కొనే శక్తినిచ్చే గ్రంథమే మానవ తరుణోపాయ «ధర్మకమైన జ్యోతి’.
ఈ మహత్తర దార్శనికతా భరితమైన కవిత కాబట్టే శేషేంద్రది మహత్తర కవిత. నవదార్శనిక మహాకవి శేషేంద్ర.
- గింజల నరసింహారెడ్డి -----------
దార్శనిక విమర్శకుడు శేషేంద్ర శర్మ --- సాగర్ శ్రీరామకవచం -------
తెలుగు సాహిత్య వైతాళికుల్లో గుంటూరు శేషేంద్ర శర్మది ప్రత్యేకమైన స్థానం. ఆయన స్థానం ఏమిటో స్వయంగా నిరూపించుకోవటమే కాదు, కవిసేన మేనిఫెస్టో ద్వారా ప్రతి వర్ధమాన కవీ తన స్థానం ఏమిటో, ఎలా ఉండాలో చర్చించి మరీ తన తర్వాత తన ఖాళీని, ఏ కవి అయినా సరే వైజ్ఞానికంగా పూరించాలని తపన పడ్డాడు. కానీ ఇవాళ పేరుకోసం తపనపడే వాళ్లు శేషేంద్ర కవిత్వాన్ని మక్కికి మక్కి అనుసరించటం కాదు, ఆయన కవిత్వాన్నే ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా దించేసి కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నారు. అది వారి తప్పు కాదు. శేషేంద్ర తన కవిత్వ మాయాజాలం ద్వారా మరొకరు మరోవిధంగా రాయలేకుండా చెరగని ముద్రవేసి ఆకాశంలోకో, మబ్బులోకో ఈ దేవ నదుల్లోకో తరలి వెళ్ళిపోయాడు..., ఒక మహాశూన్యం నింపేసి మరీ. ఎన్నో మహావాక్యాలు అందించి మరీ. పైగా కవిసేన మేనిఫెస్టో ద్వారా ఆధునిక కావ్యశాస్త్రం లక్షణాలు, లక్షితాలు వివరించి మరీ. అందుకే శేషేంద్ర ఆధునిక తెలుగు సాహిత్య వైతాళికుడు. శేషేంద్ర బతికి ఉండగానే తెలుగు కవులు కవిత్వం నినాదమయం చేసి, ఎలా రాయాలో తెలియక దారి తప్పుతుంటే చాలా బాధపడ్డాడు. అందుకు కవిత్వం ఎలా ఉండాలో, ఎలా రాయాలో, ఎలా రాయకూడదో సుదీర్ఘంగా తన కవిసేన మేనిఫెస్టోతో సవివరంగా, బాధాతప్త హృదయంతో చర్చించాడు. దారి చూపించాడు. విప్లవం కవిత్వం గ్రూపులుగా విడివడి, కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో అసలు కవిత్వం ఏ దారిలో, ఎలా నడవాలో పున:సమీక్షించాడు. సుదీర్ఘంగా, ఓపికతో, కోపంతో, వివేకంతో, ఆవేశంతో, అనేకానేక ఉటంకింపులతో, సోదాహరణంగా తన ప్రతిపాదనలను శాస్త్రీయంగా వెలువరించాడు. ఆనాడు అంటే 1977 ప్రాంతాలకు కవిసేన మేనిఫెస్టోని సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఇవ్వాల్సిన గౌరవం, విలువ ఇవ్వకపోగా పైగా ఆయన సాహిత్య పరిశీలనని ఎద్దేవా చేశారు. అవహేళన చేశారు. శేషేంద్ర తిరుగుబాటుతో కూడిన అనేకానేక శాస్త్రీయ ప్రతిపాదనలను మూల్యాంకనం చేయకుండా నిరాకరించి తోసి రాజనటం తెలుగు సాహిత్యంలో జరిగిన చారిత్రక ద్రోహం. ఆనాడు యూనివర్సిటీలు కూడా గమ్మున కూర్చున్నాయి. అది ఈనాటికీ ఓ మహాపుస్తకం - కవిసేన మేనిఫెస్టో పట్ల ఎంతో ఉదాసీనత ఆవరించి ఉంది. దాన్ని పటాపంచలు చేయాల్సిన బాధ్యత మన విమర్శకుల మీద ఎంతో ఉంది. అందుకే కవిసేన మేనిఫెస్టోని, అందులోని భావజాలాల్ని మరోసారి స్మరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏ విమర్శనా గ్రంథానికి గ్రహణం పట్టకూడదు. అది సాహిత్యం వెనుకబాటుతనానికి పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే ప్రతి గొప్ప గ్రంథానికి ప్రాసంగికత ఉంటుంది. దాన్ని విస్మరించకూడదు. కవిసేన మేనిఫెస్టోలో శేషేంద్ర ఒంటిచేత్తో అలవిమాలిన పని పెట్టుకున్నాడు. పెనుభారాన్ని తలకెత్తుకున్నాడు. తన శాయశక్తులూ ధారపోసి సంభాషణా శైలితో, వాగ్ధారతో, తర్కంతో తను సమకూర్చుకున్న సమస్త శాస్త్రాలంకారాలు గుమ్మరించాడు. ఒకసారి వర్తమాన సాహిత్యాన్ని ఎద్దేవా చేశాడు. ఆవేశించాడు. కోపంతో కుమిలిపోయి ఆనాటి కవుల్ని విమర్శిస్తూ తిట్టాడు. శేషేంద్రలోని నవ్య కవిత్వ తత్త్వసారాన్ని గ్రహించకుండా మతతత్త్వ లేబుల్స్ తగిలించారు. ఆయనలోని మార్క్సిస్టు భావజాలాన్ని తలకిందులు చేసి చూపించాలని ఆరాటపడ్డారు. ఆదరించాల్సిన కవిసేన మేనిఫెస్టోని దాని ఆవశ్యక ఉద్యమ వాదాన్ని తిరస్కరించారు. నిజానికి, శేషేంద్ర తన మేనిఫెస్టోలో ఈ శిరోధార్యమైన భావాలు పంచాడు. కొత్త కవులకి ఏది కవిత్వమో, మంచి కవిత్వ లక్షణాలు, ప్రపంచ వ్యాపిత కవిత తీరుతెన్నులూ సవివరంగా అందించాడు. కవిత్వం రాయాలనే తపన ఉన్న ప్రతి సామాజిక జీవికి ఎంతో ఆక్సిజన్ అందించే అభిప్రాయాలు కవిసేన మేనిఫెస్టో ఈనాటికీ మోస్తోంది. సౌందర్య శిల్పశాస్త్రం ఎలా ఉంటుందో శేషేంద్ర తన ముక్తకాలతో నింపి మరీ కవిసేన మేనిఫెస్టో రూపొందించాడు. శేషేంద్ర కవిత్వ రీతిలో అత్యంత ఆధునికుడు. ప్రపంచ సాహిత్యం నేల మాళిగలని దున్నిన చదువరి. పారశీక కవుల హృదయాలని పట్టుకున్న గొప్ప ప్రేమికుడు. ఆ వ్యవహారాలన్నింటిని ఏకరువు పెట్టి ఉద్యమ స్ఫూర్తికి పట్టుకొమ్మగా ఈ గ్రంథం అవతరించింది. ఒకవిధంగా శేషేంద్రలోని అత్యాధునికుడి కోణమూ కవిసేన మేనిఫెస్టోలో చూడవచ్చు. అందుకే శ్రీశ్రీ తర్వాత ఏది రాసినా కవిత్వంగా చెలామణి చేయగలిగిన ధైర్యం శేషేంద్రలో కనిపిస్తుంది. అంతేకాదు యావత్తు ప్రపంచ సంక్షేమం కోసం, పీడితుల పక్షాన నిలబడి ఒక వైజ్ఞానిక నాయకత్వం కోసం తపించాడు. కవి సమాజంలో సర్వవిధ వైజ్ఞానిక తరగతులకు ఏకైక ప్రతినిధి అంటాడు శేషేంద్ర. కవిత్వం ఒక ఆత్మకళగా అభివర్ణించాడు. ఫ్రెంచికవులు రేంబో, బోదిలేర్ దగ్గర్నించి, గోర్కీ ప్లెఖనోవ్, షెర్బీనా, మయకోవ్‌స్కీ దాకా ప్రాచీన ఆలంకారికులు పాణిని, భవభూతితో ఆగక, వాల్మీకి నుంచి గాలిబ్ దాకా పయనించి వారి సిద్ధాంతాలు ఎంత ఆచరణీయమో కవిసేన మేనిఫెస్టోలో చర్చించి దానిని ఆధునిక కావ్యశాస్త్రంగా సారభూతం చేశాడు. దార్శనికుడు శేషేంద్ర కవిసేన మేనిఫెస్టోలో కవిత్వ సమాజానికిచ్చిన సూచనలు కొన్ని పరిశీలిద్దాము. - విశిష్టమైన భావం, విశిష్టమైన భాష తన రక్తంలో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదు. - కవిత్వంలో అనుభూతే సర్వధా ముఖ్యం. అనుభూతిలోనుంచే కవిత్వం అంటే అలంకారాలు, బింబాలు, ప్రతీకలు పుడతాయి. - కవిత్వతత్త్వం తెలియని వాళ్లు కవిత్వం వేరు, టెక్నిక్ వేరు అనుకుంటారు. - ప్రతి కవితా ఎలా ఉండాలి? ఉష్ణోగ్రత కలిగి ఉండాలి. ఒక మరణాస్త్రంలో ఉండాలి. - నిజమైన కవులు తయారు కావాలని ఇవాళ కవిసేన అరుస్తోందంటే ఒక కొత్త మనుషుల గుంపు తయారు కావాలని పిలుస్తోందన్నమాట. ఈ విధంగా కవిసేన మేనిఫెస్టో శేషేంద్ర కావ్యదర్శనం ఆవిష్కరించాడు. ప్రతిభ, సమాధి, వ్యుత్పత్తి కవి సమగ్రంగా ఎలా సాధించాలో శేషేంద్ర సులభగ్రాహ్యంగా వివరించాడు. ప్రాక్, పశ్చిమ కావ్యంతత్త్వ చింతనతోపాటు, ఆధునిక, మార్క్సిస్ట్ చింతనతో నవ్య ఆధునిక కవిత్వానికి తన కావ్యశక్తిని అందించాడు. శేషేంద్రని పట్టించుకుంటే తెలుగు సమాజం మరింతగా తలెత్తుకొని తిరుగుతుంది. శేషేంద్ర జీవితాంతం తల ఎత్తుకొనే బతికాడు. కవిత్వాన్ని, విమర్శని, తత్త్వ చింతనని అనితర సాధ్యంగా ధారపోశాడు.
- సాగర్ శ్రీరామకవచం -----------------
శేషేంద్రకు విశ్వనాథ యోగ్యతా పత్రం
గుంటూరు శేషేంద్ర శర్మ రచనల్లో ‘షోడశి - రామాయణ రహస్యాలు’ గ్రంథానికి ఒక విశిష్టత ఉంది. అనేకానేక ఉత్తమ లక్షణాలతోపాటు కవిసమ్రాట్ విశ్వనాథ వారిచ్చిన యోగ్యతాపత్రం చెప్పుకోదగ్గ దీని మరో విశిష్ఠత. ‘షోడశి’కి వ్రాసిన ముందుమాటలో...
శేషేంద్రకు విశ్వనాథ యోగ్యతా పత్రం ‘షోడశి’పుస్తకంలో ‘‘శ్రీసుందరకాండకు పేరెట్లు వచ్చినది’’ అనే అధ్యాయంలో ఆసక్తికరమైన చర్చ లేవదీశారు శేషేంద్ర శర్మ. ‘‘హనుమంతుడు సుందరుడగుట, సుందర హనుమన్మంత్రమని యొకటి యుండుట, హనుమంతుడు నివసించిన స్థానములలో ఒకదానికి సుందరనగరమనే పేరు ఉండుట...’’ ఇలా అనేక కారణాలని అంటారు శేషేంద్ర.
‘‘వాల్మీకి వేదముననుసరించి శ్రీ రామాయణము వ్రాసెననుట న్యాయమే అనిపించును. ఇది యొక పెద్ద గొడవ. ఇది నిరూపించుటకు నాకు శ్రీ శర్మగారికున్నంత యోపికలో సగమైన నుండవలయును. నాకు లేనిదే అది’’ అంటూ విశ్వనాథ ‘షోడశి’ పుస్తకానికి ముందుమాటలో శేషేంద్రశర్మకు ఒక అద్భుతమైన ప్రమాణ పత్రాన్ని ఇచ్చారు.
గుంటూరు శేషేంద్ర శర్మ రచనల్లో ‘షోడశి - రామాయణ రహస్యాలు’ గ్రంథానికి ఒక విశిష్టత ఉంది. అనేకానేక ఉత్తమ లక్షణాలతోపాటు కవిసమ్రాట్ విశ్వనాథ వారిచ్చిన యోగ్యతాపత్రం చెప్పుకోదగ్గ దీని మరో విశిష్ఠత. ‘షోడశి’కి వ్రాసిన ముందుమాటలో శేషేంద్ర లోచూపును ప్రస్తావిస్తూ శేషేంద్ర తనకు ఆహా పుట్టించాడంటారు విశ్వనాథ: ‘‘ఆశ్చర్యములలో నాశ్చర్య మేమనగా భారతము రామాయణమునకు ప్రతిబింబమని (శేషేంద్రశర్మగారు) చేసిన ప్రతిపాదన. సంపూర్ణముగా ప్రతిబింబము కాకపోయినను శ్రీశర్మగారు చూపిం చిన స్థలములలోని ప్రతిబింబత్వము నాకాహా పుట్టించినవి. శ్లోకములు శ్లోకములు చరణములు చరణములు వానియంతట వానినే భగవంతు డైన వ్యాసుడు వాడుకొనెను.... వాల్మీకిని యథేచ్ఛగా వాడుకొన్న వారిలో మెదటి వాడు వ్యాసుడు.’’
శేషేంద్రను లోతైన మనిషి అంటూ కవి సమ్రాట్ ఈ విధంగా పేర్కొన్నారు: ‘‘శ్రీశర్మ గారికి నాకు నేడెనిమిదేండ్ల నుండి చెలిమి గలదు. వారింత లోతైన మనిషియని నేనను కొనలేదు. అప్పుడప్పుడు నైషధము నుండి కొన్ని శ్లోకములు దేవీ పరముగా వారన్వయిం చినప్పుడు నేను వారికవి యాదృచ్ఛికముగా తోచిన విషయములనుకొన్నాను గాని శ్రీవిద్యా విషయము నింత లోతుగా తెలిసిన వారనుకొన లేదు. వారీ గ్రంథమును వ్రాసినందుకు తెలుగువారే కాదు. భారతీయులందరును కృతజ్ఞులుగా నుండ వలసిన విషయము.’’
తనకు నచ్చకపోతే నిర్మొహమాటంగా మొహంమీదే దులిపేయగల సాహసం విశ్వనాథగారికుందని వేరే చెప్పనవసరం లేదు. ఆయన ఎవరినైనా మెచ్చుకోవడం సులువుగా జరగదు. ఆయన శేషేంద్రను అభినందించడానికి ఉపయోగించిన వాక్యాలు, భాష చూడాల్సిందే: ‘‘శ్రీశర్మగారు త్రిజటా స్వప్నమును గాయంత్రీ మంత్రము లోని పాదముల సంఖ్యయు నక్షర ముల సంఖ్యయు తీసికొని అది గాయత్రీ మంత్రమునకు నొక విధ మైన వ్యాఖ్యయని నిరూపించుట మిక్కిలి యూహాస్ఫోరకముగాను న్నది; వారి శ్రద్ధను నిరూపించు చున్నది. ఇది పారాయణము చేయ నెంచెడి వారికి శ్రీశర్మగారు చేసిన యుపకారమింతయని చెప్ప రాదు. ఒక గ్రంథకర్త ఒక మహా విషయమును వ్రాయును. సహజ ముగా నతడెంత గొప్పపని చేసెనని పరులు ప్రశంసింప వలెనని యతని కుండుట వాడెంత గ్రంథ కర్తయైునను జీవిలక్షణము. ప్రశంసించెడి వారు గూడనెట్లు ప్రశంసింతురు. పెదవితో ప్రశంసింతురు. నిజముగ బ్రశంసించెడి వాడెవడనగా త్రిజటా స్వప్నములోని యీ రహస్యమును తెలిసికొని దానిని ప్రధానముగా తన పారాయణములో పెట్టుకొనెడి వాడు.’’
ఈ పుస్తకంలో ‘శ్రీసుందరకాండకు పేరెట్లు వచ్చినది’ అనే అధ్యాయంలో ఆసక్తికరమైన చర్చ లేవదీశారు శేషేంద్రశర్మ. ‘‘హనుమంతుడు సుందరు డగుట, సుందర హనుమన్మంత్రమని యొకటి యుండుట, హనుమంతుడు నివసించిన స్థానములలో ఒకదానికి సుందరనగరమనే పేరు ఉండుట...’’ ఇలా అనేక కారణాలని అంటారు శేషేంద్ర. సుందర హనుమన్మంత్రము గురించి శేషేంద్ర చాలా విస్తారంగా వివరించారు: ‘‘సుందరాయనమః అని శ్రీరామాష్టోత్తర నామములలో ఉన్నది. కాని హనుమ గురించి సుందర నామము లేదు. బ్రహ్మాండ పురాణములో సుందరకాండకు ‘చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్ సుందరే కాండే ఉత్తమే’ అని పారాయణ పద్ధతి వివరించారు. షోడశ కళా ప్రపూర్ణ అయిన శక్తియే చంద్రబింబం అంటే. ఈ కాండలో సీతారాములకు ఏ భేదమూ లేకపోవడం వల్ల రాముని పరాశక్తిగా భావించాలని పారాయణ విధాన వివరణ తాత్పర్యం.
రాముడు సుందరుడు, సుందరి కలవాడు. సుందరకాండ సౌందర్యకాండ, బ్రహ్మాండ పురా ణమున సౌందర్యకాండ అనే మాట వాడినారు. ఈ సౌందర్యము శంకరులు సౌందర్యలహరి అని చెప్పినదే. కనుక సుందర హనుమంతుడనగా దేవీభక్తుడైన హనుమ అని అర్థమేగానీ హనుమ సుందరముగా ఉన్నాడని గాదు. హనుమ నిరంతర దేవీ ధ్యానమే, జపమే, యోగమే, సుందర కాండగా దర్శనమిచ్చుచున్నది. ‘తదున్నసం పాండురదంత మవ్రణం శుచిస్మితం పద్మ పలాశ లోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం, ప్రసన్నతారాధిప తుల్య దర్శనం’ అని ఓ తల్లీ నిన్ను నేనెప్పుడు చూతునో గదా అని హనుమ పరి తపిస్తూ చెప్పిన శ్లోకం ఇది. తెలుగుసీమలో సుందరయ్య సుందరరామయ్య అని బాలా త్రిపురసుందరీ సంప్రదాయ సిద్ధ నామధేయములు ప్రజలు పెట్టుకొను వ్యవహారమున్నది. ఇతర సీమలలో కూడా సుందరేశన్, సుందర్‌సింగ్ సుందర్‌బాయ్ అట్టి చోట్ల త్రిపురసుందరీపరమైన అర్థమే గానీ హనుమత్పరమైన అర్థము లేదు’’ అని శేషేంద్ర వివరించారు.
ఈ అధ్యాయం పైన విశ్వ నాథ తన ముందుమాటలో వివరంగా వ్యాఖ్యానించారు. తనదైన భాషలో ఆ యన, ‘‘రామాయణము నందు తక్కిన కాండ లకు తత్తత్కాండాతర్గత కథాసూచకములైన నామ ములుండగా దీనికి సుంద రకాండమన్న పేరు విడిగా నేల పెట్టవలసి వచ్చినదన్న ప్రశ్ననిచ్ఛలు వినిపించునదే. ఈ సందియము పలుమందికి కలదు’’ అన్నారు. విశ్వనాథ ఈ ముందు మాటను అక్టోబర్ 1, 1967నాడు వ్రాసారు. అప్పటికి ముఫ్ఫయ్ సంవత్సరాల కిందటి ముచ్చటను వివరించారు. రైలు కోసం నిడదవోలు ప్లాటుఫారం మీద కూర్చున్న సమయంలో కీర్తిశేషులు పూజ్యు లైన శ్రీకాశీ కృష్ణాచార్యుల వారిని ఈ కాండమునకు శ్రీసుందరకాండమనే పేరు ఏవిధంగా వచ్చిందని ఆయన అడిగారట. ‘‘సుందర హనుమ న్మంత్రమని యొకటున్నది.
ఆ మంత్రమును మహర్షి యా కాండమున నిక్షేపించెను. అందుచేత దానికి సుందర కాండమని పేరు వచ్చినది’’ అని శ్రీకాశీ కృష్ణా చార్యులు విశ్వనాథకు చెప్పారట (ఇదే విషయాన్ని శేషేంద్రకూడా తన అధ్యాయంలో ప్రతిపాదించి ప్రమాణీకరించారు). ఇంకా వివరాలు అడిగే సమయం లేకపోయిందని తరువాతనైనా ఆయనను కలుసుకోలేకపోయానని విశ్వనాథ పేర్కొన్నారు. హనుమంతుడు అనే పేరు వజ్రఘాతం వల్ల, మారుతి అనే పేరు తండ్రి వాయుదేవుని మారుతమనే పేరు వల్ల, ఆంజ నేయుడు అనే పేరు తల్లి పేరుతో వచ్చినాయి. కాని తల్లి ఆంజనేయుడికి పెట్టుకున్న అసలు పేరేమిటి? ‘‘సుందరుడు’’ అని ఇద్దరు రచయితలు (శేషేంద్ర, విశ్వనాథ) వెల్లడించారు. కానీ ఇది వాల్మీకి చెప్పలేదు: ‘‘ఆ మహర్షి తాను చాల పరమగూఢమైన రచన చేయును’’ అంటారు విశ్వనాథ. సుందరుని కథా సమగ్రమయిన సుందర కాండకు ఆ పేరు వచ్చిందని వివరించారు. ఆ విధంగానే మరికొన్ని అసలు పేర్లను పేర్కొన్నారు. ద్రౌపది అసలు పేరు ‘‘కృష్ణ’’ అనీ, శూర్పణఖ అసలు పేరు ‘‘బాల’’ అని ప్రస్తావించారు.
‘‘ఒక బుద్ధిమంతుడు (ఇక్కడ గుంటూరు శేషేంద్రశర్మ) తన మేధాశక్తి చేత సోపపత్తికముగా మహా విషయమని చెప్పికోదగిన దానిని వ్రాసినచో ప్రశంసిం పవలయును. దానిని జూచి యానందింపవలయును. గాని వెక్కిరించుట మిక్కిలి తేలిక. వీరు (శేషేంద్ర) చెప్పిన యుపపత్తులు బాగుగా నున్నవి. సమంజసముగా నున్నవి. అన్నిటికంటె ప్రధానమైన యుపపత్తి సుందరకాండ మంతయు కుండలినీ యోగమని నిరూపించుటయే- ఈ నిరూపణ మాత్ర మాశ్చర్యజనకముగా ఉన్నది. శ్రీ శర్మగారు దీని నూరకయే నిరూపించలేదు. గాలిలో దీపము పెట్టి దేవుడా నీ మహిమ యనలేదు’’ అని శేషేంద్రకు కితాబిచ్చారు విశ్వ నాథ. ‘‘వాల్మీకి వేదముననుసరించి శ్రీ రామా యణము వ్రాసెననుట న్యాయమే అనిపిం చును. ఇది యొక పెద్ద గొడవ. ఇది నిరూ పించుటకు నాకు శ్రీశర్మగారికున్నంత యోపికలో సగమైన నుండవలయును. నాకు లేనిదే అది’’ అంటూ విశ్వనాథ శేషేంద్ర శర్మకు ఒక అద్భుతమైన ప్రమాణ పత్రాన్ని ఇచ్చారు.
శ్రీమద్రాయణ కల్పవృక్ష రచయిత, జ్ఞానపీఠాధిపతి, పరిశోధకుడు, విమ ర్శకుడు, అన్ని సాహితీ ప్రక్రియ లలోనూ నైపుణ్యం సాధించిన మహాకవి, పండితుడు అయిన శ్రీవిశ్వనాథ పెదవితో పైపైన కాకుండా హృదయంతో సో దాహరణంగా సప్రమాణ కంగా చేసిన ప్రశంస ఇది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానా’నికి చలం ఇచ్చినట్టు శేషేంద్ర ‘షోడశి’కి విశ్వనాథ యోగ్యతాపత్రాన్ని ఇచ్చినారు. సకాలంలో అందక విశ్వనాథ ముందు మాటను ‘షోడశి’ మొదటి ముద్రణలో చేర్చలేదు. 33 సంవత్సరాల తరు వాత 2000లో వచ్చిన మూడో ప్రచురణలో విశ్వనాథ ప్రశంస చేర్చారు.
వృత్తిరీత్యా విజ్ఞానశాస్త్రవేత్త, దేవీ ఉపాసకులు గురజాడ సూర్యనారా యణమూర్తి ‘షోడశి’ని ఆంగ్లంలోకి, ఉజ్జయిని కాళిదాసు అకాడమీ డిప్యుటీ డైరెక్టర్ జగదీశ్‌శర్మ హిందీలోకి అనువదించారు. 2006లో ప్రచురించిన పుడు విశ్వనాథ ముందుమాటకు హిందీ అనువాదం వేయలేదు. పుస్తకం పేరుతో కూడా ఇబ్బంది వచ్చింది. ‘షోడశి - రామాయణ్ కీ తాంత్రిక్ వ్యాఖ్యా’ అని పెట్టడం సరైన అనువాదం కాదని భావించి 2018లో ‘షోడశి రామా యణ్ కే రహస్య్’ అని పేరు మార్చి విశ్వనాథ ముందుమాటను కలిపి మళ్లీ హిందీ పుస్తకం ప్రచురించారు.
సుందరకాండలో కుండలినీ యోగాన్ని దర్శించిన శేషేంద్రశర్మ లోతైన పరిశోధనను ‘ది హిందూ’ పత్రిక ‘షోడశి’ ఇంగ్లీషు అనువాదాన్ని సమీక్షిస్తూ ప్రశంసిం చింది. త్రిజట స్వప్నవృత్తాంతంలో గాయత్రీ మంత్ర వృత్తిని శేషేంద్రశర్మ చూచిన తీరును, వేద రహస్యాలను లోతుగా చదివితేనే అర్థమయ్యేట్టు సూచనప్రాయంగా వాల్మీకి పొందుపరిచిన విధా నాన్ని ప్రస్తావించి రామాయణంలో ‘షోడశి’ కొత్త కోణాలను ఆవిష్కరించిందన్నారు. భారతీయ విమర్శనా సాహిత్యాన్ని ప్రపంచ వాఙ్మయంలో నిలువెత్తు నిలబెట్టిన అత్యుత్తమ గ్రంథమని మాస పత్రిక ‘విపుల’ తన సమీక్షలో పేర్కొన్నది.
శేషేంద్ర ‘షోడశి-రామాయణ రహస్యములు’ 1967లో, ‘స్వర్ణహంస-హర్ష నైషధ కావ్య పరిశీలన’ 1968లో ప్రచురితమ య్యాయి. ఈ రచనలు రెండూ నీలంరాజు వెంకటశేషయ్య సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వారపత్రిక ఆదివారం సాహితీ అనుబంధంలో 1963-67 మధ్య ధారావాహికగా వచ్చాయి. వీటితోపాటు ‘నా దేశం నా ప్రజ’, ‘ఆధునిక మహా భారతం’ వంటి రచనలతో తెలుగు సాహితీ వినీలాకాశంలో శేషేంద్రశర్మ సూర్యునివంటి అజరామర కీర్తి సంతరించుకున్నారు.
మాడభూషి శ్రీధర్ Andhra Jyothi : Telugu Daily 2020-05-25 www.facebook.com/shodasi/
-------------- కాలానికి ముందు పయనించిన కవి
Acharya Yarlagadda Laxmi Prasad Article On Gunturu Seshendra Sharma -----------
‘‘నేను పుస్తకాలతో మనిషి పశుత్వా నికి ఆనకట్టలు కడతాను; వాడు పశుత్వంతో మనిషికే ఆనకట్టలు కడ తాడు’’ (నీరై పారిపోయింది) అన్న గుంటూరు శేషేంద్ర శర్మ ఈ దేశ ప్రజలు గర్వంగా చెప్పుకోదగిన కవి. ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి, అది కన్నీరు కార్చాలి, క్రోధాగ్నులు పుక్కిలించాలి అని చెప్పిన శేషేంద్ర 1927 అక్టోబర్ 20న నెల్లూరులోని తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. బీఏ చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమిషనర్‌గా పనిచేశారు. జర్నలిజం పట్ల మక్కువతో తాపీ ధర్మారావు వద్ద ‘జనవాణి’లో ఉద్యోగం చేశారు. కానీ సాహిత్యం ఆయనను వెంటాడటంతో అన్నిటినీ వదిలి కవిత్వాన్ని ప్రేమించడం ప్రారంభించారు.
ఆయన కవిత్వంలో ప్రాచీన, ఆధునిక ధోరణులు అందంగా ఇమిడి పోతాయి. ప్రగతి శీలతనూ, ప్రాచీన భారతీయ అలంకార శాస్త్రాల్నీ, మార్క్స్ ఫిలాసఫీనీ ఏక కాలంలో జోడించి ఈ దేశానికి అవసర మైన విలువైన సాహిత్య సిద్ధాంతాన్ని ఆయన ‘కవిసేన మేనిఫెస్టో’ పేరిట మనకు అందించారు. ‘షోడశి– రామాయణ రహస్యాలు’ పేరుతో వాల్మీకి సుందర కాండకు అద్భుతమైన తాంత్రిక భాష్యాన్ని అందించిన శేషేంద్ర మేఘదూతానికీ, వాల్మీకి రామాయణానికీ మధ్య ఉన్న సంబంధంపై జర్మనీ ఇండొలాజికల్ యూనివర్సిటీలో అపురూపమైన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.
‘ఇద్దరు రుషులు– ఒక కవి’ శీర్షికతో వాల్మీకి, వ్యాస, కాళిదాసుల కవిత్వంపై విశిష్టమైన పరిశోధనా వ్యాసాన్ని రాశారు. ‘స్వర్ణ హంస’ పేరుతో నైషధంపై లోతైన విమర్శ చేశారు. ‘నా దేశం– నా ప్రజలు’, ‘మండే సూర్యుడు’, ‘గొరిల్లా’, ‘ఆధునిక మహాభారతం’, ‘నీరై పారిపోయింది’, ‘సముద్రం నా పేరు’, ‘పక్షులు’, ‘శేష జ్యోత్స్న’ పేరిట అద్భుతమైన కావ్యాల్ని ఆయన రచించారు. ‘కాలరేఖ’ పేరిట సాహితీ వ్యాసాల్నీ వెలువరించారు. దానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయిన రెండో భారతీయుడు శేషేంద్ర. తెలుగు విశ్వవిద్యాలయం డి.లిట్ ఇవ్వగా... పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘రాసేందు’ బిరుదును ప్రదానం చేసింది. ‘కామోత్సవ్’ పేరిట ఆయన రాసిన సీరియల్ నవల తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించింది.
‘ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను’ అని చెప్పిన శేషేంద్ర కవిత్వాన్ని ఆధునిక, సంప్రదాయ కవులు ఇరువురూ ఇష్టపడ్డారు. చాలాచోట్ల శేషేంద్ర కవిత్వంలో నన్నయ్య తచ్చాడుతారనీ, పెద్దన, శ్రీనాథుడిని ఆయన ఉపాసించినట్లున్నారనీ, విశ్వనాథ, జాషువా, రాయప్రోలు, కృష్ణశాస్త్రి వంటివారి పలుకుబడులు అక్కడక్కడా కనబడుతూ ఉంటాయనీ పుట్టపర్తి ఆయన ‘రుతుఘోష’కు రాసిన ముందుమాటలో అన్నారు. ‘‘నీది మంచి పద్యమా, లేక ఫ్రెంచి మద్యమా, కవిరేవ విజనాతి, కవిదేవ సుధాగీతి, శ్రీనాథుడి క్రీడల్లో, అల్లసాని వాడల్లో కూడా దొరకని పదచిత్రం’’ అని శ్రీశ్రీ ప్రశంసించారు.
‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చిందీ’ అని ‘ముత్యాల ముగ్గు’ కోసం ఆయన ఒకే ఒకపాట రాసినా అది సినీ సాహితీ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. సంస్కృత భాషా సాహిత్యంతో పాటు తెలుగు సాహిత్యంలో లోతైన పరిజ్ఞానం ఉన్న శేషేంద్ర ఫ్రెంచి కవిత్వం, గ్రీకు విషాదాంత నాటకాలు, మార్క్సిస్ట్ సాహిత్యం క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కాళిదాసు, భవభూతి, టి.ఎస్. ఇలియట్, వేమన, వాల్మీకి, బొదిలెర్, రేంబో, శ్రీశ్రీ, ప్లేటోల సమన్వయం శేషేంద్ర!
‘‘కవికి సామాజిక స్పృహ కావాలి. కానీ వర్తమాన ఆంధ్రకవితా రంగంలో ఈ సామాజిక స్పృహ ఒక నీచస్థాయి నినాద రూపం ధరించి భయంకర సుడిగుండంలా ఏర్పడింది. ఈ నినాదం నుంచి యువకుల్ని రక్షించుకోవలసిన సాహిత్య అవసరం బాధ్యతాయుతమైన సామాజిక స్పృహ ఉన్నవాళ్లం దరి మీదా ఉంది’’ అన్న మాటలు ఆయన కాలానికి అతీతంగా నిలుస్తాయి. ‘‘కళ్ళు తుడుస్తాయి/ కమలాలు వికసిస్తాయి/ మెదిలితే చాలు నీ నామాక్షరాలు పెదవులమీద భ్రమరాల్లా’’– అంటూ గజల్స్ కూడా రాసిన శేషేంద్ర కవిత్వంలో ఉర్దూ సాహిత్య పరిమళం గుబాళిస్తూ ఉంటుంది. ‘ఎప్పుడు ఆకు రాలి పోతుందో గాలికే తెలియదు’ అంటూ 30 మే 2007న శేషేంద్ర రాలిపోయారు. ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం లభించకపోవడం ఒక బాధగా మిగిలిపోయింది.
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రాజ్యసభ మాజీ ఎంపీ
Sakshi : Telugu Daily : 29 May 2022 http://seshendrasharma.weebly.com ---------- వచనకవిత్వానికి కావ్యగౌరవం కల్పించిన కవిసేన --- డా. అద్దంకి శ్రీనివాస్ -----------
మనిషితత్త్వాన్ని కవిత్వతత్త్వంగా మలిచిన మహాకవి మాత్రమే కాదు. దేశ చరిత్ర అంటే ఆ దేశపౌరుడి ఆత్మకథే అని నిరూపించి దార్శనికుడు. అలా అని దార్శనికుడిగా అంతటితో ఆగిపోలేదు. ఆగిపోతే ఆయన సాహితీ మూర్తిమత్వానికి సుసంపన్నత్వం చేకూరేది కాదు. ఆధునిక కవికులగురువుగా ఆయన బాధ్యత సంపూర్ణంగా నెరవేరినట్లు అయ్యేదీ కాదు. ఈ రెంటినీ ఒనగూర్చి శేషేంద్రను ప్రపంచకవిగా విశ్వసాహితీవేత్తగా నిలబెట్టిన రచన కవిసేనమేనిఫెస్టో. కవిసేనమేనిఫెస్టో ఆధునిక విమర్శకు దిశానిర్దేశనం చేసిన లాండ్ మార్క్ లాంటి రచన. వైజ్ఞానిక ఉద్యమానికి సిద్ధాంతగ్రంథం, సునిశిత కవిత్వ విమర్శకు గీటురాయి. ఆయనే దాన్ని ’ఆధునిక కావ్యశాస్త్రమ్’ అన్నారు. ఈ మానిఫెస్టో 30 పేజీల్లో రాద్దామని మొదలుపెడితే 350 పేజీల ఆధునిక కావ్యశాస్త్రమైంది. సంప్రదాయనేత్రాలలో ఆధునికతను చూడగల దృష్టగా మనముందు గుంటూరు శేషేంద్ర శర్మను నిలబెట్టిన రచన ఇది. తనువగు శబ్దార్థంబులు/ధ్వని జీవ మలంక్రియావితానము సొమ్ముల్/ తనరు గుణంబులు గుణములు/ ఘనవృత్తులు వృత్తులౌర కావ్యేందిరకున్ అన్నాడు భట్టుమూర్తి. కవిత్వం రాయాలంటే ఈ కవితా సామగ్రియావత్తూ ఉండవలసిందే. బాహ్యంగా చూస్తే కవిత్వం అత్యంత శక్తిమంతమైన శబ్ద యోజన. అలంకారం, బింబం, ప్రతీకలు, మెటఫర్ మొదలైనవి కావ్యసామగ్రి. అందువల్లనే కవిత్వానికి ఆకర్షణ. ఆ శక్తి అయస్కాంతానికి కూడా ఉండదు. ఈ శక్తే జాంతవదశలో ఉన్న మనిషిని సభ్యమానవుడిగా, సంస్కారవంతుడిగా మార్చింది. యుగయుగాలుగా మానవ సమాజంలో సంస్కృతినీ, నాగరికతనూ సృష్టించింది కవులే. ఈ కవులే లేకపోతే మానవ సమాజానికీ అరణ్యానికీ తేడా ఉండేది కాదు. కాబట్టి కవిది సమాజంలో సర్వోన్నతస్థానం అని నిరూపించే రచన కవిసేనమేనిఫెస్టో. ఇందులో శబ్దశక్తిని తూచగల ఆలంకారికుడుగా దర్శనమిచ్చిన శేషేంద్ర మనస్సు ఒక కవితా ప్రయోగశాల. అప్పటివరకూ ఆధునిక కవిత్వానికి ఇతమిత్థంగా చెప్పలేని అస్పష్టభావనలకు ఒక రూపం వచ్చింది ఈ రచనలోనే. అనుభవాన్ని వడపోసి, పద్యాలను చిత్రిక పట్టి పదభావచిత్రాదులతో కొంగొత్త కవిత్వవ్యక్తిత్వాన్ని సారభూతంగా అందించింది కవిసేనమేనిఫెస్టో. ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ ఒరవడి కొనసాగుతోందంటారు గానీ నిజానికి శేషేంద్ర భాషను సరళం చేసి, అభివ్యక్తికి పదునుపెట్టి, తాత్వికతను అద్ది, వచనాన్ని కవిత్వంగా తీర్చి దిద్దాడు. ప్రాచీనులు చెప్పిన చమత్కారాన్ని వీథుల్లో, బస్స్టాండులలో, కాఫీ హోటళ్లలో, రైల్వే స్టేషన్లలో మాట్లాడే భాష శ్రోతకు అందించాడు. శ్రీశ్రీని యుగకవి అంటారు. శ్రీశ్రీకి పూర్వం ప్రేమ, వగైరాలు కావ్య వస్తువులు. శ్రీశ్రీ విప్లవాన్ని కావ్యవస్తువుగా ప్రవేశపెట్టాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తెలుగు కవిత్వంలో విప్లవ కవిత్వమే ప్రధానంగా వస్తోంది. శ్రీశ్రీ కవిత్వంలో కొంత ప్రబంధధోరణి ఉంది. భావంలో అభ్యుదయం ఉన్నా భాషలో నాటి పరిమళాలు పోలేదు. కానీ శేషేంద్ర కొత్త ఆలోచనకు కొత్తబట్టలే కట్టించాడు. వచనకవిత్వానికే పట్టం కట్టించాడు. ఆ అనుభవసారమే కవిసేన. కావ్యశాస్త్రవేత్త అయిన శేషేంద్ర చేసిన ప్రయోగాల ఫలమూ ఆధునిక వచనకవిత్వానికి ఆయన చేసిన లక్షణమూ కవిసేనమేనిఫెస్టో. శేషేంద్ర ఒక డైనమెట్ శక్తిని తీసుకొని కవిత్వం అనే వెన్ను ముకలోనికి కొత్త అభివ్యక్తిగా ఎక్కించాడు. దాని ఫలితమే కవిసేన మేనిఫెస్టో. శేషేంద్రకి పాశ్యాత్యసాహిత్యం భారతీయ అంలంకారశాస్త్రం శరీరం ఆత్మ అని ఈ రచన చూస్తే తెలుస్తుంది. పాశ్చాత్య అలంకార సిద్ధాంతాలనూ, భారతీయ అలంకార సిద్ధాంతాలనూ శేషేంద్ర ఇందులో సమన్వయించి చూపారు. తెలుగులో అభ్యుదయసాహిత్యం రాకపోతే ఇటువంటి విమర్శగ్రంథం. వచ్చి ఉండేదికాదు. పాశ్చాత్యుల ప్రతీకవాద ప్రభావం ప్రబలంగా శేషేంద్రపై ఉన్నట్లు ఈ గ్రంథం నిరూపిస్తుంది. అనుభూతి వాదానికి ఇది శాస్త్రీయపునాదిని ఏర్పరచింది. కవిసేన వచ్చిన తర్వాత ఒక మంచి మార్పు వచ్చింది. పూర్వం తెలుగుకవిత్వం వచన కవిత్వమనే పేరుతో వచన మైనస్ కవిత్వం. ఈ ఉద్యమం ప్రారంభమయ్యాక ప్రధాన కవిత్వ లక్షణమైన ఆలంకారికత లేక కావ్యాత్మకత కలిగిన కవిత్వాన్ని యువతరం రాయడం ప్రారంభించింది. కవిసమ్మేళనాలకు శ్రోతలు అసంఖ్యాకంగా వచ్చేవాళ్లు. ఇది ఒక చారిత్రక సత్యం.ఆ ఒరవడి నేటిదాకా కొనసాగింది. ఇప్పుడు వస్తున్నదంతా అదే రకమైన కవిత్వం. కవి అన్నవాడు అదే యాంగిల్‌లో రాయక, ఇంకెట్లా రాస్తాడు? దీని వల్లనే కవిసేన ఆధునిక తెలుగు వచనకవిత్వానికి కావ్యగౌరవం కల్పించడమే కాదు ఇతర భారతీభాషల్లోని కవిత్వం కన్నా తెలుగు కవిత్వం అత్యుత్తమంగా ఉండేలా తీర్చిదిద్దింది.
డా. అద్దంకి శ్రీనివాస్
------------------------------
ప్రతిభా విమర్శకు పరంధాముడు: గుంటూరు శేషేంద్రశర్మ
డా. అద్దంకి శ్రీనివాస్,
కవి , విమర్శకులు
విమర్శలో కుండలినీశక్తి లాంటివాడు శేషేంద్ర. ఆయనలోని అఖండశేముషీ ధురీణతను పట్టిచూపేవి ఆయన విమర్శగ్రంథాలే. అందులో షోడశి తలమానికం.
శేషేంద్రను కవిగా అంచనా వేయడం ఒక ఎత్తయితే పండితవిమర్శకుడిగా అంచనా వేయడం మరో ఎత్తు. శేషేంద్ర కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సహృదయత ఉంటే చాలు. కానీ శేషేంద్ర విమర్శలోని లోతులను అర్థం చేసుకోవాలంటే ప్రతిభతో పాటూ వ్యుత్పత్తి అభ్యాసాలూ మెండుగా పండాలి. శేషేంద్ర వాల్మీకిని శ్వాసించాడు. కవితా ప్రస్థానం కూడా వాల్మీకిలో కలిగినవిధంగానే కలిగింది (చండాలోపి మమ గురుః). ఆ తరువాత పురాణేతిహాస అనువాద వారసత్వం సోహ్రాబ్ రుస్తుం. వాల్మీకి (ఇతర కవుల) కవిత్వవిద్యను సాధారణ పాఠకుడిగానో భక్తుడుగానో పండితుడిగానో చదువుకొని ఆపేస్తే ఎందరో పండితుల్లాగా శేషేంద్ర కూడా అక్కడితో ఆగిపోయేవాడు. శేషేంద్రది ప్రతిభావిమర్శ, ఇంకా చెప్పాలంటే శేషేంద్రవిమర్శ. అదే ఆయా కవుల కవిత్వంలోని శాస్త్ర రహస్యాలను అన్వేషించేటట్టు చేసింది. ఇక వాల్మీకినైతే శేషేంద్ర దర్శించినట్లు మరెవ్వరూ దర్శించలేదు. శేషేంద్రకు వాల్మీకిదర్శనం అయ్యింది. శేషేంద్ర వాల్మీకికి శిష్యుడు, భక్తుడు. ఆ భక్తి వేరు.
విశ్వదృశ్యంనుంచి తాత్పర్యం పిండిన దివ్యపదార్థం రామాయణంలో ఉంది. దానిని విమర్శద్వారా పట్టి చూపాడు శేషేంద్ర. ఇది ప్రతి కావ్యం విషయంలోనూ జరగాలి అని శేషేంద్ర కల. దానికి సాకారమే కవిసేన మేనిఫెస్టో. కవిత్వంలో విలువల్నిగానీ వస్తురూపాల్లాంటి కావ్య సామాగ్రిని గానీ కవి ఆలోచనలే నిర్దేశిస్తాయని కవిసేన మేనిఫెస్టోలో చేసిన లక్షణానికి శేషేంద్ర కావ్యాలు లక్ష్యాలయితే దానికి మూలాలు రామాయణంలోనివే. వాల్మీకిని శేషేంద్ర చూసిందీ ఈ కోణంనుంచే. అందుకే శేషేంద్ర కవిత్వమూ సాహిత్యవిమర్శ వేరు కాదు అనేది. కవిత్వంలో చూపాల్సిన ప్రతిభను విమర్శలోనూ విమర్శలో చూపాల్సిన వ్యుత్పత్తిని కవిత్వంలోనూ జంటగా నడిపిన నేర్పు శేషేంద్రది. అంతర్లీనంగా కవులలో ఉండే అభ్యుదయాగ్నినీ, ఒకానొక కవనార్తినీ విమర్శకుడిగా జీర్ణించుకొన్న శేషేంద్ర నివురు కప్పిన నిప్పులా వెలిగిపోయాడు. రగిలిపోయాడు. సంస్కృత ఆంధ్ర కావ్యాలపై చేసిన పరిశోధనలు రెండూ శేషేంద్రకు రెండు కళ్ళయితే వాల్మీకిరామాయణం మాత్రం మూడో కన్ను.
భాగవతాన్ని అర్థం చేసుకోవాలంటే భక్తి ఒక్కటీ చాలు అన్నారు. భారతానికి భక్తీ యుక్తీ కావాలన్నారు. అదనంగా వ్యుత్పత్తీ కావాలట. ఇది ఎంత వాస్తవమో శేషేంద్రవిమర్శ అర్థం కావడానికి ప్రతిభ, వ్యత్పత్తి, అభ్యాసాలూ వాటితో పాటుగా వివిధ శాస్త్రాంశాలతో కంఠదఘ్నపాండితీగరిమ కూడా ఉండాలన్నది అంతే వాస్తవం. శేషేంద్రకి పాశ్యాత్యసాహిత్యదృక్పథం శరీరం. భారతీయ అంలంకారశాస్త్రం ఆత్మ. వీటి సమన్వయం శేషేంద్ర ప్రతిభ. సాధారణంగా కవిత్వానికి వ్యాఖ్యానం కావాలి. విమర్శవ్యాసాలకు అవసరం ఉండదు. కానీ శేషేంద్ర విషయంలో ఇది వ్యతిరిక్తం.
శేషేంద్ర సాహిత్యపు లోతుల్ని ఆవిష్కరింపజేసిన తాత్త్వికవిమర్శకుడు. లౌకికసత్యాలను వేదపరంగా సమన్వయించే శేషేంద్రగారి విమర్శనాన్వేషణ ఒక చెట్టు అయితే ఆయన కవిత్వం జీవతత్త్వం ప్రతిఫలించిన ఫలం. అందుకే విమర్శశిఖరాలపై కవిత్వదీపాలు వెలిగించిన క్రాంతదర్శి. ఈ నేపథ్యంలోంచి పురుడుపోసుకొన్నదే ఆధునిక మహాభారతం. ఇది ఆధునిక సాహిత్యంలో కావ్యేతిహాసాలు లేనిలోటు తీర్చింది. వేలసంవత్సరాలుగా సాగిన సాహిత్యకళ ప్రస్థానంలోని అన్ని దశలూ దిశలూ సారభూతంగా ఘనీభవించి అక్షరాకృతిని దాలిస్తే ఒక ఆధునిక మహాభారతం అవుతుంది. కొన్ని కొత్త సాహిత్యప్రయోజనాలు అవతరించవలసిన సంధికాలంలో సామాజిక చైతన్యాన్ని సాహిత్యగతం చేయటంకోసం శేషేంద్రశర్మ వచనకవితావాహికను ఎంచుకొన్నారు. అలా అని కావ్యత్వానికి భంగం వాటిల్లనివ్వని వ్యూహం శేషేంద్రది. ఇది విమర్శరంగం సృజనలో ప్రతిఫలించడానికి నిదర్శనం. అంతకు ముందు తెలుగులో వచనకవిత్వప్రక్రియ ఉంది. దానిది పాశ్చాత్యభూమిక. కానీ శేషేంద్ర వచనకవిత్వం పాశ్యాత్య రూపం, ప్రాచీన భారతీయకావ్యశాస్త్ర అంతరంగం కలది. అందుకే వర్తమాన కవిత్వంలో ఇతిహాసం ఒక అచుంబిత ప్రక్రియగా గుర్తించాడు. దీనికి ఇతివృత్తం ఉండదు. కానీ మానవసంఘర్షణనే ఆంతరిక ఇతివృత్తంగా గ్రహించి శేషేంద్ర వస్త్వైక్యం సాధించాడు. ఇది ఆధునిక కవిత్వానికి కొత్త దారి తెరిచిన దార్శనికతే కాదు విమర్శలోకానికి అంతుచిక్కని అనర్ఘరత్నం. పాశ్చాత్యదేశాల్లోనూ అప్పట్లో ఇటువంటి కావ్యాలే వస్తున్నాయి. అంతస్సూత్రం ఆధునిక మానవుడి సర్వతోముఖ అభ్యుదయకాంక్ష. మహాభారతంలాగా అంతుచిక్కని చిక్కని రహస్యాలను ఆవిష్కరించడమే దీని లక్ష్యం. పది పర్వాల బృహత్కావ్యం. శేషేంద్ర ఆత్మకు సమగ్రస్వరూపం. కవితా విశ్వరూపం. ఇందులో పర్వశబ్దాన్ని సార్థకంగానే విమర్శమూలాలను తాకిన వ్యక్తి కాబట్టే వాడగలిగారు. పర్వశబ్దం అగ్ని త్రయీ వేదానికి సంబంధించినది. భారతం అగ్ని విద్య కాబట్టి ఇందులోని భాగాలకు పర్వాలని పేరు. పర్వం అంటే గ్రంథి. రస బలాల గ్రంథి బంధనమే సృష్టి. రసబలాల తారతమ్యాలను బట్టి జీవసృష్టిలో వివిధగ్రంథులు ఏర్పడతాయి. ప్రతిగ్రంథిలోనూ రసం ఉంటుంది కాబట్టి భారతం ప్రతిపర్వ రసోదయం. 18 పర్వాలూ జీవితానికి అన్వయిస్తాయి. మానవ జీవితమే మహాభారతం. పైగా మహా భారతంలో నరుడే నాయకుడు. ధర్మరాజాదులు అతడి ప్రవృత్తులే. సాహిత్యంలో సామాన్యనరుడు నాయకుడైతే శేషేంద్ర గీతాచార్యుడు. ఏదైనా ఒక ఆర్షకావ్యాన్ని సాధారణంగా కాక ఇలా తాత్త్వికంగా ఆలోచించాలనే ఆలోచనలకు ఊపిరులూదిన వాడు సకాలీన సాహిత్యప్రపంచంలో శేషేంద్ర ఒక్కడే. ఆ ఆలోచనకు పరాకాష్ఠ షోడసి రామాయణ రహస్యాలు. కవిత సామాన్య జనులలోనికి కూడా ప్రవహించాలి. అందుకు విమర్శ తోడ్పడాలి. ఇదే శేషేంద్ర సాహిత్యప్రస్థానానికి పరమావధి.
కవిత్వంలోనైనా విమర్శలోనైనా విపరీతమైన కసిని పెంచుకొన్నవ్యక్తి శేషేంద్ర. ఆ కసిని అసిగా మార్చుకోవడమూ ఆయనకే చెల్లింది. విమర్శన పటిమకు, లోకోత్తర నిపుణతకు అప్పటివరకూ ఉన్న కాలం చెల్లిన రేఖల్ని తుడిచివేసి కొత్త రేఖ దిద్దిన విమర్శగ్రంథం 'కాలరేఖ'. వాల్మీకి, వ్యాస, కాళిదాస, మయూరాది సంస్కృతకవుల హృదయాలను అత్యంత నైపుణ్యంతో కొత్తగా ఆవిష్కరించిన విమర్శగ్రంథం . నిర్మలనైషధమందాకినీవీచికలలో ప్రతిభావ్యుత్పత్తులను రెక్కలుగా తొడుక్కొన్ని ఓలలాడి, అప్పటివరకూ నీరమే ననుకొంటున్న సాపితీలోకానికి హర్షకవిత్వక్షీరమాధురిని వేరుచేసి చూపించిన స్వర్ణహంస శేషేంద్ర. నైషధం ప్రౌఢమైనదని అందరూ చెప్పారు. శేషేంద్ర శ్రీహర్షుడిది శాంకర సంప్రదాయమని నిరూపించి మంత్ర, యోగ, వేదాంతాలకు అన్యటించాడు. నలుడు జీవాత్మ. భీముడు పరమాత్మ (నిర్గుణ బ్రహ్మము) దమయంతి శ్రీమహాత్రిపురసుందరి. ఇది శేషేంద్ర నిరూపణ. దీనికి ఉపనిషద్వాక్యాలను ఉట్టంకిస్తూ సమర్థించటం శేషేంద్ర పాండితీవైభవానికి పరాకాష్ఠ. ఇవన్నీ క్శీరధారలే. తాగి అరిగించుకోవడం మాన్యలకు తప్ప సామాన్యులకు అయ్యేపని కాదు.
షోడశి అంటే శ్రీవిద్య. ఇది మహాతంత్రాత్మకం. మంత్ర యోగవిద్యలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు రామాయణంలో ఉన్నాయని సోపపత్తికంగా మొట్టమొదట షోడశి - రామాయణ రహస్యాలు (1967) గ్రంథంలో శేషేంద్ర నిరూపించారని విశ్వనాథ సత్యనారాయణగారి మెచ్చుకోలు. కుండలినీ విద్యా ప్రబోధకమైనందువల్లనే సుందరాకాండకు ఆపేరు. సీతరూపంలో ఉన్న శక్తిదేవతే సౌందర్యనిధి. విద్యా , ప్రతిపత్ కళ, ఔపయికి వంటి ఉపమానాలు కల సీతాదేవియే శ్రీమహాలక్ష్మి. హనుమంతుడు కుండలినీ యోగసాధకుడు, త్రిజటా స్వప్నవృత్తాంతం గాయత్రీ మంత్రం, రావణుడు కౌళమార్గ సాధకుడు,ఇవన్నీ ధ్వనిగర్భితాలనీ వాల్మీకి హృదయసంకేతాలనీ శేషేంద్ర ప్రతిపాదనలు. అపూర్వాలు.నానంతరాలు.
భారతం రామాయణానికి ప్రతిబింబం. మేఘ సందేశానికీ రామాయణంతో సంబంధం ఉంది. రామాయణంలో ఉన్నది ఇంద్ర పారమ్యమే. ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. రామాయణం భారతానికి పూర్వగ్రంథమే. శాకుంతలంలోని నాందీ శ్లోకం దేవీతత్త్వబోధకమే. ఇవన్నీ శేషేంద్ర ఆలోచనాజలధినుంచి పుట్టిన అమృతఫలాలు. వీటిని నిరూపించడానికి విశ్లేషణ నికషోపలంగా సాగుతుంది. అన్నీ చెప్పడం సాధ్యం కాదుగానీ ఒక్క ఉదాహరణ చెప్తాను. అది రావణుడు కౌళమార్గయాయి అని నిరూపించడం. వామాచార మార్గాలని మొత్తం అయుదు ఉన్నాయి. వాటిలో కౌళం ఒకటి. ఇది కౌలం’ నుంచి వచ్చి ఉంటుంది. కొన్ని కులాచారాలు ఇలా కౌళంగా పరిణమించి ఉంటాయి. ఇది పంచ మకారాలను ఆశ్రయించి చేసే తాంత్రిక సాధన. ఇందులో పశు, వీర, దివ్య భావాలు ఉంటాయి. పశు భావన దశలో ఇంద్రియ సుఖాలను విపరీతంగా అనుభవిస్తారు. మోక్షం పొందాలనే తపన జ్వలిస్తూ ఉండడమే దానికి కారణం. ఇది ఒకరకంగా వైరభక్తి లాంటిదన్నమాట. మద్యం, మగువలను ఉపయోగించిన తరువాత వీరోపాసన చేస్తారు. చివరిదైన దివ్యభావన చేరితే సాధకుడు గమ్యం చేరినట్లే. కాని, అలా చేరిన వారు అరుదు. సృష్టి, స్థితి, లయాలలో చివరిదైన సంహార క్రమానికి కౌలంలో ప్రాముఖ్యం ఉన్నదని ఒక వాదం ఉంది. కానీ తగిన ఆధారాలు లేవు. ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ అందులో నుంచి బయటపడటం కష్టసాధ్యం. కనుక చాలా మంది అందులోనే కూరుకుపోతారు. పశుభావన దశలో ఇంద్రియ సుఖాలను అనుభవించి బయట పడగలిగినవారు గురువు సహాయాన్ని పొంది, ‘‘సోహం’’ భావనతో దివ్య భావన దశ చేరుతారని కౌలాన్ని పాటించేవారి విశ్వాసం. పంచ మకారాలను వీరు సమర్థిస్తారు. మద్యం కుండలినీ సాధనలో సహస్ర దళ పద్మం నుంచి అంటే సహస్రారం నుంచి స్రవించే (సుధ) అమృతమే. మనస్సును అదుపు చేసి, వాక్ తదితర ఇంద్రియాలను నియంత్రించి, పాప, పుణ్యాలను జ్ఞాన ఖడ్గంతో ఛేదించడమే ‘‘మాంసం’’. మత్స్యం అంటే ఇడా పింగళ నాడుల మధ్య శ్వాసే. నిత్యం కదులుతూ ఉంటుంది. ముద్రా భక్షణం అంటే అటుకులు తినడం కాదు. కుండలినీ శక్తిని సహస్రారం చేర్చి, బలమైన కోర్కెలకు కళ్ళెం వేయడం. మైథునం అంటే స్త్రీ సంగమం కాదు. జీవాత్మ, పరమాత్మల కలయిక. ఇదే దివ్య భావన.
సంస్కృతి నాగరికతల సృష్టికర్తలయిన కవులే లేకపోతే సమాజానికీ అరణ్యానికీ తేడా ఉండేది కాదు. మానవుల ప్రధానప్రవృత్తి కళాకారుడో కవో కావడమే. మానవుడు భాషకంటే సమున్నతుడు. కానీ భాషే నేడు మనిషిని శాసిస్తోంది. అందుకే కవిది సమాజంలో సర్వోన్నతస్థానం అని శేషేంద్ర తీర్పు. వైజ్ఞానిక విశ్లేషణలలో సత్యదృష్టి, విలువల పరిరక్షణ, విచక్షణ, ధైర్యం శేషేంద్ర బలాలు. విశ్వం మొత్తం ఊహాత్మకం. సంకేతాత్మకం. దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. వాటిని అర్థంచేసుకొంటే మన దృక్పథమూ, జీవితమూ మారిపోతాయి. గోళ, ఖండ, దేశ, జాతి లాంటి క్షుద్రబంధాలు తెగిపోతాయి. శారీరక పంజరం నుంచి ఆత్మకు విముక్తి. ఇది శేషేంద్ర తాత్త్వికజ్ఞానజ్యోతి. మానవ విలువల్ని మనం మతసైద్ధాంతిక కోణంనుంచి కాక వాటిని మానవవిధులుగా చూడాలి. ఇది శేషేంద్ర దార్శనికత.
'భారతరామాయణములను శర్మ చదివినట్లుగా చదివినవారి సంఖ్య లేదనియే చెప్పవలెను ' - అన్న విశ్వనాథవారి వాక్కులే శేషేంద్రకు శతకోటి జ్ఞానపీఠాలు. ఆధునిక మహాభారతం 2004 లో నోబుల్ బహుమతికి నామినేట్ అయిందని మనం సగర్వంగా చెప్పుకొంటున్నాం కానీ ఆ పురస్కారం దానికి రాకపోవడంలో ఒక సూచన కనిపిస్తోంది. భారతీయకావ్యాత్మను అర్థం చేసుకొనే స్థాయికి విశ్వసాహిత్యలోకం ఇంకా ఎదగాలేదనీ ఎదగాలనీ. అందుకే షోడశకళాపూర్ణుడు కావడంకోసం విశ్వమానవుణ్ణి ఈ షోడసిలోనికి ఆహ్వానిస్తూ..
డా. అద్దంకి శ్రీనివాస కవి , విమర్శకులు http://seshendrasharma.weebly.com www.facebook.com/shodasi/ -------