వాడుకరి:సత్యమేవ జయతే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంబేద్కర్‌, భారత రాజ్యాంగంNov 26 2015 @ 01:04AM‘1950 జనవరి 26న మనం వైరుధ్యాలమయమయిన జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. ఆర్థిక జీవనంలో అసమానత ఉంటుంది. రాజకీయంగా ఒక మనిషికి ఒకే ఓటు, ఒక ఓటుకి ఒకే విలువ ఉంటాయి. మన ఆర్థిక రాజకీయ వ్యవస్థ మూలంగా మన సామాజిక, ఆర్థిక జీవనంలో మనం ఒక మనిషికి ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాం. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించి తీరాలి. లేకపోతే, ఎంతో శ్రమించి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలు అనుభవిస్తున్నవారు ధ్వంసం చేస్తారు’. 1949 నవంబర్‌ 26న అంబేద్కర్‌ అన్న మాటలివి. రాజ్యాంగ దినోత్సవం నాడు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇదే.

ఏటా నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటించింది. ముంబైలో గత నెల 11న అంబేద్కర్‌ స్మారక కట్టడం శంకుస్థాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో రాజ్యాంగ దినోత్సవానికి సన్నాహాలు మొదలైనాయి. రాజ్యాంగం గురించి రాజ్యాంగ శిల్పి డాక్టర్‌ అంబేద్కర్‌ గురించి తెలియజెప్పే కార్యక్రమం ప్రతి ఏడూ ఇలాగే జరపాలని మోదీ చెప్పారు. ప్రతి విద్యాలయంలోనూ, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో దీనికి సంబంధించి కార్యక్రమాలుంటాయని ప్రకటించారు. రెండు రోజుల ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు కూడా జరుపుతామని మోదీ చెప్పారు.

జనవరి 26 రిపబ్లిక్‌ డే అని అందరికీ తెలుసు. అది రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చిన రోజు. మరి నవంబర్‌ 26 ప్రత్యేకత ఏమిటి? 1949లో ఆ రోజున రాజ్యాంగ సభలో చర్చలు పూర్తయినాక ముసాయిదా ఆమోదించబడింది. నరేంద్ర మోదీ తనదైన ముద్రతో ఆ శుభ దినానికి విశిష్టత కల్పించాలని నిర్ణయించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు - 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ముసాయిదాని, రాజ్యాంగ సభలో చర్చించి ఆమోదించిన రోజు 1949 నవంబర్‌ 26. ఈ రాజ్యాంగం పుట్టుపూర్వోత్తరాలు, అందులో అంబేద్కర్‌ పాత్ర కూడా విచిత్రమైనవి.

రాజ్యాంగ సభ 1946లో ఎన్నికైంది. అంటే స్వతంత్రం రాకమునుపే ఈ ప్రక్రియ మొదలైంది. ఆ ఎన్నికలు ఎవరు జరిపారు? బ్రిటిషు వలస పాలకులు. ఏ చట్టాల ఆధారంగా? 1935 గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్టు ప్రకారం జరిపిన ఎన్నికలు అవి. ఆ ఎన్నికల్లో ఓటర్లు ఎవరు? అప్పటికి వయోజన, సార్వత్రక ఓటింగు విధానం ఇంకా అమల్లోకి రానేలేదు. మరెవరు ఓటు వేశారు? అప్పటి జన సంఖ్యలో సుమారు 10 శాతం మందికే ఓటు హక్కు ఉండేది. ఎవరికి ఉండేది ఆ హక్కు? వివిధ రాష్ర్టాల్లో అధికారం, పలుకుబడి గల కులీనులే ఓటర్లు ప్రధానంగా; బాగా పన్నులు కట్టగలవారు, పెద్ద విద్యావంతులు ఓటర్లు, సామాన్యులు ఓటర్లు కాదు. ఇలా కులీన వర్గాల ద్వారా ఆయా రాష్ర్టాల్లో ఎన్నికైన ప్రతినిధులు 292 మంది. వీరిలో ఆయా మతాల జన సంఖ్యను బట్టి హిందువులు, ముస్లింలు, సిక్కులు ఉన్నారు. వివిధ సంస్థానాల ప్రతినిధులు 93 మంది రాజ్యాంగ సభ సభ్యులైనారు. ఒకరిద్దరికి రాజ్యాంగ సభలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చారు.

ఇలాంటి రాజ్యాంగ సభలో చర్చల ద్వారా నిర్ణయించబడిన విషయాల్ని ముసాయిదాపై సుమారు మూడేళ్లు చర్చించి సవరించి ఆమోదించారు. రాజ్యాంగ శిల్పిగా మనం చెప్పుకునే అంబేద్కర్‌ నిజానికి ఆ ముసాయిదా రచనా కమిటీ ఛైర్మన్‌. ఆ కమిటీకి చాలా పరిమితులుండేవి. కమిటీ సభ్యుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. కులీనుల సభ నిర్ణయాలనే వారు రచించాలి, సవరించి రాయాలి. బ్రిటిష్‌ ప్రభుత్వంలో కీలక అధికారి అయిన సర్‌ బెనెగల్‌ నర్సింగరావు ఈ కమిటీకి సలహాదారు. ఆయన ఐసిఎస్‌ అధికారి, రాజ్యాంగ చట్ట నిపుణుడు.

నిజానికి అంబేద్కర్‌కి ఈ బాధ్యతలు అప్పగించటం చాలా విచిత్రంగా జరిగింది. మహారాష్ట్రకి చెందిన ఆయన అక్కడి నుంచి ఎన్నిక కాలేదు. సరిగ్గా చెప్పాలంటే ఎన్నిక కాకుండా అడ్డుపడ్డారు. అప్పటి పాలక వర్గాల వారు, ముఖ్యంగా కాంగ్రెస్‌ నాయకులు, హిందూ మహాసభ వారు. అలాంటి స్థితిలో ఆయన బెంగాల్‌ నుంచి ఎన్నికైనారు. బెంగాల్‌ శాసనసభలోని ఎస్సీ ఫెడరేషన్‌ సభ్యులు, ముస్లిం లీగ్‌ మద్దతుతో ఎన్నికయ్యారు. 1946 జూన్‌ 29న బ్రిటిష్‌ పాలకులు, ఇండియాకి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని నియమించనున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 24న ఆ మంత్రి వర్గంలోని పేర్లను ప్రకటించారు కానీ ఆ జాబితాలో అంబేద్కర్‌ పేరు లేదు. కాంగ్రెస్‌ వారు జగ్జీవన్‌ రామ్‌ని మంత్రిగా ప్రకటించారు. బ్రిటిష్‌ వారు ప్రకటించిన ఈ లిస్టుని ఆమోదించవద్దని ఎస్సీ ఫెడరేషన్‌ జగ్‌జీవన్‌ రామ్‌కి విజ్ఞప్తి చేసింది. ఆయన మన్నించలేదు. అంబేద్కర్‌ లండన్‌ వెళ్లి దళితులకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఇంతలో 1947 ఆగస్టు వచ్చింది. దానితో పాటు దేశ విభజన, పాకిస్థాన్‌ ఏర్పాటు జరిగాయి. ఈ క్రమంలో అంబేద్కర్‌ ఎన్నికైన బెంగాల్‌ స్థానం తూర్పు పాకిస్థానలోకి వెళ్లింది. ఆయన రాజ్యాంగ సభలో సభ్యత్వం కోల్పోయారు. ఈ చీలిక వాతావరణంలో కాంగ్రెస్‌ నాయకత్వం దేశ ఐక్యత కోసం అని అంబేద్కర్‌ని, హిందూ మహాసభ నాయకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీని ఆహ్వానించి కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకున్నది. ఆ క్రమంలోనే అంబేద్కర్‌ని రాజ్యాంగ సభలోకి మళ్లీ తీసుకున్నారు. ఇంతకూ 1950 జనవరి 26 న అమలులోకి వచ్చిన రాజ్యాంగాన్ని ఎవరు, ఎలా రాశారు? దీని గురించి రాజ్యాంగ నిపుణులు చాలా వివరాలతో రచనలు చేశారు.

మొత్తంలో సుమారు 250 క్లాజులను (60 శాతం) 1935 బ్రిటిష్‌ రాజ్యాంగం నుంచి చాల వరకు యధాతథంగా, కొన్ని చోట్ల స్వల్ప మార్పులు చేర్పులతో తీసుకున్నారు. బ్రిటన్‌ రాజు లేదా రాణి నాయకత్వాన్ని లాంఛనంగా ఆమోదించి, ఇండియా కామన్వెల్తులో చేరింది. (ఐర్లాండ్‌ అలా చేరడానికి నిరాకరించిందని గమనించాలి, బ్రిటన్‌కి చాలా సన్నిహితం అయినప్పటికీ).

ఫ్రాన్సు నుంచి స్వేచ్ఛా భావనలను, ఐర్లాండు నుంచి ఆదేశిక సూత్రాలను, జపాన్‌ నుంచి సుప్రీం కోర్టు చట్టం సూత్రాలను, రష్యా నుంచి ప్రణాళికా పద్ధతిని, బ్రిటన్‌ పార్లమెంట్‌ నియమాల నుంచి దానికి సంబంధించిన విషయాలను, అమెరికా పాలకులు రూపొందించిన చట్టాల నుంచి మరి కొన్నిటిని గ్రహించారు. భారత రాజ్యాంగంపై అనేక వాల్యూముల వ్యాఖ్యానాలు రచించిన ప్రసిద్ధ రాజ్యాంగ నిపుణుడు దుర్గాదాస్‌ ఇలా అన్నారు. ‘ప్రపంచంలో తెలిసిన అన్ని రాజ్యాంగాల నుంచి వెదికి వెదికి కొల్లగొట్టి అత్యధిక నిబంధనలను అరువు తెచ్చారు’ (ఆయన ransack అనే పదం వాడారు). ‘‘ఇది అందమైన అతుకుల బొంత’’ (బ్యూటిఫుల్‌ ప్యాచ్‌ వర్క్‌) అని రాజ్యాంగ సభ చర్చల్లో (వాల్యూం 2, పేజీ 613-616) పేర్కొన్నారు. (బహుశా దీన్ని పరోక్షంగా ప్రస్తావించారేమో- మేరా జూతాహై జపానీ .. ఫీర్‌ భీ దిల్‌ హై హిందుస్తానీ అన్న ప్రసిద్ధ సినిమా పాటలో) ‘ఇది పాశ్చాత్యులకు బానిసత్వంతో కూడిన అనుకరణ’ అని కూడా ఆ సభలోనే కొందరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు శరత్‌ చంద్రబోస్‌ ఇలా అన్నారు: ‘ఈ రాజ్యాంగ అవతారికే దగాతో రూపొందించబడింది’.

రాజ్యాంగ తుది ముసాయిదాని ఆమోదానికై రాజ్యాంగ సభకు సమర్పిస్తూ అంబేద్కర్‌ ఇలా అన్నారు. ‘1950 జనవరి 26న మనం వైరుధ్యాలమయమయిన జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. ఆర్థిక జీవనంలో అసమానత ఉంటుంది.


రాజకీయంగా ఒక మనిషికి ఒకే ఓటు, ఒక ఓటుకి ఒకే విలువ ఉంటాయి. కానీ మన ఆర్థిక రాజకీయ వ్యవస్థ మూలంగా మన సామాజిక, ఆర్థిక జీవనంలో మనం ఒక మనిషికి ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాం. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించి తీరాలి. లేకపోతే, ఎంతో శ్రమించి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలు అనుభవిస్తున్నవారు ధ్వంసం (బ్లోఅప్‌) చేస్తారు’. 1949 నవంబర్‌ 26న అంబేద్కర్‌ అన్న మాటలివి. రాజ్యాంగ దినోత్సవం నాడు గుర్తు చేసుకోవాల్సిన అత్యంతముఖ్యమైన విషయం ఇదే. ఇది అంబేద్కర్‌ గురించి తెలియజెప్పాల్సిన రోజు అన్నారు మోదీ. ఇవాళ అన్ని పార్టీల వారూ ఆయన పేరుని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఆయన్ని రాజ్యాంగ శిల్పి అంటున్నారు. కానీ ఆయన రాజ్యాంగసభలో సభ్యుడు కాకుండా మొదట అడ్డుకున్నారు. 1952 ఎన్నికల్లో ఆయన్ను ఓడించారు. 1954లో ఒక ఉపఎన్నికలో పోటీ చేస్తే మరోసారి ఓడించారు. అలా ఓడింది రెండుసార్లూ రిజర్వుడు నియోజకవర్గంలోనే. ఆయనను లోక్‌సభకి ఎన్నిక కాకుండా చూశారు. రాజ్యసభ ద్వారా రానిచ్చారు. మంత్రిగా తీసుకున్నారు. 1951 సెప్టెంబర్‌ 27న మంత్రిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన్ని ఓడించారు. రాజ్యాంగ శిల్పికి పాలకవర్గాలు చేసిన సన్మానం ఇది.