Jump to content

కంపోస్టు

వికీపీడియా నుండి
కంపోస్టు
కంపోస్టు తయారీ యంత్రం

సాధారణంగా గ్రామాల్లో రైతులు పశువుల పేడను, వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలను కుప్పలుగా వేస్తారు. ఇట్లు చేయుట వల్లన అవి ఎండకు ఎండి, వానకు తడిసి సహజ పోషకాలను చాలావరకు కోల్పోతాయి. రైతులు కొంత శ్రమపడి సేంద్రీయ పదార్ధాలను సేకరించి ఒక గుంటలో వేసి కుళ్ళటానికి తగిన పరిస్ధితులు కల్పిస్తే అవి త్వరగా కుళ్ళి మంచి ఎరువుగా తయారవుతుంది. సాధారణ పరిస్ధితులలో సేంద్రీయ పదార్ధాలు కుళ్ళటానికి చాలా నెలలు పడుతుంది. కుళ్ళే ప్రక్రియ చాలా త్వరగా జరగటానికి అనువైన పరిస్ధితులను కల్పించడాన్ని కంపోస్టింగ్ (Composting) అని అంటారు. ఇలా తయారయిన ఎరువును కంపోస్టు (Compost) అంటారు.[1]

కంపోస్టింగ్ అనువైన వ్యర్ధ పదార్ధాలు

[మార్చు]

ఎండుగడ్డి / గైరిసీడియా లేత కొమ్మలు / ఎండుఆకులు / కలుపు మొక్కలు / వివిధ నూర్చిన తర్వాత వచ్చిన వ్యర్ధ పదార్ధాలు / కంచెల్లో పెరుగుతున్న తంగెడు, దిరిశెన, కానుగ, వావిలి మొదలయిన మొక్కల ఆకులు, కొమ్మల భాగాలు / పశువుల పేడ, గొర్రెల / కోళ్ళ పెంట, మూత్రములు / గోబర్ గ్యాస్ ప్లాంట్ స్లర్రీ మొదలయిన వాటిని కంపోస్టు ఎరువు తయారుచేయటానికి వాడుకోవచ్చును.[2]

కంపోస్టు గుంట పరిమాణము
5.2మీ x 2 మీ x 1 మీ

కంపోస్టింగ్ పద్ధతి

[మార్చు]

5.25.2 మీటర్ల పొడవు, 2 మీ వెడల్పు, 1 మీ లోతు గుంటను పొలంలో ఒక మూల వీలయితే చెట్ల నీడలో త్రవ్వాలి.

  • ఇలా త్రవ్విన గుంటలో నీరు నిలువకుండా సులభంగా ఇంకిపోవడానికి దిబ్బ అడుగున రాళ్ళు, పెంకులు వంటివి 6 అంగుళాల మందము పరవాలి.
  • సేకరించిన వ్యర్ధ పదార్ధాలను, చెత్తను 6 అంగుళాల మందము వరకు నింపి దానిపైన పేడను ఆపైన సూపర్ ఫాస్పేట్ సుమారు 1 కిలో చిలకరించాలి. ఈ పద్ధతిన పొరలు, పొరలుగా వ్యవసాయ, పశువుల వ్యర్ధ పదార్ధాలపై సూపర్ ఫాస్పేట్ ను చిలకరించి ఈ విధముగా భూమట్టానికి 12 ఎత్తువరకు అమర్చిన తర్వాత అందులో తేమ పెంచటానికి నీళ్ళు చిలకరించవలయును.
  • ఆ తర్వాత గాలి సోకకుండా మట్టి, పేడ మిశ్రమంలో పూత పూయవలయును.
  • ఈ విధముగా కూర్చిన తరువాత గుంతలో వేసిన సేంద్రీయ పదార్ధాలు క్రుళ్ళి సుమారు 75 – 90 రోజులలో మంచి సారవంతమయిన కంపోస్టు తయారవుతుంది.
  • ఈ ప్రక్రియలో గుంతలో ఉత్పన్నమయిన వేడికి (40 – 50 సెంటీగ్రేడ్) అందులోని హానికారక శిలీంధ్రాలు, రోగకారక క్రిములు, కీటకాలు నశించును.

కంపోస్టింగ్ త్వరగా జరగడానికి అనువైన పరిస్ధితులుపంటవ్యర్ధ పదార్ధాల ఎంపిక

[మార్చు]
  • పంటవ్యర్ధ పదార్ధాలలలో వుండే కర్బన, నత్రజని మోతాదులను బట్టి కుళ్ళటానికి పట్టే సమయం ఆధారపడి ఉంటుంది. కర్బన, నత్రజని నిష్పత్తి ఏ పంట వ్యర్ధాలలో ఎక్కువ ఉంటుందో అవి త్వరగా కుళ్ళుతాయి. (ఉదా : గైరిసీడియా లేత కొమ్మలు, ఆకులు, గడ్డి ఆకులు, పశువుల మల మూత్రాదులు, మొదలయిన వాటిలో కర్బన, నత్రజని మోతాదు ఎక్కువ ఉండడము వలన త్వరగా కుళ్ళుతాయి.)[3]
  • కర్బన, నత్రజని నిష్పత్తి తక్కువగా వుండే చెక్కపొడి, రంపపు పొట్టు, వరిగడ్డి మొదలయినవి త్వరగా కుళ్ళవు.
  • కనుక కంపోస్టు త్వరగా 3 నెలలలోపు తయారవాలంటే కర్బన, నత్రజని మోతాదు ఎక్కువ వున్న వ్యర్ధ పదార్ధాలు ఎన్నుకోవాలి.
  • కంపోస్టు దిబ్బలో ఎక్కువ ఎండుపుల్లలవంటివి ఉన్నట్లయితే యూరియా 1 కిలో గుంతలో చల్లడం వలన త్వరగా కుళ్ళుతుంది.
  • పంటల వ్యర్ధ పదార్ధాలు చిన్నవిగా వున్నట్లతే త్వరగా కుళ్ళి ఎరువు తయారవుతుంది.
  • గుంతలో తేమ ఎప్పుడూ తగినంత ఉండాలి.
  • తేమ ఉండడము వలన సేంద్రీయ పదార్ధాలు కుళ్ళడానికి దోహదపడే సూక్ష్మజీవులు అధికంగా వృద్ధి చెంది వ్యర్ధ పదార్ధాలు త్వరగా కుళ్ళుతాయి. అందువలన దిబ్బపై తరచుగా నీటిని చిలకరిస్తూండాలి.
  • ఎట్టి పరిస్ధితులలోను కంపోస్టు గుంతలో నీరు నిల్వ ఉండకూడదు.
  • నీరు నిల్వ ఉన్నట్లతే దిబ్బలో గాలి సోకక, హానికారక సూక్ష్మజీవులు (ప్రాణవాయువు అవసరంలేనివి) పెరుగుతాయి. తెగుళ్ళకు సంబంధించిన సూక్ష్మజీవులు కూడా పెరిగే అవకాశం ఉంది.
  • ఇటువంటి పరిస్ధితుల్లో గుంత నుండి చెడు వాసన రావడం మొదలవుతుంది.
  • సాధ్యమైనంత వరకు తేమ త్వరగా ఆరిపోకుండా ఉండడానికి కంపోస్టు గుంటను చెట్ల నీడలో వేసుకోవాలి. తరుచుగా నీరు చిలకరించాలి.[4]

కంపోస్టింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు

[మార్చు]
  • నీరు ఇంకే, నీరు నిలువకుండా కొంచెం వాలుగా వున్న స్థలం మంచిది. ఎంపిక చేసుకున్న స్థలం ఇళ్ళకు దూరంగా, లేదా పొలం దగ్గర చెట్ల క్రింద ఉండాలి.
  • కుప్పలో వేడిమి 60 – 90 సెంటీగ్రేడ్ డిగ్రీల వరకు గడ్డి మొలకలు, గడ్డి విత్తనాలు, రోగకారక సూక్ష్మజీవులు చనిపోతాయి.[5]
  • కంపోస్టు కుప్పలోని అన్ని భాగాలకు గాలి బాగా ఆడాలి. అందువల్ల సూక్ష్మజీవులకు అవసరమయిన ఆక్సిజన్ లభించడమే కాకుండా ఉత్పత్తి అయిన కార్బన్ – డై – ఆక్సైడ్ బయటికి వెళ్ళే అవకాశముంటుంది. బెడ్ లో వేసే వ్యర్ధ పదార్ధాలను 1 – 2 అంగుళాల సైజు ముక్కలుగా చేసి వేస్తే గాలి బాగా ఆడుతుంది.
  • కంపోస్టింగ్ ప్రక్రియ త్వరగా జరగడానికి కుప్పలో పి హెచ్ (Ph) ఉదజని సూచిక 6.5 నుండి 7.5 మధ్యలో వుండేట్లు చూసుకోవాలి.

కంపోస్టు వాడడం వల్ల లాభాలు

[మార్చు]
  • నత్రజని, పొటాష్, భాస్వరం వంటి పోషకాలే కాకుండా కాల్షియం, మెగ్నీషీయం, బోరాన్, జింక్, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా పంటకు అందుతాయి.[6]
  • యూరియా, డిఎపి, పొటాష్ వంటి ఎరువులు వాడనక్కరలేదు.[7]
  • పంటకు తెగుళ్ళను తట్టుకునే శక్తి పెరుగుతుంది. అందువల్ల క్రిమినాశక మందులకు అయ్యే ఖర్చు బాగా తగ్గుతుంది.
  • కంపోస్టు వాడితే పంటకు నీరు తక్కువ పట్టి నీరు ఆదా అవుతుంది.
  • నేలలోకి గాలి బాగా వీచేలా, నీరు బాగా ఇంకేలా చేస్తుంది. నీటిని నిల్వ ఉంచే సామర్ధ్యాన్ని పెంచుతుంది.[8][9][10]
  • కంపోస్టు ఎరువులోని జిగురు పదార్ధాలు మట్టిని పట్టుకొని వుండడం వల్ల మట్టికోత తక్కువగా ఉంటుంది.
  • నేలను సారవంతం చేసే సూక్ష్మక్రిములు సంఖ్యను బాగా పెంచుతుంది. భూమికి సేంద్రీయ కర్బనం లభిస్తుంది.
  • భూమి సారవంతమై పంట దిగుబడి ఎక్కువవుతుంది.
  • ప్రతి ఏటా పంట దిగుబడి నిలకడగా ఉంటుంది.
  • పండిన పంట త్వరగా చెడిపోదు. మంచి రుచిగా ఉంటుంది.[11]

కంపోస్టు తయారయ్యేటప్పుడు ఉత్పన్నమయ్యే కొన్ని సమస్యలు – కారణాలు – పరిష్కారాలు

[మార్చు]
కనుగొన్న విషయం సమస్య కారణాలు పరిష్కారం
1. దిబ్బవేడెక్కదు సూక్ష్మజీవులు పెరగటం లేదు వ్యర్ధపదార్ధాలు బాగా తడిగా లేదా పొడిగా ఉండి ఉండవచ్చును. దిబ్బలో గాలి ప్రసరణ బాగా తక్కువ కర్బన, నత్రజని నిష్పత్తి సరిగా లేదు మట్టి బాగా ఎక్కువగా ఉండి ఉండవచ్చు దిబ్బను నీటితో గాని, మూత్రంతో గాని తడపాలి. దిబ్బలోని సేంద్రీయ పదార్ధాలను కలిపి కదలించాలి. దిబ్బకు నత్రజని ఎక్కువ ఉండే పశువుల పేడ కలపాలి. కొద్ది పరిమాణంలో యూరియా సూపర్ ఫాస్ఫేట్ చిలకరించాలి.
2 . దిబ్బ అకస్మాత్తుగా చల్లబడిపోతుంది సూక్ష్మజీవుల చర్య ఆగిపోతుంది సేంద్రీయపదార్ధాలు బాగా పొడిగాఉండి ఉండవచ్చు. నత్రజని అంతా అయి పోయి ఉండవచ్చు. దిబ్బను నీటితో గాని, మూత్రంతో గాని తడపాలి.

దిబ్బను నత్రజని ఎక్కువ ఉండే పేడ కలపాలి.

3 . దిబ్బలోని సేంద్రీయపదార్ధాలపై తెల్లని బూజు అంటినట్లుంది బూజు చాలా ఎక్కువగా వృద్ధి చెందటము అయిఉంటుంది. సేంద్రీయ బాగా పొడిగా ఉండవచ్చు. దిబ్బలోని పదార్ధాలను కలియ తిరగబెట్టి చాలా కాలం అయి ఉండవచ్చు. దిబ్బను తిరగతోడి మరలా తయారు చేయాలి. దిబ్బను నీటితో గాని, మూత్రంతో గాని తడపాలి. నత్రజని ఎక్కువ ఉండే సేంద్రీయ పదార్ధాలు కలపాలి.
4 . సేంద్రీయపు ఎరువు నల్లగా, పచ్చగా తయారయింది దిబ్బ దుర్వాసనగా ఉంటుంది. దిబ్బ గుల్లగా లేకపోవడం వలన గాలి ప్రసరణ సరిగ్గా లేదు. నత్రజని పదార్ధాలు మరీ ఎక్కువగా ఉండి ఉండవచ్చు. దిబ్బలో నీరు నిలిచి

ఉండవచ్చు. దిబ్బను సరిగ్గా కలియబెట్టి ఉండకపోవచ్చు. || కర్బన మోతాదు ఎక్కువగా ఉన్న పదార్ధాలతో దిబ్బను తయారు చేయాలి. దిబ్బ వేడెక్కే దశలో తరచుగా ఎక్కువసార్లు కలియబెట్టాలి.

మూలాలు

[మార్చు]
  1. జాలగూడు[permanent dead link]
  2. Masters, Gilbert M. (1997). Introduction to Environmental Engineering and Science. Prentice Hall. ISBN 9780131553842.
  3. "Composting for the Homeowner - University of Illinois Extension". Web.extension.illinois.edu. Archived from the original on 24 February 2016. Retrieved 2021-03-10.
  4. "Composting for the Homeowner -Materials for Composting". uiuc.edu. Archived from the original on 25 December 2009. Retrieved 2021-03-10.
  5. Lal, Rattan (2003-11-30). "Composting". Pollution a to Z. 1.
  6. "The Effect of Lignin on Biodegradability - Cornell Composting". cornell.edu.
  7. Bahramisharif, Amirhossein; Rose, Laura E. (2019). "Efficacy of biological agents and compost on growth and resistance of tomatoes to late blight". Planta. 249 (3): 799–813. doi:10.1007/s00425-018-3035-2. ISSN 1432-2048. PMID 30406411.
  8. Morel, P.; Guillemain, G. (2004). "Assessment of the possible phytotoxicity of a substrate using an easy and representative biotest". Acta Horticulturae (644): 417–423. doi:10.17660/ActaHortic.2004.644.55.
  9. Itävaara et al. Compost maturity - problems associated with testing. in Proceedings of Composting. Innsbruck Austria 18-21.10.2000
  10. Aslam DN, et al. (2008). "Development of models for predicting carbon mineralization and associated phytotoxicity in compost-amended soil". Bioresour Technol. 99 (18): 8735–8741. doi:10.1016/j.biortech.2008.04.074. PMID 18585031.
  11. EPA OSWER ORCR, US (2013-04-16). "Reduce, Reuse, Recycle - US EPA" (PDF). US EPA. Retrieved 2021-03-10.
"https://te.wikipedia.org/w/index.php?title=కంపోస్టు&oldid=3719002" నుండి వెలికితీశారు