క్రికెట్ చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1836 ఆగస్టు 3న హాంప్టన్ కోర్ట్ గ్రీన్‌పై రాయల్ అమెచ్యూర్ సొసైటీ సభ్యులు ఆడిన మొదటి గ్రాండ్ క్రికెట్ మ్యాచ్

చారిత్రకంగా మనకు తెలిసినంతవరకూ 16వ శతాబ్దం ఉత్తరార్థం నుంచి క్రికెట్ ఆట చరిత్ర ప్రారంభమవుతోంది. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో పుట్టిన ఈ ఆట 18వ శతాబ్దంలో ఆ దేశానికి జాతీయ క్రీడగానూ, 19, 20 శతాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్రీడగానూ అభివృద్ధి చెందింది. 1844 నుండి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నారు. 1877లో టెస్ట్ క్రికెట్ ప్రారంభమైందని తర్వాతి తరాల చరిత్రకారులు గుర్తించారు. అసోసియేషన్ ఫుట్‌బాల్ (సాకర్) తర్వాత ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన రెండవ వీక్షక క్రీడ క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) అంతర్జాతీయ క్రికెట్‌ పరిపాలన చూస్తూంటుంది, దీనిలో వందకు దేశాలు, ప్రాంతాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం సభ్యదేశాల్లో పన్నెండు మాత్రమే టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాయి.

తొలినాళ్ళలో క్రికెట్

[మార్చు]

ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో కెన్ట్ నుంచి సస్సెక్స్ వరకూ ఉన్న వీల్డ్ అనే ప్రాంతంలో సాక్సన్ల కాలంలో కానీ, నార్మన్ల కాలంలో కానీ పిల్లలు కనిపెట్టిన ఆటగా క్రికెట్ ప్రారంభమై ఉండొచ్చు. ఇది దట్టమైన అడవి, అడవులు కొట్టి ఏర్పరిచిన ఖాళీ ప్రదేశాలతో నిండిన ప్రాంతం.[1] అత్యంత ప్రాచీనమైన క్రికెట్ ఆట కోసం కచ్చితమైన ఆధారం కోసం వెతుకుతూ వెళ్తే అది 1597 జనవరి 17 (పాత పద్ధతిలోని జూలియన్ తేదీ, ఆధునిక క్యాలెండర్‌లో ఇది 1598కి సమానం) సోమవారం నాడు లభిస్తోంది.

ఆట మూలాల గురించి అనేక ఊహాగానాలు ఉన్నాయి, వీటిలో కొన్నిటిలో ఫ్రాన్స్‌లో లేదా ఫ్లాన్డర్స్‌లో ప్రారంభమైందని చెప్తారు. ఈ ఊహాజనితమైన సూచనలలో మొట్టమొదటిది ఈ ఆట 1300 మార్చి 10 నాటిదని చెప్తుంది. దానిలో భవిష్యత్ రెండవ ఎడ్వర్డ్ రాజు వెస్ట్ మినిస్టర్, న్యూయెండెన్ గ్రామాలు రెండింటిలో "క్రీగ్", ఇతర ఆటలు ఆడుతున్నట్టు ఒక మూలంలో రాసివుంది. ఈ వివరణ "క్రీగ్" (creag) అనేది క్రికెట్ కోసం ఓల్డే ఇంగ్లీష్ (ప్రాచీన ఆంగ్లం) పదం అని సూచించిస్తూంది, కాని నిపుణుల అభిప్రాయం ప్రకారం "వినోదం, ఆటలు" అన్న అర్థం వచ్చే "క్రేక్" (craic) అన్న పదానికి పూర్వపు స్పెల్లింగ్ మాత్రమే కానీ క్రికెట్‌కి పూర్వ పదం కాదు.[2]

17వ శతాబ్దం ప్రారంభంలో పెద్ద ఎత్తున పెద్దవారు ఆడడం మొదలుపెట్టడాని కన్నా ముందు చాలా తరాల పాటు క్రికెట్ పిల్లల ఆటగా ఉండేదని సాధారణంగా నమ్ముతారు. క్రికెట్ బౌల్స్ నుండి పుట్టి ఉండవచ్చు, బౌల్స్ అనే ఆటలో కిందుగా బంతిని టార్గెట్ వైపుకు విసురుతారు. ఈ బౌల్స్‌లో బంతి వేసే బౌలర్‌కీ, వారి టార్గెట్‌కి మధ్యలో బ్యాట్స్‌మ్యాన్‌ని ప్రవేశపెట్టి అడ్డుకుని దూరంగా బంతిని కొట్టడానికి ప్రయత్నించేలా మార్పుచేస్తే క్రికెట్ పుట్టిందని భావిస్తారు. గొర్రెలు మేసిన భూమిపై కానీ, అడవుల మధ్య ఖాళీ భూమిలో, ముద్దగా చుట్టిన గొర్రె ఉన్ని (లేదా ఒక రాయి కానీ, ఒక చిన్న చెక్క ముక్క కానీ)తో ఆడి ఉండవచ్చు; కర్ర కానీ, చెక్క ముక్క కానీ, మరేదైనా సాధనం కానీ బ్యాట్‌గానూ, కూర్చునే స్టూల్ కానీ, చెట్టు మొదలు కానీ, కంచెకో, ఇంటికో ఉండే గేటు కానీ వికెట్‌గానూ ఆడేవారు.[3]

మూలాలు

[మార్చు]
  1. Wynne-Thomas, Peter (1997). From the Weald to the World. Stationery Office Books.
  2. Altham, H.S. (1962). A History of Cricket, Volume 1 (to 1914). George Allen & Unwin.
  3. Birley, Derek (1999). A Social History of English Cricket. Aurum.

వెలుపలి లంకెలు

[మార్చు]