ఘంటా గోపాల్‌రెడ్డి
ఘంటా గోపాల్‌రెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తిపోతల పథకాల సృష్టికర్త.[1]
జీవిత విశేషాలు
[మార్చు]గోపాల్‌రెడ్డి 1932 ఫిబ్రవరి 14న నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో జన్మించాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో 1948-52 వరకు వ్యవసాయ విద్యనభ్యసించాడు. అనంతరం నల్లగొండలో వ్యవసాయ విస్తరణాధికారిగా కొంతకాలం సేవలందించాడు. 1958లో అమెరికాకు వెళ్లిన గోపాల్‌రెడ్డి 1960-64 వరకు అగ్రికల్చర్ పీజీ పూర్తిచేసి, 1969లో పీహెచ్‌డీ పూర్తిచేశాడు.[2] 1964 నుంచి 1969 వరకు హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించాడు. నాగార్జునసాగర్ ఎడమకాలువ తవ్వకాల సమయంలో కాలువకు ఎగువ భాగంలోని బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు సుదీర్ఘంగా పోరాటం చేశాడు. 1969లో మహాత్మాగాంధీ ఎత్తిపోతల నిర్మాణానికి కృషిచేశాడు. ఈ పథకాన్ని ఏర్పాటుచేసి రైతుల బీడు భూముల్లో పంట సిరులు కురిపించాడు. దీని నిర్మాణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తిపోతల సృష్టికర్తగా ఆయన మన్ననలు అందుకున్నాడు. రైతులకు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో శిక్షణలు ఇప్పించాడు. పలు కొత్త వంగడాలను ఆయన సృష్టించారు.[3] శ్రీమాతృకృపా గడ్డిపల్లి అభ్యుదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 1984-85లో గడ్డిపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పాడు.
1980లో గడ్డిపల్లి చుట్టూ ఉన్న ఏడు గ్రామాల రైతులను సమీకరించి అందరి సహకారంతో రైతు సేవా సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులకు అనేక సేవలు అందించాడు. గడ్డిపల్లి కేవీకే కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పనిచేసి వ్యవసాయ పరంగా విస్తృత సేవలు అందించాడు. కేవీకే ద్వారా చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1994లో ఉత్తమ కేవీకేగా ఎంపిక చేసింది. అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చతురానందమిశ్రా చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. అలాగే జిందాల్ అవార్డును కూడా పొందాడు. దీని ద్వారా వచ్చిన రూ.25 లక్షలను గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు కేటాయించాడు. ఇవే కాకుం డా గ్రామంలో ఆదర్శ పాఠశాల ఏర్పాటుకు 8 ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందజేసాడు.[4]
మరణం
[మార్చు]కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు 2018, ఏప్రిల్ 14 శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గోపాల్‌రెడ్డికి భార్య రత్నమాల, ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, మీరా, కుమారుడు అజిత్‌రెడ్డి ఉన్నారు. అజిత్‌రెడ్డి పాండిచ్చేరిలోని అరవింద ఆశ్రమంలో స్వచ్ఛంద కార్యకర్తగా సేవలందిస్తున్నాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "ఎల్-27 ఎత్తిపోతల పథకం ఆదర్శనీయం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2018-04-15.
- ↑ "వ్యవసాయ శాస్త్రవేత్త గోపాల్‌రెడ్డి కన్నుమూత". Retrieved 2018-04-15.[permanent dead link]
- ↑ "వ్యవసాయ మాంత్రికుడు గోపాల్‌రెడ్డి కన్నుమూత -". www.andhrajyothy.com. Archived from the original on 2018-04-17. Retrieved 2018-04-15.
- ↑ 4.0 4.1 "అపర భగీరథుడు గోపాల్‌రెడ్డి అస్తమయం". Retrieved 2018-04-15.