చెన్నమరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox p erson

చెన్నమరాజు కవి పరిచయము[మార్చు]

ఈకవి చారుచంద్రోదయ మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును జేసెను. ఇతడు నందవరీక నియోగిబ్రాహ్మణుడు; ఆత్రేయగోత్రుడు; శేషయామాత్యపుత్రుడు. ఈకవి తాను పెమ్మసాని తిమ్మరాజున కాశ్రితుడయినట్టు చెప్పి తిమ్మరాజు శ్రీరంగనాయనికిని వేంకటపతిరాయనికిని మంత్రియైన ట్టొకపద్యములో నీక్రింది వాక్యముతో జెప్పియున్నాడు -

సీ. శ్రీరంగరాయ ధాత్రీతలాధ్యక్ష దక్షిణభుజాదండమై చెలగినాడు.
రమణ వేంకటపతిరాయేంద్రుడు నుతింప బటుకార్యదక్షుడై ప్రబలినాడు

ఈకవి తనముత్తాతయైనలక్ష్మీపతి శ్రీనాథకవికి శిష్యుడై నట్లీక్రింది పద్యములలో దెలిపియున్నాడు-

క. సన్నుత కవిత్వవిద్యా|భ్యున్నతి శ్రీనాథసుకవిపుంగవుకరుణన్
   జెన్నమరున్ లక్ష్మీపతి|చెన్నమరాజప్రధాన శేఖరు డెలమిన్.

ఈకవి శ్రీరంగరాయ వేంకటపతిరాయల కాలములోనున్నవా డగుటచేత క్రీస్తుశకము 1574-1614 సంవత్సరములమధ్య కాలమువాడని తెలియుచున్నది.

కవియొక్క కవిత్వరీతి[మార్చు]

కవియొక్క కవిత్వరీతి తెలియుటకై చారుచంద్రోదయములోని పద్యముల రెంటిని నిందుదాహరించ బడినవి.

ఉ. ఎల్లి యవశ్యమున్ పనికి నేగి మహోగ్రతపం బొనర్చి సం
   వల్లలనామనోహరుకృపన్ వరలాభము గాంచివత్తు నీ
   యుల్లమునం బ్రమోదము సముల్లసితంబుగ నిందు నిల్వు మో
   పల్లవపాణి యంచు బ్రియభాషల భూవిభు డాదరించినన్.

శా. తావు ల్గుల్కెడుమేనుతీవకు బరీతాపంబు గావించునీ
   జీవంజీవమనోజ్ఞ మూర్తి యకటా శీతాంశువా కాదు శో
   భావై రూప్యమునన్ జనభ్రమదమౌ భస్మానృతానంగతే
   జోవై శ్వానరవిస్ఫులింగముసుమీ చూడన్ దిశానాయకా.

మూలాల జాబితా[మార్చు]

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు .. చెన్నమరాజు