Jump to content

దోమకాటుతో వచ్చే వ్యాధులు

వికీపీడియా నుండి

దోమ సాధారణంగా ఎక్కడపడితే అక్కడ కనిపించే కీటకం. అది మనుషుల రక్తం తాగి బతుకుతుంది. అయితే అలా అది రక్తం పీల్చేప్పుడు మన శరీరంలోకి కొన్ని క్రిములను కూడా విడుదల చేస్తుంది. ఆ క్రిముల వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. అందులో కొన్ని ఇక్కడ.[1]

మలేరియా

[మార్చు]

లక్షణాలు

[మార్చు]
  • తీవ్రమైన చలిజ్వరంతో మొదలవుతుంది. తలనొప్పి, ఒంటినొప్పితో బాధపడతారు. లక్షణాలు ముఖ్యంగా మూడు దశలుగా గుర్తించవచ్చును.
  • చలిదశ : చలి, వణుకు, తలనొప్పితో బాధలు మొదలు అవుతాయి. రోగి దుప్పట్లు కప్పుకొంటాడు.. ఈ విధంగా 15 ని.ల నుండి 1 గంటవరకు ఉంటుంది.
  • వేడి దశ :శరీరమంతా మంటలతో తీవ్రమైన జ్వరం వచ్చును. తీవ్రమైన తలనొప్పి, వాంతి వికారములకు లోనవును. ఇది 2 నుండి 6 గంటల వరకు ఉండును. నాడి వాడిగా కొట్టుకుంటుంది. దప్పిక ఎక్కువ అవుతుంది.
  • చెమటదశ :జ్వరం తగ్గుతుంది. చెమటలు పోస్తాయి. రోగికి నిద్ర కలుగుతుంది. తరువాత నీరసంగా వుంటుంది. ఇది 2 నుండి 4 గంటల వరకు ఉంటుంది.
  • రోజు విడిచి రోజు జ్వరం వచ్చుట
  • తలనొప్పి
  • వంటినొప్పి
  • వణుకుతో కూడిన చలి రావటం, చెమటలు
  • వాంతులగుట
ప్రపంచవ్యాప్తంగా మలేరియా ప్రభావిత ప్రాంతాలు

రోగ కారణాలు

[మార్చు]
  • ప్లాస్మోడియా వైవాక్స్
  • ప్లాస్మోడియా ఫాల్సిపేరమ్
  • ప్లాస్మోడియా ఓవేల్
  • ప్లాస్మోడియా మలేరియా
  • ఈ జ్వరానికి కారణం – ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి. రోగి శరీరంలో ఈ సూక్ష్మజీవులుంటాయి. అనాఫిలిసం జాతికి చెందిన ఆడ దోమ ఈ రోగిని కుట్టి రక్తంతోపాటు సూక్ష్మ జీవులను కూడా పీల్చుకుంటుంది. అలాంటి దోమ ఇతర ఆరోగ్యవంతులను మళ్ళీ కుట్టినప్పుడు వారికి సంక్రమిస్తుంది. వారికి 10 – 15 రోజుల తరువాత జ్వరం వస్తుంది.
మలేరియాకు దోమకాటు కారణం

వ్యాధి వ్యాప్తి చెందే సమయం

[మార్చు]

జూలై – నవంబరు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

[మార్చు]
  • జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్ష చేయించాలి. మలేరియా అని నిర్ధారణ అయితే క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవాలి. రక్త పరీక్ష చేసే సదుపాయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లభిస్తుంది. దోమల ద్వారా ఈ జ్వరం వ్యాపిస్తుంది. కావున దోమలు పుట్టి పెరిగే స్థావరాలను అరికట్టాలి. నీరు నిలకడ ప్రదేశాలను పూడ్చి వేయాలి.
  • ఇంటి పరిసరాలలో గుంతలు గోతులు లేకుండా జాగ్రత్త పడాలి.
  • ఇంటి బయటపడుకునేవారికి దోమ తెర, వంటి నిండా బట్ట ఉంచుకోమని తెలియ చేయడం.
  • వేపనూనె ఒంటికి రాసుకుంటే దోమ కుట్టదు.
  • చిన్నచిన్న చెరువులు, గుంటలలో గంబూసియా లేక గప్పి చేపలు వదలడం.
  • ఇంటిపై కప్పులో వున్న ట్యాంకులు (ఓవర్ హెడ్ ట్యాంకులు), నీటి కూలర్స్ మొదలగు నీటి తొట్లలో దోమలు పెరగకుండా చూసుకోవాలి.
  • జూన్ – మలేరియా మాసం. ఈ నెలలో స్ర్పే జరిగిందా లేదా చూసుకోవాలి. గ్రామ పంచాయితీలో యాంటీ లార్వలం (దోమ పిల్లలను చంపుట) జరిగిందా లేదా చూసుకోవాలి.
  • చలిజ్వరం కేసులున్నప్పుడు మలేరియా సిబ్బంది వచ్చి రక్తపరీక్ష చేయించడంలో సమన్వయం ఏర్పరచుకోవాలి.

నియంత్రణకొరకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు

[మార్చు]
  • జాతీయ మలేరియా కార్యక్రమం ద్వారా అన్ని జిల్లాలలో జిల్లా మలేరియా కార్యాలయాల ద్వారా 1,386 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, 10,562 ఉపకేంద్రాలలో సిబ్బంది నియమింపబడియున్నారు. ఇందులో 470 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోజుకు 24 గంటలు పని చేయునట్లుగా ఏర్పాటు చేయబడింది.

ఎవరైనా ఎలాంటి జ్వరంతోనైనా బాధపడుచున్నచో ఏలాంటి మందులు తీసుకోకముందు పైనుదహరించిన కేంద్రాలకు వెళ్ళి వ్యాధి నిర్ధారణ కొరకు రక్త పరీక్ష చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణలో వచ్చిన జ్వరం మలేరియా మూలంగా అని తేలినచో, మలేరియా సిబ్బంది చికిత్స ప్రారంభిస్తారు. మలేరియా క్రిములున్న దోమ ఆరోగ్యవంతున్ని కుట్టినాక 10 నుండి 14 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయటకువచ్చును.

గర్బిణీ స్త్రీలలో మలేరియా జ్వరం

[మార్చు]
  • 3నెలలు లోపు గర్బిణీ స్త్రీకి మలేరియా జ్వరం ఉన్నదని నిర్దారించినట్లయితే మలేరియా జ్వరానికి సంబంధించిన మందులు వడరాదు.
  • 3 నెలలు దాటిన తర్వాత డాక్టరు సలహా తీసుకొని మాత్రమే మలేరియా జ్వరం చికిత్స చేయించాలి.

మెదడకు సోకే మలేరియా

[మార్చు]
  • మలేరియా జ్వరంలో ప్రమాదకరమైనవి ప్రాణాంతకరమైనవి మెదడుకు సోకే మలేరియా
  • ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ అనే మలేరియా క్రిమి ద్వారా ఈ మెదడకు వచ్చే మలేరియా జ్వరం వ్యాపిస్తుంది.
  • ఈ మలేరియా జ్వరం వచ్చిన వ్యక్తులకు పిట్స్ కూడా సాధారణంగా వస్తుంది.
  • ఈ రకమైన మలేరియాను సెర్కేల్ మలేరియా అంటారు.
  • తీవ్రమైన స్దితిలో మరణం కూడా సంభ విచ్చవచ్చు.కాబట్టి ఆలస్యం చేయుకుండా వ్యాధి నిర్ధారణ చేయించి సరియైన చికిత్స చేయించడం వలన ప్రాణాపాయి స్థితి నుండి కాపాడవచ్చును.

మెదడు వాపు వ్యాధి

[మార్చు]

వ్యాధి లక్షణాలు

[మార్చు]
  • జ్వరము, వణుకు, ప్రవర్తనలో మార్పు, అగుతూ అపస్మారక స్థితికి చేరుకోవడం, నిద్రమత్తు, రోగ తీవ్రతని తెలియచేస్తుంది. దృష్టిలోపం కూడా కలుగవచ్చు. మూత్ర విసర్జనపై, బయలు విసర్జనపై నియంత్రణ కోల్పోవచ్చు. సరైన సమయంలో రోగ నిర్ధారణ కాకపోతే మరణం సంభవించును. జబ్బు నుండి కోలుకున్నాక కూడా
  • ఆకస్మిక జ్వరం వచ్చుట, జ్వర తీవ్రత ఎక్కువగా ఉండుట
  • కండ్లను అసాధారణంగా త్రిప్పుట
  • అపస్మారక స్థితి సంభవించుట
  • ఏదో ఒక పక్క శరీరం పక్షవాతానికి గురి అగుట
  • వాంతులు, విరేచనాలు సంభవించుట
  • శరీరం మెలికలు తిరిగి కొట్టుకొనుట
  • మానసిక మాంద్యము

వ్యాప్తి చెందు విధానం

[మార్చు]
  • జపనీస్ బి వైరస్ అనే సూక్ష్మజీవి దోమల ద్వారా ఇతర జంతువుల ద్వారా (ముఖ్యంగా పందులు) ఈ వ్యాధిని సంక్రమింప చేస్తాయి.
  • పందులు, పశువులు, గుర్రాలు, కొంగలు ఈ వైరస్ ముఖ్యస్థావరాలు. దోమలు వీటిని కుట్టి మనిషిని కుట్టినప్పుడు ఈ వైరస్ మనిషిలో ప్రవేశించి రోగాన్ని కలుగచేస్తాయి. మనిషి నుంచి మనిషికి ఇది వ్యాప్తి చెందదు.
  • పందులను కుట్టిన దోమలు ఆరోగ్యవంతుని కుట్టిన తర్వాత 7 నుండి 10 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు కన్పించును. ఈ వ్యాధి ముఖ్యంగా 1 నుండి 14 సంవత్సరముల లోపు పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

వ్యాపించే సమయం

[మార్చు]

సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు మెదడువాపు వ్యాధి ప్రబలుతున్నది. వర్షాధారంగా నిలువవున్న నీటి స్థావరాలు పెరిగిన కొలదీ దోమలు ఉత్పత్తి పెరుగును. క్యూలెక్స్ (గూని దోమ) దీని వ్యాప్తికి దోహదపడతాయి.

వ్యాధిని అరికట్టడానికి కార్యాచరణ పథకం

[మార్చు]

దోమల ఉత్పత్తి అరికట్టడం

[మార్చు]
  • నీటి స్థావరాలని పూడ్చి వేయడం
  • ప్రజలలో వ్యాధి అరికట్టడానికి ఒక నెల ముందే అవగాహన శిక్షణలు / సదస్సులు గ్రామ కమిటీలలో చర్చించడం.
  • ఆరోగ్యశాఖ తీసుకొనే చర్యలలో ప్రజలని భాగస్వామం చేసి పాల్గొనేలా చేయడం.
  • రోగిని గుర్తించి వెంటనే ఆసుప్రతికి తరలించడం.
  • గ్రామ ప్రజలతో చర్చించి పందులను ఊరికి దూరంగా ఉంచేటట్లు చర్య తీసుకోవాలి.
  • వ్యాక్సిన్ ఇచ్చు కార్యక్రమంలో సహకరించి పిల్లలకి వ్యాక్సిన్ డోసులు ఇప్పించాలి.

వ్యాధి రాకుండుటకు ముందు జాగ్రత్త చర్యలు

[మార్చు]
  • దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి
  • ఇంటిలోనికి దోమలు రాకుండా కిటికీలకు తలుపులకు సన్నని జాలి బిగించుకోవాలి
  • ఓడోమాస్ లాంటి క్రీములను శరీరానికి రుద్దుకోవాలి
  • ఇంటిలో జెట్, మస్కిటో కాయిల్ ఉపయోగించాలి
  • పందులను గ్రామానికి కనీసం 5 కి. మీ. దూరంలో ఉంచాలి
  • జాలరి గుంటలు, ఇంటిచుట్టు ప్రక్కల నీటినిల్వ ఉన్నచో ఆ నీటిలో కిరోసిన్ లేక వాడిన ఇంజన్ ఆయిల్ చుక్కలు వేయాలి
  • సెప్టిక్ట్ ట్యాంక్ గొట్టాలకు దోమలు వెళ్లకుండా, దోమ తెర గుడ్డ లాంటి ఇనుప జాలీని బిగించాలి
  • ఒక వేళ పిల్లలకు జ్వరం వచ్చినచో ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి

మలేరియా అంశంలో పేర్కొనిన దోమల నివారణ జాగ్రత్తలను పాటించాలి

ఫైలేరియా(బోదవ్యాధి)

[మార్చు]

బోదవ్యాధి (ఫైలేరియాసిస్) హెల్మెంత్ వర్గానికి చెందిన సన్నని పరాన్నజీవి వలన కలుగుతుంది. ఈ వ్యాధి మానవుని మరణానికి దారితీయకపోయినప్పటికీ, దీని వలన కలిగే దుష్పరిణామాలు మాత్రం చాలా తీవ్రమైనవి. వ్యాధి సంక్రమణను సరిగా అంచనా వేయడం, ప్రాథమిక దశలో గుర్తించడం కష్ట సాధ్యం. ఈ వ్యాధి నుండి పూర్తి విముక్తికి మార్గం లేదు. రాకుండా చూసుకోవడమే ఉత్తమం. ఈ వ్యాధి సోకిన వారి వ్యాధినిరోధక శక్తి లోపించి యితర వ్యాధులకు గురి కావడానికి అవకాశం ఎక్కువ అవుతాయి. వాపుల వలన సాధారణమైన పనులు చేసుకోలేకపోవడం, అంగవైకల్యం, శారీరక, మానసిక వ్యధ యీ వ్యాధి వలన కలిగే దుష్పరిణామాలు.

బోద వ్యాధి విస్తరణ

[మార్చు]

ప్రపపంచంలోని బోదవ్యాధి గ్రస్తులలో సగం మంది మన దేశంలోనే ఉన్నారు. మన రాష్ట్రంలోని 20 జిల్లాల్లో యీ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించబడింది. ప్రాంతాలవారీగా చూస్తే కోస్తా ప్రాంతంలో అధికముగాను, తెలంగాణా ప్రాంతములో ఒక మోస్తరుగాను, రాయలసీమలో తక్కువగా ఉంది. 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలోని 6 కోట్ల 63 లక్షల మందిలో 5 కోట్ల 24 లక్షల మంది బోధ వ్యాధి విస్తరించి ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారిలో 53 లక్షల మందికి పైగా యీ వ్యాధి సోకినట్లు నిర్ధారించబడింది. తూర్పు గోదావరి, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో యీ వ్యాధి ఎక్కువగా ఉంది.

వ్యాధి కారక క్రిమి

[మార్చు]

మానవుని రక్తంలో ఉన్న ఫైలేరియా పరాన్నజీవి పిల్లలు (మైక్రోఫైలేరియా). దోమ, మనిషిని కుట్టి రక్తం పీల్చేటప్పుడు, రక్తంతో పాటు దోమ కడుపులోనికి ప్రవేశిస్తాయి. ఇలా దోమలో ప్రవేశించిన క్రిములు 10 – 15 రోజుల్లో వివిధ దశలుగా అభివృద్ధి చెంది, మరొక వ్యక్తిలోనికి ప్రవేశించడానికి తయారవుతాయి. ఇలా తయారైన దోమలు మరోవ్యక్తిని కుట్టి, రక్తం పీల్చుకొనే సమయంలో అతని లోనికి క్రిములు ప్రవేశిస్తాయి. ఇలా మానవునిలో ప్రవేశించిన క్రిములు శోషనాళములలో చేరి 1 - 2 సఁవత్సరాలలో పెరిగి పెద్ద క్రిములుగా మారతాయి. మానవుని శరీరంలోని శోషరసకణుతులలో పెద్ద క్రిములు సుమారు 10 సంవత్సరాల వరకు జీవించి ఉండి, పిల్లలను పెడుతుంది. ఈ మైక్రోఫైలేరియా పగటి సమయంలో శరీరములోని అంతర్భాగాల్లో నివసిస్తూ, రాత్రి సమయంలో ఉపరితల రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా చర్మం వద్దకు చేరతాయి. ఈ మైక్రో ఫైలేరియా ఒక సంవత్సరము పాటు బ్రతికి ఉండి, అవి ఉన్న మనిషిని దోమలు కుట్టి రక్తం పీల్చినప్పుడు, రక్తంతోపాటు దోమ శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఇలా బోధవ్యాధి కారక పరాన్నజీవి తన జీవిత చరిత్రను కొనసాగిస్తుంది.

వ్యాధి వ్యాప్తిచేయు దోమ

[మార్చు]

మన ప్రాంతములో మామూలుగా 5 జాతులకు చెందిన దోమలు కనపిస్తాయి. 1) అనాఫిలిస్, 2) క్యూలెక్స్, 3) మాన్సోనియా, 4) ఏడిస్, 5) ఆర్మిజెరిస్. వీటిలో క్యూలెక్స్ క్యుంక్యుఫాసియాటస్ దోమ మాత్రమే బోధవ్యాధిని వ్యాప్తి చేయగలదు. దోమ జీవిత చరిత్ర గ్రుడ్డు, లార్వా, ప్యూపా, పెద్ద దోమ అను 4 దశలు కలిగి ఉంటుంది. వీటిలో గ్రుడ్డు, లార్వా, ప్యూపా దశలు నీటిలో నివసిస్తూ, పెద్ద దోమగా మారిన తరువాత మాత్రమే గాలిలోకి ఎగురుతుంది. బోధవ్యాధి వ్యాప్తికారక క్యూలెక్స్ దోమ సాధారణంగా మురుగు కాల్వలు, పాడుపడిన బావులు, మురికి నీటి గుంటలు, మరుగుదొడ్లు, యితర కలుషిత నీటి నిల్వల్లో మాత్రమే పెరుగుతుంది.

వ్యాధి లక్షణములు

[మార్చు]

బోధవ్యాధి ప్రారంభదశలో బయటకు కనిపించని అంతర్గత లక్షణములతో మొదలై ప్రాథమికదశను దాటి తీవ్రమై ముదిరిన దశకు చేరుతుంది. ఇలా దశల వారీగా వ్యాధి తీవ్రతరం కావడానికి సుమారు 10 సంవత్సరాలు పడుతంది. బోధవ్యాధి గ్రస్తులు కొద్దిపాటి జ్వరానికి తరుచూలోనవుతారు. చంకల్లో, గజ్జల్లో బిళ్ళ కట్టడం, కాళ్ళు చేతులపై ఎర్రని చారలు (వెదురుపాము) కనబడుతాయి. కొంత కాలము తరువాత కాళ్ళు, చేతులు, వృషణాలు, యితర జననేంద్రియములకు సంబంధించిన వాపులు కూడా బోధ వ్యాధి లక్షణములే.

రోగ నిర్ధారణ

[మార్చు]

బోధవ్యాధి నిర్ధారణకు ప్రస్తుతం అందుబాటులో వున్న అవకాశాలు కేవలం వ్యాధి లక్షణములు బయటకు కనిపించడం, రక్త పరీక్ష చేయడం మాత్రమే. ఇతర రకాలైన యాంత్రికపరీక్షలు, వ్యాధి తీవ్రత పరీక్షలు యింకా ప్రయోగ దశలోనే ఉండి సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. సాధారణంగా రాత్రిపూట రక్త పరీక్ష ద్వారా ఒక వ్యక్తి శరీరంలో బోధ వ్యాధి క్రిములు ఉన్నదీ, లేనిదీ తెలుసుకొనవచ్చును. వ్యాధి లక్షణములు బయటపడని వారిలో క్రిములు కనిపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వ్యాధి సోకలేదు అనుకొనే వారు కూడా తరచూ రాత్రిపూట ఫైలేరియా రక్త పరీక్ష చేయించుకొని నిర్ధారణ పొందవచ్చును. వ్యాధి ముదిరితే క్రిములు రక్తములో కనిపించవు, చికిత్సకు లొంగదు. తరుచూ వచ్చే కొద్దిపాటి జ్వరం, చంకల్లో, గజ్జల్లో బిళ్ళలు, వెదురుపాము బోధ వ్యాధికి గుర్తులు. పొడి దగ్గు, నీరసం, ఆయాసం, ఆస్నోఫీలియా, కీళ్ళ నొప్పులు కూడా బోధవ్యాధి వలన కలిగే పరిణామాలుగా గుర్తించాలి. వృషణాలు, స్థనాలు, యితర జననేంద్రియాలు నొప్పి కల్గించడం బోధవ్యాధి సోకినట్లుగా గుర్తించాలి. ఈ వ్యాధి వంశపారపర్యంగా గాని, లైంగిక సంపర్కము వలన గాని, గాలి, నీరు వంటి యితర కారణముల వలన గాని వచ్చే రోగము కాదు. కేవలం దోమల వలన మాత్రమే ఒకరి నుండి యింకొకరికి వ్యాపిస్తుంది.

చికిత్స

[మార్చు]

బోధవ్యాధి చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో వున్న డైయిథైల్ కార్బమజైన్ (డి.ఇ.సి.) ఫైలేరియా పరాన్నజీవి పిల్లలతో పాటు, పెద్ద క్రిములను కూడా చంపే గుణం ఉండుట వలన ఇది విరివిగా వాడబడుచున్నది. ఈ మందు వ్యాధి కారక క్రిములను పరోక్షంగా సహకరించుట వలన ఈ మందుకు తట్టుకునే గుణం బోధవ్యాధి క్రిమికి కలుగదు. ఈ మందు హెట్రోజన్, ఇథోడ్రల్, బోనసైడ్, యూనికార్బజాన్ అను సాధారణ పేర్లతో లభిస్తుంది. ఈ మందును ప్రతి కిలో గ్రాము శరీర బరువుకు 6 మి. గ్రా. చొప్పున 12 రోజులు వాడాలి. జాతీయ బోధవ్యాధి నివారణ కార్యక్రమము ప్రకారం మనదేశంలో వయస్సును బట్టి వాడబడుతున్న డి.ఇ.సి. మోతాదు.

వయస్సు

[మార్చు]

వ్యాధికారక క్రిమి సంహారము

[మార్చు]

బోధవ్యాధి నివారణ కేంద్రము ఏర్పాటు కాబడి ఉన్న పట్టణంలో నెలకు 2, 3 రోజులు ఆరోగ్య సిబ్బంది రాత్రులందు గృహములను సందర్శించి రక్తపూతలు సేకరించి, వ్యాధి గ్రస్తులను గుర్తించి, చికిత్స చేస్తారు. ఈ పద్ధతిలో వ్యాధితో నిమిత్తం లేకుండా వ్యాధి ఉన్నవారికి, లేనివారికి అందరికి రక్త పరీక్షలు చేస్తారు. దీనితో పాటు వారంలో నిర్ణయింపబడిన ఒక రోజు, బోధవ్యాధి నివారణ కేంద్రంలో రాత్రిపూట క్లినిక్ నిర్వహించి బోధవ్యాధి గ్రస్తులకు చికిత్స, వ్యాధి లేనివారికి రక్త పరీక్షలు చేస్తారు.

వ్యాధి వ్యాప్తి చేయు దోమల నియంత్రణ

[మార్చు]

ఇందుకు గాను నివారణ కేంద్రంగల పట్టణాన్ని 6 భాగాలుగా విభజించి ప్రతి భాగంలో నిర్ణయింపబడిన రోజు చొప్పున మొత్తం పట్టణాన్ని వారం రోజుల్లో పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో బోధవ్యాధి దోమపిల్లలు పెరిగే మురుగు కాల్వలు, పాడుబడిన బావులు, మురికి నీటి గుంటలు, మరుగుదొడ్లు యితర కలుషితమైన నీటి నిల్వల్లో దోమ పిల్లలను చంపే మందు చల్లుతారు. తద్వారా దోమలను పిల్ల దశలోనే నిర్మూలించి, పెద్ద దోమలుగా మారకుండా నివారిస్తారు.

నివారణ మార్గాలు

[మార్చు]

బోధవ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం, పూర్తి చికిత్స పొందడం వ్యాధి నివారణలోని ముఖ్యాంశాలు. ఈ వ్యాధి దోమల వలన ఒకరి నుండి యింకొకరికి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దోమల నియంత్రణ కూడా యీ వ్యాధి నివారణలోని ముఖ్యాంశము.

  • తరచు రాత్రులందు రక్త పరీక్ష వేయించుకొని బోధవ్యాధి సోకినదీ లేనిదీ నిర్ధారణ పొందడం.
  • ముందు చెప్పబడిన వ్యాధి లక్షణములు కనిపించిన వెంటనే బోధవ్యాధి నివారణ కేంద్రాన్ని / ఆరోగ్య కార్యకర్తని సంప్రతించడం.
  • వ్యాధి సోకిన వారు పూర్తి మోతాదు చికిత్స పొంది వ్యాధి వలన కలిగే యితర నష్టాల నుండి విముక్తి పొందడం.
  • నిర్ణయింపబడిన పద్ధతిలో చికిత్స చేయించుకొని యితరులకు వ్యాధి సోకకుండా జాగ్రత్త వహించడం.
  • వ్యాధి గ్రస్తుల పట్ల సానుభూతి చూపడం
  • వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుధ్యం పాటించడం
  • బోధవ్యాధి వ్యాప్తి చేయు దోమలు పిల్లలు పెట్టే మురికి నీటి గుంటలు, మురుగు కాల్వలు, యితర రకాల నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం.
  • మరుగుదొడ్లు, పాడుపడిన బావులు మొదలైన వాటిలో దోమలు గ్రుడ్లు పెట్టకుండా జాగ్రత్త వహించడం.
  • దోమకాటుకు గురికాకుండా దోమ తెరలు, దోమలను పారద్రోలు మందఉలు వాడడం.
  • ఇండ్లలోనికి దోమలు రాకుండా తెరలు, మెష్ లు అమర్చుకోవడం.
  • మురుగు కాలువల్లో చెత్తా చెదారం వేయకుండా, అవి ప్రవహించేలా చూడడం.
  • మురికి నీటి నిల్వల్లో దోమల మందు చల్లడం
  • ఖాళీ డ్రమ్ములు, పాత టైర్లు, పూల కుండీలు, కుండలు ఇతర పాడుబడిన వస్తువులలో నీరు చేరి, దోమల పిల్లలు పెట్టకుండా వాటిని తొలగించాలి.
  • ప్రభుత్వం అమలు జరిపే వ్యాధి నివారణ కార్యక్రమాలకు సహకరించడం.

డెంగూ జ్వరం

[మార్చు]

ఈ వ్యాధి కారక క్రిమి ఆర్బోవైరసం జాతికి చెందినది. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. కంటికి కనిపించదు .ఈ వైరస్ ఏయిడిస్ ఈజిప్టి జాతి దోమద్వారా రోగగ్రస్తుల నుండి ఆరోగ్య వంతులకు సంక్రమించును. ఈ దోమను టైగర్ దోమ అనికూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటి పూటనే కుట్టును. ఈ దోమలు కుట్టిన తర్వాత 5 నుండి 8 రోజులలో వ్యాధి లక్షణాలు కన్పించును.

డెంగూ వ్యాధి లక్షణాలు

[మార్చు]
  • ఉన్నట్టుండి జ్వరం ఉధృతంగా వచ్చుట
  • తలనొప్పి అధికంగా నుండును, ఎక్కువగా నొసటిపై తలనొప్పి కల్గుట
  • కంటిలోపల నొప్పి వచ్చి కంటి కదలికలను తగ్గించుట, కన్ను కదిలినప్పుడు నొప్పి ఎక్కువ అగుట
  • కండరాలు, కీళ్ళ నొప్పి కల్గుట
  • వాంతి అగునట్లు భ్రాంతి కల్గుట
  • నోరు ఎండిపోవును, ఎక్కువ దాహముండును

పై లక్షణాలు కలిగి ఉన్నచో వెంటనే మీ సమీపములో గల ఆసుపత్రినందు చూపించుకొని వ్యాధి నివారణ కొరకు చికిత్స పొందగలరు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కావున ప్రజలు వెంటనే స్పందించి జ్వర తీవ్రతను గుర్తించి పై తెలిపిన లక్షణాల నివారణ కొరకు వెంటనే తగిన చికిత్స పొందగలరు. ఈ విషయం సంబంధిత ఆరోగ్య శాఖాధికారులకు వెంటనే తెలియచేయవలెను.

వ్యాధి వ్యాపించే విధానము

[మార్చు]
  • ఈ వ్యాధి ఒక రకమైన ఆర్బోవైరస్ వలన సంక్రమించును
  • ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి ఏడిస్ ఈజిప్టై అనే దోమ కాటు వలన వ్యాప్తి జరుగును
  • ఈ దోమలు పగలే కట్టును
  • ఈ రకమైన దోమలు మన ఇంటి పరిసరాలలో నీరు నిలుచుటకు ఆవకాశం వుండి, ఆ నీరు కనీసము వారం రోజులు నిల్వ ఉన్నచో, ఈ దోమలు వృద్ధి చెందును.
  • ఈ దోమలు గ్రుడ్డు పెట్టి పెరుగుటకు ఈ క్రింద తెలిపిన వస్తువులు / పరిసరాలు అనూకూలమైనవి.

ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్, పూలకుండీల క్రింద గల సాసర్లు, బయట పెట్టిన టైర్లు, మూతలు పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్, ఖాళీ డ్రమ్ములు, సన్ షేడ్స్ పై నిల్చిన వాన నీరు, బిల్డింగ్ ల పైన నిల్చిన వాన నీరు.

  1. ఇతర పనికిరాని, పగిలిపోయిన పస్తువులు
  2. ఈ దోమ ఇంటిలో గల చీకటి ప్రదేశాలలో నివసించుచుండును
  3. వాడకుండా వదిలి వేసిన పచ్చడి రోళ్ళు
  4. ఫ్లవర్ వాజ్, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, పగిలిపోయిన కప్పులు, చెట్టు తొర్రలు మొదలైనవి.
ఎ) దోమల నివాసాలను తొలగించుట

నీరు నిల్వను, పనికిరాని కూలర్లను, టైర్లు, పాత్రలు, డ్రమ్ములు, పూలకుండీలు ఇతరత్రా కనీస అవసరాలకు ఉంచుకొని పనికిరాని వాటిని తీసివేయవలెను, ఇండ్లలోని, వెలుపల నీటి నిల్వలను పాలపారబోయవలెను. నీటి ట్యాంకునకు మూతలుంచవలెను. నీటి నిల్వలు గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేయించుచూ వారంలో ఒక రోజు డ్రైడే (Dry Day) విధానము తప్పక పాటించుచూ రావలెను. అదే విధముగా జనవాసములందు సంఘీభావముతో పై కార్యక్రమములను పాటింపచేయవలెను.

బి) వ్యక్తిగత జాగ్రత్తలు

దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి విముక్తి పొందవచ్చును. పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించవలెను. అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి. పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పబడునట్లు దుస్తులు వేయవలెను. కావున ప్రజలందరూ పైన తెలిపిన సూచనలు పాటించి డెంగూ వ్యాధిని అరికట్టుటలో సహకరించగలరు.

గమనిక :

[మార్చు]

స్వంత చికిత్స చేయకూడదు. ఆస్ప్రిన్, బ్రూఫెన్, కాంబిఫ్లామ్, అనాలజిన్ లాంటి మాత్రలు తీసుకోకూడదు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోమల నివారణకు మనమందరం కలిపికట్టుగా పోరాటం సాగిద్దాం.

చికెన్ గునియా

[మార్చు]

చికెన్ గునియా వ్యాధిని చికెన్ గునియా జ్వరము అని అంటారు.ఈ వ్యాధి వైరస్ అనే అతి సూక్ష్మక్రిముల ద్వారా వస్తుంది.

చికెన్ గునియా ఎలా వ్యాపిస్తుంది

[మార్చు]

చికెన్ గునియా వ్యాధి 'ఏడీస్ 'అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది.ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఈ దోమ ద్వారా సంక్రమిస్తుంది.

లక్షణాలు

[మార్చు]
  • చలి, జ్వరము.
  • తలనొప్పి.
  • వాంతులు వచ్చినట్లు ఉండడం.
  • వాంతులు.
  • కీళ్ళనొప్ఫులు.
  • కొన్ని సందర్భాలలో చర్మముపై దద్దుర్లు కూడా రావచ్చు.
  • విపరీతమైన కీళ్ళు నొప్పులు ఈ వ్యాధి ప్రధాన లక్షణము.
  • జ్వరతీవ్రత తగ్గినా, ఈ కీళ్ళ నొప్ఫులు కొంత కాలము వ్యక్తికి ఉంటాయి.

వ్యాధి నివారణ

[మార్చు]
  • దోమల నివారణ చర్యలన్నీ తీసుకోవాలి.
  • 'ఏడీస్ ' దోమ సాధారణంగా పగలు కుడుతుంది.
  • నీటిని 2 - 3 రోజుల కంటే ఎక్కువ నిలువ ఉంచరాదు.
  • నీళ్ళ ట్యాంకులు, ఇతర నీటి నిల్వ పాత్రలపై మూతలు తప్పని సరిగా ఉంచాలి.
  • ఎయిర్ కూలర్లు, పూల కుండీలు, రబ్బరు ట్యాబులు, మొదలగు ప్రాంతాలలో నీటిని నిలువ వుంచరాదు.
  • వ్యక్తి గతంగా దోమల నుండి రక్షణ పొందాలి. దోమ తెరలు, దోమలను నివారించు క్రీములు, కాయిల్స్, ఆల్ అవుట్ లాంటి వేపరైసిగ్ ద్రవాలు వాడుట మంచిది.

కాలా జ్వరము - నలుపు మచ్చల జ్వరము

[మార్చు]

నలుపు మచ్చల జ్వరము అంటే ఏమిటి ?

[మార్చు]
  • ఇలా చాలా మెల్లగా వ్యాపించే లేక వృద్ధి చెందే దేశీయ జబ్బు. దీనికి కారణం ప్రోటోజోవాకు చెందిన లీప్యానియా అను (కొత్తి మెర పురుగు) (చిన్న దోమ) పరాన్నజీవి
  • మన దేశంలో లీష్మానియా అను ఒకే ఒక పరాన్నజీవి ఈ కాలా అజార్ జ్వరానికి కారణం అవుతుంది
  • ఈ పరాన్న జీవి ముఖ్యంగా శరీర రక్షణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. తరువాత అస్ధిరమజ్జు
  • (బోన్ మారో), కాలేయము, మహాభక్షక వ్యవస్థలలో ఎక్కువ మోతాదులో కనబడుతుంది
  • కాలా జ్వరము లేక నల్ల మచ్చల జ్వరము. తదుపరి వచ్చే చర్మవ్యాధిలో లీప్యానియా డోనవాని అను పరాన్నజీవి చర్మం ఉపరితలంలోని కణాలలో చొచ్చుకొని పోయి అక్కడ వృద్ధి చెందుతూ వ్యాధి లక్షణాలకు కారణం అవుతుంది. కొందరు వ్యాధిగ్రస్థులలో ఈ చర్మ సమస్య చికిత్సానంతరం కొన్ని సంవత్సరాల తరువాత బయటపడవచ్చును
  • కొన్ని సార్లు ఈ పరాన్నజీవి జీర్ణ వ్యవస్థలో ప్రవేశించకుండానే చర్మంలోనే వృద్ధి చెంది అక్కడే లక్షణాలను వృద్ధి చేయవచ్చును. దీని గురించి ఇంకా విపులంగా పరిశోధనలు జరగవలసి వున్నవి

నల్లమచ్చలు జ్వరంలో కనపడే లక్షణాలు, చిహ్నాలు

[మార్చు]
  • మళ్ళీ, మళ్ళీ, వచ్చే జ్వరం లేక ఆగి వచ్చే జ్వరం. ఈ మళ్ళీ జ్వరం తీవ్రంగా ద్విగణీకృతమై వుంటుంది
  • ఆకలి లేకపోవడం, పాలిపోవడం, క్రమంగా బరువు తగ్గిపోవడం
  • ప్లీహపు (స్ప్లీ న్) వాపు - ప్లీహము త్వరితగతిన వాపునకు గురౌతుంది. మెత్తగా ఉంటుంది. ముట్టుకుంటే నొప్పితెలియదు
  • కాలేయము - వాపునకు గురౌతుంది కానీ ప్లీహమంత (స్ప్లీ న్) ఎక్కువగా వుండదు. మెత్తగా, ఉపరితలం సమంగా అంచులు కొస్సెగా వుంటాయి
  • లింఫ్ గ్రంథుల్లో వాపు
  • చర్మం - ఎండిపోయినట్టు, పలచబడినట్టు, పొలుసుబారినట్టు వుంటుంది. వెండ్రుకలు వూడి పోవచ్చు. చర్మం పాలిపోయి పాలిపోయి అక్కడక్కడా బూడిదరంగు మచ్చలు ఏర్పడుతాయి. దీని గురించి ఈ జ్వరానికి నల్ల మచ్చల జ్వరము అని పేరు వచ్చింది
  • రక్త హీనత - శీఘ్రంగా వృద్ధి చెందుతుంది. బలహీనత రక్తహీనత శుష్కించి పోవడం, ప్లీహము వాపు వంటి లక్షణాలతో వీరు ప్రత్యేకంగా కనబడుతూ వుంటారు

నల్ల మచ్చల జ్వరానంతరం కనపడే చర్మ వ్యాధి లక్షణాలు, చిహ్నాలు చర్మంలో వచ్చే మార్పుల ఆకృతిని బట్టి రకాలుగా విభజన

[మార్చు]

నల్ల మచ్చల జ్వరానంతరం వచ్చే చర్మ వ్యాధిలో ఈ పరాన్న జీవి చర్మపు ఉపరితలపు పొరల్లో కనబడుతుంది. ఈ చర్మంలో మార్పులు నల్ల మచ్చల జ్వరం వచ్చి కోలుకున్న 1-2 సం. తరువాత కనబడవచ్చు. అప్పుడప్పుడు నల్ల మచ్చల జ్వరం రాకుండానే కేవలం చర్మం వ్యాధిలాగా కనపడవచ్చు.

  • తక్కువ వర్ణ పరిమాణంతో కూడిన మచ్చలు కనపడడం. ఇవి కుష్టు వ్యాధిలో కనబడు మచ్చలను పోలివుంటాయి. కానీ సాధారణంగా 1 cm కంటే తక్కువ పరిమాణంలో ఎక్కువగా ముఖంలో కనపడుతాయి. కానీ శరీరంలో ఏ భాగంలోనైనా కనబడవచ్చు
  • కొంత కాలం తరువాత (కొన్ని నెలలు నుంచి కొన్ని సంవత్సరాలు కావచ్చు) ఈ మచ్చల మీద వివిధ పరిమాణాల కంతులు ఉత్పన్నమవుతాయి
  • ఎఱ్ఱగా సీతాకోక చిలుక ఆకారంలో ఉండే దద్దుర్లు కనబడుతాయి. ఇవి సూర్యరశ్మికి తీవ్ర తరమవుతాయి. ఇది ఈ చర్మవ్యాధిలో తొలిదశలో కనబడే ఒక లక్షణం
  • ఎఱ్ఱగా ఉండే కంతులు, బుడిపెలు ముఖ్యంగా గడ్డంమీద, ముఖం మీద కనపడతాయి
  • ఇవి చాలా సంవత్సరాల కాలంలో పెరుగుతూ వుంటాయి. అకస్మాత్తుగా మానడం సాధారణంగా జరుగదు

అతి తక్కువగా చూసే నల్లజ్వరం తదనంతరం వచ్చే మార్పులు

[మార్చు]
  • ఒకటికంటే ఎక్కువ కణుతులు, బుడిపెలు కలిసిపోయి గారలాంటి ప్రదేశాలు చర్మం మీద ఏర్పడతాయి
  • చేతులు, కాళ్ళ మీద పులిపిర్లవలే ఉత్పన్నం అవుతాయి
  • పులిపిరుల వంటి కంతులు మొఖం మీద ముక్కుపై, గడ్డం, పెదవుల మీద కనబడతాయి
  • అభివృద్ధి చెందిన కణజాలం (కనురెప్పల, ముక్కు, పెదవుల పైన)
  • కనుబొమ్మల దగ్గర పసుపు పచ్చని తరకలు కట్టడం కొవ్వుతో కూడిన కంతులు చంకలలో, మోకాలి వెనుక భాగంలో, తొడల లోపలి భాగంలో నోటి చుట్టూ కనబడతాయి
  • చర్మం పొలుసులలాగా కట్టి పొరలు పొరలుగా రాలిపోవుట. ఇది నానా రంగుల పొలుసుల రూపంలో ఉండవచ్చు

హెచ్.ఐ.వి. నల్లమచ్చలు జ్వరం సంయుక్తంగా ఉండుట

[మార్చు]
  • అంతర్ అవయవాలలో కనిపించే లీప్మానియా పరాన్నజీవి తరచూ అవకాశానుసారం హెచ్.ఐ.వి. వ్యాధి సోకిన రోగులలో, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన రోగులలో ఎక్కువగా కనపడుతుంది
  • మన దేశంలో ఇది అంత తీవ్ర సమస్య కాకపోయినా ఇతర దేశాలలో హెచ్.ఐ.వి. అంతర్ అవయవాలలో వచ్చే లీఫ్మానియా పరాన్ జీవి జబ్బు కలిసి 1000 కేసులకు పైగా నిర్ధారించబడ్డాయి
  • హెచ్.ఐ.వి. వ్యాధి సోకిన వ్యక్తులలో ఈ అంతర్ అవయవాలకు సోకే లీప్మానియా జ్వరం మొదటి లక్షణంగా కనపడవచ్చు
  • ఎయిడ్స్ వ్యాధి ముదిరిన రోగులలో (ధీర్ఝకాలిక) కనపడుతుంది
  • ఎయిడ్స్ జబ్బుతో కూడి ఈ జబ్బు ఉన్నా కూడా అప్పుడప్పుడూ లక్షణాలు కనపడకపోవచ్చు
  • నల్ల మచ్చల జ్వరం లక్షణాలు చాలా కొద్ది సమయం వరకే ఉండడం మూలాన జబ్బు నిర్ధారణ చేయడం కష్టం కావచ్చు. జ్వరం, ప్లీహం యొక్క వాపు ప్రస్పుటంగా కనపడకపోవచ్చు. రక్తంలో నల్ల మచ్చల జ్వర ప్రతికూల కణాలు కనపడకపోవచ్చును
  • కొన్ని ప్రత్యేక రక్త పరీక్షలలో రోగ నిర్ధారణలో మంచి ఫలితాలు మెరుగుగా ఉంటాయి
  • చికిత్సా ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. మందుల వల్ల కలిగే దుశ్ఫలితాలు అధికంగా ఉంటాయి. జబ్బు తిరగబెట్టడం సర్వ సాధారణంగా జరుగుతూ వుంటుంది

నల్ల మచ్చల జ్వరం ఏ విధంగా వ్యాపిస్తుంది ?

[మార్చు]
  • నల్ల మచ్చల జ్వరం రోగ వాహకముల ద్వారా వ్యాపించు జబ్బు
  • సాండ్ ఫ్లై అను ఒకే రోగ వాహకము ద్వారా మన దేశంలో నల్ల మచ్చల జ్వరం వ్యాప్తి చెందుతుంది
  • ఇండియాలో కనిపించే నల్ల మచ్చల జ్వరం కేవలం మానవులలోనే కనబడుతుంది. మానవుడు ఒక్కడే ఆశయము లాగా పని చేస్తాడు
  • ఆడ దోమ వ్యాధిగ్రస్థుడైన మనిషిని కుట్టినప్పుడు దాని శరీరంలోకి లీఫ్మానియా పరాన్నజీవి చేరుతుంది
  • ఈ పరాన్న జీవి శరీరాకృతిలో కొన్ని మార్పులు చెంది, వృద్ధిచెంది, విభజన జరుగుతుంది. ఇది అంతయూ డ దోమ యొక్క ప్రేగులో జరుగుతుంది. తరువాత పరాన్న జీవి నోటి భాగములోనికి చేరుతుంది
  • పై విధంగా లీప్మానియా పరాన్నజీవి నిల్వ వున్న స్యాండ్ ఫ్లై దోమ మానవుని కుట్టినప్పుడు పరాన్నజీవి మానవుని రక్తస్రావంలోకి ప్రవేశిస్తుంది

భారతదేశంలో వున్న నల్ల మచ్చల జ్వరం

[మార్చు]
  • భారతదేశంలో స్యాండ్ ఫ్లై అనే ఒకే ఒక ఆరోహకము కనబడుతుంది. దీనిని ఫ్లెబోటొమస్ ఏరిజెన్ టిపిస్ అంటారు
  • ఈ స్యాండ్ ఫ్లై అనే కీటకాలు చాలా చిన్నవి. దోమలలో వీటి పరిమాణం నాలుగో వంతు వుంటుంది. దీని పొడవు 1.5 నుంచి 3.5 మి.మి. వుంటుంది
  • యౌవన దశలో వున్న స్యాండ్ ఫ్లై నాజూకుగా నిలువుగా వున్న పెద్ద రెక్కలతో సమంగా వుంటుంది. శరీరమంతా పొడుగాటి రోమాలతో కప్పబడి వుంటుంది
  • జీవిత చక్రంలో అండము → 4 భాగాముల లార్వా → ప్యూపా, → ప్రౌఢ దశకు చేరుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు నెలరోజులు పట్టవచ్చు
  • ఈ ప్రక్రియ పూర్తి అవడం పై ఉష్ట్రోగ్రత, పరిసరాల ప్రభావం కూడా వుండవచ్చు
  • ఈ కీటకాలు తేమ ఎక్కువగా వుండి వేడిగా వాతావరణం, ఇసుక నీరు సంవృద్ధిగా చెట్లు చేమలూ ఉన్న ప్రదేశాలలో బాగా వృద్ధి చెందుతాయి
  • ఈ కీటకాలు సంవృద్ధిగా జీవుల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్ధ పదార్ధాలు ఉండే చోట ఎక్కువగా వుంటాయి. ఈ పదార్ధాలు లార్వాకు ఆహారంగా పనికి వస్తుంది
  • ఇవి చాలా నాజూకైన కీటకాలు, ప్రతికూల వాతావరణంలో తేలికగా విచ్ఛిన్నమవుతాయి. పొడిగా వున్న వాతావరణంలో బ్రతుకలేవు

నల్ల మచ్చల జ్వరం నిర్ధారణ

[మార్చు]

వైద్యపరంగా రెండు వారాల కంటే ఎక్కువ రోజులు జ్వరం మలేరియా మందులు, జ్వరం మాత్రలకు తగ్గకపోవడం. ప్రయోగ శాలలో పరీక్షలలో రక్తహీనత తెల్లకణాలు తగ్గపోవడం, రక్తంలో ప్రవహించు తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం, రక్తంలో గామా గ్లోచ్యుల్లిన్ అనే ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం.

ప్రయోగశాలలో పరీక్షలు

[మార్చు]

రసి విజ్ఞానము శరీరమునకు బహిర్గతంగా జరుగు ప్రతిజనక - ప్రతి రక్షక ప్రక్రియలకు సంవత్సరాలు శాస్త్రము - జ్ఞానము.

ఈ రోగ నిర్ధారణకు చాలా రకముల పరీక్షలు వున్నాయి

సాధారణంగా రక్తంలో ఉత్పన్నమై వున్న ఐ.జి.జి. ప్రతి రక్షక కణాలను గుర్తించే పరీక్షలు చేస్తారు. ఇవి రక్తంలో ఎక్కువ కాలం వుంటాయి. ఈ పరీక్షలకు పరిస్థితులు అనుకూలించాలి. ఐ.జి.ఎమ్. ప్రతి రక్షక కణాల కనుగొన్న పరీక్ష ఇంకా ప్రారంభదశలో ఉంది. ఇది కొంత మెరుగైన పరీక్ష.

పరాన్న జీవిని కనుగొనడం

[మార్చు]

పరాన్న జీవిని ఎముకల మూలుగ ప్లీహము, శోషరసకణాలు నుంచి తీసిన రస ద్రవము వీటిలో పరాన్న జీవిని చూపగలగడం. లేదా కణజాలమును పెంచి, సంరక్షించి వాటి సంఖ్య పెరిగేటట్లు చేసే సాధనలో పరాన్న జీవిని నిరూపించడం.

బాహ్య జీవ ప్రక్రియలో కణజాలమును పోషించుట

[మార్చు]

ఈ విధంగా పరాన్నజీవిని కనుగొనడం వ్యాధిని నిర్ధారించడమవుతుంది. ఇది కూడా పరీక్షకు ఎన్నుకొన్న అవయవాన్ని అవయవాల నుంచి తీసిన ద్రవంలో పరాన్నజీవి యొక్క సాంద్రతను బట్టి నిర్ధారణ నిష్పత్తి ఆధారపడి వుంటుంది. ప్లీహము నుండి తీసిన ద్రవంలో ఈ పరాన్న జీవిని కచ్చితంగా కనుగొనే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కానీ ఈ ద్రవాన్ని తీయడానికి నిపుణులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని వసతులు వున్న ఆసుపత్రిలో నైతేనే తీయడం మంచిది.

సారూప్యంగల ఇతర వ్యాధులు

[మార్చు]
  • సన్నిపాత జ్వరము
  • క్షయవ్యాధి (శరీరమంతా సబ్బుగింజల ప్రమాణంలో వ్యాధి నలుసుల వివిధ అవయవాలలో ఉంటాయి.)
  • చలిజ్వరం, వణుకుడు జ్వరం (మలేరియా)
  • బ్రూసెల్లోసిస్ గొర్రెలు, మేకల నుంచి మనుషులకు సోకే అంటు వ్యాధి
  • కాలేయంలో వచ్చు చీముగడ్డ దీనికి కారణం అమీబా అను ఏకకణ జీవి
  • ఇఫెక్షయస్ మోనో న్లూక్షియోసిస్
  • శోషరసకణాల పెరుగుదల
  • రక్త క్యాన్సరు
  • ప్లీహపు వాపు
  • కాలేయము నుండి బయటకు వెళ్ళు రక్త నాళాలు, వాహికలో అవరోధము

భారత దేశంలో నల్ల మచ్చల జ్వరం యొక్క తీవ్రత

[మార్చు]
  • నిరంతరం ప్రబలి ఉండే రాష్ట్రాలు బీహార్, జార్ ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్
  • 48 జిల్లాలలో నిరంతరం ప్రబలి ఉంటుంది. అక్కడక్కడా కొన్ని వేరే జిల్లాలలో కూడా కనబడుతుంది
  • 4 రాష్ట్రాలలో 165.4 మిలియన్ల జనాభా ప్రమాదం బారిన పడవచ్చునని అంచనా
  • గ్రామీణ ప్రాంతాలలో నివసించి, ఆర్థికంగా వెనుక బడినవారిలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది

నల్ల మచ్చల జ్వరాన్ని నియంత్రించుటకు భారత దేశంలో చేస్తున్న ప్రయత్నాలు

[మార్చు]
  • 1990-91 లో కేంద్రీయ ప్రభుత్వం సాయంలో నియంత్రించ బడిన కార్యక్రమం నిరంతరం ప్రబలి ఉన్న ప్రాంతాలలో ప్రారంభించారు
  • భారత ప్రభుత్వము నల్ల మచ్చల జ్వరం మందుల సరఫరా చేస్తున్నారు. పురుగుల మందులు (దోమల, స్యాండ్ ఫ్లై నివారణకు) సాంకేతిక సహకారం భారత ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆరోగ్య కేంద్రాలు, రాష్ట్ర మలేరియా నివారణ సంస్థల ద్వారా మిగిలిన ఖర్చుభరిస్తూ అమలు చేస్తున్నారు

లింఫాటిక్ ఫైలేరియాసిస్

[మార్చు]

“ఎలిఫెంటియాసిస్” అనిపిలిచే లింఫాటిక్ ఫిలేరియాసిస్ అనే వ్యాధి సాధారణంగా బాల్యంలో వస్తుంది. శరీరాకృతిని వికారంగా మార్చటం, శారీరక వైకల్యం కలగటం ఈ వ్యాధి వచ్చిన వారికి జరుగుతుంది.

ఫిలేరియా అనే క్రిమి లక్షలాది సంఖ్యలో సూక్ష్మమైన, అపరిపక్వమైన మైక్రోఫిలేరియా అనే లార్వాను ఉత్పత్తి చేస్తుంది. ఈ లార్వాను పరిసర ప్రదేశాల్లోని రక్తంలో తిరుగుతూ నిర్థేశిత వ్యవధి వరకు నిద్రాణ స్థితి లోనే ఉంటుంది. ఇలా ఈ క్రిములు 4 నుంచి 6 సంవత్సరాల వరకు జీవించి మైక్రోఫైలేరియాను ఉత్పత్తి చేస్తుంటాయి.

దోమ కాటు ద్వారా లింఫటిక్ ఫిలేరియాసిస్ ఒకరి నుంచి ఒకరికి బదిలీ అవుతుంది. మైక్రోఫిలేరియా కలిగి వున్న వ్యక్తిని కుట్టినపుడు దోమ శరీరంలోకి ఈ క్రిమి ప్రవేశ్తుంది. దోమ శరీరంలో ఈ మైక్రోఫిలేరియా పెరిగి పెద్దగా అవటానికి 7 నుంచి 21 రోజులు పడుతుంది.

వ్యాధి ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంది ?

[మార్చు]

లింఫటిక్ ఫిలేరియాసిస్ రావటానికి సంవత్సరాల తరబడి అనేక దోమకాట్లకు గురికావలసి ఉంటుంది. ఫిలేరియా ప్రబలిన ప్రాంతాల్లో ఎక్కువకాలం పాటు నివసించే ప్రజలకు ఈ వ్యాధి వచ్చే అపాయం ఎక్కువగా ఉంటుంది. రాత్రివేళ రక్తపరీక్షల సర్వే చేయటం ద్వారా ఈ అంటువ్యాధిని కనుగొనవచ్చు.

లింఫటిక్ ఫిలేరియాసిస్ లక్షణాలేమిటి ?

[మార్చు]

శరీరంలో ఈ వ్యాధిని కలుగజేసే కీటకాలు మరణించేంత వరకు సాధారణంగా చాలా మందికి ఈ వ్యాధి లక్షణాలు అనుభవంలోకి రావు. మమూలుగా నైతే ఈ వ్యాధి వల్ల ప్రాణాలకు ముప్పు రాదు కాని, శారీరక ద్రవ క్రియా (లింఫ్) వ్యవస్థ, మూత్రపిండాలు దెబ్బతింటాయి. ద్రవాలకు సంబంధించి శారీరక క్రియా వ్యవస్థ సరిగా పనిచేయని కారణంగా, శరీరంలో ఊరే ద్రవాలు ఒకే చోట చేరి భుజాలు, ఛాతీ, కాళ్లకు వాపు కలిగిస్తాయి. ఇలాంటి వాపులకు, “లింఫోడెమా” అని పిలుస్తారు. మగవారికైతే, పురుషాంగంలో కూడా వాపు కలుగుతుంది. దీన్ని “హైడ్రోసీల్” అని అంటారు. వాపు, “లింఫ్ సిస్టమ్” పని తీరులో తగ్గుదల కారణంగా రోగకారక క్రిములు, అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటం శరీరానికి కష్టమవుతుంది. ఇలాంటి వ్యక్తులకు చర్మంపైన, లింఫ్ వ్యవస్థలోను బ్యాక్టీరియా కారక అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఇవి చర్మాన్ని దళసరిగా, మొద్దుగా తయారు చేస్తాయి. దీన్నే “ఎలిఫెంటియాసిస్” అని కూడా అంటారు.

ఈ అంటువ్యాధిని నేను ఎలా నివారించగలను ?

[మార్చు]

వ్యాధి కలుగజేసే సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిములను చంపటానికి వాడలో ఉన్న వారందరికీ ఔషధాలు ఇవ్వటం, దోమలను నియ్రంత్రించటం నివారణ చర్యల్లో ఒక భాగం. దోమకాటు నుంచి రక్షించుకోవటం నివారణ చర్యల్లో మరో భాగం. ఫెలేరియల్ పురుగులను బదిలీ చేసే దోమలు సాధారణంగా రాత్రి వేళల్లో కుడతాయి. లింఫటిక్ ఫిలేరియాసిస్ ప్రబలి ఉన్న ప్రాంతాల్లో ఒకవేళ మీరు నివసిస్తున్నట్లయితే, ఈ క్రింద పేర్కొన్న జాగ్రత్తలను తీసుకోండి.

  • క్రిమి సంహారక మందుతో రుద్దిన దోమ తెరకిందే నిద్రించండి.
  • సాయంత్రం నుంచి మర్నాడు తెల్లవారే దాకా ఒంటిపై, కనిపించే చర్మంపైన దోమల రిపెల్లెంట్ మందును (ఆయింట్ మెంట్ ) పూయండి.

లిఫంటిక్ ఫిలేరియాసిస్ కు చికిత్స ఏమిటి ?

[మార్చు]

ఈ వ్యాధి కీటకాలు సక్రమించిన వ్యక్తులు ఏడాదికొకడోసు (డి.ఇ.సి.) మందును తీసుకోవటం ద్వారా రక్తంలో సంచరిస్తున్న (మైక్రోఫిలేరియా) సూక్ష్మక్రిములను చంపేయవచ్చు. ఈ మందు శరీరంలో పెద్ద కీటకాలన్నిటినీ చంపలేక పోయినప్పటికీ, కనీసం ఈ వ్యాధి గ్రస్తులు ఇంకొకరికి దీన్ని బదిలీ చేయకుండా నివారించగలరు. పెద్ద కీటకాలు చనిపోయినప్పటికీ, లింఫోడెమా వృద్థి చెందగలదు. ఈ లింపోడెమా తీవ్రమై, హానికలిగించకుండా ఉండాలంటే క్రింద పేర్కొన్న మౌలిక సూత్రాలు పాటించాలి.

  • శరీరంలో పై వాపు కలిగిన ప్రదేశాన్ని సబ్బు, నీళ్లతో ప్రతిరోజు కడగాలి.
  • శరీరంపై ఏర్పడిన పుండ్లమీద యాంటి-బ్యాక్టీరియల్ క్రీము పూయాలి. తద్వారా బ్యాక్టీరియా కలిగించే ఇన్ ఫెక్షన్ ను నిలిపి వేయవచ్చు.
  • వాపు కలిగిన చేతిని లేదా కాలును పైకెత్తి, కసరత్తు చేయాలి. తద్వారా లోపల ఒకేచోట పేరుకు పోయిన ద్రవాలు కదిలి, లింఫ్ ద్రావాల ప్రవాహం పెరుగుతుంది.

మూలములు

[మార్చు]
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]