మలయ మారుతాలు
మలయ మారుతాలు | |
కృతికర్త: | సామల సదాశివ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | హిందుస్తానీ సంగీతం |
విభాగం (కళా ప్రక్రియ): | వ్యాససంకలనం |
ప్రచురణ: | తెలుగు విశ్వవిద్యాలయం |
విడుదల: | 2001 |
మలయ మారుతాలు పుస్తకం సామల సదాశివ హిందూస్తానీ సంగీతం గురించి రాసిన వ్యాససంకలనం.
రచనా నేపథ్యం
[మార్చు]హిందూస్తానీ సంగీత విద్వాంసులు, శ్రోతలు, పోషకులు, కచేరీలు వంటి విషయాలను గురించి రాసిన ఈ వ్యాసాలను సంకలనం చేసి మలయ మారుతాలుగా ప్రచురించారు. ఈ పుస్తకాన్ని మే, 2001లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించారు. ఈ రచనకు సదాశివను సంగీతజ్ఞుడు, సాహిత్యవేత్త కె.సదాశివరావు ప్రేరణ కలిగించారు.[1] పద్మాసచ్ దేవ్, రేఖాసఫ్రూ, బాల్ కవి బైరాగి, శంభూనాథ్ మిశ్రా తదితరుల హిందీ రచనలను, మోహన్ నాద్ కర్ణి, జి.ఎన్.జోషి లాంటి సంగీత మర్మజ్ఞుల ఆంగ్ల రచనలను, పద్మభూషణ్ దేశ్ పాండే, రాజారాం వంటి మరాఠీ రచయితల రచనలను ఈ వ్యాసాలకు ఆధారంగా తీసుకున్నారు. కొన్ని రచనలకు ప్రముఖ పాత్రికేయుడు జి.కృష్ణ ఆంగ్ల, తెలుగు వ్యాసాలు, అప్పుడప్పుడు ఆయన స్నేహితుడైన జి.కృష్ణ కబుర్ల కొన్ని వ్యాసాలకు ఆధారమని రచయిత పేర్కొన్నారు.
ప్రధానాంశాలు
[మార్చు]మలయ మారుతాలులో సదాశివ హిందూస్తానీ సంగీతాన్ని గురించి ఎన్నో అంశాలను వివరించారు. సంగీత విద్వాంసుల విశిష్టతలు, ప్రత్యేకతలు, శ్రోతల రసజ్ఞత, విద్వాంసుల జీవితంలో చెణుకులు, వివిధ రాగాల ప్రత్యేకతలు వంటి అంశాలు ఈ వ్యాసాల్లో కనిపిస్తాయి. సంగీత రసజ్ఞుడు, స్వదేశీ సంస్థానాధీశుల వద్ద దివాన్ గా పనిచేసినవాడు ఐన కిషన్ సింగ్ చావ్ డా తన అనుభవాలను ఆమాస్నాతారా అనే గుజరాతీ పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం అంధేరీ రాత్ కే తారే పేరిట హిందీలో అనువాదమైంది. ఎందరో సంగీతవిద్వాంసుల గురించి రాసున్న ఆ అనుభవాలను మలయమారుతాల్లో క్లుప్తంగా రాశారు సదాశివ.
ప్రముఖ హిందూస్తానీ సంగీత విద్వాంసులు హైదరీజాన్, మలికాజాన్, గోహర్ జాన్, హీరాబాయి బారోడేకర్, అంజనీబాయి మాల్ఫేకర్, విద్యాధరీదేవి, ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్, అన్నపూర్ణాదేవి, హరిప్రసాద్ చౌరాసియా, పండిత్ రవిశంకర్, అలీబఖష్ తదితరుల ప్రస్తావనలు, వ్యక్తిత్వాలు, జీవనశకలాలు ఈ గ్రంథంలో వస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ మలయ మారుతాలు:సామల సదాశివ, కృతజ్ఞతలు నోట్