శివదేవుని సోమవారపు నోము కథ
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. (July 2021) |
శివానుగ్రహాన్ని పొందడానికి గాను 'సోమవారం నోము' చెప్పబడింది. ఈ నోము పట్టిన వారు ప్రతి సోమవారం చొప్పున, 21 సంవత్సరాల పాటు శివారాధన చేయవలసి వుంటుంది. నోము పట్టిన రోజున ఒంటిముడి తోరాన్ని ... రెండో రోజున రెండు ముడుల తోరాన్ని ధరించవలసి వుంటుంది. ప్రతి 21 వారాలకి తోరం మార్చడాన్ని 'లఘు ఉద్యాపన' అంటారు. ఇక 42వ వారం నుంచి మూడు ముడుల తోరాన్ని ధరించవలసి వుంటుంది.
21 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత 21 ద్రవ్యాలతో మహా శివుడిని అభిషేకించాలి. 21 వత్తులతో దీపం వెలిగించాలి. 21 మంది బ్రాహ్మణులకు సమారాధన చేయాలి. అలాగే 21సంవత్సరాల వయసుగల స్త్రీ పురుషులకు భోజనాలు పెట్టాలి. అప్పుడే 'మహా ఉద్యాపన'కార్యక్రమం ముగిసినట్టు అవుతుంది.
ఇక ఈ సోమవారపు నోము మహిమను తెలిపే కథలోకి వెళితే పూర్వం ఓ ఇల్లాలు సోమవారపు నోమును నోచుకుంటోన్న కారణంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. తనకి సంతానాన్ని ఇవ్వమని ఆమె కోరడంతో, అది వారి జాతకంలో లేదని చెబుతూనే అల్పాయుష్కుడైన కొడుకుని ప్రసాదించాడు. ఆ పిల్లవాడు పదహారవ యేట చనిపోతాడని తెలిసి కూడా ఆమె శివుడి పైనే విశ్వాస ముంచింది.
కొడుక్కి 16వ సంవత్సరం నిండిన రోజునే ఆమె సోమవారపు నోము మహా ఉద్యాపన చేయసాగింది. కొడుకుని భర్తకు అప్పగించి ఆమె శివాలయానికి వెళ్లింది. కొడుకు పరిస్థితి బాగోలేదనే కబురు వస్తున్నప్పటికీ, ఆమె ఆ ఉద్యాపన కార్యక్రమాన్ని అంకిత భావంతో పూర్తిచేసింది. ఫలితంగా శివుడు ప్రత్యక్షమై ఆమెకి కొన్ని అక్షింతలను ఇచ్చి కొడుకుపై చల్లమని చెప్పి అదృశ్యమయ్యాడు.
ఆమె ఇంట్లో అడుగు పెడుతుండగానే తమ కొడుకు చనిపోయాడంటూ భర్త బావురుమన్నాడు. దాంతో ఆమె తన చేతిలోని అక్షింతలను కొడుకు శవంపై చల్లింది. వెంటనే అతను సజీవుడై లేచి కూర్చున్నాడు. దాంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ముగ్గురూ కూడా ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నట్టుగా ఈ కథ నోము మహిమను తెలుపుతోంది.......అమృత