శివాపిథెకస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శివాపిథెకస్
కాల విస్తరణ: 12.5–8.5 Ma
Miocene
ఎస్. ఇండికస్ పుర్రె, నేచురల్ హిస్టరీ మ్యూజియం, లండన్
శాస్త్రీయ వర్గీకరణ e
Unrecognized taxon (fix): Sivapithecus
జాతి

శివాపిథెకస్ బ్రెవిరోస్ట్రిస్
శివాపిథెకస్ పంజాబికస్
శివాపిథెకస్ పర్వాడా
శివాపిథెకస్ శివాలెన్సిస్
శివాపిథెకస్ ఇండికస్

Synonyms

రామాపిథెకస్

శివాపిథెకస్ (శివుడి కోతి) (నానార్థం: రామాపిథెకస్) అంతరించిపోయిన కోతుల జాతి. 1.22 కోట్ల సంవత్సరాల క్రితం[1], మయోసీన్‌ ఇపోక్‌కు చెందిన ఈ జాతి జంతువుల శిలాజ అవశేషాలను 19 వ శతాబ్దం నుండి భారత ఉపఖండంలోని సివాలిక్ కొండల్లో కనుగొన్నారు. ఈ జీనస్‌లోని ఏదైనా జాతి ఆధునిక ఒరంగుటాన్లకు పూర్వీకులు అయి ఉండవచ్చు.

తొలుత కనుగొన్న కొన్ని జంతు అవశేషాలకు రామాపిథికస్ (రాముడి కోతి) అని, బ్రామాపిథికస్ (బ్రహ్మ కోతి) అనీ పేర్లు పెట్టారు. ఇవి మానవుల పూర్వీకులు అయి ఉండవచ్చని భావించారు.

కనుగోలు[మార్చు]

ఎస్. శివాలెన్సిస్ దవడ శకలాలు.
ఎస్. పంజాబికస్ దవడ

శివాపిథికస్ యొక్క మొదటి అసంపూర్ణ అవశేషాలను 19 వ శతాబ్దం చివరిలో ఉత్తర భారతదేశంలో కనుగొన్నారు.

1932 లో నేపాల్ పశ్చిమ భాగంలోని పల్పాలో టినావ్ నది ఒడ్డున మరొక అవశేషాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం అది ఖాట్మండూ నేచర్ మ్యూజియంలో ఉంది. దీనికి "రామాపిథెకస్ " అని పేరు పెట్టారు. దీన్ని కనుగొన్న జి. ఎడ్వర్డ్ లూయిస్, ఇది శివాపిథెకస్ కంటే భిన్నమైనదని పేర్కొన్నాడు. ఎందుకంటే దాని దవడ అప్పటికి తెలిసిన ఇతర శిలాజ కోతుల కంటే భిన్నంగా, మానవుడి దవడకు దగ్గరగా ఉంది. తిరిగి ఈ వాదన 1960 లలో తలెత్తింది. ఆ సమయంలో, మానవుల పూర్వీకులు 1.4 కోట్ల సంవత్సరాల క్రితం ఇతర కోతుల నుండి విడివడ్డారని భావించేవారు. జీవరసాయన అధ్యయనాలు ఈ అభిప్రాయం తప్పని తేల్చాయి. ఒరంగుటన్ పూర్వీకులూ, చింపాంజీ, గొరిల్లా, మానవులు - ఈ ముగ్గురి పూర్వీకులూ ముందే విడివడ్డారని అవి సూచించాయి.

ఇదిలా ఉండగా, 1975, 76 ల్లో మరింత సంపూర్ణమైన రామాపిథెకస్ నమూనాలను కనుగొన్నారు. రామాపిథెకస్, ముందు అనుకున్నదానికంటే మానవ పోలికలు తక్కువగా ఉన్నాయని ఈ నమూనాలను బట్టి తెలిసింది. పరిశీలించే కొద్దీ దీనిలో శివాపిథెకస్ పోలికలు ఎక్కువగా కనిపించడం మొదలైంది. అంటే పాత పేరుకే ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి. రామాపిథెకస్ శిలాజాలు శివాపిథెకస్ యొక్క స్త్రీరూపం అయి ఉండే అవకాశం ఉంది. ఈ రెండూ ఖచ్చితంగా ఒకే జీనస్‌కు చెందినవి. చింప్‌లు గొరిల్లాలూ, మానవుల ఉమ్మడి పూర్వీకుడి నుండి అప్పటికే వేరుపడి ఉండవచ్చు. ఈ పూర్వీకుడు చరిత్రపూర్వపు గొప్ప కోతి అయిన నకాలిపిథెకస్ నాకాయమాయ్ అయి ఉండవచ్చు. ఒకప్పుడు రామాపిథెకస్ జాతికి చెందినవని భావించిన సివాలిక్ నమూనాలు ఇప్పుడు శివాపిథెకస్ జాతులకు చెందినవని ఎక్కువమంది పరిశోధకులు భావిస్తున్నారు. రామాపిథెకస్‌ను ఇకపై మానవుల పూర్వీకుడిగా పరిగణించరు.

1982 లో, డేవిడ్ పిల్‌బీమ్ శివాపిథెకస్ ముఖం, దవడ కలిగిన ఒక ముఖ్యమైన శిలాజ వివరాన్ని ప్రచురించాడు. ఈ నమూనాకు ఒరంగుటాన్ పుర్రెకూ బాగా పోలికలున్నాయి. శివాపిథెకస్‌కు ఒరంగుటాన్లతో దగ్గరి సంబంధం ఉందన్న సిద్ధాంతం (గతంలో ఇతరులు సూచించినది) దీంతో బలోపేతమైంది.

వివరణ[మార్చు]

శివాపిథెకస్ 1.5 మీ. ఎత్తుతో, ఆధునిక ఒరంగుటాన్ మాదిరిగానే ఉంటుంది. చాలా విషయాల్లో, ఇది చింపాంజీని పోలి ఉండేది, కానీ దాని ముఖం ఒరంగుటాన్ ముఖానికి దగ్గరగా ఉంటుంది. దాని మణికట్టు ఆకారం, శరీరాంగాల నిష్పత్తులను బట్టి చూస్తే అది చెట్లపై జీవించడంతో పాటుగా, నేలపై కూడా గణనీయమైన సమయాన్ని గడిపినట్లు తెలుస్తుంది. దీనికి పెద్ద కోర పళ్ళు, భారీ మోలార్లూ ఉన్నాయి. దీన్నిబట్టి అది విత్తులు, సవానా గడ్డి వంటి గట్టి ఆహారాన్ని తినేదని తెలుస్తుంది.

జాతులు[మార్చు]

ప్రస్తుతం మూడు జాతులను గుర్తించారు:

  • శివాపిథెకస్ ఇండికస్ శిలాజాలు సుమారు 1.25 కోట్ల నుండి 1.05 కోట్ల సంవత్సరాల క్రితం నాటివి. [2]
  • శివాపిథెకస్ శివాలెన్సిస్ 95 లక్షల నుండి 85 లక్షల సంవత్సరాల క్రితం జీవించింది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు, ప్రస్తుత పాకిస్తాన్లోని పొథోవార్ పీఠభూమిలో కూడా దీన్ని కనుగొన్నారు. ఈ జంతువు చింపాంజీ పరిమాణంలో ఉండి, ఒరంగుటన్ ముఖాకృతి ఉండేది. ఇది మృదువైన పండ్లను తింనేది (పళ్ళ అరుగుదలను బట్టి గమనించాఅరు) బహుశా ఇది చెట్లపైనే ప్రధానంగా నివసించేది.
  • 1988 లో వెలుగులోకి వచ్చిన శివాపిథెకస్ పర్వాడా జాతి గణనీయంగా పెద్దది. సుమారు 1 కోటి సంవత్సరాల క్రితం నాటిది.

ఇవి కూడా చూడండి[మార్చు]


బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Page 52, ISBN 978-0-19-568785-9, India's Ancient Past by R.S.Sharma
  2. "A partial hominoid innominate from the Miocene of Pakistan: Description and preliminary analyses". Archived from the original on 2021-10-07. Retrieved 2019-11-09.