అబచూరిన పోస్టాఫీసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబచూరిన పోస్టాఫీసు
దర్శకత్వంఎన్. లక్ష్మీనారాయణ
రచనపూర్ణచంద్ర తేజస్వి
నిర్మాతపత్రె సి. వినాయక్
తారాగణంనాని
గిరిజా లోకేష్
రమేష్ భట్
ఛాయాగ్రహణంఎన్.జి.రావ్
కూర్పుపి. భక్తవత్సలం
సంగీతంవిజయ భాస్కర్
నిర్మాణ
సంస్థ
చిత్ర శిల్పి
విడుదల తేదీ
1973
సినిమా నిడివి
106 నిమిషాలు
దేశంభారతదేశం
భాషకన్నడ

అబచూరిన పోస్టాఫీసు (కన్నడ : ಅಬಚೂರಿನ ಪೋಸ್ಟಾಫೀಸು) ఒక కన్నడ చలన చిత్రం. కె.పూర్ణచంద్ర తేజస్వి రచించిన కథ ఆధారంగా ఈ సినిమా తీయబడింది. ఇది 1973లో నిర్మించబడిన భారతీయ భాషాచిత్రాలలో ఉత్తమ చిత్రంగా ప్రాంతీయ బహుమతి పొందిన కన్నడ చిత్రం. పత్రె సి.వినాయక్ నిర్మించిన ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాని, గిరిజా లోకేష్, రమేష్, రామారావు ప్రధాన పాత్రలను ధరించారు. విజయకుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం నెరపాడు.

కథ[మార్చు]

అబచూర్ అనేది చిన్న గ్రామం. అక్కడ నివసించే బోబన్న చాలా మంచివాడు. అతడు కాఫీ ఎస్టేట్‌లో పనిచేస్తున్నాడు. ఆ కుగ్రామంలో వున్న చిన్న పోస్టాఫీసును కూడ్డా అతనే నడుపుతున్నాడు. బోబన్న నిజాయితీగా, నిక్కచ్చిగా తన పని పాటలు చూసుకుంటూ, గ్రామంలో వున్న వివిధ వ్యక్తులతో పరిచయం ఏర్పరుచుకుంటూ వస్తున్నాడు. ఒక్కోసారి, తనకు ఏదైనా ఇబ్బంది కలిగితే అది దాచిపెట్టుకుని నవ్వేసే స్వభావం అతనిది.

అతనికి పోస్టాఫీసు ఉద్యోగం సరదాగా, వినోదంగా ఉండేది. కాని ఇంటిదగ్గర మాత్రం అతనికి సుఖంలేదు. అతని భార్య కావేరికి అతనికి మధ్య ఉన్న అనురాగ సంబంధాలను అతని అత్త మాచమ్మ తుంచివేస్తున్నది. అత్తగారి అజమాయిషీ క్రింద అతని నలిగిపోతున్నాడు. కావేరి కూడా తల్లికి భయపడుతూ ఎటూ ఏమీ చెప్పలేక సతమతమవుతున్నది.

ఎస్టేట్ యజమాని శ్రీకాంతయ్య కొడుకు రమేష్ విలాస జీవితం గడిపే యువకుడు. సెలవుల్లో అతను అబచూర్ వచ్చాడు. తన వ్యక్తిగత విషయాలు తండ్రికి తెలియకూడదని, తన ఉత్తరాలు, తన టపా అంతా తనకే అందజెయ్యమని బోబన్నకు చెప్పాడు. బోబన్న అలాగే అన్నాడు. కొన్ని కొన్ని కవర్లు జాగ్రత్తగా అతన్నే అట్టేపెట్టమన్నాడు. ఒకరోజు రమేష్‌^కు వచ్చిన ఒక పార్సెల్ చిరిగి బయట పడింది. అందులో అతనికి నగ్నదృశ్యాలున్న పుస్తకం కనిపించింది. స్త్రీల నగ్నత్వాన్ని అలా చూడడంలో బోబన్న ఉత్సాహం కనబరిచాడు. ప్రణయానందంతో ఉప్పొంగసాగాడు. అప్పుడప్పుడూ రమేష్ దగ్గర్నుంచి ఖరీదైన అత్తర్లను, సిగరెట్లను పుచ్చుకుంటూ కులాసాగా గడపసాగాడు. ఈ ఉత్సాహం భార్యను అటూ ఇటూ తీసుకెళ్ళేంతవరకూ వచ్చింది.

ఇది ఇలా ఉండగా ఇంకో సంఘటన జరిగింది. కల్లు దుకాణంలో బెలయాడ అనే వ్యక్తికి ఒకరోజు ఒక పోస్టుకార్డ్ వచ్చింది. అది కేరాఫ్ బోబన్న అని ఉంది. బెలయాడ ఎప్పుడూ ఒక చోట నిలవడు. వూరూరూ తిరుగుతూ వుంటాడు. ఉత్తరం వచ్చిన రోజు కూడా బెలయాడ అందుబాటులో లేడు. ఆ కార్డు ఆకాశరామన్న ఉత్తరం. బెలయాడ కుమార్తె పద్మిని గురించి లేనిది పోనిది రాసి ఉంది. బోబన్న అది చూడనే లేదు. కాని అతని అత్తగారు చూసింది. ఆ ఉత్తరాన్ని రంగప్ప అనే అతనిచేత చదివింది. ఆ ఉత్తరం అటూ ఇటూ చేతులు మారడంతో తడిసిపోయింది. అది చూసి బోబన్న కంగారు పడి మంచి ఉద్దేశం తోనే - ఇంకో కార్డు మీద అదే విషయం వ్రాసి, బెలయాడ అడ్రసు రాసి పోస్ట్ చేస్తాడు. ఈ విషయం బయట పడి ఆ ఉత్తరం రాసిన 'ఆకాశ రామన్న ' బోబన్ననే అని వూరందరూ అపోహపడ్డారు. అమాయకురాలైన పద్మినిపై అభాండాలు వేసినందుకు బోబన్నపై అందరూ విరుచుకు పడ్డారు.అయితే బోబన్న తడిసిన మొదటి కార్డు చూపడం వల్ల ఆ ఉత్తరం అతను వ్రాయలేదని అందరూ గ్రహించారు. అయితే తన భార్యముందు ఊరంతా అలా అనడం, భార్య బాధపడడం చూసి బోబన్న అదోలా అయిపోయాడు. దానికి తోడు కూతురు పెళ్ళికి అత్తగారు చేసిన అప్పు విషయమై ఎస్టేటు యజమాని ఆమె పరంగానే తీర్పు చెప్పడంతో అతనికి మంచితనంపై, నిజాయతీపై నమ్మకం పోతుంది. ఫలితంగా వికలమైన మనసుతో తన భార్యను తీసుకుని ఆ గ్రామం విడిచి వెళ్ళిపోవడంతో కథ ముగుస్తుంది.[1]

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (1 November 1974). "అబచూరిన పోస్టాఫీసు". విజయచిత్ర. 9 (5): 33.

బయటి లింకులు[మార్చు]