Jump to content

గ్రామ రెవిన్యూ అధికారి

వికీపీడియా నుండి
(గ్రామ కార్యదర్శి నుండి దారిమార్పు చెందింది)

పూర్వం ఆంధ్రప్రాంతంలో కరణం మునసబు, తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీలు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. 1985లో ఈ విధానాన్ని తొలగించి గ్రామ సహాయకులను (Village Asssistant) నియమించారు. తరువాత 1990 లో గ్రామ పాలనాధికారి (వి.ఏ.వో (Village Administrative Officer) వ్యవస్థను ప్రవేశపెట్టారు. తరువాత 2002 లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేసే పంచాయితీ సెక్రటరీల విధానం అమలులోకి వచ్చింది. గ్రామ పంచాయితీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో [1] 2007 ఆగస్టు నుంచి గ్రామ రెవెన్యూ అధికారుల (Village Revenue Officer) వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది.వీరు తహసీల్దారు (ఎంఆర్ఒ) అజమాయిషీలో పని చేస్తారు.

అధికారుల కేటాయింపు, నియమించు విధానం

[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 28,123 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో 26,613 నివాసిత గ్రామాలు 1,510 నివాసాలు లేని గ్రామాలు. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 21,809 గ్రామ పంచాయితీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12, 397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు గ్రామ పంచాయితీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక గ్రామ రెవెన్యూ అధికారి వుండాలి. గ్రామ పంచాయితీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ లో 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10, 000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవెన్యూ అధికారి వీ.ఆర్.వోలు ఉంటారు. ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది. గ్రామ రెవెన్యూ అధికారికి సహాయకునిగా గ్రామంలోనివసించే వారిలో ఒకరిని గ్రామ రెవెన్యూసహాయకునిగా (Village Revenue Assistant) నియమించుతారు.

విధులు

[మార్చు]

విధులు సాధారణ పరిపాలన, రెవెన్యూ విధులు, పోలీస్ విధులు, సామాజిక సంక్షేమం అభివృద్ధి ఉన్నాయి.[2] ([3]) .

సాధారణ పరిపాలన / రెవెన్యూ విధులు:

  1. గ్రామ పాలన వ్యవహారాల రెవెన్యూ రికార్డులు, లెక్కలను సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించడం.
  2. ప్రభుత్వానికి రావలసిన భూమిశిస్తు, సెస్‌లు, పన్నులు, ఇతర బకాయిలను వసూలు చేయడం.
  3. సర్వే రాళ్ళు తనిఖీతో సహా పంటలను నూరు శాతం అజమాయిషీ చేయడం.
  4. గ్రామ రెవెన్యూ అధికారులు సంబంధిత గ్రామములలో జన్మస్థల ధ్రువపత్రములు, సాల్వెన్సీ సర్టిఫికేట్లు, నివాస పత్రము, పహాణి/అడంగల్‌ ఎక్స్ ట్రాక్టులు వంటి ధ్రువపత్రంలను నియమబద్ధముగా జారీ చేయాలి.
  5. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫానులు ఇతర విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు సత్వరం ఉన్నతాధికారులకు తెలియచేయడం. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలను అంచనా వేయడంలో రెవెన్యూ అధికారులకు సహకరించడం, సహాయాన్ని అందజేయడం.
  6. అకస్మాత్తుగా వరదలు / ప్రమాదాలు సంభవించినప్పుడు సత్వర చర్య తీసుకొను పై అధికారులకు, రైల్వే స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారాన్ని అందించడం.
  7. గ్రామ సేవకుల వేతనాల బిల్లులు తయారు చేయడం
  8. గ్రామ చావిడుల నిర్వహణ
  9. ప్రభుత్వ భూములు, చెరువులు, చెట్లు, ప్రభుత్వానికి చెందిన ఇతర ఆస్తుల పరిరక∆ణ. ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడం.
  10. నిధి నిక్షేపాలు, హక్కులు లేని ఆస్తుల గురించి ఉన్నతాధికారులకు సత్వరం సమాచారం అందజేయుట.
  11. పురాతన కట్టడలు కూల్చివేత గురించి కానీ శిలాశాసనాలు, స్మారక చిహ్నాలు లభ్యమైనప్పుడు కానీ తహశీల్దార్‌కు ఆ సమాచారం అందించాలి.
  12. ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడలి. గ్రామ రెవెన్యూ అధికారుల పరిధిలోని గ్రామాలలోనూ, పరిసరాల్లోనూ, ప్రజాప్రయోజనాలకు ఉద్దేశించిన రహదారులు, వీధులు, బహిరంగ ప్రదేశాల వంటి భూములు దుర్వినియోగం కాకుండా, నష్టపోకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి.
  13. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనా, వాటికి నష్టం వాటిల్లినా సంబంధిత సమాచారాన్ని తహశీల్దార్‌కు తక్షణం తెలియజేయాలి. తదానంతర చర్యలు చేపట్టాలి.
  14. రెవెన్యూ రికవరీ చట్టం క్రింద ప్రభుత్వ బాకీలు వసూలు చేయు నిమిత్తం సదరు బాకీదారుల ఆస్తుల వివరాల సేకరణ ప్రక్రియలో సంబంధిత అధికారులకు సహకరించాలి.
  15. లీగల్‌ నోీటీసులు, సమన్‌లు జారీ చేయడంలో అధికారులకు సహకరించాలి.
  16. ప్రజలకు అవసరమైన సంఘటనలను తెలియచెప్పానికి దండోరా, ఇతర పద్ధతులు అవలంభించాలి.
  17. ఋణాల వసూళ్లలో సహకరించాలి.
  18. వారసులు లేని ఆస్తి స్వాధీనమైనప్పుడు పంచనామా నిర్వహించాలి.
  19. ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులకు భద్రత కల్పించాలి.
  20. ఒటర్ల జాబితాల తయారీ, నవీకరణ (అప్‌డేట్) లో సహకరించి, సవరణ చేయవలసినప్పుడు ఇతర ఎన్నికల విధులు నిర్వహించాలి.
  21. తమ పరిధిలోని గ్రామ పంచాయితీలు నిర్వహించే సమావేశాలకు హాజరై, వారి అభ్యర్థన మేరకు పింఛన్‌లు, అమలులో ఉన్న రేషన్‌ కార్డుల వివరాలు, ఇళ్ళ స్థల పట్టాల పంపిణీ, రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలకు సమాచారాన్ని అందాజేయాలి.
  22. ఎ.పి. ట్రాన్స్‌కో గ్రామములో నిర్వహించుచున్న విద్యుత్తు పనుల నిర్వహణకు సహకరించాలి. గ్రామాలలో విద్యుత్తు చౌర్యం, విద్యుత్తు అక్రమ వాడకం గురించిన సమాచారాన్ని సంబంధిత విద్యుత్తు అధికారులకు అందజేయాలి.
  23. సమర్ధాధికారి / ఉన్నతాధికారి ప్రకటన మేరకు కనీస వేతనాల చట్టం 1948 క్రిందా వీరు ఇన్‌స్పెక్టర్లుగా వ్యవహరిస్తారు.
  24. ఏ రెవెన్యూ అధికారి కానీ, జిల్లా కలెక్టర్‌, ఆర్‌.డి.ఓ. లేక తాహశీల్దార్‌ నియమించిన అధికారులు కానీ తనిఖీకి కోరినప్పుడు గ్రామ రెవెన్యూ అధికారి తాను నిర్వహిస్తున్న గ్రామ రిజిష్టర్లు, ఇతర రికార్డులు చూపవలయును. పైన పేర్కొన్న విధాంగా అధికారులు కోరితే తప్ప, ఆ రికార్డులను గ్రామ రెవెన్యూ అధికారులు తమ వ్యక్తిగత ఆధీనంలో భద్రాపరచాలి.
  25. బదిలీ /సస్పెన్షన్‌/తొలగింపు /డిస్మిస్‌/పదవీ విరమణ / సెలవుపై వెళ్ళే సందార్భాలలో (క్యాజువల్‌ లీవ్‌ మినహా) అన్ని గ్రామ రిజిష్టర్లు, రికార్డులను అధికారికంగా నియమితులైన అధికారికి అప్పగించాలి.

పోలీస్ విధులు:

  1. హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, గ్రామాలలో అశాంతి ప్రబలడానికి గల ఇతర ముఖ్య పరిణామాల గురించి పోలీసు శాఖకు సత్వరమే సమాచారం అందజేయాలి.
  2. అనుమానాస్పదంగా గ్రామములో ప్రవేశించి సంచరిస్తున్న వారి గురించి, పోలీసులకు సమాచారం అందించాలి.
  3. హింసాత్మక సంఘటనలను, ప్రజలకు గందారగోళం/ఇబ్బంది (న్యూసెన్స్‌) కలిగించే చర్యలను నిలువరించాలి.
  4. అపరాధులను గుర్తించి, న్యాయ రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి.
  5. చోరీ సొత్తు కోసం సోదా నిర్వహించి, పోలీసు స్టేషన్‌లో అప్పగించాలి.
  6. నేరానికి సంబంధించిన రుజువులను భద్రపరచాలి.
  7. వారసులు లేని / అడగని సొత్తులను స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌లో అప్పగించాలి.

సామాజిక సంక్షేమం అభివృద్ధి విధులు:

  1. ఇందిరమ్మ, ఇందిరప్రభ, ఇందిర క్రాంతి పథాం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథాకం వంటి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సహకరించాలి.
  2. దారిద్ర రేఖకు దిగువన వున్న కుటుంబాల వివరాల సేకరణలో సహకరించాలి. వారి ఆదాయ పరిమితిని అవరోహణ క్రమంలో జాబితాలు రూపొందించాలి.
  3. బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన పత్రాలు తయారుచేయడంలో, ఈ పథకం అమలుకు సహకరించాలి.
  4. మహిళలు, పిల్లలపై జరిగే ధురాగతాల గురించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. 24 గంటలలోగా చర్య తీసుకోవాలి.
  5. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు వారిపై జరిగే అత్యాచారాల గురించి సంబంధిత ఉన్నతాధికారులకు సమచారం అందజేసి, వారికి సహకరించాలి.
  6. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారికి ఆలయ ప్రవేశం కల్పించడం ద్వారా అంటరానితనాన్ని నిర్మూలించాలి.
  7. అంటువ్యాధులు ముఖ్యంగా మలేరియా, మెదడువాపు, అతిసారం వంటి వ్యాధులు ప్రబలినప్పుడు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తక్షణం తెలియజేయాలి.
  8. గిరిజన గ్రామ అభివృద్ధి సంస్థల సమావేశాలకు హాజరై, సూక్ష్మ ప్రణాళికల తయారీ అమలుకు సహకరించాలి.
  9. అక్షరాస్యత తరగతుల నిర్వహణలో సహకారం అందించాలి.
  10. పంటల బీమా పథకం అమలుకు, పంటలను అంచనా కట్టడంలో తోడ్పటును అందించాలి.
  11. వ్యవసాయ కార్యక్రమాల అమలు, సమాచార విస్తరణకు చేయూతనివ్వాలి.
  12. వ్యవసాయ గణాంకాలు తయారీలో సహకరించాలి.
  13. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నల్లబజారులో విక్రయిస్తున్నటువంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత అధికారులకు అందజేయాలి.
  14. సహకార రంగం పరిధిలోని, వెలుపల గల చేనేత కార్మిక కుటుంబాలు, వారి ఆర్థిక స్తోమత వివరాలు సేకరణలో తోడ్పటును అందించాలి.
  15. చేనేత కార్మికులకు అవసరమైతే 'డిపెండెన్సీ' సర్టిఫికెట్లు జారీ చేయాలి.
  16. వివాహ నిర్బంధిత రిజిస్ట్రేషన్‌ చట్టము 15/2002 ప్రకారము రాష్ట్రంలో జరిగే వివాహములను తప్పనిసరిగా రిజిష్టరు చేయు నిమిత్తం తమ పరిధిలోనున్న గ్రామములో, సముదాయములో మ్యారేజ్‌ అధికారిగా వ్యవహరించుట.
  17. ప్రభుత్వం, భూ పరిపాలన శాఖ ప్రధాన కమీషనర్‌, కలెక్టర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి, తహశీల్దారు లేక ఏ ఇతర అధికారి అయినా అప్పగించిన విధులు నిర్వర్తించాలి.

మూలాలు

[మార్చు]
  1. జి.ఓ.యం.యస్‌. నెం.1059 రెవెన్యూ (గ్రామ పరిపాలన) శాఖ తేది .31.07.2007కు అనుబంధం
  2. గ్రామ ఆదాయ ఆధికారి విధులు జి.ఒ.ఎమ్.ఎస్ సంఖ్య 1059 రెవెన్యూ ( గ్రామ పరిపాలన) శాఖ 31.7.2007
  3. "గ్రామ పరిపాలన మార్గదర్శిని" (PDF). AMR-APARD. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2012-12-27.

వెలుపలి లంకెలు

[మార్చు]