చండ్ర పుల్లారెడ్డి
చండ్ర పుల్లారెడ్డి భారత విప్లవకారులలో అగ్రగణ్యులు. సిపి అనే పేరుతో పిలవబడేవారు.
పుట్టుక-విద్యాభ్యాసం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగోడు గ్రామంలో 1917 జనవరి 19 న జన్మించారు.[1] మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన సీపీ గారు ఐదవ తరగతి వరకు వెలుగోడులో, ఆపైన మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ విద్యను కర్నూలు ఉస్మానియా కాలేజీలో పూర్తి చేశారు. ఇంజనీరింగ్ విద్యకై మద్రాస్ గిండి ఇంజినీరింగ్ కాలేజీలో చేరారు.
ఉద్యమ జీవితం
[మార్చు]అక్కడ ఇంజనీరింగ్ చదువుతూవుండగా నాటి బ్రిటిష్ పాలకులు జవహర్లాల్ నెహ్రూను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు.దాంతో కాలేజీ యాజమాన్యం ధర్నాకు ముఖ్య కారకులైన చండ్ర పుల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి గార్లను క్షమాపణ చెప్పాలనికోరగా వారు నిరాకరించారు. కాలేజీ ప్రిన్సిపాల్ వారిరువురిని కాలేజీ నుండి బహిష్కరించారు.అప్పటికే స్వతంత్ర భావాలు,నాటి మద్రాస్ కమ్యూనిస్టు నాయకులు కుమారమంగళం లాంటి వారి ప్రసంగాల వల్ల కమ్యూనిస్టు భావజాలం సీపీ గారిలో బలంగా ఉండేవి.1937 మే 1 వ తేదీన నాటి ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు జిల్లా కొత్తపట్నంలో 15 రోజులపాటు జరిగిన రాజకీయ పాఠశాలలో వెలుగోడు గ్రామం నుండి ఔత్సాహిక యువకులతో పాటు చండ్ర పుల్లారెడ్డి గారు కూడా పాల్గొన్నారు.ఆ రాజకీయ పాఠశాలకు పుచ్చలపల్లి సుందరయ్య,చండ్ర రాజేశ్వరరావు వంటి ప్రభుతులు అధ్యాపకులుగా ఉండేవారు.1941 నాటికి పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారి కర్నూలు జిల్లా కమిటీ సభ్యుడిగా వున్నారు.1946 లో కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు.1949 మధ్యకాలంలో డిటెన్యూ కింద అరెస్టు కాబడి 1951లో విడుదలయ్యారు.1952 మద్రాస్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరుపున పోటీ చేసి తన ప్రత్యర్థి ,కాంగ్రెస్ అభ్యర్ధి, భూస్వామి అయిన మద్దూరు సుబ్బారెడ్డి మీద 10000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఎమ్మెల్యేగా మద్రాస్ అసెంబ్లీలో రాయలసీమ వెనకబాటుతనాన్ని ప్రశ్నిస్తూ సీపీ గారు చేసే ప్రసంగాలకు ముఖ్యమంత్రి రాజగోపాలచారి గారిచే " రాయలసీమ తరుపున పోరాడడానికి గట్టివాడే దొరికాడే " అని అనిపించుకున్నాడు.1953 రాష్ట్ర విభజన తరువాత 1955 లో పోటీచేసి ఓడిపోయారు. మళ్ళీ 1962 లో జరిగిన ఉప ఎన్నికల్లో మిడుతురు నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు.అది మొదలు సీపీ గారు తన చివరి శ్వాస వరుకు ఎన్నడూ ప్రత్యక ఎన్నికల్లో పాల్గొనింది లేదు.1946-51 మధ్యకాలంలో సాగిన తెలంగాణ ప్రజల సాయుధ పోరాటంలో పలుమార్లు అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యారు.1964 లో భారత కమ్యూనిస్టు పార్టీలో మొదలైన సైద్ధాంతిక విభేదాల్లో పుచ్చలపల్లి సుందరయ్య ,మాకినేని బసవపున్నయ్య, తరిమెల నాగిరెడ్డి గార్లతో కలిసి సీపీఎం వైపుకు వచ్చారు. జైలు నుంచి విడుదలై 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.1975లో సి.పి., సీపీఐ (ఎం-ఎల్) కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. 1979లో యస్.యన్.యస్ స్థానంలో కేంద్రకమిటీ జనరల్ సెక్రటరీ కాగలిగారు. 1980 ప్రత్యేక మహాసభలో కేంద్రకమిటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.[2]
మరణం
[మార్చు]కార్మిక సంఘాల సమావేశాలకు హాజరై తిరిగి వస్తూ రైలులోనే కలకత్తా లో 1984 నవంబర్ 9 న తీవ్ర గుండెపోటుతో మరణించారు.[2]
రచనలు
[మార్చు]- మానికొండ సుబ్బారావుతో కలిసి 'ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం - దాని పరిణామం'
- వి.ఆర్.బొమ్మారెడ్డి తో కలిసి ' మావో సూక్తులు' అనువాదం
- మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం - దాని గుణపాఠాలు.
- ఎన్నికల సంఘటనలు గుణపాఠాలు
- సీపీఐ, సీపీఎం, ఎపిసిసిసిఆర్ లలో వున్నప్పుడు ' జనశక్తి ' లో , సీపీఐ ( ఎం.ఎల్ ) లో తన పార్టీ పత్రిక విమోచన లోనూ అనేక సిద్ధాంత వ్యాసాలు రాసారు.
- సిద్ధాంత వ్యాసాలు ఏడు సంపుటాలుగా వెలువడ్డాయి.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (19 January 2022). "అణచివేతను ధిక్కరించిన అరుణపతాక". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
- ↑ 2.0 2.1 http://www.andhrajyothy.com/node/25234[permanent dead link]