జొన్నవిత్తుల శేషగిరిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జొన్నవిత్తుల శేషగిరిరావు
జననం1905
శాయపుర అగ్రహారం, మంటాడ, కృష్ణాజిల్లా
మరణం1937, మార్చి
వృత్తినటుడు, గాయకుడు

జొన్నవిత్తుల శేషగిరిరావు నటుడు, గాయకుడు. ఆంధ్ర గంధర్వ బిరుదాంకితుడు.[1]

విశేషాలు[మార్చు]

ఇతడు 1905లో కృష్ణాజిల్లా మంటాడ సమీపంలోని శాయిపుర అగ్రహారంలో జన్మించాడు. ఇతడు చిన్నతనంలోనే ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, రామదాసు కీర్తనలు ఆలపిస్తూ భక్తులను తన్మయత్వంలో ముంచేవాడు. తన 13వ సంవత్సరంలో ఇతడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా విజయవాడకు చేరుకున్నాడు. అక్కడ మైలవరం రాజా నడుపుతున్న బాలభారతి నాటక సంస్థ ప్రాంగణంలో కూనిరాగాలు తీస్తూవుంటే యడవల్లి సూర్యనారాయణ విని ఆకర్షితుడై ఇతడిని మైలవరం రాజాకు పరిచయం చేశాడు. పసితనంలో వున్న ఇతని గానం విని తన్మయుడైన మైలవరం రాజా ఇతడిని తన నాటక సమాజంలో నెలకు 40 రూపాయల వేతనంతో సభ్యునిగా చేర్చుకున్నాడు. బాలభారతి నాటక సమాజంలో ఇతడు హేమాహేమీలైన నటీనటులతో కలిసి అనేక నాటకాలలో నటించాడు. ఇతని పాట ప్రేక్షకులకు ఉత్తేజాన్ని కలుగజేసేది. ఇతడు ప్రహ్లాదుడు, శ్రీకృష్ణుడు మొదలైన పాత్రలతో నటజీవితం ప్రారంభించి అచిర కాలంలోనే ముఖ్యమైన వేషాలు వేయడం ప్రారంభించాడు. "సావిత్రి","ద్రౌపదీ వస్త్రాపహరణం", "కృష్ణలీలలు", "శకుంతల", "తులాభారం" మొదలైన నాటకాలలో యడవల్లి స్థానంలో నాయక పాత్రలను పోషించాడు. బాలభారతి నాటక సమాజం ప్రాచుర్యం క్షీణించగానే స్వయంగా గంధర్వ నాటక మండలిని స్థాపించి "సక్కుబాయి", "రాధాకృష్ణ", "శాకుంతలం", "రామదాసు" నాటకాలను ప్రదర్శించాడు. కర్ణాటక హిందుస్తానీ రాగాలలో అనర్గళంగా పాడగల గాత్ర సౌష్టవం, అందమైన ముఖవర్చస్సు ఇతడు నటుడిగా రాణించడానికి తోడ్పడ్డాయి[2].

ఇతడి ప్రతిభను తెలుసుకున్న గ్రామ్‌ఫోన్ కంపెనీ వారు 1930లో ఇతని పాటలను రికార్డులుగా తీసుకుని వచ్చాయి. ఇతని గాన వైదుష్యాన్ని తెలుసుకుని మహారాష్ట్ర గాయక - నటుడు బాల గంధర్వ ఇతడిని స్వయంగా కలుసుకుని తన సమాజంలో చేరవలసినదిగా ఆహ్వానించాడు. అయితే ఇతడు దానిని సున్నితంగా తిరస్కరించాడు. ఆయనే ఇతడికి ఆంధ్ర గంధర్వ అనే బిరుదుతో సత్కరించాడు.

తోడి, శంకరాభరణం, శహన, కేదారగౌళ, వరటి, శ్రీరాగం, కాంభోజి, భీంపలాస్, సోహని, కళింగ భాగేశ్వరి మొదలైన రాగాలు ఇతనికి అత్యంత ప్రియమైనవి. వీటిని సంపూర్ణంగా సాధన చేసి ఎంతో నేర్పుగా పాడేవాడు.

ఇతడి గానాన్ని మహారాష్ట్ర గాయకులైన బాల గంధర్వ, మాస్టర్ కృష్ణ నారాయణరావు వ్యాస్, పట్వర్ధన్ కర్ణాటక సంగీత విద్యాంసులైన కోనేరి రాజపురం వైద్యనాథ అయ్యర్, తిరుచి గోవిందస్వామి పిళ్లె, మధుర పొన్నుస్వామి పిళ్లె మొదలైన వారు విని ప్రశంసించారు.

మరణం[మార్చు]

నటునిగా, గాయకునిగా ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జొన్నవిత్తుల శేషగిరిరావు అతి పిన్న వయసులోనే 1937 మార్చిలో మరణించాడు[2].

మూలాలు[మార్చు]

  1. "::: ప్రముఖ వ్యక్తులు బిరుదులు :::". eenadupratibha.net. ఈనాడు. Archived from the original on 25 జనవరి 2018. Retrieved 12 January 2018.
  2. 2.0 2.1 మొదలి నాగభూషణశర్మ (20 March 2010). తొలినాటి గ్రామఫోన్ గాయకులు (1 ed.). హైదరాబాద్: క్రియేటివ్ లింక్స్. pp. 25–27. Retrieved 19 February 2019.[permanent dead link]