Jump to content

తాటి ముంజలు

వికీపీడియా నుండి
తాటి ముంజలు
అమలాపురంలో తాటి ముంజలు
తాటికాయలో ముంజల అమరిక

తాటి ముంజలు (ఆంగ్లం: Palmyra Palm / Ice Apple) తాటిచెట్ల కాయల నుండి లభిస్తాయి. ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి.[1] ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని 'ఐస్ యాపిల్' అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి. వీటిని కన్నడలో 'తాటి నుంగు' అని.. తమిళంలో 'నుంగు' అని అంటారు. శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికీ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.

ఉపయోగాలు

[మార్చు]

చలువ కోసం..

[మార్చు]

ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటాయి.. కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే!

నిర్జలీకరణం నుంచి ఉపశమనం..

[మార్చు]

ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా నిర్జలీకరణ అయిపోవడం సర్వసాధారణం. కాబట్టి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. ఈ పండ్లు ఆకారంలో లీచీ పండును పోలి ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది.

గర్భిణులకూ మంచిదే..

[మార్చు]

గర్భధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి.

బరువునూ తగ్గిస్తాయి

[మార్చు]

తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. అలాగే చికెన్‌పాక్స్‌తో బాధపడే వారికి దురద నుంచి ఉపశమనం అందించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

విషపదార్థాలు మాయం..

[మార్చు]

తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తుంది.

వాంతులయ్యేలా ఉంటే..

[మార్చు]

అధిక ఎండ వేడిమికి కొంతమందికి ఒక్కోసారి వాంతులయ్యేట్లు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు నిమ్మరసం తాగుతారు. ఒకవేళ నిమ్మరసంతో ఎలాంటి ఫలితం లేకపోతే తాటి ముంజలు తినడం మంచిది. వెంటనే ఆ సెన్సేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

క్యాన్సర్ల నుంచి..

[మార్చు]

తాటి ముంజలు.. వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. కాబట్టి ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి.

అలసట దూరం..

[మార్చు]

వేసవిలో అలా కాసేపు బయటికి వెళ్లొస్తేనే అలసిపోతాం కదా! అంతేకాదు.. విపరీతమైన చెమట పోస్తుంది.. ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని అందించి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి ఒక సులువైన మార్గం తాటి ముంజల్ని తినడం..

పొట్టు తీయకుండా తినాలి..

[మార్చు]

చాలామంది ముంజల పైన పొట్టులాగా ఉండే పైపొర తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవి చాలా అవసరం. అలాగే ఈ పొట్టువల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది. తాటి పండ్లు పళ్ళు

తాటిచెట్టు బాగా ఆర్థిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం, కాంబోడియాలలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2004-09-11. Retrieved 2015-11-09.
  2. Sakshi (24 March 2022). "తాటిముంజెలు ఎక్కువగా తింటున్నారా.. ఇందులో 80 శాతానికి పైగా!". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.

ఇతర లింకులు

[మార్చు]