తాళ్ళపాక కవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అన్నమయ్య వంశీయులైన కవులను తాళ్ళపాక కవులు అంటారు. వీరి అనేక రచనలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి.

అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య. తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాధుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.

చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంథము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము. ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు.

తాళ్ళపాకవారి వంశము

చిన్నన్న ద్విపద కెఱఁగున్
పన్నుగ పెద తిరుమలయ్య పదమున కెఱఁగున్
మిన్నంది మొరసె నరసిం
గన్న కవిత్వంబు పద్య గద్య శ్రేణిన్

అని తెనాలి రామకృష్ణుని చాటువు.

తాళ్ళపాక కవులు, వారి రచనలు జాబితా

[మార్చు]

పద కవితా పితామహుడు. తాళ్ళపాక వంశానికి మూల పురుషుడు. జీవిత కాలం 1408 - 1503 ప్రాంతం. ఇతని భార్యలు అక్కాంబ, తిమ్మాంబ (తిమ్మక్క).

  • శృంగార సంకీర్తనలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు (వెరసి ముప్పది రెండువేలు)
  • శృంగార మంజరి __ ప్రకటితము, మంజరీ ద్విపద యందు రచించబడినది
  • శతకములు __ పండ్రెండు, వీనిలో అలమేలు మంగ పై చెప్పబడి "వేంకటేశ్వరా" యను ముకుటముతో గల శతకం ఒకటే ప్రకటితము, తక్కినవన్నీ అలభ్యములు)
  • ద్విపద రామాయణము __ అలభ్యము
  • వేంకటాచల మాహాత్మ్యము __ సంస్కృత రచన, అలభ్యము
  • సంకీర్తన లక్షణము __ లక్షణ గ్రంథము, సంస్కృత రచన, అలభ్యము

అన్నమయ్య భార్య

  • సుభద్రా కళ్యాణము _ మంజరీ ద్విపద, ప్రకటితము

అన్నమయ్య రెండవ కుమారుడు. అన్నమయ్య పెద్ద భార్య అక్కాంబ కొడుకు. తిరుమలలో నివసించి తండ్రి సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగించాడు. 13 గ్రామములు, అనేక కానుకలు స్వామివారికి సమర్పించాడు. అన్నమయ్య సంకీర్తనలను రాగిరేకులపై వ్రాయించి సంకీర్తనా భండాగారంలో భద్రపరపించాడు

అన్నమయ్య, తిమ్మక్కల సంతానం. ఇతడు సుంకేశుల గ్రామంలో స్థిరపడినందున సంకుసాల నృసింహకవిగా పేరు పొందాడని ఒక అభిప్రాయము.

  • కవికర్ణ రసాయనము - ఆంధ్రప్రబంధము, ప్రకటితము (సంకుసాల నృసింహకవి రచన)

ఇతడు పెదతిరుమలయ్య పెద్ద కుమారుడు (అనగా అన్నమయ్య మనుమడు). తాతగారిచే ఉపదేశము పొందాడు. 16వ యేటనే సాహిత్య వ్యాసంగం ప్రారంభించాడు. ఎనిమిది భాషలలో అష్టభాషా దండకం చెప్పి "అష్టభాషా చక్రవర్తి" అనే బిరుదు పొందాడు.

  • శృంగార సంకీర్తనములు
  • ఆధ్యాత్మ కీర్తనలు
  • అష్టభాషా దండకము __ దండకము, ప్రకటితము
  • సంకీర్తన లక్షణము __ తెలుగు లక్షణ గ్రంథము అనువాదము (ప్రకటితము)

పెద తిరువెంగళనాధుడు

[మార్చు]

పెద తిరుమలాచార్యుని మూడవ కొడుకు. సాత్విక శుభమూర్తి, సంగీత సత్కవిత్వాధికుడు. ఇతడు సంకీర్తనలు వ్రాసి గానం చేస్తుంటే వే్కటేశ్వరుడే స్వయంగా వచ్చి నాట్యం చేసేవాడని రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయంలో పేర్కొన్నాడు.

తాళ్ళపాక చిన్నన్న (చిన తిరువేంగళనాథుడు )

[మార్చు]

పెద తిరుమలయ్య నాలుగవకుమారుడు.

  • అన్నమాచార్య చరిత్రము __ జీవిత చరిత్ర ద్విపద ప్రకటితము
  • పరమయోగీవిలాసము __ ద్విపద, ప్రకటితము
  • అష్టమహిషీ కళ్యాణము __ ద్విపద ప్రకటితము
  • ఉషాపరిణయము __ ద్విపద, ప్రకటితము.

కోనేటి తిరువెంగళనాధుడు

[మార్చు]

పెద తిరుమలాచార్యుని ఐదవ కొడుకు. సదమల విద్యా విశారదుడు. అత్యంత వైభవంగా జీవించాడట.

అన్నమయ్య ముని మనుమడు. చిన తిరుమలాచార్యుని కుమారుడు. నివాసము తిరుపతి.

  • అమరుకము __ కావ్యము, అనువాదము ప్రకటితము
  • బాల ప్రభోధిక __ అమరమునకు తెలుగు వ్యాఖ్య, అప్రకటితము
  • సుథానిధి __ మమ్మటుని కావ్యప్రకాశికకు వ్యాఖ్య _ అప్రకటితము
  • రామచంద్రోపాఖ్యానము __ కావ్యము. అలభ్యము

రేవణూరి కొండయార్యుడు

[మార్చు]

అన్నమాచార్యుని అల్లుడు. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల తాలూకా రేవణూరు నివాసి.

  • రామ చంద్రోపాఖ్యానము (ప్రబంధము)

రేవణూరి వేంకటాచార్యుడు

[మార్చు]

అన్నమాచార్యుని దౌహిత్రుడు (కూతురు కొడుకు). తిరుమలాంబా తిరుమల కొండయార్యుల కొడుకు.

  • శకుంతలా పరిణయము __ ప్రబంధము, అప్రకటితము
  • శ్రీపాదరేణు మాహాత్మ్యము __ కావ్యము, ప్రకటితము

తాళ్ళపాక శ్రీనివాసుడు

[మార్చు]

అన్నమయ్యకు ఏ తరం మనుమడో తెలియదు.

  • వేంకటేశ్వర శతకం (సీస పద్యాలు)

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]
  • అన్నమాచార్య - కామిశెట్టి శ్రీనివాసులు - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ (2006) - (తెలుగు వైతాళికులు సిరీస్ ప్రచురణలో భాగంగా)
  • క్రింది లింకులలో ఇచ్చిన పుస్తకాలు

బయటి లింకులు

[మార్చు]
  • ఆంధ్రభారతి”లో తి.తి.దే. 29 సంపుటములలో ప్రచురించిన తాళ్లపాకకవుల (అన్నమాచార్యుల, పెదతిరుమలాచార్యుల, చినతిరుమలాచార్యుల) పదసాహిత్యము 14,911 సంకీర్తనలు.

తాళ్ళపాక కవులకు సంబంధించిన కొన్ని రచనలు, పరిశోధనా గ్రంథాలు ఇంటర్నెట్ ఆర్చీవులలో లభిస్తున్నాయి.