దోసపాటి రాము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దోసపాటి రాము
జననంమార్చి 25
వృత్తిసమాజ సేవకుడు, సాప్ట్‌వేర్ ఉద్యోగి
పిల్లలుఇద్దరు కుమారులు
పురస్కారాలుది వీకెండ్‌ లీడర్‌ అవార్డు

దోసపాటి రాము తెలంగాణ రాష్ట్రానికి చెందిన సమాజ సేవకుడు. కరోనా సాయంలో రైస్ ఏటీఎంను స్థాపించి పేదలకు చేస్తున్న సేవలకు గాను, 2020వ సంవత్సరానికి వీఐటీ యూనివర్సిటీ వారి ‘ది వీకెండ్‌ లీడర్‌’ పురస్కారాన్ని అందుకున్నాడు.[1][2]

సామాజిక కార్యక్రమాలు[మార్చు]

దోసపాటి రాము 2005 సంవత్సరం ఓ రోడ్డు ప్రమాదంలో మరణం అంచులకు వెళ్లి బయటపడ్డాడు. అదే అతనిలో కొత్త ఆలోచనకు దారి తీసింది. అవసరంలో ఉన్నవాళ్లకు చేతనైన సహాయం చేయాలని ఆ క్షణమే సంకల్పించి తన జీతంలో సగం సంపాదన, జీవితంలో సగం సమయం సహాయ కార్యక్రమాలకే వెచ్చించాలని నిశ్చయించుకున్నాడు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ వాడాలని ప్రచారం చేసాడు. ప్రత్యేకంగా స్నేహితులతో కలిసి 'ఐయామ్‌ నాట్‌ ఇడియట్‌' అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశాడు. సీసీ కెమెరాలను పెట్టాలంటూ అప్పటి పాలకులకు, అధికారులకు వినతి పత్రాలు అందించాడు.[2] 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ళలో గాయాల పాలైన వాళ్లకు దాదాపు 150 లీటర్ల రక్తం అందించడంలో సాయపడ్డాడు.

టిఫిన్‌ బాక్స్‌ ఛాలెంజ్‌[మార్చు]

రాము శనివారం ఉదయం వచ్చిందంటే చేతిలో ఓ మైక్‌, భుజానికి జ్యూట్‌ బ్యాగ్‌ తగిలించుకొని కూరగాయల మార్కెట్లలోకి వెళ్లేవాడు. ఆదివారం చికెన్‌, మటన్‌ దుకాణాల వద్దకు వెళ్లే వెళ్లి ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, ప్లాస్టిక్‌ను వాడకుండా జ్యూట్‌ బ్యాగ్‌లు వాడాలనీ, మాంసాహారం కొనేవాళ్లు టిఫిన్‌ బాక్స్‌లు వాడాలనీ కోరుతూ 'టిఫిన్‌ బాక్స్‌ ఛాలెంజ్‌'ను విసిరాడు. మీ దగ్గర ఉన్న ప్లాస్టిక్‌ కవరు ఇవ్వండి, మొక్కలు తీసుకెళ్లండంటూ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేశాడు.[3][4]

రైస్ ఏటీఎం[మార్చు]

లాక్​డౌన్ సమయంలో తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా రాము, చికెన్ కొనేందుకు షాపుకు వెళ్లాడు. అక్కడ ఒక మహిళా సెక్యూరిటీ గార్డు రూ.2 వేలు పెట్టి చికెన్ కొనడం చూసి ఎందుకు అంత ఎక్కువగా తీసుకున్నారని అడుగగా వలస కార్మికులకు ఆహారం అందించేందుకు అని ఆమె చెప్పింది. ఆమె నుండి ప్రేరణ పొందిన రాము, కరోనా వైరస్ కారణంగా లాక్​డౌన్ విధించిన సమయంలో ఉపాధి కరువై డబ్బు లేక, తినేందుకు తిండి లేక పేదలు, వలస కూలీలు ఎదుర్కొన్న కష్టాలను తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచనకు రూపమే రైస్ ఏటీయెం. హైదరాబాద్, ఎల్​బీ నగర్, రాక్​టౌన్ కాలనీలో 24x7 గంటలు పని చేసేలా రైస్ ఏటీఎం ఏర్పాటు చేసి సాయం కోసం ఎవరు వచ్చినా నయాపైసా తీసుకోకుండా ఉచితంగా బి​య్యం, సరుకులను అందజేసాడు. చాలామంది వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆర్థిక సాయం కూడా చేశాడు.[5][6][7][8]

ప్రాజెక్ట్‌ ప్రిష[మార్చు]

కొవిడ్‌తో ఉపాధి తీవ్ర సమస్యగా మారింది. దీంతో ఆర్థికంగా చితికిన కుటుంబాలకు ఉపాధి మార్గం చూపాలి అనే ఆలోచనతో మొదలైందే 'ప్రాజెక్ట్‌ ప్రిష'. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఒంటరి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు వారికీ జీవనోపాధి కల్పించాడు. ఇందులో భాగంగా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వ్యవస్థాపకురాలైన యశస్విని జొన్నలగడ్డతో కలిసి కుట్టుమిషన్లు, కూరగాయల దుకాణాలు, ఇస్త్రీ షాపులు, టిఫిన్‌ సెంటర్లు, పిండిగిర్ని, బోటిక్‌, కిరాణా దుకాణాలు, కొబ్బరిబోండా షాపులను ఏర్పాటు చేయించాడు.[9][10]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (24 December 2021). "సామాజిక కార్యకర్త దోసపాటి రాముకు 'ది వీకెండ్‌ లీడర్‌' 2020 అవార్డు". Archived from the original on 25 March 2022. Retrieved 25 March 2022.
  2. 2.0 2.1 The Weekend Leader (25 March 2022). "Meet the man who spent Rs 50 lakh from his earnings to set up the Rice ATM during lockdown" (in English). Archived from the original on 25 March 2022. Retrieved 25 March 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. ETV Bharat News (2 February 2020). "ప్లాస్టిక్ కవర్లతో రండి.. మొక్కలు తీసుకెళ్లండి". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
  4. ETV Bharat News (2020). "This Hyderabad engineer gives saplings in exchange for waste plastic". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
  5. News18 Telugu (27 December 2020). "పేదల కోసం రూ.52 లక్షలు ఖర్చు చేశాడు.. తన కలను వదులుకున్నాడు". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. BBC News తెలుగు (16 December 2020). "ATM - ఎనీ టైమ్‌ మీల్‌: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన..." Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
  7. Eenadu (20 May 2021). "పేదలకు అండగా రైస్‌ ఏటీఎం". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
  8. Eenadu (1 August 2021). "స్నేహగీతం.. విజయసూత్రం". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
  9. Namasthe Telangana (28 August 2021). "పేదల కోసం.. ప్రాజెక్ట్‌.. ప్రిష!". Archived from the original on 25 March 2022. Retrieved 25 March 2022.
  10. Eenadu (13 September 2021). "750 మందికి చేయూత". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.