ధ్వన్యాలోకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనంద వర్ధనుని ధ్వన్యాలోకం

ధ్వన్యాలోకం ఆనందవర్ధనుడు రాసిన సంస్కృత అలంకారిక గ్రంథం. కావ్యంలో ధ్వని ప్రాధాన్యతను ప్రతిపాదించడం ఈ అలంకారిక గ్రంథంలోని విశేషం. ధ్వనిని స్ఫురింపజేస్తున్న వ్యంగ్యార్థ శోభితమైన కావ్యమే ఉత్తమ కావ్యమని ఆనంద వర్థనుని ప్రతిపాదన. ఆ ప్రతిపాదనను ప్రధానంగా ధ్వన్యాలోకంలోనే పొందుపరిచారు. ఆనందవర్ధనుడు రాసిన ధ్వన్యాలోకం, అందులో ప్రతిపాదించిన ధ్వని సిద్ధాంతం మొదట్లో విమర్శలు, క్రమంగా సర్వజన ఆమోదం పొందింది. ఈ గ్రంథానికి పలు వ్యాఖ్యలు ఉన్నా వాటిలో అభినవగుప్తుడు వ్రాసిన లోచనమ్ అన్న వ్యాఖ్యానం సుప్రసిద్ధమైనదీ, ప్రస్తుతం లభిస్తున్నది.

సిద్ధాంతం

[మార్చు]

కావ్యంలో వాచ్యం (సంభాషణల్లోనో, వర్ణనల్లోనో చెప్పేది), లక్ష్యం (కావ్యం బోధించే) అర్థాల కన్నా భిన్నమైన అర్థాంతరం భాసిస్తుందనీ, అదే ధ్వని. అలాంటి ధ్వని లేక వ్యంగ్యార్థం లక్ష్యార్థం కన్నా రమణీయమైనది, కావ్యానికి శోభనిచ్చేది. ధ్వనిని సూచిస్తూ, వ్యంగ్యార్థ శోభితమైన కావ్యమే ఉత్తమ కావ్యం అన్నది ఆనందవర్థనుని సిద్ధాంతం. ఇదే ధ్వని సిద్ధాంతంగా ప్రసిద్ధి పొందింది.[1]

రచయిత, కాలం

[మార్చు]

ధ్వన్యాలోకాన్ని రచించినవారు ఆనందవర్ధనుడనే కాశ్మీర పండితుడు. ఆయన అవంతివర్మ (సా.శ.855-883) వద్ద ఆస్థాన పండితునిగా ఉండేవారు.[1] ఈ కారణంగా ధ్వన్యాలోకం కూడా 9వ శతాబ్దికి చెందినదని చెప్పవచ్చు.

విభాగాలు

[మార్చు]

ధ్వన్యాలోకంలోని విభాగాలను ఉద్ద్యోతాలుగా పేర్కొన్నారు. మొత్తంగా ధ్వన్యాలోకం నాలుగు ఉద్ద్యోతాలుగా విభజించబడింది. మొదటి ఉద్ద్యోతంలో ధ్వనిని గురించి ప్రాచీనాలంకారికుల అభిప్రాయాలను వెల్లడించి, వాటిని ఖండించారు. మిగిలిన ఉద్ద్యోతాల్లో ధ్వని స్వరూపం, ధ్వని భేదాలు, గుణంగా వ్యంగ్యం గురించి విస్తరించి నిరూపించారు. చివరిదైన నాలుగవ ఉద్ద్యోతంలో ధ్వని నిరూపణ యొక్క ప్రయోజనాన్ని గురించి చర్చించారు.[1]

నామ ఔచిత్యం

[మార్చు]

ధ్వని అంటే వ్యంగ్యార్థం, ఆలోకం అంటే దర్శించడం అని అర్థాలు. కావ్యంలోని ధ్వని ప్రాధాన్యతను దర్శింపజేసే అలంకారశాస్త్ర గ్రంథం కనుక ధన్వాలోకమన్న పేరు ఒప్పింది.

ప్రాచుర్యం, వ్యాఖ్యానాలు

[మార్చు]

అలంకారశాస్త్రంలో ధ్వన్యాలోకం విస్తృత ప్రాచుర్యాన్ని పొందింది. అలంకారశాస్త్ర గమనాన్ని ముందుకు తీసుకువెళ్ళిన ధ్వని సిద్ధాంతాన్ని సమర్థిస్తూ వ్రాసిన ప్రామాణిక గ్రంథం కావడంతో దీనికి విశేష ప్రాధాన్యత లభించింది. మొదట్లో సిద్ధాంతం, గ్రంథం విమర్శల పాలయినా, క్రమంగా కావ్యసిద్ధాంతాల్లోకెల్లా ధ్వని సిద్ధాంతం గొప్పదిగానూ, ధ్వన్యాలోకం అలంకారశాస్త్రంలో ఎన్నదగిన గ్రంథాల్లో ముఖ్యమైనదిగానూ పేరొందాయి.
ధ్వన్యాలోకానికి పలు వ్యాఖ్యలున్నాయని పండితులు భావిస్తున్నా చాలావరకూ లభించడం లేదు. వాటన్నిటిలోనూ అభినవ గుప్తుడు వ్రాసిన లోచనమ్ అన్న వ్యాఖ్య ప్రామాణికంగా, విస్తృతాదరణీయంగా నిలిచింది. అభినవ గుప్తుడు రాసిన శ్లోకాన్ని ఒకదాన్ని అనుసరించి ధ్వన్యాలోకానికి చంద్రిక అన్న వ్యాఖ్య కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే లోచనమే వాటన్నిటిలోనూ మిగిలినదీ, సుప్రసిద్ధమైనది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 ముదిగంటి, గోపాలరెడ్డి; ముదిగంటి, సుజాతారెడ్డి (2014). "అలంకారశాస్త్ర గ్రంథాలు". సంస్కృత సాహిత్య చరిత్ర (సప్తమ ముద్రణ ed.). హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. pp. 766–770.