Jump to content

పల్లెల్లో కులవృత్తులు

వికీపీడియా నుండి

రైతులు దేశానికి వెన్నెముక అంటారు. రైతులు నివసించేది పల్లెల్లోనే. రైతు అంటే వ్యవసాయదారుడు. దేశానికి ఆహారం పెట్టగలిగిన వాడు రైతు. దేశ జనాభాలో అధిక శాతం వ్యవసాయదారులే. వీరు ప్రకృతి కరుణా కటాక్షం మీద అధార పడి బ్రతుకుతున్నారు. రైతుల మీద ఆధారపడి అనేక కుల వృత్తుల వారు ఉన్నారు. నిజానికి రైతులు, కులవృత్తి పనివారు ఒకరి మీద ఒకరు అదార పడి ఉన్నారు. ఆ ఇద్దరి బాంధవ్యం ఎంతగా పెనవేసుకుని పోయిందంటే ఒకరు లేనిదే మరొకరు లేరనే విధంగా వుండేది. ఇదంతా గతం. భూమిని నమ్ముకొని ప్రకృతి మీద ఆధార పడిన రైతులు వర్షాలు లేక వారి జీవన విధానము విచ్ఛిన్నమైనది. రైతులనే అంటి పెట్టుకొని వున్న ఈ కులవృత్తి పని వారి జీవన విధానము కూడా విచ్ఛిన్నమై పోయింది. ఈ కుల వృత్తి వారు కేవలము రైతులకు పొలంపనులలో సహాయం చేస్తూ వారికి కావలసిన పనిముట్లును తయారు చేసి ఇవ్వడమే కాకుండా రైతుల సంస్కృతిలో, సామాజిక పరంగా కూడా విడదీయ లేని బాందవ్య కలిగి వుండే వారు.

చాకలి

[మార్చు]

పల్లెల్లో చాకలిది చాల ప్రధానమైన వృత్తి. ఈ చాకలి వృత్తి, వారి వారసత్వ హక్కు. రెండు, మూడు పల్లెలు కలిపి ఒక చాకలి కుటుంబం వుంటుంది. వారు తప్ప వేరే చాకలి ఆవూరి వారి బట్టలను వుతక రాదు. పల్లె వాసులకు కూడా వేరొక చాకలిని పెట్టు కోడానికి హక్కు లేదు. ఒక చాకలికి ఇద్దరు మగ పిల్లలుంటే వారు వేరు పోదలచు కుంటే, వారి అధీనంలో వున్న ఊర్లను పంచు కుంటారు. చాకలి లేనిదే పల్లెల్లో సాంప్రదాయమైన పనులు చాల జరగవు. వారి ముఖ్యమైన పని అందరి బట్టలను ఉతికి తేవడం. మధ్యాహ్నం ఒకరు వచ్చి ప్రతి ఇంటి వద్ద కొంత అన్నం కూర తీసుకుని వెళ్లి తింటారు. అలాగే రాత్రికి కూడా కొంత అన్నం పెట్టాలి. ఊరి వారి బట్టలి అన్ని కలిపి వున్నా సాయంత్రానికి ఎవరి ఇంటి బట్టలు వారివి వేరు చేసి వారి వారికిస్తారు. బట్టలను వారు అంత బాగా గుర్తు పట్టగలరు. అందుకే చదివిన వాడికన్న చాకలి మిన్న అన్న నానుడి పుట్టింది . వారు బట్టలను ఉతికే ముందు కొన్ని బట్టలను ఉబ్బకేస్తారు, ఉబ్బ అంటే మూడు పెద్ద మట్టి కుండలను త్రికోణాకారంలో పెద్ద పొయ్యి మీద పెట్టి వాతి చుట్టూ మట్టితో దిమ్మ కడ్తారు. ఆ కుండల మూతులు మాత్రమే కనిపిస్తుంటాయి. వాటిల్లో సగం వరకు నీళ్లు పోసి, ఆమూడు కుండల మీద ఉబ్బకు వేయాల్సిన బట్టలను సౌడు నీళ్లతో తడిపి చుట్టలు చుట్టలుగా రెండు మూడు అడుగులఎత్తు వరకు అమర్చుతారు. తర్వాత అ బట్టల కుప్పకు ఒక పెద్ద బట్టను కప్పుతారు. ఇప్పుడు కుండల క్రింద మంట పెడ్తారు. కుండలలోని నీరు ఆవిరై అది పైనున్న బట్టలన్నింటికి వ్యాపిస్తుంది. అలా ఒక గంట ఆవిరి పట్టాక వాటిని తీసి నీళ్లలో వుతుకుతారు. అప్పుడు ఆ బట్టలు చాల తెల్లగా వస్తాయి. వీటిలో రంగు బట్టలు వేయరు. ఎందుకంటే ఒకదాని రంగు మరొక దానికి అంటు తుంది. సౌడు అనగా సౌడు భూములలో పైకి తేలిన ఉప్పటి నున్నటి మట్టి. బట్టలు ఉతికినందుకు చాకలికి ఫలితానికి ఒక సారి మేర ఇవ్వాలి, మేర అంటే ఐదు బళ్ళ వడ్లు. అలాగే వరి కోతలప్పుడు అందరి పని వాళ్లతో బాటు చాకలికి కూడా ఒక మోపు వరిని కూడా వదిలి పెట్టాలి. దాన్ని చాకలి ఇంటికి తీసు కెళ్లతాడు. అలా అందరి రైతుల వద్దనుండి వచ్చిన వరి మోపులను ఒక్క రోజున నూర్చి వడ్లను తీసుకుంటాడు. పెళ్ళి పత్రికలు రాకముందు పెళ్ళి పిలుపులకు చాకలినే పంపే వారు. తమలపాకులు, వక్కలు ఇచ్చి ప్రతి ఇంటికి, వేరే వూర్లో వున్న బంధువులకు చెప్పిరమ్మని చాకలిని పంపేవారు. స్వంత గాళ్లు పిలిచిన పిలిపు కంటే చాకలి పిలుపుకే గౌరవం.... మర్యాద.... సాంప్రదాయం కూడ. ఏశుభ కార్యానికైనా వక్క ఆకు ఇచ్చి పిలిస్తేనె అది మర్యాద. లేకుంటే అయిష్టంగా పిలిచినట్లే భావించే వారు. ఆ సందర్భంగా పుట్టినదే ఈ నానుడి: నాకేమైనా ,వక్క ఆకు ఇచ్చి పిలిచారా నేను రావడానికి? అదేవిధంగా పిల్లలు పుట్టినపుడు పురుడుకు వూరివారి నందరిని చాకలే పిలవాలి నీళ్లు పోయడానికి. చాకలే ముందు నీళ్లు పోయాలి. ఆడ పిల్లలు సమర్తాడినప్పుడు (పుష్పవతి) విషయాన్ని ఊరి వారందరికి చాకలితో చెప్పి పంపుతారు. ఆడ పిల్లలు సమర్థాడి (పుష్పవతి) నప్పుడు వారి వంటి పైనున్న బట్టలు చాకలికే చెందుతాయి. దీనిని బట్టే ఒక సామెత పుట్టింది. అదేమంటే.... సరదాకి సమర్థాడితె చాకలి వచ్చి చీరపట్టు కెళ్లిందట. ఈ సామెతలో.. సరదాకి కూడా అబద్ధం ఆడ కూడదనే సందేశం ఉంది. ఎవరైనా ప్రయాణమై వెళుతున్నప్పుడు చాకలి ఎదురు పడితే శుభ చూచకంగా బావించేవారు. పెళ్ళిల్లలో చాకలి చేయాల్సిన సాంప్రదాయ పనులు చాల వుంటాయి. దీవిటి పట్టడం, చాకలి సాంగెం అనే ఒక కార్యక్రమం వుండేది. అది లేక పోతే చాల లోటు. పంతులు గారు కూడా కొన్ని సందర్భాలలో చాకలి ఎక్కడ అని పిలుస్తుంటాడు. పెళ్ళి సందర్భంగా చాకలికి ప్రత్యేకించి డబ్బులు ఇవ్వరు. కాని అక్కడ తలంబ్రాలు పోసిన బియ్యం చాకలికే చెందుతాయి. అలాగే మంగళ స్నానం తర్వాత విడిచిన బట్టలు కూడా చాకలికే చెందు తాయి. శోభనము నాడు కూడా చాకలికి ప్రధాన పాత్ర ఉంది. జాతరలు, గ్రామ దేవతల పూజలందు చాకలే పూజారి. ప్రతి పండక్కి ఊరి వారందరు ప్రతి రోజు అన్నం పెట్టినట్టే పిండి వంటలు ఇస్తారు. సమాజంలో ముఖ్యమైన పాత్ర వహించిన ఈ చాకలి వృత్తి ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైనది. అప్పట్లో వంకల్లో వాగుల్లో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు లభించేవి.బట్టలుతికే వారి పని సులువయ్యేది. రాను రాను నీటి లబ్యత తక్కువయ్యే కొద్ది నీటి కొరకు పొలాలలోని బావుల వద్దకు పరుగులు తీసి, అవికూడ అడుగంటగా వారికి దిక్కు తోచ లేదు. పైగా రైతులు వరి పండించడం మానేయగా.. వారికి రావలసిన మేర సరిగా రాక, ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని క్రమంగా ఆ వ్వవస్థ కనుమరుగైనది. చాల తక్కువగా వుండే చాకలి కులం సామాజిక మార్పులతో చెల్లా చెదురై అంతరించి పోయింది. తరతరాలుగా బట్టలుతికిన చాకిరేవులలో చాకి బండలు నునుపు దేలి చాకలి వృత్తికి సాక్షిభూతంగా నేటికి అక్కడక్కడా పడి ఉన్నాయి. పల్లె ప్రజలు ఎవరి బట్టలు వారే వుతుక్కుంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. చాకలి, మంగలి లేకుండా శుభ, అశుభ కార్యక్రమాలు జరిగే అవకాశమే లేదు ఒకపుడు. కాని విధి లేని పరిస్థితిలో ప్రస్తుతం వారు లేకుండానే ఆ కార్యక్రమాలు జరిగి పోతున్నాయి. పట్టణాలలో కళ్యాణ మండ పాలలో జరిగే పెళ్ళిల్లలో వారి అవసరమే లేకుండా జరిగిపోతున్నాయి. కాక పోతే బట్టల మురికి అతి సులభంబా వదల గొట్ట డానికి అనాడు లేని డిటర్జెంటులు, పౌడర్లూ, సబ్బులు, బట్టలు ఉతికే యంత్రాలు ఇప్పుడొచ్చాయి. పైగా మురికి అంతగా అంటని, అంటినా సులభంగా వదిలిపోయే టెర్లిన్, టెరికాట్, పోలిస్టర్ వంటి బట్టలు ఎక్కువైనాయి. రాబోవు తరాల వారికి చాకలి అంటే పుస్తకాలలో చదువు కోవలసిందే.

మంగలి

[మార్చు]

మంగలి వృత్తి కూడా ఆ నాటి సమాజంలో చాల ప్రధానమైన వృత్తి. ప్రతి సారి ప్రతి ఫలం ఆశించ కుండా అందరికి క్షవరంచేసి, జుట్టు కత్తరించే వీరు ఆ పనికి గాను ప్రతి ఫలితానికి, మేర ద్వారా ఐదు బళ్లల వడ్లు, ఒక మోపు వరి తీసుకునేవారు. ఫలిత మంటే ఒక పంట కాలము. తలంటు స్నానం చేయించడం వంటి పనులు చేసే వారు. ప్రతి రోజు మంగలి పల్లెల లోనికి వచ్చి క్షురక వృత్తి చేసే వారు. తల క్రాపు చేయడం, పెద్దవారికి గడ్డం చేయడం వంటివి చేసే వారు. మంగలి వారు తాము వాడే వస్తువులు 1. కత్తెరలు 2. మంగలి కత్తులు మూడు.,3. కాలి గోర్లు తీసే సాధనం 4. చిన్న కత్తెర, 5. సాన రాయి 6. చిప్ప లాంటి గిన్నె 7. బ్రష్, 8. అద్దం, 10. చెవులో గుమిలి తీయడానికి ఒక సాధనము.,. వీటిని పెట్టుకోవడానికి నాలుగు పొరలున్న నలుచదరంగా ఉన్న ఒక తోలు సంచి వుంటుంది. దీన్ని అడపం అంటారు,. వారి భోజనం ఆరోజుకి వారు పనిచేసిన ఆ వూర్లోనే గడిచి పోతుంది. శుభ కార్యాలలో మంగళా వాయిద్యాలు వాయించేవారు. దానికి ప్రాతి ఫలం వేరుగా వుండేది. అది కూడా అప్పట్లో ధాన్య రూపంలోనే వుంటుంది. రైతులు తమ ఇంట్లో శుభ కార్యాలకు ఎక్కడి నుండో మంగలి వాళ్లను తీసుకుని రావడానికి వీల్లేదు. వేరెవ్వరు రారు కూడ.. ఒక వేళ ఎక్కువ మంది వాయిద్య కారులు కావలసి వస్తే ఆ వూరి మంగలే మిగతా వారిని సమకూర్చు తాడు. దానికొరకు వారికొక బృందం ఉంటుంది. ఇది వారి వంశ పారంపర్య హక్కు. మంగలి వారు ఎదురు పడితే శుభ సూచకంగా భావిస్తారు. పెళ్ళిల్లలో జరిగీ అనేక కార్యక్రమాల వివరాలు మంగలికే బాగా తెలుస్తాయి. ఆ సందర్భాలలో వారిదే పైచేయి. పెళ్ళి చేసే పంతులు గారు కూడా కొన్ని సందర్భాలలో తర్వాత చేయ వలసిన కార్యక్రమం ఏమిటని మంగలి వారిని అడిగే సందర్భాలు కూడా వుంటాయి. పెళ్ళి కొడుక్కి మంగళ స్నానం చేయించేందుకు మంగలి రావలసిందే. పెళ్ళి కూతురుకైతే మంగలి స్త్రీ రావలసిందే. ఆ సందర్భంగా మంగలి వారికి పరిహారము వేరుగా వుంటుంది. ఈ పరిహారము వారు చేసిన పనిని బట్టి గాక రైతు హోదాను బట్టి వుండేది. అశుభ కార్యక్రమాలకు కూడా మంగలి తప్పని సరిగా వుండాలి. ఈ మంగలి, చాకలి వారు చేసే పనిని ఉద్యోగం" అనే వారు. వారు ఎప్పుడైనా ఒక రోజు రాకుంటే "ఏమి ఈ రోజు ఉద్యోగానికి రాలేద ని ఆడిగే వారు. ఉద్యోగం అంటే అదే నని అప్పట్లో చాల మందికి పెద్ద అపోహ. పల్లె ప్రజలకు ఎవరి గడ్డాలను వారు గీసుకోడానికి కూడా రాదు. దానికి తగిన సామాగ్రి కూడా వారి వద్ద వుండేది కాదు. వర్షాభావంతో రైతులు పంటలు పండించక, మంగలి వారికి ఇవ్వవలసిన మేర ఇవ్వ నందున మంగలి వారు తమ జీవనోపాదికి వేరే మార్గాలను వెతుక్కోవలసి వచ్చింది. కొందరు ప్రభుత్వ ఉద్యోల వైపు మొగ్గు చూపగా... మరి కొందరు తమ కుల వృత్తినే నమ్ముకొని పట్టణాలలో చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేసు కున్నారు. ప్రస్తుతం మంగలి కుల వృత్తి పల్లెల్లో పూర్తిగా కనుమరుగైనది. అంటే పల్లె ప్రజలు అందరు గడ్డాలు మీసాలు, జుట్టు పెంచుకుని తిరుగు తున్నారని కాదు గాని మంగలి చేయవలసిన సామజిక పరమైన చాల పనులు వారు లేకనే జరిగి పోతున్నాయి. గడ్డం పని యువకులు ఎవరికి వారే చేసు కుంటున్నా.. పెద్దవారు ఆపనిని కూడా చేసుకో చేత గాక ఎప్పుడైనా మంగలి కనిపిస్తే వానికి కొంత డబ్బు ఇచ్చి తమ పని కానిచ్చు కుంటున్నారు.

కుమ్మరి

[మార్చు]
కుమ్మరి తయారు చేసిన కుండలు, అమ్మకానికి సిద్దం

కుమ్మరి మట్టితో కుండలు చేసి కాల్చి రైతులకు ఇచ్చేవారు. వీరికి కూడా ప్రతి ఫలితానికి 'మేర' వరి మోపు ఇచ్చేవారు. పెద్ద వస్తువులైన, కాగు, తొట్టి, ఓడ మొదలగు వాటికి కొంత ధాన్యం తీసుకొని ఇచ్చేవారు. పెళ్ళి సందర్భంగా ''అరివేణి'' కుండలని కుమ్మరి వారు ఇవ్వాలి. అనగా కొన్ని కుండలకు రంగులు పూసి కొన్ని బొమ్మలు వేసి ఇచ్చేవారు. ఇవి పెళ్ళిలో అత్యవసరం. అదే విధంగా ఎవరైనా మరణించినా ఆ కార్యక్రమాలకు కొత్త కుండలు అత్యవసరం. వాటిని కుమ్మరి సమకూర్చే వాడు. ఈ కుమ్మరి వ్వవస్త చాల కాలం క్రితమే కనుమరుగైనది. మట్టి కుండల స్థానంలో లోహ పాత్రలు వచ్చినందున వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పెళ్ళిల్లలో అరివేణి కుండలు ఏనాడో మాయమైనవి. కాని మరణానంతర కార్యాలకు మాత్రం కొత్త కుండల అవసరం ఈ నాటికి తీరలేదు. వాటికొరకు కొన్ని పల్లెల్లో, పట్టణాలలో కొనుక్కోవాలి. ఆవి అరుదుగానైనా దొరుగుతున్నాయి.

కాని ఈ కాలంలో మట్టి తోచేసిన ఇతర అలంకరణ వస్తువులు రంగు రంగులవి, ఎంతో కళాత్మకమైనవి తయారవుతున్నాయి. ఇలాంటివి కేవలం పట్టణ వాసులకే పరిమితం అయ్యాయి. వీటిని పెద్ద పెద్ద ప్రదర్శన శాలలోనే గాక రోడ్డు ప్రక్కన కూడా అముతున్నారు. కళాత్మకమైన వీటి ధరలు అధికమె.

కుమ్మరి కుండలను తయారు చేయు విధానము

కూజాలు, ఇతర మట్టి పాత్రలు. కొత్తపేట రైతు బజారు వద్ద తీసిన చిత్రం

మట్టి కుండలు గతంలో ప్రతి ఇంట్లోను అత్యవసరం. నీళ్లు తాగే గ్లాసులు తప్ప ఇంకొన్ని చిన్న వస్తువులు తప్ప మిగతావి అన్ని మట్టితో చేసినవే. అదొక సాంప్రదాయం. మట్టి కుండల్లో చేసిన వంటలు రుచిగా వుంటాయని నమ్మే వారు. ఆ తర్వాత కొంత కాలానికి లోహ పాత్రలు వచ్చినా కొన్ని వంటలకు మట్టి పాత్రలనే తప్పని సరిగా వాడే వారు. ఉదాహరణకు పాలు కాగ బెట్టడానికి తప్పనిసరిగా మట్టి పాత్రనే వాడే వారు. దానివలన పాలకు, మజ్జిగకు మంచి రుచి వస్తుందనుకునే వారు. అలా పాలను కాచే మట్టి పాత్రను ''పాల సట్టి'' అనే వారు. అలా వంటింటి పాత్రలే గాక ఇళ్లలో ధాన్యం నిలవ చేసుకునే పెద్ద వస్తువులైన, ''ఓడ'', కాగు బాన నీళ్ల తొట్టి, పొంత మొదలగు నవి కూడా మట్టితో చేసినవే. ప్రస్తుతం ఇటువంటివి చాల వరకు కను మరుగైనవి. కొన్ని ఇళ్లల్లో పాతవి కొన్ని ఇప్పటికి కనబడతాయి. లోహ పాత్రలు అందు బాటులోకి వచ్చింతర్వాత కుమ్మరి వృత్తి పూర్తిగా కనుమరుగైనది. వారు తమ బ్రతుకు తెరువుకు ఇతర మార్గాల వైపు మరలి పోయారు. కుమ్మరి మట్టితో కుండలను చేసే విధానము చాల సున్నితమైనై. నేర్పరి తనం కలిగినది, జాగ్రత్తగా చేయ వలసినది.

మట్టితో కుమ్మరి చేసిన కాగు. దామల చెరువు గ్రామ వద్ద తీసిన చిత్రం

కుమ్మరి సమీపంలోని చెరువు నుండి మెత్తటి ఒండ్రు మట్టిని సేఖరించి తీసుక వచ్చి దానిని మరింత మెత్తగా చేసి అందులో వున్న చిన్న చిన్న రాళ్లను, చెత్తను వేరు చేసి దానిని నీళ్లతొ తడిపి నాలుగైదు రోజులు ముగ్గ బెడతారు. ఆ తర్వాత దానికి నీళ్లు కలిపి కాళ్లతో బాగా తొక్కు తారు. అలా తయారైన మట్టిని సుమారు ఒక అడుగు కైవారం రెండడుగులు ఎత్తు వున్న స్థూపాకారంగా తయారు చేసి దానిని కుమ్మరి చక్రం మధ్యలో పెడతారు. ఆ కుమ్మరి చక్రం సుమారు రెండడుగుల వ్యాసార్థం కలిగి క్రింద ఒక చిన్న లోహపు బుడిపె వంటిది వుండి అది క్రింద నున్న మరొక లోహపు గిన్నె పై నిలబడి బాలెన్సుడుగా నిలబడి వుంటుంది. ఆ చక్రానికి ఒక చోట సుమారు ఒక అంగుళం లోతున ఒక చిన్న రంధ్రం వుంటుంది. కుమ్మరి ఆ రంధ్రంలో ఒక కర్రను పెట్టి చక్రాన్ని తిప్పు తాడు. అది చాల వేగంగా తిరుగు తుంది. అప్పుడు దానిమీద వున్న మట్టి ముద్ద కూడా తిరుగు తుంది. అప్పుడు కుమ్మరి చక్రానికి అవతల నిలబడి వంగి తన చేతులతో చక్రంపై వున్న మట్టి ముద్ద పైబాగాన కొంత మట్టిని ఒడిసి పట్టి తనకు కావలసిన కుండ మూతి ఆకారానికి మలుస్తాడు. కొత్త ఆకారాల కొరకు అతడు చిన్న చిన్న పుల్లలను వాడు తాడు. చక్రం వేగంగా తిరుగు తున్నందున కుమ్మరి తన చేతులతొ మట్టిపై వత్తిడి కలుగ జేసినందున అది గుండ్రటి ఆకారానికి వస్తుంది. అలా పూర్తిగా కుండ ఆకారానికి రాగానే ఒక సన్నని పుల్ల తీసుకొని కుండ అడుగు బాగాన గుచ్చుతాడు. అప్పుడు చక్రం వేగంగా తిరుగు తున్నందున దానిపై వున్న మట్టి ముద్దకు పైన తయారైన కుండకు బందం తెగి పోయి కుండ మట్టి ముద్దపై అలానే వుంటుంది. అప్పుడు కుమ్మరి ఒడుపుగా ఆకుండను తీసి క్రింద పెడతాడు. అప్పుడు కుండకు అడుగు భాగం వుండదు. అక్కడ ఖాళీగా పైమూతి లాగానే ఒక పెద్ద రంధ్రం వుంటుంది. చక్రం వేగ తగ్గితే మరలా కర్ర తీసుకొని దాని వేగాన్ని పెంచు తారు. అలా చక్రం పైనున్న మట్టి అంతా అయిపోయి నంతవరు కుండలను, కూజాలను, ఇతర పాత్రలను చేసి వాటిని పక్కన పెడతాడు. అలా తయారయిన ఆ పాత్రలు పచ్చిగా వున్నందున అతి సున్నితంగా వుంటాయి. వాటిని అలా నీడలో ఒక రోజు ఆర బెట్టితే కొంత వరకు గట్టి పడతాయి. అప్పుడు కుమ్మరి ఒక్కొక్క పాత్రను తన ఒడిలోనికి తీసుకొని ఎడం చేతిలోని ఒక అతి నునుపైన రాయిని తీసుకొని, కుండ లోనికి పెట్టి లోపల కుండ అంచులకు తాకించి కుడి చేత్తో కుండ పైన క్రింద రాయి ఆనించిన భాగాన మెత్తగా కొడతాడు. అలా కుండ ఉపరితలమంతా కొట్టగా ఆమెత్తటి కుండ సాగి అడుగున వున్న రంధ్రం మూసుక పోతుంది. అప్పుడు దానిని నీడలో పక్కన పెడతాడు. అదే విదంగా కుండలన్ని పూర్తిగా చేసి రెండు రోజులు నీడలో ఆర బెడతారు.

పెళ్లిల్లో వాడే అరివేణి " కుండ. కొత్త రైతు బజారు వద్ద తీసిన చిత్రం

కుమ్మరి వామి అనగా ఆరిన కుండలను కాల్చడానికు ఉపయోగించె ఒక పొయ్యి లాంటిది. ఇది అర్థచంద్రాకారంలో వుండి మధ్యలో సుమారు మూడడుగుల ఎత్తు వుండి క్రింద ఒక ఆడుగు కైవారంతొ ఒక రంధ్రం వుండి ఒకడుగు మందంతో గోడ వుండి ఆ గోడ రాను రాను ఎత్తు తగ్గి చివరకు భూమట్టానికి వుంటుంది. దీనినే కుమ్మరి వామి అంటారు. ఆరిన కుండలను ఇందులో నిండుగా వరుసగా పేర్చి తర్వాత అన్నికుండలకు కలిపి పైన చెత్త, ఇతర ఆకులు అలుములతో కప్పులాగ వేసి దానిపై బురద మట్టితో ఒక పొరలాగ అంతటికి ఒక కప్పు వేస్తారు. ఇప్పుడు ముందున్న రంధ్రంలో చెత్త, కంపలు మొదలగునవి వేసి మంట పెడతారు. అలా సుమారు ఒకరోజు కాల్చి ఆ తర్వాత దాన్ని అలాగె వదెలేస్తారు. ఆ వామి చల్లారిన తర్వాత ఒక వైపున మెల్లిగా పైనున్న కప్పును తొలగించి తనకు కావలసిన కుండలను తీసుకొంటారు. ఆ విదంగా కుమ్మరి కుండలను తయారు చేస్తారు.

అలంకార వస్తువులుగా మట్టి పాత్రలు

గృహాలంకారానికి .. మట్టి పాత్రలు ఇతర వస్తువులు, మలకపేటలో తీసిన చిత్రం

ప్రస్తుత కాలంలో అలంకార వస్తువులుగా అనేక మట్టి పాత్రలు పట్టణాలలో కనబడు తున్నాయి. పెద్ద పెద్ద కూజాల వంటి పాత్రలు, వాటిపై అనేక అలంకారలతో, లతలు, పువ్వులు మొదలగు అలంకారాలతో ఎంతో అందంగా కనబడు తున్నాయి. అలాగె ఇండ్లలో వేలాడదేసె వస్తువులు మొదలగునవి ఎక్కువగా వస్తున్నాయి. ఇవి అధిక ధరలు కలిగి వుంటాయి. నీళ్లకు కూజాలు, కుండలు, దీపావళికి ప్రమెదెలు మొదలగు మట్టి పాత్రలు పట్టణాలలో ఇప్పటికి కనబడుతూనె వున్నాయి. అంతరించి పోతున్న కుమ్మరి వృత్తికి పాత వాసనలు తెలియ జేయడాని ఇవే ఆధారాలు.

వడ్రంగి

[మార్చు]

వీరి పని కర్రలతో పని ముట్లు తయారు చేయడం. నాగలి, కాడిమాను, ఎద్దుల బండి, ఇంటి సామానులు తయారు చేయడం వీరి పని. వ్వవ సాయం యాంత్రీకరణ మైన ఈ రోజుల్లో వడ్రంగి చేయవలసిన వ్వయసాయ పని ముట్లు ఏమి లేవు. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చి అన్ని వ్యవసాయ పనులను అదే చేస్తున్నది. చివరికి ఎద్దుల బండి పని కూడ ట్రాక్టర్ చేస్తిమ్మది. అయినా ఇంటికి సంబందిచిన ద్వారాలు, కిటికీలు వంటి పనులు వీరికి ఎక్కువగా వున్నాయి వారు ఇప్పటికి పూర్తి స్థాయిలో పనులలో నిమగ్నమై వున్నారు. వారికి కావలసినంత డిమాండు వున్నది. ప్రస్త్రుత కాలంలో రైతులు తమ సాంప్రదాయక నివాస గృహాలైన పూరిళ్లు, గుడిసిళ్లు మొదలగు వాటి స్థానంలో పక్కా గృహాలను నిర్మించు కుంటున్నాడు. వాటి అవసరాలకు కావలసిన తలుపులు, కిటికీలు వంటి వాటి అవసరాలకొరకు వడ్రంగి పై ఆధార పడక తప్పదు. గతంలో వ్యవసాయ పనిముట్లు ఎక్కువ గా చేసె వడ్రంగులకు ఇంటికి కావలసిన సామానులను తయారు చేసె పని చాల ఎక్కువగా వున్నది. కాని వడ్రంగులు మాత్రం సమయానికి పని చేయక రైతులను తిప్పించు కుంటారు. ఒక రైతు తన అవసరానికి ఒక తలుపొ కిటికీనో, ద్వార బందమో తయారు చేయించాలంటే వడ్రంగి చుట్టు తన పనులు మానుకొని తిరగ వలసి వస్తున్నది. ఇది పల్లెలో ప్రతి రైతు అనుభవమే. గతంలో పల్లెల్లోని ఇళ్లలో ఫర్నిచరు సామాగ్రి అసలు వుండేది కాదు. ఇంటి ముందున్న అరుగులు, దిన్నెలు వుండేవి. కాని ఈ రోజుల్లో పల్లెల్లోని ప్రతి ఇంటి లోను కుర్చీలు, బల్లలు, వంటి సామానులు కనిపిస్తున్నాయి. వాటి తయారికి వడ్రంగి అవసరము. ఆ విధంగా వడ్రంగి చేతి నిండా పని వున్నది. పర్నిచరు సామాగ్రికి ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ సామాగ్రి వచ్చినా వడ్రంగికి మాత్రం పనిలేదు అనే మాట రాదు. కాక పోతె వారు పని చేయాలి. వడ్రంగి వాడె పనిముట్లు: బాడిసె, ఉలి, చత్రి, సుత్తి, గూటము, బర్మా, మొదలగునవి. వీరి శరీర కష్టాన్ని తగ్గించ డానికి వీరి చేతి పనిముట్ల స్థానంలో చిన్న చిన్న యంత్రాలొచ్చాయి. వీరిని ఆచారి అంటారు. వీరి పనికి పల్లె, పట్నం అన్న తేడాలేదు. చేతి నిండా పని వున్నది.

మేదర

[మార్చు]

మేదరి వారు అల్లిన బుట్టలు, తట్టలు, చాటలు, ఇతర అందమైన అలంకార వస్తువులు., చాదర్ ఘాట్ రోడు ప్రక్కన తీసిన చిత్రం

మేదరి చేసిన తట్టలు, బుట్టలు, వెదురు బద్దలతో చేసిన్ ఇతర అలంకరణ వస్తువులు. చాదర్ ఘాట్ వద్ద తీసిన చిత్రం

వీరు వెదురు బద్దలతో తట్టలు,, బుట్టలు దాన్యాన్ని నిలావ చేసె బొట్టలు ఎద్దుల బండికి వేసె మక్కిన వంటివి అల్లు తారు. గతంలో అడవులలో వున్న వెదుర్లను కొట్టి తెఛ్ఛి తట్టలు బుట్టలు అమ్మేవారు. అప్పట్లో బొట్టలు, మక్కెనలు, వంటి పెద్ద పెద్ద సామానులను తయారు చేయడంలో వారికి ఆదాయం బాగ వుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ కాలంలో అడవులకు వెళ్లే పరిస్థితి లేకున్న రైతుల పొలాల గట్టులందు కావలసినన్ని వెదుర్లు వున్నాయి. ఆయినా వీరు ఎక్కువగా లేరు. అక్కడక్కడ వున్న వారు తట్టలు బుట్టలు చేసి సంతలలో అమ్ము తున్నారు. వీరు కనుమరుగైనారు. ప్రస్తుతం వెదురు బద్దల తో చేసిన అనేక అలంకరణ వస్తువులు పట్టణాలలో అమ్ముతున్నారు. కళాత్మకమైన ఇటు వంటి వస్తువుల తయారి తోనైనా ఈ మేదర వృత్తి వారు కొంతవరకు బతుకు వెళ్లదీస్తున్నారు. ఈ అలంకరణ వస్తువులు ఖరీదైనవి. పట్టణాలలో మాత్రమె ఇవి కనబడతాయి.

కమ్మరి

[మార్చు]

లోహ వస్తువులను తయారు చేసె వారిని కంసాలి అంటారు వీరు కత్తులు, గొడ్డల్లు, కొడవళ్లు వంటి లోహ సామానులు చేసె వారు. ఇప్పుడు వాటి అవసరం ఎక్కువ లేదు. అయినా యంత్రాలతో తయారైన రడిమేడ్ పరికరాలు సంతల్లో దొరుకుతున్నాయి. గతంలో అక్కడక్కడా ''కొలిమి'' వుండేది. కాని ఈరోజుల్లో కొలిమి ఎక్కడా లేదు. ఈ తరం పిల్లాలకు కొలిమి అంటే అసలు తెలియదు. దానిని బొమ్మల్లో చూపాల్సిందే. గతంలో ఎద్దులు ఎక్కువగా వున్నందున వాటికి నాడాలు కొట్టే పని ఎక్కువగా వుండేది. ఎద్దులకు నాడాలను కొట్టే విధానం ఎలా వుంవుంటుందంటే: ఎద్దు నడుంకు దారం బిగిస్తారు దాన్ని బిగ దీయగానె అది మెల్లిగా వాలి పోతుంది. అప్పుడు దాన్ని ఒక్కసారిగా పడి పోకుండా మెల్లిగా పడుకో బెట్టేస్తారు. అప్పుడు దాని నాలుకు కాళ్లను ఒకటిగా దారంతొ కట్టేస్తారు. ఎద్దు కన్నులు ఒకడు మూసి వుంచగా ఆచారి (కంసాలి) అర్ద చంద్రాకారంలో వున్న ఇనుప నాడాను తీసి ఎద్దు గిట్టల లకు సరిపడిన దానిని గిట్టలకు ఆనించి దానికున్న రంద్రాలలో మేకులు గిట్టలలోని దిగ కొట్టేస్తాడు. ఇలా ప్రతి ఎద్దుకు ఎనిమిది నాడాలు అవసరం. ఇది కూడా కంసాలుల పనే. అప్పట్లో ఎద్దుకు ఇంత అని ప్రతి పలం వుండేది. ఇప్పుడు ఎద్దులు లేవు నాడాలు లేవు.

జంగం

[మార్చు]

వీరిని జంగం దేవర అని కూడ అంటారు. వీరు శివ భక్తులు. నొసటన వీభూతి ధరించి చేతిలో పెద్ద గంట పట్టుకొని వాయిస్తూ సంక్రాంతి ససందర్భంగా ఆ నెల అంతా తెల్ల వారు జామున వీదుల్లో తిరుగుతు శివ కీర్తనలు చేస్తూ, ఆ రోజు తిథి, వార, నక్షత్ర పలాలను తెలిపి తెల్లవారాక ప్రతి ఇంటికి వచ్చి సంభావన తీసుకునే వారు. అప్పటికే వీరు అంతిమ దిశలో వుండే వారు. వీరు అంత రించి చాల కాలమే అయింది. జంగం వారి జనాభా అతి తక్కువ. ముఖ్యంగా వీరు శివ భక్తులు. వీర భద్రుని ఆలయాల్లో పూజారులు వీరే వుంటారు. గతంలో వీరు కొన్ని పల్లెలను తమలో తమకు కేటాయించుకొని ఆ పల్లెల్లో కార్తీక మాస నెలంతా తెల్లవారు జామున తిరిగుతూ గంట వాయిస్తూ, శివనామ స్తుతి చేస్తూ తిథి, వార, నక్షత్రాలను చెప్పి.... తెల్లవారి ప్రతి ఇంటి ఆసామి వద్ద సంబావన పొందుతారు. ఇలా తిరిగే వారిని జంగం దేవర అని అంటారు. వీరు శుభాశుబాలను చెప్పుతారు. వీరికి సమాజంలో బ్రాహ్మణుల తరువాత గౌరవ స్థానం వీరిదే. వీరి వేష ధారణ కూడ గౌరవ ప్రదంగానే వుంటుంది. కాషాయ వస్త్రాలను ధరించి, తలపాగా కట్టి, బుజాన కావడి లేదా జోలే, ఒక చేతిలో గంట, రెండో చేతొలో శంఖం వుంటుంది. శివ స్తుతి చేస్తూ గంట వాయిస్తూ, మధ్య మధ్యలో శంఖాన్ని పూర్తిస్తారు. వీరిని పల్లె ప్రజలు శుభప్రదంగా భావించే వారు. వీరు కుల వృత్తి ఏనాడో మంట గలిసింది. ఎక్కడో కొందరు మిగిలిన వారు తమ పూర్వీకులు నేర్పిన విద్యను బిక్షాటనకు ఉపయోగించుకుని జీవనం సాగిస్తున్నారు.

గాజుల వాళ్లు

[మార్చు]

ఆ రోజుల్లో గాజుల శెట్టి తన మలారం బుజాన వేసుకొని పపల్లెల్లో తిరిగే వారు. మలారం అంటే ... సన్నని పొడవైన దారాలకు గాజులను రెండు వైపులా గుత్తులు గుత్తులుగా కట్టి ఆ దారాలన్నింటిని మధ్యలో ఒకటిగా కట్టి దాన్ని బుజాన వేసుకుంటారు. గాజుల వాళ్లు కొన్ని పల్లెలను తమ ప్రాంతగా విభజించుకొని ఆ యాపల్లెలలో వారె గాజులను అమ్మేవారు. ఒకరి ఇలాక లో వేరొకరు ప్రవేశించ రాదు. అతిక్రమించి నందున అపుడపుడు గాజుల వారి మధ్య పెద్ద పోరాటాలు జరిగిన సందర్బాలున్నాయి. గాజుల శెట్టి పల్లెలోనికి వచ్చాడంటే ఆడవాళ్లు అందరు అతని చుట్టు గుమిగూడి గాజుల అంద చందాలు చూస్తూ మురిసి పోతుంటారు. నచ్చిన వారికి ;గాజుల శెట్టి వారికి గాజులు తొడుగు తాడు. ప్రతి పలంగా ధాన్యం కొలిపించు కుంటారు. ఆ రోజుల్లో పల్లెల్లో డబ్బు చలామణి చాల తక్కువ. ఎక్కువగా వస్తు మార్పిడే. ముక్యంగా ఆడ వారి చేతిలో డబ్బులు అసలు వుండేవి కావు. వారపు సంతల్లో గాజులు ఎవరైనా అమ్ముకోవచ్చు. సంతకు చిట్టి లచ్చికి గాజులూ అనే సామెత ఈ సందర్భంగా పుట్టినదే. తన దగ్గర కూలి చేసె లచ్చి అయ్యగారిని తనకు గాజులు వేయించమని కోరిందట. దాంతో అతను సంతకు చీటి రాసి లచ్చికి ఇచ్చాడట. దాన్ని తీసుకొని లచ్చి కులుక్కుంటా సంత కెళ్లిందట. ఆ చీటిని ఎవ్వరికివ్వాలో తెలియక తికమక పడింది.

మాల కులం పూర్వం ప్రధాన వృత్తి చేనేత ఇవే కాకుండా, ఇతర ప్రాంతాలలో వీరిని అంట రాని వారుగా పరిగణించబడినా, ఈ ప్రాంతంలో అంట రాని తనం అంత తీవ్రం వుండేది కాదు. వీరి జన సంఖ్య ఎక్కువే. వీరు ఎక్కువగా వ్యవసాయ కూలీలుగా వుండే వారు. వీరిలో కూడ భూములున్న వారు కొందరుండేవారు. వీరు వ్వవ సాయ పనులు చాల బాగ చేస్తారు. మరణించిన వారి ఊరేగింపులో పలకలను అనగా డప్పులను వాయించడం వీరి పనులలో ముఖ్యమైనది. రైతులకు పంటలు బాగా పండిన రోజుల్లో రైతులతో బాటు, వీరు కూడ చాల ఆనందంగా వుండే వారు. వ్వవ సాయ పనులు లేనప్పుడు కూడ రైతుల వద్ద చిన్న చిన్న పనులు చేసే వారు. ఏపని చేయక పోయినా ఏ రైతు ఇంటికి వెళ్లి అన్నంపెట్టమని చాల దారాళంగా అడిగే వారు. రైతులు కూడ ఉదారంగానె స్పందించే వారు. ఏ పని లేకున్నా రైతు ఇంటి వద్ద కూర్చొని మాటలు చెప్పి అన్నం సమయానికి వారు పెట్టిన అన్నం తిని వెళ్లే వారు. వారు రైతుల ఇళ్లలోకి కూడ అవసరాన్ని బట్టి వచ్చే వారు. ఒక్క వంట గదిలోనికి, మారొక ప్రధాన గది లోనికి తప్ప. ఇప్పుడు వీరి జనాబ పల్లెల్లో చాల వరకు తగ్గింది. రైలులకే పని లేదు, వ్వవ సాయ పనులు ఎక్కువగా లేవు. వీరు ప్రభుత్యం కల్పించిన అవకాశాలను ఉపయోగించుకొని ఉద్యోగాలలోనో, ఇతర పనులలోనో పట్టణాలలో కుదురుకున్నారు. పాత తరం ముసలివారు తమ పల్లెల్లోనె వుంటూ ప్రభుత్వ పించను తో బతుకున్నారు. నీరు గట్టోడు .... ఇదొక చిన్నపాటి ఉద్యోగం. సాధారణంగ ఒక హరిజనున్ని ఈ పనికి నియమిస్తారు. అతని పనేమంటే.... చెరువులు నిండి నప్పుడు ఆ చెరువుకింద సాగులో వున్న భూములలోని పంటలకు చెరువు నీళ్లను పారించడము ఇతని పని. ప్రతిపలంగా ఆయా రైతుల ఇళ్లల్లో ఇతనికి భోజనము పెడ్తారు. పలితానికి ఇతని మేర ఇస్తారు. మేర అంటే వరికోతలప్పుడు ఒక వరి మోపును అందరి పని వాళ్లతో ఇతనికి ఒకటి వదులుతారు. పైగా ప్రతి రైతు ఐదు బళ్లల వడ్లు ప్రతి పలితానికి ఇవ్వాలి. దానిని మేర అంటారు. ఈ మేర ప్రతి కుల వృత్తుల వారికి ఉంటుంది.

మాది

[మార్చు]

వీరు కూడ హరిజనులే.వీరి జనసంఖ్య మిగతా హరిజనుల్లో కెల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది. వీరికి కూడ రైతుల నుండి మేర, వరి మోపు లబిస్తుంది. రైతులందరూ వీరి వద్దనే చెప్పులు కుట్టించు కునేవారు. కరెంటు మోటార్లు వచ్చాక వీరి వృత్తి మరుగున పడిపోయింది. చెప్పుల షాపులొచ్చాక వీరికి ఆ పని కూడ లేకుండా పోయింది. చెప్పులు తయారు చేయడంలో వీరు సిద్ద హస్తులైనా ఈ కులం వారు రైతులతో తమ మనుగడ లేకుండా పోయిన తర్వాత పెద్ద చెప్పుల షాపు పెట్టుకున్న దాఖలాలు అసలు లేవు. పెద్ద చెప్పుల షాపులను పెట్టుకోవడానికి అధిక మొత్తంలో ధనము కావాలి. అంత స్తోమత ఈ మాదిగ వారికి లేదు. అందు చేత చెప్పుల షాపులన్ని వేరె కులాల వారివే. మాదిగ వారు తమ జీవనాధారానికి ఇతర పనులపై ఆధార పడి బ్రతుకు తున్నారు. కొందరు పట్టణాలలో చిన్న చిన్న డబ్బా కొట్టులు పెట్టుకొని చెప్పులు కుట్టు కుంటు కాలం వెళ్ల దీస్తున్నారు.

వడ్డెర

[మార్చు]

వీరు అంట రాని వారు కాదు. కాని వీరి జీవన విధానం ప్రత్యేకంగా వుండేది. వీరు కేవలం రాతి పనులు, కంకర , రోడ్డు వేయుట, మట్టి పనులు మాత్రమే చేసె వారు. వ్యవసాయ పనులు వీరికి ఎంత మాత్రం చేత గాదు.గతంలో వీరు అంటరాని వారు కాదు. కాని వీరి జీవన విధానము కొంత వైవిధ్యంగా వుండేది. మాల, మాదిగ వంటి అంటరాని కులాల వారు మిగత సమాజంలో కలిసి నంతగా ఈ వడ్డి వారు కలవరు. వీరు తాము చేసే రాతి పని, మట్టి పని తప్ప మరే పని వీరికి చేతకాదు. వీరు కనీస ఇతర పనులు కూడ చేయాలని ప్రయత్నం కూడ చేయరు. మిగతా కులం వారు వ్యవసాయ పనులు సరిగా చేయకుంటె................. నీవు చేసిన పని వడ్డి పని లాగ వున్నది అని నిందా వాచకం వేస్తుంటారు. వీరికి బోయలు అనే మరో నామం కూడా ఉంది. వీరు ఇళ్లల్లో పందులను పెంచే వారు. ప్రస్తుతం వీరు చేయగలిగిన పనులు ఇంకా ఎక్కువైనందున వీరికి చేతి నిండా పని దొరుకుతున్నది. పల్లెల్లోకూడ, రైతులు స్వంతంగా గాని, ప్రభుత్యం రాయితీతో గాని కడుతున్న ఇళ్ల వలన వీరికి కావలసినంత పని ఉంది. వీరు బాగనే బతుకుతున్నారు. ప్రభుత్వం తరుపున వున్న ఫలితాలను ఉపయోగించు కుని అభివృద్ధి చెందు చున్నారు.

ఉప్పొడ్డి వారు

[మార్చు]

ఉప్పొడ్డివాళ్లు ఇది ఒక జాతి. మరెక్కడా కనబడని ఈ జాతి ఇక్కడే ఎలా ఉన్నారు., వీరెక్కడి నుండి వచ్చారు మొదలగు విషయాలు ఎవ్వరికి తెలీవు. నాగరికథ విలసిల్లిన ఈ పల్లెల నడుమ వీరు చాల అనాగిరంగా ఉన్నారు. ఐనా వీరు అంట రాని కాదు, కానీ మిగతా దళిత కులాల వారు వారి కులాలు వేరైనా వారి కట్టు, భాష, అన్ని విషయాలు అందరి లాగానే వుంటాయి. వడ్డి వాళ్లు కూడా అందరి వాళ్ల లాగే వుంటారు. కాని ఈ ఉప్పొడ్డు వాళ్లు మాత్రం ప్రత్యేకంగా జీవిస్తున్నారు. వీరి భాష, కట్టు అన్ని ప్రత్యేకంగా వుంటాయి. వీరు గిరిజనుల లాగ మొగ వాళ్లు మొలకు గోచి మాత్రమే కట్టు కుంటారు. ఆడవారు పాత చీర మొలకు చుట్టు కొని కొంత భాగాన్ని భుజంపైనుండి వేసు కుంటారు. పిల్లలు కూడా గోచీ గాళ్లే. వారి భాష కూడా ప్రత్యేకంగా వుంటుంది. అది తెలుగే ........ కాని చాల ప్రత్యేకంగా వుంటుంది. తరతరాల నుండి వారు ఇక్కడి సామాజిక ప్రపంచంలో జీవిస్తున్నా.... వారు ఎందుకు మార కుండా ప్రత్యేకంగా వున్నారో అర్థం కాని విషయం. ప్రభుత్వం కూడా వీరిని పూర్తిగా గుర్తించి నట్లు లేదు. వీరు పూర్తిగా నిరక్ష్య రాస్యులు. ఏ కులం తోను కలవరు. వారి నివాసం గుడిసెలు. వారు మామూలు వడ్డి వాళ్ల లాగ ఊర పందులను పెంచు తారు. అదొక ఆదాయ వనరు వారికి. మొదట్లో వీరు ఉప్పు బస్తాలను నెత్తిన పెట్టుకొని పల్లెల్లో తిరుగుతూ ఉప్పు అమ్మేవారు. అందుకే వారికి ఉప్పొడ్డి వారు అని పేరు వచ్చిందనిపిస్తుంది. అయినా వడ్డి వారికి, వీరికి పోలికే లేదు. వడ్డి వాళ్లు సామాన్య జీవన స్రవంతిలో కలిసి పోయి కాలాను గుణంగా మార్పును సంత రించు కుంటున్నారు. మొదట ఈ ఉప్పొడ్డివారు అడవికి వెళ్లి కరివేపాకును బస్తాల కొద్దీ కోసుకొచ్చి ఎండ బెట్టి పల్లెల్లో అమ్మెవారు. దాన్ని డబ్బులకు కాదు.... కాసిన్ని సద్ది నీల్లకు, లేదా కాసింత సంగటి కొరకు కరెపాకును ఇచ్చెవారు. పొలాల వెంబడి, చేలల్లో గుంపులుగా తిరుగుతూ ఎండి పోయిన కలబంద పట్టలను సేకరించి వాటిని నీళ్లలో నాన బెట్టి వాటిని బాగా చితగ్గోట్టి దాని నుండి నార తీసి దాంతో చేంతాడు, పలుపులు, ఉట్టి, కుదురులు వంటి వాటిని పేని రైతులకు వడ్ల గింజలకు ఇచ్చే వారు. అప్పట్లో చేద బావులు ఎక్కువ వుండేవి కనుక చేంతాడులకు బాగా గిరాకి వుండేచి. వీరు నివసించే పల్లే పేరు ఉప్పొడ్డి పల్లి. వీరేదో నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో లేరు. నాగరీకుల పల్లెకు అతి సమీపంలో ఉన్నారు. వీరికి వ్యవసాయ పనులు గాని. ఇంటి పనులు గాని పూర్తిగా తెలియవు. అందు చేత వీరిని ఎవ్వరు వ్వవ సాయ పనులకు గాని ఇంటి పనులకు గాని పిలవరు. వారుకూడ ఆ పని తమకు తెలియదని రారు. పోని ఇంటి పనులు అనగా ఇంటి ముందు చెత్త ఊడ్చడం, పాత్రలను తోమడం ఇలాంటి సామాన్యమైన పనులు కూడా వీరికి చేత కాదు. కనుక వారిని ఆ పనులకు కూడా పిలవరు. వారు కూడా రారు. కాని పక్కనున్న పల్లెల్లో కాసిన్ని సద్ది నీళ్లకు, కాసింత సంగటికి యాచిస్తుంటారు. పల్లె ప్రజలు కూడా వీరి జీవన విధానం తెలుసు గనుక వారికి ఏ పని చెప్పక తమకు తోచిన తిండి పెడ్తారు. అప్పట్లో వీరికి ఒక నాయకుడు ఉండే వాడు. పాడి కనుసన్నలలో ఆ పల్లె ప్రజలు జీవించే వారు. ఆ నాయకుడు ఆ పల్లెకు రాజు లాంటి వాడు. అతను ఆ చుట్టు ప్రక్కల వున్న చింత చెట్లను కాత కొరకు కొనే వాడు. చింత కాయలను రాల్చి వాటి పొట్టు తీసి, గింజలను వేరు చేసి ఎండ బెట్టి దళారులకు అమ్మే వారు. చింత కాయలను ఎండ బెట్టినపుడు..... వారు పెంచు తున్న పందులు ఆ చింత పండు మీద యదేచ్చగా తిరుగుతూ వుండేవి. మల మూత్రాదులు విసర్జించేవి. కాని పల్లె వాసులకు చింత పండు కొని వాడనావసరం లేదు కనుక వీరి చింత పండు కొనాల్సిన అవసరం లేదు. వీరి అమాయ కత్యాన్ని ఆసరా చేసుకుని చింత పండు వ్యాపరంలో సాధారణ వ్యాపారులు వీరిని చాల సులభంగా మోసం చేసే వారు. అది వారికి అర్థం అయ్యేది కాదు. వీరి జీవన విధానంపై పరి శోదించే వారికి ఇదొక మంచి అవకాశం., అలాంటి వారి పరిశోధనా ఫలితాల వల్లనైనా వారి జీవిత విధానం ప్రభుత్వ దృష్టికి వచ్చి వారి జీవితాలు కొంతైన బాగుపడతాయని ఆసిద్దాం. ప్రస్తుతం వీరి జీవన విధానంలో ఏదైనా మార్పు వచ్చిందంటే వారు బట్టలు కట్టే విధానంలో మాత్రమే. నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో నివసించే గిరిజనులను వీరితో పోలిస్తే గిరిజనులే అత్యంత నాగ రీకులు. సభ్య సమాజంలో అందరి మధ్యనున్న వీరి జీవిత విధానం పై సమగ్ర పరిశోధన చేసి వారి మనుగడను అభివృద్ధి చేయగల మహాను బావులు ఇప్పటికైనా పుట్టారో లేదొ తెలియదు.

పల్లెల్లోని రైతులు ఇతర కుల వృత్తుల వారు తర తరాలుగా కలిసి మెలిసి సాగిన వారి జీవన యాత్రకు ఇప్పుడు పెద్ద గండి పడింది. జగదైక కుటుంబంగా మెలిగిన వీరు ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టున్నారు. కాలం మారింది అంటే ఇదే.