పోతులపాటి సోమశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోతులపాటి సోమశర్మ
జననం(1940-02-15)1940 ఫిబ్రవరి 15
మరణం2021 జూన్ 2(2021-06-02) (వయసు 81)
వృత్తిఅర్చకుడు
తల్లిదండ్రులు
  • లచ్చయ్య (తండ్రి)
  • లింగమ్మ (తల్లి)

పోతులపాటి సోమశర్మ అర్చకుడు. అతను పుట్టుకతోనే చూపు లేకపోయినా తన ప్రజ్ఞతో అనేక కృతులు వెలువరించాడు. 2012లో అతనికి "విద్వన్నేత్ర" అనే బిరుదును ప్రదానం చేసారు. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామికి అర్చకత్వం చేసాడు.

జీవితం[మార్చు]

నల్లగొండ సమీపంలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి అనువంశిక అర్చకుడు లచ్చయ్య, లింగమ్మల పెద్ద కుమారుడు సోమశర్మ. 1940 ఫిబ్రవరి 15 గురువారం ప్రమాది సంవత్సరం మాఘ మాసం రథసప్తమి నాడు జన్మించాడు. తమకు పుట్టినది కనులులేని కొడుకని కలత చెందినా, అధైర్య పడలేదు ఆ తల్లిదండ్రులు. ఊరి బడిలో చేర్పించగా చెవులతో విన్నది మనసులో లగ్నం చేసికొంటూ 5వ తరగతి పూర్తి చేశాడు. పద్యాలు, శ్లోకాలు, అమరకోశం కంఠస్థం చేశాడు. తెలుగు సంస్కృతాలలో పాండిత్యం అబ్బింది. జడల రామలింగేశ్వరస్వామికి అర్చకత్వం చేశాడు. చెల్లెలు అమృతమ్మ ఆయనకు పాఠకురాలు, లేఖకురాలు. తమ్ముడు రామ లింగేశ్వర శర్మ కార్యదర్శి. జడల రామలింగేశ్వరస్వామి శతకం - సుప్రభాతం, పాలకుర్తి సోమేశ్వరస్వామి శతకం - సుప్రభాతం, శివాష్టోత్తర శతనామావళి, మేధా దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి, లలితా సహస్ర నామావళి, లలితా అష్టోత్తరం, శివ సహస్ర నామావళికి తెలుగు పద్యానువాదాలు చేశాడు. లక్ష్మీగణపతి అష్టోత్తర శతనామావళి, శ్రీ హేరంబ గణపతి నవరత్న మాలికా స్తోత్రం, శ్రీ సరస్వతీ మంత్ర మాతృకా స్తోత్రం రాశాడు. మాడుగుల నాగఫణి శర్మ పంచ శతావధానంలో పృచ్ఛకుడుగా పాల్గొని ప్రశంసలు పొందాడు. ఒక శ్రీరామనవమి నాడు ఊరిలో అష్టావధానాన్ని ప్రదర్శించి తాను అవధానినని నిరూపించుకొన్నాడు. లలితా త్రిశతి నామావళి పద్యానువాదం కూడా పూర్తి చేశాడు. ఆకాశవాణిలో సమస్యా పూరణానికి సోమశర్మ పద్యం అనివార్యం. సోమశర్మకు పాలకుర్తి సోమనాథ కళాపీఠం, హరద్విజ సూత్ర కర్త దేవగిరి రాజయ్య గారి కుమారుల సౌజన్యంతో, 2012 జూన్ 24న “విద్వన్నేత్ర” బిరుదు ప్రదానం చేసింది. ఆయన అశీతి పూర్తి సందర్భంగా 2020 జనవరి 22, 23 తేదీలలో మాస శివరాత్రి శుభవేళ ఆదిశైవ పెద్దలు, అభిమానులు భక్తి ప్రపత్తులతో విజయరథ శాంతి, సువర్ణ సింహ తలాట సన్మానం జరిపారు.

2021 జూన్ 2 బుధవారం రోజున మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "పోతులపాటి సోమశర్మ శివైౖక్యం". andhrajyothy. Retrieved 2021-07-07.