బషీరుద్దీన్ బాబూఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బషీరుద్దీన్ బాబూఖాన్

పదవీ కాలం
1985-1998 (తెలుగుదేశం) ,
1998-2013 (కాంగ్రెస్)

వ్యక్తిగత వివరాలు

జననం 1941 సెప్టెంబర్ 20
పోచారం (యెడపల్లె)
మరణం 2013 సెప్టెంబరు 15
హైదరాబాదు
రాజకీయ పార్టీ 1985-1998 (తెలుగుదేశం) ,
1998-2013 (కాంగ్రెస్)
నివాసం హైదరాబాదు
బాబు ఖాన్ ఎస్టేట్, హైదరాబాద్

బషీరుద్దీన్ బాబూఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, దక్షిణభారతదేశపు ప్రముఖ విద్యావేత్త. బాబూఖాన్ 1941 సెప్టెంబరు 20న హైదరాబాదులో జన్మించాడు. నిజామాబాద్ జిల్లా, యెడపల్లె మండలంలోని పోచారం ఈయన స్వగ్రామం. నిజాం కాలేజీ నుంచి డిగ్రీలో పట్టభద్రుడయ్యాడు. ఎన్.టీ.రామారావు మంత్రివర్గంలోను, చంద్రబాబునాయుడు ప్రభుత్వంలోను మంత్రిగా పనిచేశాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

నిజమాబాద్ జిల్లా, బోధన్ నియోజకవర్గం నుంచి బాబూఖాన్ 1985, 1994 లలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1998 లో కేంద్రంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

కుటుంబ నేపథ్యం

[మార్చు]

బషీరుద్దీన్ బాబూఖాన్ తండ్రి, ఖాన్ బహదూర్ కరీం బాబూఖాన్, 1930లో హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీని స్థాపించాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనం, నాంపల్లిలోని గాంధీ భవన్, ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్, గోదావరి తీరంలోని సోహన్ బ్రిడ్జి, కడెం డ్యామ్, తుంగభద్ర డ్యాం, రామగుండం థర్మల్ పవర్‌స్టేషన్ తదితర నిర్మాణాలను అబ్దుల్ కరీం బాబూఖాన్ నిర్మించాడు. యాభై ఏళ్ళ క్రితం హైదరాబాదు నాంపల్లిలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం 'గాంధీ భవన్ 'ను, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ ను నిర్మించి విరాళంగా ఇచ్చాడు. నిజాం కాలంలో గొప్ప పారిశ్రామికవేత్తగా పేరు సంపాదించాడు.

విద్యారంగంలో విద్యావేత్తగా

[మార్చు]

బషీరుద్దీన్ బాబూఖాన్, బండ్లగూడలో గ్లెండెల్ అకాడమీ స్కూల్‌తో పాటు స్ప్రింగ్‌ఫీల్డ్ పాఠశాలను కూడా నడుపుతున్నాడు. బాబూఖాన్ విద్యార్థి దశ నుంచే పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఆలిండియా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడిగా, ఆలిండియా ముస్లిం మజ్లీసే ముషావీరత్ సభ్యుడిగా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ముస్లిం ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సభ్యుడిగా వ్యవహరించాడు.

సమకాలీన నిర్మాణాలు

[మార్చు]

హైదరాబాదులోనే మొదటి అతి ఎత్తైన భవనం (17 అంతస్తులు) బాబూఖాన్ ఎస్టేట్‌ను బషీర్‌బాగ్‌లో నిర్మించాడు. సోమాజీగూడ చౌరస్తాలోని బాబూఖాన్ మిలీనియం, బాబూఖాన్ హిల్‌వ్యూ, బాబూఖాన్ మాల్, క్వీన్ ప్లాజా, బాబూఖాన్ చాంబర్స్, నోబుల్ చాంబర్స్‌, దక్కన్ టవర్స్, మొఘల్ కోర్టుతోపాటు నగరంలో 20 కి పైగా బహుళ అంతస్తుల రెసిడెన్షియల్, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లను నిర్మించాడు. బాబూఖాన్ తన ఆత్మకథను ‘లివింగ్ అండర్ ద రెయిన్‌బో-మై అచీవ్‌మెంట్’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశాడు.

మరణం

[మార్చు]

బషీరుద్దీన్ బాబూఖాన్ శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో 16 సెప్టెంబర్ 2013లో మరణించాడు. బాబూఖాన్‌కు భార్య, సల్మాన్ బాబూఖాన్ అనే కుమారుడితో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 September 2013). "మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ మృతి". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  2. Telugu One (16 September 2013). "మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ కన్నుమూత". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.

బయటి లింకులు

[మార్చు]