రామ్‌గోపాల్ మలానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామ్‌గోపాల్‌జీ మలానీ హైదరాబాదులో పేరుగడించిన సేవాతత్పరుడు[1].

జీవిత విశేషాలు

[మార్చు]

జోధ్‌పూర్ లోని నాగూర్ ప్రాంతపు మరాఠీ కుటుంబానికి చెందిన ఇతడి తండ్రి సేఠ్ శుభకరణ్‌జీ 1849లో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. సేఠ్ శుభకరణ్‌జీ నలుగురు కుమారులలో చివరివాడైన రామ్‌గోపాల్‌జీ కాంట్రాక్టర్‌గా నిర్మాణ రంగంలో స్థిరపడ్డాడు. నిజాం ప్రభుత్వం వేసిన రైల్వేలైన్, రహదారులలో ఎక్కువ శాతం ఇతడు వేసినవే. వ్యాపారంలో ఆర్జించిన ఆదాయాన్ని ఇతడు అనేక సేవా కార్యక్రమాలలో వినియోగించాడు. విజయవాడలో 1897లో రైల్వేప్రయాణికుల కోసం ఒక ధర్మసత్రాన్ని నిర్మించాడు. ఫతేమైదాన్‌లో ఒక స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించి నిజాం ప్రభువు మహబూబ్ అలీ ఖాన్కు బహుమానంగా ఇచ్చాడు. అదే ఇప్పుడు ఎల్.బి.స్టేడియంగా ప్రసిద్ధిగాంచింది. సికిందరాబాద్ ఎం.జి.రోడ్డులో క్లాక్ టవర్, ఫౌంటెన్, సత్యనారాయణ దేవాలయం, రామ్‌గోపాల్ పేట్ పోలీస్‌స్టేషన్ భవనం, మలానీ ట్రస్ట్ భవనం ఇవన్నీ ఇతడు నిర్మించనవే. 1902లో సికిందరాబాదులోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పెటల్‌లో లేడీ కర్జన్ పేరిట ఒక ప్రసూతి విభాగం ప్రారంభించడానికి నిధులు సమకూర్చాడు. తిరుమలగిరిలో సైనికులకు సోల్జర్స్ హోమ్‌, వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్స్ హోమ్‌ పేరిట ఆశ్రమం ఏర్పాటు చేశాడు. ఇతడు నిర్మాణ రంగంలోనే కాకుండా పారిశ్రామిక రంగంలో ప్రవేశించి లోయర్ టాంక్‌బండ్ రోడ్డులో దివాన్ బహదూర్ రామ్‌గోపాల్ మిల్స్ (డి.బి.ఆర్.మిల్స్) పేరుతో ఒక టెక్స్‌టైల్ మిల్లును ప్రారంభించాడు. ఎంతో మందికి ఉపాధి కల్పించిన డి.బి.ఆర్.మిల్స్ 1984 వరకు ఇతని కుటుంబం ఆధీనంలో ఉంది. ఇతని సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం ఇతడికి "కైసర్-ఇ-హింద్" అవార్డును ప్రదానం చేసింది. రాయ్ దివాన్, రాయ్ బహద్దూర్ బిరుదులు ఇతడిని వరించాయి. ఒక వైపు పారిశ్రామిక, వ్యాపార రంగాలలో తలమునకలై కూడా సేవాకార్యక్రమాలను ఒక కర్తవ్యంగా నిర్వహించిన రామ్‌గోపాల్‌జీ మలానీ 1923, జనవరి 1 న మరణించాడు. ఇతడి జ్ఞాపకార్థం 1929లో ఎం.జి.రోడ్డులో ఇతడి విగ్రహాన్ని స్థాపించారు.

మూలాలు

[మార్చు]
  1. ఎడిటర్ (15 January 2016). "భాగ్యనగరిపై సేవాసంతకం దివాన్ బహదూర్ సేఠ్ రామ్‌గోపాల్ మలానీ". సాక్షి దినపత్రిక. No. సంపుటి 8, సంచిక 295. జగతి పబ్లికేషన్స్, హైదరాబాద్. Archived from the original on 17 జనవరి 2016. Retrieved 15 January 2016.

ఇతర లింకులు

[మార్చు]