విజయవాడ

వికీపీడియా నుండి

ప్రకాశం బ్యారేజిపై కృష్ణవేణీమాత.
  ?బెజవాడ
విజయవాడ
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
కృష్ణా జిల్లా  పటములో విజయవాడ మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో విజయవాడ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°31′N 80°37′E / 16.516, 80.616
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
61.88 కి.మీ² (24 చ.మై)
• 11.88 మీ (39 అడుగులు)
వాతావరణం
అవపాతం
ఉష్ణోగ్రత
• వేసవికాలం
• శీతాకాలం
Tropical climate (Köppen)
• 1,050 mm (41.3 in)
27 °సె (81 °ఫా)
• 43.3 °సె (110 °ఫా)
• 24 °సె (75 °ఫా)
ప్రాంతం కోస్తా ఆంధ్ర
జిల్లా(లు) కృష్ణా జిల్లా
తాలూకాలు విజయవాడ (పట్టణ)
జనాభా
జనసాంద్రత
Metro
అక్షరాశ్యత శాతం
851,282 (2001)
• 14,231/కి.మీ² (36,858/చ.మై)
• 1,039,518 (34th) (2001)
• 71
భాష(లు) తెలుగు
మేయరు మల్లికా బేగం
ఎంపీ లగడపాటి రాజగోపాల్
ఎంఎల్యే
లోక్‌సభ నియోజకవర్గం విజయవాడ
శాసనసభ నియోజకవర్గం విజయవాడ (తూర్పు), విజయవాడ (పడమర), కంకిపాడు
ప్రణాళికా సంస్థ VGTMUDA
కోడులు
పిన్‌కోడు
టెలీఫోను
UN/LOCODE
వాహనం

• 520 0xx
• +866
• IN VGA
• AP16

అక్షాంశరేఖాంశాలు: 16°31′N 80°37′E / 16.516, 80.616


విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరము. కృష్ణా జిల్లాలో, కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపారకేంద్రం. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములలో విజయవాడ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ అతి పెద్ద కూడలి. భారత దేశం లోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఇక్కడ ఉన్న అనేక కార్పొరేటు విద్యాసంస్థల వలన దీనికి విద్యలవాడ అనే పేరు కూడా వచ్చింది. ఎండాకాలములో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడ అన్నాడట.


విజయవాడ, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతములతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. రాజధాని హైదరాబాదుకు 275 కి.మీ. దూరములో కృష్ణా జిల్లాలో 58 చదరపు కి.మీ. విస్తీర్ణములో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ జనాభా 825,436. అంతేకాదు విజయవాడ కృష్ణా జిల్లాకు వర్తక/వాణిజ్య రాజధాని.

విషయ సూచిక

[మార్చు] భౌగోళికం, జనవిస్తరణ

భౌగోళికంగా విజయవాడ నగరం కృష్ణానది తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల.

నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 10°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది.

ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ మూడవ పెద్ద నగరం. 2001 జనగణన ప్రకారం నగర జనాభా 8,51,282 (పరిసర ప్రాంతాలతో కలిపితే 1,039,518). 2006 లెక్కల ప్రకారం ఈ సంఖ్యలు 1,025,436 మరియు 1,411,152.

కృష్ణానది తీరాన విజయవాడ - 1943 నాటి చిత్రం (మాగంటి బాపినీడు కూర్చిన "ఆంధ్ర సర్వస్వము" అనే పుస్తకం నుండి)
విజయవాడ నగరంలో ఒక భాగం - మధ్యలో కృష్ణ కాలువను, ఎడమ ప్రక్క కృష్ణానదిని చూడవచ్చును. 2008 చిత్రం.

[మార్చు] చరిత్ర

నాగార్జున సాగరు నుండి మచిలీపట్నము వరకు గల కృష్ణా పరివాహక ప్రాంతములలో రాతి యుగపు మానవుల సంచారము యొక్క ఆనవాళ్ళు లభించడం వలన, ఇక్కడ ప్రాచీన మానవులు నివశించారని భావిస్తున్నారు.

అర్జునుడు వేటగాని రూపములో ఉన్న శివుడిపై సాధించిన విజయానికి చిహ్నముగా ఇక్కడ విజయేశ్వరుడి (మల్లేశ్వర స్వామి లేదా జయసేనుడు)ని ప్రతిష్టించాడని పురాణగాథ. పురాణాలలో విజయవాడను విజయవాత అని పెలిచేవారు. దీని గురించి రాజేంద్రచోళ పురాణములో కూడా పేర్కొన్నారు.

హిందువులకు మరియు బౌద్ధులకు విజయవాడ ఒక ముఖ్య ఆధ్యాత్మిక స్థలము. కళ్యాణి చాళుక్యులు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. కీ.శ. 638 సంవత్సరములో ఇక్కడ బౌద్ధ మతము బాగా ప్రాచుర్యములో ఉన్నప్పుడు చైనా దేశపు యాత్రికుడైన హుయాన్ త్సాంగ్ (Huan-tsang) ఈ ప్రాంతాన్ని దర్శించాడు.


బ్రిటీషువారు పరిపాలిస్తున్న రోజులలో ఈ ప్రాంతము చాలా అభివృద్ధిని చవిచూసింది. వారి కాలంలో కృష్ణానదిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. దానితో వ్యవసాయాభివృద్ధి జరిగి, తద్వారా విజయవాడ పట్టణం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ రోజులలో సినిమా వ్యాపారానికి కూడా విజయవాడ ఒక కూడలి అని చెప్పవచ్చు.

[మార్చు] విజయవాడకు ఆ పేరు ఎలా వచ్చింది?

విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కధ ఉంది. ఆ కధ ఇలా సాగుతుంది: పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు, వారిని వేదవ్యాసుడు కలిసి, వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి ఆర్జునుడిని ఎన్నుకొంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతముపై (ఇంద్రకీలాద్రి) ఒంటికాలిపై, చేతులు పైకెత్తి, పంచాగ్నుల మధ్య (నాలుగు సృష్టించినవి ఐదవది సాక్షాత్తూ సూర్య భగవానుడు), ఘోరమయిన తపస్సు చేసాడు. శివుడు, అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు.

ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడయిన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటిపైకి బాణము విసురుతాడు. అదే సమయములో వేటగాని రూపములో ఉన్న శివుడు కూడా బాణము విసిరుతాడు. ఈ రెండు బాణములు ఒకేసారి తగిలి, ఎలుగుబంటి మరణిస్తుంది. ఇద్దరూ ఆ ఎలుగును చంపింది తానంటే తానేనని తగువుకి దిగుతారు. మాటలు కాస్తా యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంత గొప్పవీరుడయినా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా ఆలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగము మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండటం గమనించి, సాక్షాత్తూ శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై, అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్టించాడని ప్రతీతి.


ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిధిలమైపోయాయి. రాళ్ళ కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచినారు.

[మార్చు] ఆర్ధికం

చుట్టుప్రక్కల సారవంతమైన నేల, మంచి నీటివనరులు, ప్రగతిశీలురైన రైతులు కారణంగా విజయవాడ ముఖ్యమైన వ్యవసాయ వర్తక కేంద్రమైంది. చెరకు, వరి, మామిడి పంటల ఉత్పత్తులకు ఇది చాలా పెద్ద వాణిజ్యకేంద్రం. ఇందుకు తోడు వినియోగదారుల అవుసరాలను తీర్చే వర్తకం, రవాణా, ప్రయాణ, విద్య, వైద్య సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు. ఇంకా మోటారు వాహనాల విడిభాగాలు (ఆటోనగర్), ఇనుప సామాను, గృహనిర్మాణ సామగ్రి, దుస్తులు తయారీ, మరకొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అధికంగా వ్యాపారం పాత నగర భాగం (వన్ టౌన్), కాళేశ్వరరావు మార్కెట్‌లలో జరుగుతుంది. గవర్నర్ పేట, బీసెంట్‌రోడ్‌లు దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గృహ వినియోగ వస్తువుల వ్యాపారానికి కేంద్రాలు. లబ్బీపేట, ఎమ్.జి.రోడ్‌లలోను, మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి.


కోస్తా ఆంధ్ర ప్రాంతంలో (ముఖ్యంగా నాలుగు జిల్లాలకు) హోల్‌సేల్ వ్యాపారం విజయవాడనుండి పెద్దయెత్తున జరుగుతుంది. వస్త్రాలు, ఇనుప సామానులు, పప్పుధాన్యాలు, ఎరువులు, మందులు వంటివి ఇక్కడినుండి సరఫరా చేయబడుతాయి.


విజయవాడ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్.

[మార్చు] నగర పాలన

విజయవాడ నగరం ఆంధ్ర ప్రదేశ్‌లో మూడవ పెద్ద నగరమైనాగాని ఆ జిల్లా (కృష్ణా జిల్లా) పరిపాలనా కేంద్రం కాదు. విజయవాడ నగరం పరిపాలనా బాధ్యతలు విజయవాడ నగరపాలక సంస్థ (మునిసిపల్ కార్పొరేషన్)చే నిర్వహించబడుతాయి. [1]. నగరంలోని 59 వార్డులనుండి ఒక్కో కార్పొరేటర్ ఎన్నికోబడుతారు. నగరానికి ఒక మేయర్‌ను ఎన్నుకొంటారు. ప్రభుత్వం ఒక మునిపల్ కమిషనర్‌ను నియమిస్తుంది. విజయవాడ నగరంలో ఒక సబ్-కలెక్టర్ (కృష్ణా జిల్లా అధికారి) ఉంటాడు.

[మార్చు] రవాణా

రోడ్డు, రైలు మార్గాల ద్వారా విజయవాడ నగరం మంచి రవాణా సౌకర్యాలు కలిగి ఉంది. జాతీయ రహదారి-5 (చెన్నై-కొలకత్తా), జాతీయ రహదారి-9 (మచిలీపట్నం-ముంబై), జాతీయ రహదారి-221 (విజయవాడ-జగదల్‌పూర్) - ఇవి విజయవాడ మీదుగా ఉన్నాయి. విజయవాడనుండి రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు మార్గాలు:

  • జా.ర.-5: ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా కొలకత్తా
  • జా.ర.-5: గుంటూరు, నెల్లూరు మీదుగా చెన్నై
  • జా.ర.-9: కోదాడ, సూర్యాపేట, హైదరాబాదు మీదుగా ముంబై
  • బందరు రోడ్డు
  • నూజివీడు రోడ్డు
  • నరసరావుపేట - కడప - బెంగళూరు

రవాణా వ్యవస్థ ఎంతగా అభివృద్ధి చెందినా ఈపట్టణానికి ప్రక్కనే గుంటూరు జిల్లాలో ఉన్న తాడేపల్లి,సీతానగరం,ఉండవల్లి సెంటర్,డోలాస్ నగర్,నులకపేట మొదలైన ఊళ్ళకు రవాణా సదుపాయాలు సరిగా అందలేదు.ఇటీవల మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సీతానగరంలోని రామకృష్ణమిషన్ కు వచ్చారు.సీతానగరం నుండివిజయవాడకు, జిల్లా కేంద్రమైన గుంటూరుకునేరుగా బస్సు సౌకర్యం ఉంటే బాగుండేది.విజయవాడ నుండి గుంటూరుకు దాదాపు ప్రతి పావుగంటకు ఒక బస్సు ఉంటుంది. హైదరాబాదుకు ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండు దేశంలో అతి పెద్ద బస్సు స్టాండులలో ఒకటి. నగరం లోపలి ప్రయాణాలకు సిటీ బస్సులు, ఆటోలు, రిక్షాలు ఇంకా ప్రైవేటు వాహనాలు (మోటారు సైకిళ్ళు, కారులు, సైకిళ్ళు వంటివి) అధికంగా వాడుతారు. సరకుల రవాణాకు లారీలు సప్లై చేసే కంపెనీలు నగరంలో చాలా ఎక్కువ ఉన్నాయి.

లిఫ్ట్ సౌకర్యం గల ఏకైక బస్టాండు
విజయవాడ బస్ స్టేషన్ ప్రవేశ ద్వారం

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ద్వారా నడుపబడే బస్సులు ఇతర పట్టణాలకు, నగరాలకు ప్రధాన ప్రయాణ సాధనాలు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండు ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్టాండ్ ఈబస్టాండ్‌లో షిర్డీ క్యాంటిన్‌ అధినేత దస్తగిరి స్వంత వ్యయంతో లిఫ్టు సౌకర్యాన్ని కల్పించారు. మన దేశంలో ఇప్పటివరకూ ఏ బస్టాండ్‌లోనూ లిఫ్ట్ సౌకర్యం లేదు. విమాన ప్రయాణం - విజయవాడకు సమీపంలోని గన్నవరంలో ఉన్న చిన్న విమానాశ్రయానికి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, రాజమండ్రి, విశాఖపట్నం నగరాలకు విమాన సర్వీసులున్నాయి. ఎయిర్ డెక్కన్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీల వారు రోజువారీ సర్వీసులు నడుపుతున్నారు.[2][3]


చెన్నై-హౌరా, చెన్నై-ఢిల్లీ రైలు మార్గాల కూడలిగా ఉన్న ఉన్నవిజయవాడ జంక్షన్ దేశంలో అధికంగా రద్దీగా ఉండే రైలు స్టేషన్లలో ఒకటి. [1].[4] నగరం బయటి ప్రాంతాలలో ఉన్న చిన్న స్టేషన్లు - మధురానగర్, గుణదల, రామవరప్పాడు.

విజయవాడ నగరానికి 65 కి.మీ. దూరంలో ఉన్న మచిలీపట్నం రేవును అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి. [5]

[మార్చు] సంస్కృతి

ఆంధ్ర ప్రదేశ్ కోస్తా జిల్లాలలోని పెద్ద నగరమైనందున విజయవాడలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల సంస్కృతి ప్రముఖంగా ఉంది. కాని నగరం విస్తరిస్తున్న కొద్దీ నాగరికతలో ఆధునిక జీవన ధోరణులు ప్రబలుతున్నాయి. ఇంతే కాకుండా వ్యాపారం లేదా ఉద్యోగం లేదా చదువు రీత్యా దేశంలోని పలు ప్రాంతాలనుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన లేదా తాత్కాలికంగా ఉంటున్న జనాభా కూడా గణనీయంగా ఉంది. అలాగే ప్రధానంగా హిందువులు ఉన్న నగరమైనా గాని క్రైస్తవులు, మహమ్మదీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతే కాకుండా కులాల మధ్య పెచ్చుపెరిగిన వైషమ్యాల ప్రభావం కూడా విజయవాడలో ప్రబలంగా ఉంది.

[మార్చు] విద్య

ఎన్.టి.ఆర్.వైద్యశాస్త్ర విశ్వవిద్యాలయం.

విజయవాడ పెద్దగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. కాని ఇంటర్మీడియట్ స్థాయిలో విజయవాడ రాష్ట్రంలో పెద్ద విద్యా కేంద్రంగా స్థానం సాధించింది. ఇబ్బడి ముబ్బడిగా స్థాపించబడిన ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలు మరియు ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇందుకు దోహదం చేశాయి.

సిద్ధార్థ పబ్లిక్ స్కూలు విజయవాడ మొగల్రాజపురములో ఉంది. సిద్ధార్థ ఎకాడెమీ వారిచే 1977లో స్థాపించబడినది. వీరమాచినేని పద్దయ్య దానమిచ్చిన సుమారు 8 ఎకరాలలో రేకుల షెడ్డు, 8 మంది టీచర్ల తో ప్రారంభించబడినది.

1982 లో స్కూలు నిల్డింగు సమకూరినది. 1987 లో జిమ్నాజియం నిర్మించబడినది. 1995లో ప్రాధమిక తరగతుల కోసం ప్రత్యేక భవనం నిర్మంచబడినది. ప్రస్తుతము 2500 విధ్యార్థుల తో, 120 టీచర్ల తో, గత 25 ఏళ్ళ నుండీ 100 % 10వ తరగతి సీ బీ ఎస్ సీ బోర్డు పరీక్షా ఉత్తీర్ణత సాధిస్తూ ఉంది.

విజయవాడలోని ప్రముఖ విద్యా సంస్థలు
  • విశ్వవిద్యాలయం - ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.
  • వైద్య విద్య - సిద్ధార్ధ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సస్
  • ఇంజినీరింగ్ - సిద్ధార్ధ, కోనేరు లక్ష్మయ్య,మాంటిస్సోరి .. కాలేజీలు
  • డిగ్రీ కాలేజీలు - మాంటిస్సోరి కాలేజి,ఆంధ్ర లయోలా కాలేజి, స్టెల్లా మేరీ కాలేజి, సిద్ధార్ధ కాలేజి, శాతవాహన కాలేజి,సప్తగిరి కాలేజి,
  • ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు - గౌతమి, విజ్ఞాన్, వికాస్, కృష్ణవేణి, శ్రీచైతన్య
  • ప్రముఖమైన పాఠశాలలు - మాంటిస్సోరి,సిద్ధార్ధ,బిషప్,గాంథి మున్సిపల్,నిర్మల
  • ఆర్కిటెక్ కాలేజి -
  • లయోలా కాలేజి చాలా పురాతనమయినది,ఎంతొ మంది ప్రముఖులు విద్య ను అభ్యసించారు.

[మార్చు] ఆటలు

దేశమంతటిలాగానే క్రికెట్ ఆటకు అత్యంత ప్రజాదరణ ఉంది. ఇందిరా గాఁధీ స్టేడియంలో జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి.[6]. మంగళగిరి వద్ద ఒక పెద్ద స్టేడియం నిర్మాణం జరుగుతున్నది.[7]- కోనేరు హంపి (చదరంగం గ్రాండ్ మాస్టర్), అయ్యప్ప (బ్యాడ్మింటన్ ఆటగాడు) వంటివారు విజయవాడకు చెందినవారు.

[మార్చు] మీడియా

విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక ప్రముఖ వాణిజ్య, రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రము. ఇక్కడ ప్రచురణ మరియు ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. ప్రముఖ పాత్రికేయులు మరియు జర్నలిస్టులు : ముట్నూరి కృష్ణారావు, మోటూరి హనుమంతరావు, తుర్లపాటి కుటుంబరావు, నండూరి రామ్మోహన రావు, గరపాటి ఉపేంద్ర బాబు, సయ్యద్ అక్బర్, ఎ.ఎమ్.ఖాన్ యజ్దాని, కాశీనందుని నాగేశ్వరరావు పంతులు, ఖాదర్ మొహియుద్దీన్, ముహమ్మద్ వజీరుద్దీన్, ఆర్.రాంప్రసాద్, శ్రీరాములు.కే మరియు కుచ్చి గోపాలకృష్ణ.

[మార్చు] రేడియో

విజయవాడలో ఎఫ్.ఎమ్. రేడియో స్టేషన్లు : ఆ.ఇ.రే.(AIR) రెయిన్‌బౌ క్రిష్ణవేణి ఎఫ్‌ఎమ్ (102.2 MHz), రేడియో మిర్చి ఎఫ్‌ఎమ్ (98.3 MHz) మరియు రెడ్.ఎఫ్.ఎమ్. (RED FM) (93.5 MHz).

[మార్చు] టెలివిజన్

టెలివిజన్ ప్రసారణ మాధ్యమాలు, నగరంలో రెండు విధాలుగావున్నవి. కేబుల్ టి.వి. మరియు 'డైరెక్ట్ టు హోమ్ సాటిల్లైట్ టి.వి'.

[మార్చు] ముద్రణా

విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లో ప్రచురితమయ్యే అనేక ప్రచురణల కేంద్రం. ఓ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రచురితమయ్యే పుస్తకాలలో 90% పుస్తకాలు ఇక్కడినుండే ముద్రితం మరియు ప్రచురితమౌతున్నాయి. గ్రంధోత్సవాలు ఇక్కడ సర్వసాధారణం. భారతదేశంలోని ప్రచురణ కర్తలు ఇక్కడ హాజరవ్వడమూ సర్వసాధారణమే.
విజయవాడ పుస్తక ఉత్సవం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉత్సవం దేశంలోనే కోల్కతా తరువాత, రెండవ అతిపెద్ద ఉత్సవం.

[మార్చు] కొండపల్లి అడవులు

విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దారాన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 కి.మీ.² (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి కలవు.[2]

[మార్చు] రాజకీయాలు

విజయవాడ, ఆంధ్రప్రదేశ్ కు 'రాజకీయ రాజధాని' వంటిది. ఇక్కడి ఓటర్లు రాజకీయంగా క్రియాశీలత మరియు పరిపక్వత గలవారు. ఇక్కడి మేజర్ రాజకీయపార్టీలు తెలుగుదేశం పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ మరియు అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు. క్రితంలో ఈ ప్రాంతం కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి.ఈ నగరంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అవి, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య మరియు విజయవాడు తూర్పు. ఈనగరంలో పాక్షికంగా పెనమలూరు, మైలవరం మరియు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతాలున్నవి. విజయవాడకు ఒక లోక్‌సభ నియోజకవర్గం వున్నది.

[మార్చు] ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

ఈ నగరంలో విద్యారంగం తగిన స్థాయిలో వున్ననూ ఐ.టీ. రంగంలో అంత ముందంజలో లేదు. ఈనగరంలో దాదాపు 20 ఐ.టీ. సంస్థలున్నాయి, 2006-07 ఆర్థిక సంవత్సరంలో ఇవి 42 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టాయి. ఆం.ప్ర.ఐ.ఐ.సి. సంస్థ గన్నవరం లో ఐ.టీ. పార్కు మరియు ఎస్.ఇ.జెడ్. (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటు చేసింది. వీటి నిర్మాణాలకోసం ఎల్.‍& టి. కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది, దీని బడ్జెట్ 300 కోట్ల రూపాయలు. ఈ ఐ.టీ. పార్కులు దాదాపు 10,000 మంది ఐ.టీ. ప్రొఫెషనల్స్ కు ఉద్యోగావకాశాలు కలుగజేస్తుంది. ఇంకో ఐ.టీ.పార్కు, మంగళగిరి లో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నవి.

[మార్చు] విజయవాడలో చూడదగిన ప్రదేశములు

లెనిను విగ్రహం (విజయవాడ ప్రముఖ కమ్యూనిస్టు కేంద్రం)
  • విక్టోరియా మ్యూజియము - పురావస్తు శాఖవారి మ్యూజియము. బందరు రోడ్డులో ఉంది. ఇందులో విగ్రహాలు, వర్ణచిత్రాలను భద్రపరచారు. ఇక్కడ రాతి యుగానికి చెందినవిగా భావిస్తున్న ఎన్నో రాతి పనిముట్లను కూడా ఉన్నాయి. ఇక్కడ అల్లూరు నుంచి తెచ్చిన బ్రహ్మాండమయిన బుద్దుని నల్లరాతి (గ్రానైటు) విగ్రహము, మరియు ఇంకొక పాలరాతి విగ్రహము ఉన్నాయి. ఇవి మూడు లేదా నాలుగవ శతాబ్దమునకు చెందినవిగా భావిస్తున్నారు.
  • కొండపల్లి , కొండపల్లి కోట - కొండపల్లి గ్రామం విజయవాడ నగరానికి వాయువ్యాన 14 కి.మీ.ల దూరములో ఉన్నది. కొండపల్లి కలపతో తయారుచేసే బొమ్మలకు పెట్టింది పేరు. "పొనికి" అనే తేలికయిన చెక్కమీద లక్కపూతతో అందమయిన రంగులలో ఈ బొమ్మలను తయారుచేస్తారు. గ్రామాలలోని జీవన శైలిని, పురాణ గాధలలోని పాత్రలను, జంతువులను, పక్షులను, పండ్లను, కాయగూరలను, మొదలైనవాటిని వర్ణిస్తూ తయారవుతాయి. ఏడవ శతాబ్దములో నిర్మించిన మూడు అంతస్తుల కోటను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ కోట ఎన్నో రాజ వంశాల పాలనలో ఉండేది. అంతేకాదు, ఇది ఒక వ్యాపార కేంద్రంగా కూడా ఉపయోగపడింది. బ్రిటిషు పాలకులు తమ సైన్యానికి రక్షణలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కోటను వాడుకునేవారు. వనవిహారానికి ఇది చాలా అనువైనది.
కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి, రైలు వంతెన
  • ప్రకాశం బ్యారేజి - కృష్ణా నదిపై ఇక్కడ ఒక ఆనకట్ట కట్టే ఆలోచన మొదట 1798 లో వచ్చింది. తరువాత 1841 లో కేప్టెన్ బకుల్ చేతులలో ఒక రూపాన్ని సంతరించుకున్నది. 1852 లో ఆనకట్టను నిర్మించడం మెదలుపెట్టి 1855 లో పూర్తి చేసారు. వందేళ్ళ పాటు ఉపయోగపడిన ఆనకట్ట ఆనకట్ట కొట్టుకొని పోవడంతో, 1954 మార్చి 1ఆంధ్ర రాష్ట్రపు మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఒక కొత్త రెగ్యులేటరు మరియు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. 1957లో బారేజి పూర్తి అయింది. 1223.5మీటర్ల పొడవు కలిగిన ఈ బారేజీ వలన మొత్తం 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీని వలన కృష్ణా డెల్టా రాష్ట్రం లోనే పెద్ద ధాన్యాగారముగా మారింది. ప్రకాశం బారేజి వలన ఏర్పడిన సరస్సు నలుదిక్కులా కనిపిస్తూ చాలా మనోహరంగా ఉంటుంది.
  • గాంధీ కొండ: గాంధీ కొండ లేదా ఒర్ కొండ అని పిలిచే ఈ కొండ మీద 1968 లో మహాత్ముడి సంస్మరణార్ధం ఒక స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఈ స్తూపం 15.8 మీటర్లు (52 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఇక్కడ ఒక గాంధీ స్మారక గ్రంధాలయం, "సౌండ్ అన్డ్ లైట్ షో" మరియు నక్షత్రశాలలు ఉన్నాయి. ఈ కొండపై నుండి దాదాపు విజయవాడ మొత్తం కనిపిస్తుంది. కొండ మొత్తం చూపించడానికి ఒక బొమ్మ రైలు కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ స్తూపం మహాత్ముని సంస్మరణార్ధం భారత దేశములో నిర్మించిన మొదటి స్తంభము. దీనిని అక్టోబరు 6 1968 న అప్పటి అధ్యక్షుడు స్వర్గీయ డా. జాకిర్ హుసేన్ ఆవిష్కరించి, జాతికి అంకితమిచ్చాడు.
  • ఉండవల్లి గుహలు: కీ.శ. 7వ శతాబ్దములో నిర్మితమయిన ఈ గుహలు విజయవాడకు 8 కీ.మీ.ల దూరములో ఉన్నాయి. రెండంతస్తుల ఈ గుహారూపాలను బౌద్ద సన్యాసులు వానా కాలములో తమ విశ్రాంతి గదులుగా ఉపయోగించేవారు. పడుకున్న భంగిమలో ఉన్న "అనంతశయన విష్ణువు" యుక్క భారీ ఏకశిలా విగ్రహము ఇక్కడ ఉంది. ఈ కొండ నుండి కృష్ణా నది మనోహరముగా కనిపించును. ఈ కొండపైన రాళ్ళమీద విగ్రహ ప్రతిమల మాదిరిగా చెక్కిన చిత్రాలు కూడా చూడ వచ్చు.
  • నరసింహ స్వామి ఆలయము: విజయవాడకు దక్షిణాన 12 కి.మీ.ల దూరములో ఉన్న మంగళగిరిలో ఈ ఆలయము ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఒకటైన నరసింహ స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది, అదేమిటంటే, భక్తులు ఎంత పానకం సమర్పించినా అందులో సగం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. ఈ ఆలయమును 14వ శతాబ్దములో నిర్మించారు, మరల 17, 18వ శతాబ్దాలలో నమూనాను మార్చినారు. ఆలయానికి వెలుపల రధాకారములో ఉన్న గరుక్మంతుని కోవెల ఉంది.
  • హజరత్‌బల్‌ మసీదు: విజయవాడలో ఈ మస్జిద్ (మసీదు) మతపరమయిన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలలో ఇంకోటి. ఇక్కడ ఉన్న మహమ్మదు ప్రవక్త యొక్క పవిత్రమయిన కేశాన్ని సంవత్సరానికి ఒకసారి చూపిస్తారు. ఈ పండుగలో ముస్లిమేతరులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
  • గుణదల మేరీమాత చర్చి: విజయవాడకు తూర్పున ఉన్న ఈ చర్చఇని 1925 లో రెవ.ఆర్లాటిగారు - గుణదలలోని సెయింట్‌ జోసెఫ్ అనాధాశ్రయములో అప్పటి అధికారి - ఇక్కడ మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్టించి, తరువాత చర్చీని నిర్మించారు. 1971 లో దీనిని పవిత్రపరిచినారు(చొన్సెచ్రతెద్). ఇప్పుడు మేరీ మాత చర్చీగా ప్రసిద్ది చెందింది. ప్రతీ సంవత్రరం ఫిబ్రవరి నెలలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. దానిని వేల సంఖ్యలో ప్రజలు సందర్శిస్తారు.
  • హ్రీంకార తీర్థ (జైనుల ఆలయము): మంగళగిరిలో ఉన్న ఇంకో ఆకర్షణ ఈ జైన దేవాలయం. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని జైన ఆలయాలలోకి ఇదే అతి పెద్దదని ప్రతీతి. ఈ ఆలయము కళాఖండాలకు పెట్టింది పేరు.
  • రాజీవ్‌ గాంధీ పార్కు: ఈ పార్కును విజయవాడ మునిసిపలు కార్పోరేషను ప్రత్యేక శ్రద్ధ తీసికొని నిర్మించింది. ఇక్కడ ఎన్నో రకాల పూల మొక్కలు పెంచబడుతున్నాయి. సంగీతాన్ని వినిపించే ఫౌంటేను, ఒక మినీ జూ ఈ పార్కుకు ప్రత్యేక ఆకర్షణ.
  • మొగల్రాజపురం గుహలు: ఈ గుహలను క్రీశ ఐదవ శతాబ్దములో నిర్మించినట్లు చెబుతాతు. వీటిలో నటరాజ స్వామి, వినాయకుడు, మొదలగున వారి విగ్రహములు చూడవచ్చు. ఇక్కడ ఉన్న అర్ధనారీశ్వరుని విగ్రహము దక్షిణ భారతదేశములో మరెక్కడా కనిపించదు.
  • భవానీ ద్వీపం - ఈ ద్వీపం కృష్ణానదిపై ఉన్న అన్ని ద్వీపాలలోకీ పెద్దదని చెప్పుకోవచ్చు. ఇది విజయవాడ నగరానికి 4 కి.మీ.ల దూరములో ఉంటుంది. 133 ఎకరాల ఈ దీవిని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖవారు గొప్ప పర్యాటక ప్రదేశముగా మలచారు. ఇక్కడ ఒక రిసార్టు కూడా ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇది చాలా గొప్ప విహారక్షేత్రము. దీవి వద్దకు వెళ్ళేందుకు పడవ వసతి కల్పించారు.
  • అమరావతి - ఇది విజయవాడకు 68 కీ.మీ.ల దూరములో కృష్ణా నది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్నపట్టణము. అమరావతి దక్షిణభారతదేశములోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బౌద్ధారామం. క్రీ.పూ. మూడు లేదా రెండవ శతాబ్దాలలో ఆచార్య నాగార్జునుడు ఇక్కడ అతిపెద్ద స్థూపాన్ని నిర్మించాడు. కల్నలు మెకెన్జీ 1797 లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇక్కడ కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ దొరికిన పురావస్తు అవశేషాలు చాలావరకు మద్రాసు మరియు కోల్కతాలలో ఉన్న మ్యూజియములలో భద్రపరిచారు. ఇక్కడి ప్రాంతంవారు దీనిని దీపాల దిన్నె అని పిలిస్తారు. ఇక్కడ ఒక పురావస్తు మ్యూజియము ఉన్నది. అందులో అప్పటి నాణేలు, గాజులు, బోధి వృక్షము యొక్క శిల్పాలు, విరిగిన కమ్మీలు మొదలయినవాటిని చూడవచ్చు.

తాడేపల్లి మండలం, తాడేపల్లి ప్రధాన గ్రామపంచాయితి. విజయవాడ కు ప్రక్కనే (గుంటూరు జిల్లా)కృష్ణా నది ఒడ్డున కలదు. మంగళగిరి నియోజకవర్గం.

  • బీసెంటు రోడు - విజయవాడలోని ప్రముఖ వాణిజ్య కేంద్రం.
  • సత్యనారాయణ స్వామి ఆలయం - ఇది గాంధీ నగర్ లొ ఉన్నది. సత్యనారాయణ స్వామి పేరు మీద ఎన్ని ఆలయాలున్నా, ఈ ఆలయం విజయవాడ వాసులకు ఒక తీర్థం లాంటిది.
  • వేంకటేశ్వర స్వామి ఆలయం - ఇది బందరు రోడ్డు లో ఉన్నది. విజయవాడ లో 3 ముఖ్యమయిన రోడ్లు మర్చిపోకూడనివి. 1 - ఏలూరు రోడ్డు, 2 - బందరు రోడ్డు, 3 - 5వ నంబరు రూట్ రోడ్డు. వేంకటెశ్వర స్వామి గుడి కి వెళ్ళాలంటే, బందరు రోడ్డులో, పశువుల ఆస్పత్రి దగ్గరనుంచి వెళ్ళవలెను.
  • విజయవాడ లో అనేక సినిమా ధియేటర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న జనాభాకి వినోదానికి కొదవలేదు.

[మార్చు] దేవాలయాలు

[మార్చు] కనక దుర్గ అమ్మ వారి దేవాలయం

కనక దుర్గ అమ్మ వారి దేవాలయం
కనక దుర్గ అమ్మ వారి దేవాలయం

అమ్మలగన్నయమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువున్న అలయము

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.

[మార్చు] మరకత రాజరాజేశ్వరీ దేవాలయం - పటమట

మరకత రాజరాజేశ్వరి

ఆధునిక యుగంలో అపురూపమైన శిల్పకళతో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో(పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చే ఈ గుడి కుంభాభిషేకం మరియు ప్రతిష్ఠ జరుపబడింది.


[మార్చు] వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం - లబ్బీపేట

బెంజి సర్కిల్ నుండి రెండు కిలోమీటర్ల దూరములో ఉందీ విజయవాడలో పేరుగాంచిన దేవాలయము. ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర.

[మార్చు] ఆంజనేయస్వామి వారి దేవాలయం - మాచవరం

[మార్చు] క్షిప్రగణపతి దేవాలయం - పటమట

[మార్చు] రామలింగెశ్వర స్వామి దేవాలయం - యనమలకుదురు

స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న పర్వతం పైన ఉన్నది.బెంజి సర్కిల్ నుండి మూడు కిలోమీటర్ల దూరములో ఉందీ విజయవాడలో పేరుగాంచిన దేవాలయము.శీవిరాత్రి పర్వదినాన ఘనంగా స్వామి వారి ఉత్సవాలు జరుగుతాయి.

[మార్చు] బయటి లింకులు

[మార్చు] రిఫరెన్స

  1. VMC
  2. Air Deccan to launch Bangalore-Vijayawada service - India Airline News, Airport developments, Aviation, A380, B787, Kingfisher, Deccan, Jet Airways, Air India, Indian Airlines, Spicejet
  3. (Gannavaram-Vijayawada) aerodrome. తీసుకొన్న తేదీ: 2006-08-20.
  4. Murali Sankar, K.N.. Simulator training for train drivers from July 15 in Vijayawada. The Hindu. తీసుకొన్న తేదీ: 2006-08-20.
  5. The Hindu Business Line : Maytas consortium to develop Machilipatnam port at new site
  6. Vijayawada cricket stadium
  7. The Hindu : Andhra Pradesh / Vijayawada News : Keeping home turf in top shape
పేజీకి సంభందించిన లింకులు