ఈనాడు

వికీపీడియా నుండి
ఈనాడు
ఏప్రిల్ 17, 2008 నాడు ఈనాడు పేపర్ ఆన్ లైన్ వెర్షన్ పటచిత్రం
The Heart and Soul of Andhrapradesh
రకము ప్రతి దినం దిన పత్రిక
ఫార్మాటు బ్రాడ్ షీట్

యాజమాన్యం ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్
ప్రచురణకర్త రామోజీరావు
సంపాదకులు రామోజీరావు
స్థాపన ఆగష్టు 10,1974
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా
వెల భారతదేశం రూపాయలు:3.00
సోమ వారం-శని వారం
రూ.3.50 ఆది వారం
ప్రధాన కేంద్రము హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్,ఇండియా
సర్క్యులేషన్ 11,76,028 ప్రతిదినం[1].

వెబ్‌సైటు: www.eenadu.net

ఈనాడు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. తెలుగు పత్రికా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. వార్తలను సమర్పించడంలో కొత్తపుంతలు తొక్కి అశేష ప్రజల ఆదరాభిమానాలు పొందింది[ఆధారం కోరబడినది]. తెలుగు పత్రికలలోనే కాక యావద్దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికలలో ఒకటిగా నిలిచింది. ప్రజల జీవితాలతో మమేకమై, సమకాలీన చరిత్రలో విడదీయరాని భాగమైపోయింది. ఈనాడు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రిక. NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, దేశంలోనే తృతీయ స్థానంలో నిలచినది.[2].

విషయ సూచిక

[మార్చు] ప్రారంభం

హైదరాబాదు, సోమాజీగూడలో ఈనాడు ప్రధాన కార్యాలయం

1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. అదే సంవత్సరం ఆగష్టు 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడినది.[3] చాలా సాధారణంగా, ఏ ఆర్భాటాలు లేకుండా 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి.

అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది.

ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు.

అలాగే తెలుగు పత్రికల పేర్లు - ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, మొదలైనవి - తెలుగు భాషకు సహజమైన చక్కటి గుండ్రటి అక్షరాలతో అచ్చయ్యేవి. అయితే ఈనాడు ఈ సాంప్రదాయాన్ని పక్కనపెట్టి, తన పేరును పలకల అక్షరాలతో ముద్రించింది. ఇది కూడా పాఠకులకు కొత్తగా అనిపించింది.

విశాఖపట్నంలో ప్రముఖ దినపత్రికలేవీ అచ్చవని ఆ రోజుల్లో ఈనాడు స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ రావడంతో ప్రజలకు మరింత చేరువయింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలకు అది ఇస్తూ వస్తున్న ప్రాధాన్యత ఒక కారణం.

[మార్చు] ప్రస్థానం

ప్రముఖ పాత్రికేయుడైన ఏ.బి.కె. ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు. ఆయన నిర్వహణలోను, ఆ తరువాత కూడా, ఈనాడు బాగా అభివృద్ధి సాధించింది. 1975 డిసెంబర్ 17న హైదరాబాదులో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి, రాష్ట్రంలోను, రాష్ట్రం బయటా మొత్తం 23 కేంద్రాలనుండి ప్రచురితమౌతూ, అత్యధిక ప్రచురణ, ఆదరణ కల భారతీయ భాషా పత్రికలలో మూడవ స్థానానికి చేరింది.

సమర్ధులైన సంపాదక సిబ్బంది, పటిష్టమైన సమాచార సేకరణ వ్యవస్థ, ఆధునిక సాంకేతిక అభివృద్ధిని సమర్ధంగా వాడుకోవడం మొదలైనవి ఈనాడు అభివృద్ధికి ముఖ్యమైన తెరవెనుక కారణాలు కాగా, స్థానిక వార్తలకు ప్రాధాన్యతనివ్వడం, క్రమం తప్పకుండా ప్రతిరోజు కనిపించే కార్టూన్లు, పేజీలో వార్తల అమరిక, మొదలైనవి పాఠకులకు కనిపించే కారణాలు.

పరిశోధనాత్మక వార్తలకు ఈనాడు పేరెన్నికగన్నది. 1978, 1983 మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనలతో అలజడి సృష్టించింది, ఈనాడు. సిమెంటు కుంభకోణం, టిటిడిలో మిరాశీదార్ల అక్రమాలు, భూకబ్జాలు మొదలైన వాటినెన్నిటినో వెలుగులోకి తెచ్చింది ఈనాడు. 1983లో తెలుగు దేశం పార్టీ అధినేత రామారావు అధికారంలోకి రావడంలో ఈనాడు ప్రముఖ పాత్ర పోషించింది. రామారావు పర్యటనలకు, ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించింది.[4] 1993, 1994లలో జరిగిన మద్యనిషేధ ఉద్యమంలో మహిళల పక్షాన నిలిచి పోరాటం చేసింది. ఆ సమయంలో ఉద్యమం కొరకు ఒక పేజిని ప్రత్యేకించింది, ఈనాడు. గుజరాత్ భూకంపం, హిందూ మహాసముద్ర సునామి వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఈనాడు తన వంతుగా సహాయం చేసింది.

[మార్చు] భాష

భాష విషయంలో ఈనాడు తెలుగు పత్రికలలో ఒక ఒరవడి సృష్టింది. సాధారణంగా ఇంగ్లీషులో అందుకునే వార్తలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తారు. అయితే సమయం తక్కువగా ఉండటం చేతగాని, ఒక పద్ధతికి అలవాటు పడటం వలనగానీ మిగిలిన పత్రికలలో భాష క్లిష్టమైన పదాలతో కూడి, సరళంగా ఉండేది కాదు. ఈనాడు, అనువాదాన్ని సరళతరం చేసి, సహజమైన, సులభమైన భాషలో వార్తలను అందించింది.

తెలుగు భాష కొరకు ఆదివారం పుస్తకంలో ప్రత్యేక శిర్షికలను ఈనాడు అందిస్తూ ఉంది. మామూలుగా దినపత్రికలు అందించే కథలు, కథానికలే కాక, భాష విస్తృతికి దోహదం చేసే శీర్షికలను ప్రచురించింది. వాటిలో కొన్ని: తెలుగులో తెలుగెంత, మాటల మూటలు, తెలుగు జాతీయాలు, మాటల వాడుక, మాటలు, మార్పులు మొదలైనవి.

[మార్చు] శీర్షికలు, విశిష్టతలు

వారం శీర్షిక వివరాలు
సోమవారం
Eenadu edu logo.gif
విద్యకు సంభందించి, నూతన కోర్సుల గురించి సమాచారం[1]
మంగళ వారం
Eenadu health logo.gif
ఆరోగ్యంనకు, జబ్బులు సంభందించి ప్రముఖ వైద్యులతో నివారణ చర్యలు, చర్చ, సూచనలు ఆరోగ్య సంరక్షణ గురించి సమాచారం
బుధ వారం
Eenadu Champion logo.JPG
ప్రపంచ ఆటలు, క్రీడల గురించి సమగ్ర సమాచారం, విశ్లేషణ ఆటలలో గత రికార్డులు, జరగబోవు క్రీడల సమాచారం.
గురు వారం
Eenadu e eenadu logo.gif
కంప్యూటర్, సమాచార సాంకేతికాంశాలు గురించి సమాచారం, ప్రశ్నలు-జవాబులు, ఉపయోగకరమైన వెబ్సైట్ల వివరాలు
శుక్ర వారం
Eenadu Siri logo.gif
ఆర్ధిక అంశాలు పన్నులు, వడ్డీలు, మ్యూచువల్ ఫండులు, ఆర్ధిక నేరాలు-మోసాలు తీసికోవలసిన జాగ్రత్తలతో నిపుణులతో సూచనలు, మెలకువలు
శని వారం
Eenadu Etaram logo.gif

Enadu stirasti banner.JPG
  • యువతారానికి సంభందించిన విషయాలు, విజయాలు, వ్యక్తిత్వ వికాసానికి సంభందించిన నిపుణుల సూచనలు, వ్యాసాలు.
  • స్థిరాస్తుల గురించి 4 పుటల ప్రత్యేక అనుభందంలో గృహ రుణాలు, రాష్ట్రం, దేశంలోని రియల్ ఎస్టేట్ సమాచారం, నిపుణుల సూచనలు, ప్రకటనలు.
ఆది వారం
Eenadu haibujji logo.gif
Eenadu adivaaram logo.gif

ఆదివారం ప్రత్యేక అనుబంధాన్ని పుస్తకం రూపంలో అందించే సాంప్రదాయాన్ని తెలుగులో మొదలు పెట్టింది ఈనాడే. 1988 ఫిబ్రవరి 28నాడు ఇది మొదలైంది. సరదా పఠనం ఈ పుస్తకంలోని శీర్షికల ముఖ్య ఉద్దేశ్యం. చిన్న పిల్లలకు కావలసిన వినోదం, సరదా సంగతులు, కార్టూనులు, ప్రముఖుల గురించి వ్యాసాలు, పర్యాటక క్షేత్రాల వివరాలు మొదలగు సమాచారం.
ఈ ప్రత్యేక అనుభంధం పుస్తకాన్ని ఇప్పుడు ప్రతి తెలుగు దిన పత్రిక ఇస్తుందంటే ఈనాడు సాధించిన విజయం అర్ధం చేసికోవచ్చు.

ప్రతిదినం
Eenadu Vasundara logo.jpg
స్త్రీలకు ప్రత్యేకించిన ఈ అనుబంధంలో బహుళ ప్రచారం పొందిన ప్రముఖ మహిళల గురించే కాక, రాష్ట్రంలోని, దేశ విదేశాలలోని వార్తలకెక్కని గొప్ప స్త్రీల గురించిన విజయాలు, విశేషాలు, స్త్రీ ఆరోగ్య, సౌందర్య చిట్కాలు, గృహాలంకరణ, ఉద్యోగ జీవితం మొదలగు సమాచారం ప్రచురిస్తారు.
ఇప్పుడు చాల తెలుగు దినపత్రికలు స్త్రీల కోసం ప్రత్యేక అనుభందాలు ప్రచురించే సంప్రదాయానికి ఈ వసుందర శీర్షిక ప్రేరణ అని చెప్పవచ్చు.
ప్రతిదినం
Enadu busines logo.jpg
పూర్తిగా రెండు పేజీలలో వ్యాపార సంభంద సమాచారం, మార్కెట్ కబుర్లు, ప్రస్తుత విదేశీ మారకపు రేట్లు, బంగారం, వెండి ధరలు, షేర్ల ధరల సూచిక, ప్రముఖులతో మాట-మంతి మొదలగు వివరాలు.
ప్రతిదినం
Enadu Idisangati logo.gif
మన బళ్లలో కూడా తెలుగు పెట్టాలి సార్‌
ఈ శీర్షిక క్రింద పత్రిక మొదటి పుటలో ఎడమవైపు క్రింద చిన్న వ్యంగ్య చిత్రం(కార్టూన్) వర్తమాన సంఘటనల మీద (ఎక్కువగా రాజకీయాల మీద) ప్రచురిస్తారు. ఈనాడు వ్యంగ్య చిత్రకారుడు శ్రీధర్ నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలలొ ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మీద వ్యంగ్య చిత్రం.
ప్రతిదినం
Eenadu Cinema logo.jpg
ఈనాడు సినిమాలో కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు, షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల విశేషాలు, కబుర్లు, ఇంటర్వ్యూలు, వ్యాసాలు, నటీ, నటుల, సాంకేతిక నిపుణుల ఫోటోలు ఉంటాయి.
ప్రతిదినం జిల్లా ఎడిషన్లు
(మినీ ఎడిషన్లు)
ఫ్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అనుబంధాన్ని ప్రారంభించి, తెలుగు పత్రికా రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించింది ఈనాడు. 1989 జనవరి 26న ప్రారంభమైన ఈ జిల్లా అనుబంధాలతో వార్తల సమర్పణలో ఒక కొత్త శకం మొదలైంది. తన రాష్ట్రం, తన జిల్లా వార్తల వరకే పరిమితమైన తెలుగు పాఠకులు తన గ్రామంలో జరిగిన వార్తలను కూడా పత్రికలలో చదవడం మొదలు పెట్టారు. ఈ సాంప్రదాయాన్ని మిగిలిన పత్రికలూ అనుసరించాయి.

[మార్చు] పరిశోధనా విభాగం

ఈనాడుకు ఒక స్వంత పరిశోధనా విభాగం (రీసెర్చి అండ్ రిఫరెన్స్ గ్రూప్) ఉంది. ఇది ఈనాడుకు సమాచార నిధి వంటిది. దేశ విదేశాలనుండి ఎన్నో పత్రికలు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలు, వార్తల విశ్లేషణకు, వివరణకు అవసరమైన సమాచారం ఇక్కడి నుండే వస్తుంది.

[మార్చు] ఆన్ లైన్ వెర్షన్

ప్రస్తుతం ఈనాడు పేపర్ సంప్రదాయ ప్రచురణ కాకుండా, అంతర్జాలంలో ఆన్ లైన్ వెర్షన్ రెండు విధాలుగా ప్రచురిస్తుంది.

  • ఒకటి సాదారణమయిన తెలుగు అక్షరాలతో(ఈనాడు ఫాంటుతో)http://eenadu.net లింకు,
  • రెండు పిడీయఫ్ ఫార్మాట్(.pdf format)http://epaper.eenadu.net లింకు
    ఈ పిడీయఫ్ ఆన్ లైన్ వేర్శన్లో ఈనాడు పేపరుని అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు.కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. పిడీయఫ్ ఫోర్మాట్ పనిచేయకపోతే జేపియిజి(.jpeg) ఫోటో ఫోర్మాట్లో కాని అక్షరాలలో(text) కాని కనిపించటం ఈనాడు యి.పేపర్ విశిష్టత.[5]

అంతర్జాతీయంగా విశ్వసనీయమయిన వెబ్ సైట్ ట్రాఫిక్ ర్యాంకులు ప్రచురించే సంస్థ(ఆన్ లైన్ వెబ్ సైట్) ఎలేక్సా(Alexa) వారి ఈనాడు ట్రాఫిక్ రాంకు: 827 గా ఉంది.[6] ఈనాడు.నెట్, నెలలో 5 కోట్ల (50 మిలియన్లు) పైగా పేజీ వీక్షణలు, 80 లక్షలపైగా నిర్దిష్ట వాడుకరి సందర్శనలు [7]కలిగివున్నది

ఈనాడు.నెట్ ఆన్ లైన్ వెబ్ సైట్‌ని దేశాల వారిగా వీక్షించేవారి శాతం ( గూగుల్ ఎనలిటిక్స్ జులై 2010 ప్రకారం ఈ నాడు మార్కెటింగు సమాచార సైటు నుండి)

భూభాగం శాతం
ఇండియా 41.5%
అమెరికా 38.01%
ఆసియా (ఇండియా కాక) 10.29%
యూరోప్ 5.98%
ఒషేనియా 2.9%
ఆఫ్రికా 1.07%
ఇతరాలు 0.26%


(ట్రాఫిక్ రాంకు: అంటే ప్రతి రోజు సైట్ వీక్షకుల సంఖ్యని బట్టి వెబ్సైట్ స్థానాన్ని నిర్ణయించటం)
మొత్తం ఈనాడు ఆన్ లైన్ వెబ్ సైట్ వీక్షకుల శాతం:

[మార్చు] ఈనాడులో కావాల్సినవి

తెలుగు పత్రికలలో అగ్రగామిగా ఉన్న ఈనాడులో కొన్ని శీర్షికలు కావాలనుకోవడంలో తప్పులేదు. వాటిలో కొన్ని:

  • రాశి ఫలాలు: ఏ భాషలోనైనా దాదాపు ప్రతీ పత్రికలోను తప్పనిసరిగా ప్రతి రోజూ ఉండే ఈ శీర్షికకు ఈనాడులో 2010 వరకు చోటు కల్పించలేదు. ఆ తరువాత ఆదివారము అనుబందం లో రాశి ఫలాలను చేర్చారు
  • ధారావాహికలు: దిన పత్రికలలో డైలీ సీరియల్ ఒకటి ఉండటం తెలుగు పత్రికలలో రివాజు. అయితే ఆదివారం అనుబంధంలో మాత్రం ఒక కథను ప్రచురిస్తారు.
  • రైతే రాజు: ఈ శీర్షిక ని రోజూ ప్రచురించాలి, దీని ద్వారా సహజ వ్యవసాయ పద్ధతులను, గోవు లతో తయారు చేయు పంచగవ్య, మొదలైన వాటి విధానం మరియు వాడిన వారి అనుభవాలను రోజూ ప్రచురించాలి.
  • రైతు నుంచి నేరుగా: ఈ శీర్షిక ని కూడా రోజూ ప్రచురించాలి, దీని ద్వారా రైతు పాస్ పుస్తకం ఉన్న రైతుల నుండి నేరుగా ఎవరైనా ఉత్పత్తులు కొని కొంత సుంకాన్ని పత్రికకు కట్టవచ్చు.
  • రైతు దగ్గర ఉన్నవి: రైతు దగ్గర వాడ కుండా ఉన్న పనిముట్లను విక్రయించుటకు కొంత సుంకాన్ని వసూలు చేసి ప్రకటన ఇచ్చుకొనే వీలు కల్పించుట.

[మార్చు] ప్రముఖులు

ఈనాడుకు ఎంతోమంది ప్రముఖులు ఖ్యాతి తీసుకువచ్చారు. అలాగే ఎంతో మంది ఈనాడు ద్వారా ఖ్యాతి పొందారు. వారిలో కొందరు:

  • ఎ.బి.కె.ప్రసాద్: ఈనాడుకు ప్రథమ సంపాదకుడు. తొలినాళ్ళలో పత్రిక అభివృద్ధికి దోహదపడ్డాడు.
  • శ్రీధర్: ప్రముఖ కార్టూనిస్టు. ఈనాడు బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో సహాయపడ్డాయి. ఆయన కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి.
  • గజ్జెల మల్లారెడ్డి: పుణ్యభూమి శీర్షికతో పత్రికకు ఎందరో అభిమానుల్ని సంపాదించి పెట్టాడు.
  • బూదరాజు రాధాకృష్ణ: పుణ్యభూమి శీర్షికను సి.ధర్మారావు అనే కలం పేరుతో కొనసాగించాడు. ప్రతి ఆదివారం మాటలూ మార్పులూ అనే పేరుతో తెలుగు మాటల తప్పొప్పుల గురించిన శీర్షికను నిర్వహించాడు.
  • చలసాని ప్రసాదరావు: ఈయన కబుర్లు శీర్షిక ఎంతో విజయవంతమయింది.
  • డి.వి.నరసరాజు: అక్షింతలు అనే ఈయన శీర్షిక కూడా మంచి ఆదరణ పొందింది.
  • కొమ్మినేని శ్రీనివాసరావు: రాష్ట్రంలో రాజకీయమ్" శీర్షిక ఎంతో ఆదరణ పొందింది.

ప్రస్తుతం శ్రీధర్ తప్ప మిగతా వారు ఈనాడుతో పనిచేయడం లేదు.

[మార్చు] మూలాలు

  1. 1.0 1.1 Eenadu History నుండి జులై 05 2008న సేకరించబడినది.
  2. జాతీయ చదువరుల సర్వే 2006 నుండి డిసెంబర్ 9 2006న సేకరించబడినది.
  3. Registrar of Newspapers for Indiaలో వివరాలు.
  4. A Newspaper Ensured NTR's Victory - The Onlooker, 01-02-1983
  5. http://www.eenadu.net నుండి ఏప్రిల్, 17 2008న సేకరించబడినది.
  6. http://www.alexa.com/data/details/traffic_details/eenadu.net నుండి ఏప్రిల్, 17 2008న సేకరించబడినది.
  7. 11 అక్టోబరు 2010 నాటి ఈనాడు మార్కెటింగ్ సమాచారము, అలెక్సా మరి ఇతర ఆధారాలతో

[మార్చు] బయటి లింకులు

[మార్చు] ఇవికూడా చూడండి

రామోజీరావు
సితార (పత్రిక)

"http://te.wikipedia.org/w/index.php?title=ఈనాడు&oldid=676806" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు