మహబూబ్ నగర్
వికీపీడియా నుండి
| ?మహబూబ్ నగర్ ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 18,432 కి.మీ² (7,117 చ.మై) |
| ముఖ్య పట్టణము | మహబూబ్ నగర్ |
| ప్రాంతం | తెలంగాణ |
| జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం |
3,507,000 (2001) • 190/కి.మీ² (492/చ.మై) • 1779000 • 1726000 • 45.53 |
అక్షాంశరేఖాంశాలు: మహబూబ్‌నగర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాల్లో ఒకటి. జిల్లా ముఖ్యపట్టణం, మహబూబ్‌నగర్. ఇది హైదరాబాదునుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో కలదు. జిల్లాకు దక్షిణాన తుంగభద్ర నది, కర్నూలు జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, ఉత్తరముఅ రంగారెడ్డి జిల్లా, పశ్చిమమున కర్ణాటక లోని రాయచూరు, గుల్బర్గా జిల్లాలు కలవు. ఈశాన్య దిశలో హైదరాబాదు జిల్లా కలదు
[మార్చు] భౌగోళికం
భౌగోళికంగా ఈ జిల్లా తెలంగాణా ప్రాంతంలో దక్షిణాదిగా ఉంది. విస్తీర్ణం పరంగా తెలంగాణాలో ఇదే అతిపెద్దది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఇది రెండో పెద్ద జిల్లా. 18432 చ.కి.మీ. విస్తీర్ణం కల్గిన ఈ జిల్లాకు దక్షిణంగా తుంగభద్ర నది ప్రవహిస్తుంది. కృష్ణా నది కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి ఆలంపూర్ వద్ద తుంగభద్రను తనలో కలుపుకుంటుంది. ఈ జిల్లా గుండా ఉత్తర, దక్షిణంగా 7 వ నెంబరు జాతీయ రహదారి మరియు హైదరాబాదు-కర్నూలు రైల్వే లైను వెళ్ళుచున్నది. అమ్రాబాదు గుట్టలుగా పిల్వబడే కొండల సమూహం జిల్లా ఆగ్నేయాన విస్తరించి ఉంది. 2001 జనాభా గణన ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35 లక్షలు.
[మార్చు] చరిత్ర
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు (Palamooru) అని రుక్మమ్మపేట (Rukmammapeta) అని పిలిచేవారు. ఆ తరువాత డిసెంబరు 4, 1890నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా (1869 - 1911) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడినది. క్రీ.శ. 1883నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణము ప్రధానకేంద్రముగా వున్నది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చోళవాడి (చోళుల భూమి) అని పిలిచేవారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం మరియు గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు[1].
ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెల్సుకోవడానికి ఇబ్బందే. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. ఇక్కడి ప్రజలు పేదరికంతోను, బానిసత్వంలోను ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేరు. ఇప్పటికినీ ఈ ప్రాంతముధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు.
[మార్చు] పాలించిన రాజవంశాలు
- మౌర్య సామ్రాజ్యం : క్రీ.పూ.250 లో అశోక చక్రవర్తి కాలంలో మౌర్య సామ్రాజ్యం లో ఈ ప్రాంతము దక్షిణ సరిహద్దుగా ఉండేది.
- శాతవాహన రాజ్యం : క్రీ.పూ.221 నుంచి క్రీ.శ 218 వరకు పాలించిన శాతవాహన కాలంలో మహబూబ్ నగర్ ప్రాంతం భాగంగా ఉండేది.
- చాళుక్య రాజ్యం : క్రీ.శ. 5 వ శతాబ్దం నుంచి క్రీ.శ.11 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతము చాళుక్య రాజ్యంలో భాగంగా ఉండింది.
- రాష్ట్రకూట రాజ్యం : క్రీ.శ. 9 వ శతాబ్దంలో కొద్ది కాలం ఇక్కడ రాష్ట్రకూటులు పాలించారు.
- కాకతీయ రాజ్యం : క్రీ.శ.1100 నుమ్చి క్రీ.శ.1474 వరకు ఇక్కడ కాకతీయ రాజులు రాజ్యం చేశారు.
- బహమనీ రాజ్యం : క్రీ.శ.1347 నుంచి క్రీ.శ.1518 వరకు ఇది బహమనీ రాజ్యం లో భాగంగా ఉండింది.
- కుతుబ్ షాహి రాజ్యం : క్రీ.శ.1518 నుంచి క్రీ.శ.1687 వరకు ఈ ప్రాంతం కుతుబ్ షాహి రాజ్యంలో భాగం
- మొఘల్ సామ్రాజ్యం : క్రీ.శ. 1687 నుంచి దాదాపు 37 సం.ల పాటు మహబూబ్ నగర్ ప్రాంతంను మొఘలులు పాలించారు.
- నిజాం రాజ్యం : క్రీ.శ. 1724 నుంచి ఇక్కడ నిజాం పాలన ప్రారంభమైంది. స్వాతంత్రం అనంతరం హైదరాబాదు సంస్థానం దేశంలో కల్సే వరకు నిజాం రాజ్యంలో భాగం గానే కొనసాగింది.
[మార్చు] ఆధునిక చరిత్ర
హైదరాబాదు నిజాం ఆరవ నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్ నగర్ అనే పేరు వచ్చినది. జిల్లాలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు కూడా ఉంది.
1870లో నిజాం ప్రభుత్వం 8 తాలుకాలతో నాగర్ కర్నూల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసింది. 1881 నాటికి జిల్లాలో తాలుకాల సంఖ్య 10కి పెరిగింది. 1883లో జిల్లా కేంద్రాన్ని మహబూబ్ నగర్‌కు బదిలీ చేశారు. స్వాతంత్ర్యానంతరం సంస్థానాలుగా ఉన్న వనపర్తి, కొల్లాపూర్, షాద్‌నగర్ మొదలగు సంస్థానాలు తాలుకాలుగా ఏర్పడి విలీనమయ్యాయి.
స్వాతంత్ర్యానికి పూర్వం 1930 దశాబ్దిలో జరిగిన ఆంధ్రమహాసభలలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు అద్యక్షత వహించారు. 1930లో మెదక్ జిల్లాలో జరిగిన తొలి ఆంధ్రమహాసభకు సురవరం ప్రతాపరెడ్డి అద్యక్షత వహించగా, 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్రమహాసభకు బూర్గుల రామకృష్ణారావు అద్యక్షత వహించాడు. వీరిరువురూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖులే. 1936లో ఐదవ ఆంధ్రమహాసభ జిల్లాలోని షాద్‌నగర్ లోనే జరిగింది.
1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లానుంచి పలు ప్రాంతాలు విడదీసి, సరిహద్దు జిల్లాల నుంచి మరికొన్ని ప్రాంతాలు కలిపారు. జిల్లానుంచి పెరిగి తాలుకాను విడదీసి హైదరాబాదు జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా)కు కలిపినారు. పశ్చిమాన ఉన్న రాయచూరు జిల్లా నుంచి గద్వాల, ఆలంపూర్ తాలుకాలను విడదీసి మహబూబ్ నగర్ జిల్లాకు జతచేశారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా నుంచి కోడంగల్‌ను ఇక్కడ విలీనం చేశారు.
1958లో కల్వకుర్తి తాలుకాలోని కొన్ని గ్రామాలు నల్గొండ జిల్లాకు బదిలీ చేయబడింది. 1959లో రంగారెడ్డి జిల్లా లోని కొన్ని గ్రామాలు షాద్‌నగర్‌కు బదిలీ చేయబడ్డాయి. 1959 నాటికి జిల్లాలో 11 తాలుకాలు ఏర్పడ్డాయి. 1986లో మండలాల వ్యవస్థ అమలులోకి రావడంతో 13 తాలుకాల స్థానంలో 64 మండలాలు ఏర్పడ్డాయి.
[మార్చు] మహబూబ్ నగర్ జిల్లా సమాచారం
తెలంగాణా లో మహబూబ్ నగర్ జిల్లా అతిపెద్దది. ఆంద్రప్రదేశ్ లోనే ఇది రెండో పెద్ద జిల్ల. పాలమూరు అని కూడా పిల్వబడే ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామపంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజక స్థానాలు, 13 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు (పునర్విభజన ప్రకారం 14 స్థానాలు) కలవు. ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉండుటచేత దీన్ని కరువు జిల్లాగా పిలుస్తుంటారు. పనులు లేక అనేక మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం ఇక్కడ సాధారణం. అక్ష్యరాస్యత కూడా ఇక్కడ తక్కువ. సామాజిక, ఆర్థికంగా కూడా ఈ జిల్లా అభివృద్ధి చెందవలసి ఉంది.
[మార్చు] మహబూబ్ నగర్ జిల్లా లో పని చేసిన కలెక్టర్లు
|
|
దమయన్థి(ప్రస్తుతం) |
[మార్చు] కొన్ని గణాంకాలు
శాసనసభ లోక్‌సభ
- 'రెవిన్యూ డివిజన్లు : 5
మహబూబ్ నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణ పేట,
- రెవెన్యూ మండలాలు : 64
- లోక్ సభ స్థానాలు : 2
మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు
- శాసనసభ నియోజక వర్గాలు : 13 (పునర్విభజన ప్రకారం 14)
అచ్చంపేట, షాద్‌నగర్, మహబూబ్ నగర్, ఆత్మకూరు, వనపర్తి, గద్వాల, అలంపూర్, కొడంగల్, మక్తల్, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల.
- కొత్తగా చేపట్టిన నియోజక వర్గాల పునర్విభజన ప్రకారం మక్తల్ స్థానంలో నారాయణపేట, దేవరకద్ర స్థానంలో ఆత్మకూరు, కొత్తగా మక్తల్ శాసనసభనియోజక వర్గం ఏర్పడింది.
- గ్రామపంచాయతీలు : 1347
- ప్రకటిత (నోటిపైడ్) గ్రామపంచాయతీలు : 23
- అప్రకటిత (నాన్-నోటిపైడ్) గ్రామపంచాయతీలు : 1323
- నదులు:
- కృష్ణ, దిండి (షాబాద్ కొండలలో పుట్టిన దిండి కృష్ణానదికి ఉపనది), తుంగభద్ర నది (ఇదికృష్ణా ఉపనది అయిన తుంగభద్రనది), పెదవాగు , చినవాగు
- దర్శనీయ ప్రదేశాలు:
[మార్చు] జిల్లా నుంచి గెలిచిన ప్రస్తుత ప్రజాప్రతినిధులు
- కె.చంద్రశేఖరరావు : మహబూబ్ నగర్ లోకసభ సభ్యుడు,
- మంద జగన్నాథం : నాగర్ కర్నూల్ లోకసభ సభ్యుడు,
- ఆర్.చంద్రశేఖర్ రెడ్డి : రాజ్యసభ సభ్యుడు,
- పి.రాములు : అచ్చంపేట శాసనసభ్యుడు,
- అబ్రహాం : ఆలంపూర్ శాసనసభ్యుడు,
- రావుల చంద్రశేఖర్ రెడ్డి: వనపర్తి శాసనసభ్యుడు,
- డి.కె.అరుణ : గద్వాల శాసనసభ్యురాలు,
- ఎర్రశేఖర్ : జడ్చర్ల శాసనసభ్యుడు,
- జైపాల్ యాదవ్ : కల్వకుర్తి శాసనసభ్యుడు,
- రేవంత్ రెడ్డి : కోడంగల్ శాసనసభ్యుడు,
- జూపల్లి కృష్ణారావు : కొల్లాపూర్ శాసనసభ్యుడు,
- ఎన్.రాజేశ్వర్ రెడ్డి : మహబూబ్ నగర్ శాసనసభ్యుడు,
- సీతాదయాకర్ రెడ్డి : దేవరకద్ర శాసనసభ్యురాలు,
- దయాకర్ రెడ్డి : మక్తల్ శాసనసభ్యుడు,
- నాగం జనార్థన్ రెడ్డి : నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు,
- ప్రతాప్ రెడ్డి : షాద్‌నగర్ శాసనసభ్యుడు,
- ఎల్కోటి ఎల్లారెడ్డి : నారాయణపేట శాసనసభ్యుడు.
[మార్చు] స్వాతంత్రానికి పూర్వం మహబూబ్‌నగర్ జిల్లా లో సంస్థానాలు
- ప్రధాన వ్యాసం: పాలమూరు సంస్థానాలు
స్వాతంత్రానికి పూర్వం మహబూబ్‌నగర్ జిల్లో 16 సంస్థానాలు ఉండేవి[2]. అందులో ముఖ్యమైన సంస్థానాలు :
- వనపర్తి సంస్థానము
- గద్వాల సంస్థానము
- జటప్రోలు సంస్థానము
- అమరచింత సంస్థానము
- పాల్వంచ సంస్థానం
- గోపాల్ పేట్ సంస్థానం
- గురుకుంట సంస్థానం
- కొల్లాపూర్ సంస్థానము
- ఆనెగొంది సంస్థానం
[మార్చు] మహబూబ్ నగర్ మండలాలు
భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లాను 64 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[3].
|
1.కోడంగల్ 3.కోస్గి 6.మద్దూరు 8.హన్వాడ 10.బాలానగర్ 11.కొందుర్గ్ 12.షాద్‌నగర్ 13.కొత్తూరు 14.కేశంపేట 15.తలకొండపల్లి 16.ఆమనగల్ |
17.మాడ్గుల్ 18.వంగూరు 19.వెల్దండ 20.కల్వకుర్తి 21.మిడ్జిల్ 22.తిమ్మాజిపేట 23.జడ్చర్ల 24.భూత్‌పూర్ 25.మహబూబ్ నగర్ 26.అడ్డాకల్ 27.దేవరకద్ర 28.ధన్వాడ 29.నారాయణపేట 30.ఉట్కూర్ 31.మాగనూరు 32.మఖ్తల్ |
33.నర్వ 35.ఆత్మకూరు 36.కొత్తకోట 37.పెద్దమందడి 38.ఘన్‌పూర్ 39.బిజినపల్లి 41.తాడూరు 42.తెల్కపల్లి 43.ఉప్పునూతల 44.అచ్చంపేట 45.అమ్రాబాద్ 46.బల్మూర్ 47.లింగాల |
49.కోడేరు 50.గోపాలపేట 51.వనపర్తి 52.పానగల్ 53.పెబ్బేరు 54.గద్వాల 55.ధరూర్ 56.మల్దకల్ 57.ఘట్టు 58.అయిజా 59.వడ్డేపల్లి 60.ఇటిక్యాల 61.మానోపాడ్ 62.ఆలంపూర్ 63.వీపనగండ్ల 64.కొల్లాపూర్ |
[మార్చు] పట్టణ ప్రాంతాలు
మహబూబ్ నగర్ జిల్లాలో 4 మున్సీపాలటీలతో పాటు అనేక పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి : మహబూబ్ నగర్ (స్పెషల్ గ్రేడ్ మున్సీపాలిటీ), గద్వాల (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), వనపర్తి (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), నారాయణపేట (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), షాద్‌నగర్ (మేజర్ గ్రామపంచాయతి), జడ్చర్ల (మేజర్ గ్రామపంచాయతి), కల్వకుర్తి (మేజర్ గ్రామపంచాయతి), కొల్లాపూర్ (మేజర్ గ్రామపంచాయతి), నాగర్ కర్నూల్ (మేజర్ గ్రామపంచాయతి), ఆత్మకూర్ (మేజర్ గ్రామపంచాయతి), అచ్చంపేట్ (మేజర్ గ్రామపంచాయతి).
[మార్చు] జనాభా
1941 జనగణన ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా జనాభా 13.8 లక్షలు కాగా, 2001 జనగణన ప్రకారం 35 లక్షలు దాటింది. 1941 నుంచి 2001 వరకు ప్రతి 10 సంవత్సరాలకు సేకరించే జనాభా లెక్కల గణాంకాల ప్రకారం జిల్లా జనాభా ప్రక్క గ్రాఫ్‌లో చూపెట్టబడినది. ముఖ్యపట్టణాల జనాభా (2001 లెక్కల ప్రకారం):
- మహబూబ్ నగర్ : 1,39,534
- గద్వాల : 53,601
- వనపర్తి : 50,262
- నారాయణపేట : 37,563
- షాద్‌నగర్ :
- జడ్చర్ల :
- కల్వకుర్తి :
- నాగర్‌కర్నూల్ :
- కొల్లాపూర్ :
- ఆత్మకూర్ :
[మార్చు] రవాణా సౌకర్యాలు
రైలు సౌకర్యం : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లాలో 195 కిలోమీటర్ల నిడివి కల ప్రధాన రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గం హైదరాబాదు నుంచి కర్నూలు గుండా తిరుపతి, బెంగుళూరు వెళ్ళు దారిలో ఉంది. ఉత్తరాన తిమ్మాపూర్ నుంచి దక్షిణ సరిహద్దున ఆలంపూర్ రైల్వేస్టేషన్ వరకు జిల్లాలో మొత్తం 30 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్, షాద్‌నగర్, గద్వాల, జడ్చర్ల ముఖ్యమైనవి. మహబూబ్ నగర్ పట్టణంలోనే 3 రైల్వేస్టేషన్లు కలవు (మహబూబ్ నగర్ మెయిన్, మహబూబ్ నగర్ టౌన్ మరియు ఏనుగొండ). కర్ణాటకలోని వాడి మరియు రాయచూరు మార్గం కూడా ఈ జిల్లాగుండా కొన్ని కిలోమీటర్లు వెళ్తుంది. మాగనూరు మండలంలోని కృష్ణా రైల్వేస్టేషన్ ఈ మార్గంలోనే ఉంది. గద్వాల నుంచి కర్ణాటక లోని రాయిచూరుకు మరో రైలు మార్గపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ కూడా మంజురు అయిననూ పనులు ప్రారంభం కావల్సి ఉంది. జిల్లాలో రైల్వేలైన్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 0.57గా ఉంది.
రోడ్డు సౌకర్యం : దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి అయిన 7 వ నెంబర్ జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి కూడా ఇదొక్కటే. ఇది జిల్లాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు కలదు. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారిపై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. జాతీయ రహదారిపై జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు - షాద్‌నగర్, జడ్చర్ల, పెబ్బేర్, కొత్తకోట, ఎర్రవల్లి చౌరస్తా, ఆలంపూర్ చౌరస్తాలు. జిల్లా గుండా మూడు అంతర్రాష్ట్ర రహదారులు కూడా వెళుతున్నాయి. వాటిలో జడ్చర్ల-రాయిచూరు రహదారి ముఖ్యమైనది. ఈ రహదారి మహబూబ్ నగర్, మరికల్, మక్తల్, మాగనూరు గుండా రాయిచూర్ వెళ్తుంది. మరో అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాదు-శ్రీశైలం రహదారి. దీనికి జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లానుంచి వెళుతుంది. హైదరాబాదు-బీజాపురు రహదారి కొడంగల్ గుండా వెళ్తుంది.
బస్ డిపోలు : మహబూబ్ నగర్ జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన 8 బస్సు డిపోలు ఉన్నాయి - మహబూబ్ నగర్, గద్వాల, షాద్‌నగర్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్.
[మార్చు] సందర్శనీయ ప్రదేశాలు
- ఆలంపూర్ దేవాలయాలు : తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆలంపూర్ వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. హైదరాబాదు-బెంగుళూరు 7 వ నెంబరు జాతీయ రహదారిపై కల ఆలంపుర్ చౌరస్తా నుంచి 15 కిలోమీటర్ల లోనికి ఆలంపూర్ లో ఈ ఆలయాలు కలవు. ఈ ఆలయాలు చాళుక్యుల కాలం నాటివి. జిల్లాలో వివిధ త్రవ్వకాలలో లభించిన పురాతన శిల్పాలు కూడ ఆలంపుర్ పురావస్యు మ్యూజియంలో ఉన్నాయి.
- పిల్లలమర్రి : మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో సుమారు 700 సంవత్సరాల వయస్సు కల్గిన ఒక మహావృక్షం ఊడలు ఊడలుగా అభివృద్ధిచెంది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిఉంది. మహబూబ్ నగర్ జిల్లాకే గుర్తుగా మారిన ఈ మహావృక్షాన్ని సందర్శించడాన్కి ఎందరో వస్తుంటారు. ఇక్కడే పురావస్తు మ్యూజియం, మినీ జూ పార్క్, అక్వేరియం, ఉద్యానవనం, పిల్లల క్రీడాస్థలం, జింకలపార్క్ మొదలగునవి కూడా తనవితీరా చూడవచ్చు.
- బీచుపల్లి : 7 వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణానది పై కల ఆనకట్ట వద్ద పుష్కర ప్రాంతమైన బీచుపల్లి ఉంది. ఇక్కడ కృష్ణవేణి ఆలయంతో పాటు సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై నుంచి వెళ్ళు వాహనాల నుండి కూడా ఇక్కడి అపురూపమైన దృష్యాలు కానవస్తాయి.
- ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు : ధరూర్ మండలం రేవుల పల్లి వద్ద కర్ణాటక సరిహద్దు నుంచి 18 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు ఉంది. కృష్ణానది ఆంద్రప్రదేశ్ లో ప్రవేశించిన తర్వాత ఇదే మొదటి ప్రాజెక్టు. నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఇటీవలే విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభించింది. ఇది గద్వాల నుంచి ఆత్మకూర్ మార్గంలో ఉంది.
- మన్యంకొండ దేవాలయం : మహబూబ్ నగర్ జిల్లా లోనే అతిపెద్ద దేవాలయం మన్యంకొండ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఎత్తయిన కొండపై మహబూబ్ నగర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక లోని రాయచూరు వెళ్ళు మార్గంలో కలదు. ఇక్కడ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున జాతర జర్గుతుంది. కొండపై ఉన్న ఆహ్లాదకర వాతావరణం సందర్శకులను ఆకట్టుకొంటుంది.
- కోయిల్‌సాగర్ ప్రాజెక్టు :50 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దేవరకద్ర మండల పరిధిలో ఊకచెట్టువాగుపై నిర్మించారు. నిర్మాణం సమయంలో ఈ ప్రాజెక్టు సాగునీటి లక్ష్యం 12 వేల ఎకరాలు కాగా ప్రస్తుతం 50 వేల ఎకరాలకు పెంచి ప్రాజెక్టును అభివృద్ధి పరుస్తున్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టు సందర్శన కొరకు అనేక పర్యాటకులు వస్తుంటారు.
- కురుమూర్తి దేవస్థానం : తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంతో పోలికలున్న కురుమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం క్రీ.శ.14 వ శతాబ్దానికి చెందినది. ఇది చిన్న చింతకుంట మండలంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరడానికి రైలుమార్గం కూడా ఉంది.
- ఉమా మహేశ్వర క్షేత్రం : నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండలపై ఉమా మహేశ్వర క్షేత్రం ఉంది. ఇది శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు మార్గంలో ఉంది కాబట్టి శ్రీశైలం వెళ్ళు భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ వెళ్తారు. చుట్టూ ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉండటం కూడ భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
- గద్వాల కోట : సంస్థాన రాజుల కాలంనాటి గద్వాల కోట పట్టణం నడిబొడ్డున కలదు. ఈ పురాతన కోటలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. కోట లోపలే ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. కోటలోని స్థలాన్ని కళాశాలకు ఇచ్చినందున కళాశాల పేరు కూడా మహారాణి ఆదిలక్ష్మీ డిగ్రీ కళాశాలగా చెలమణిలో ఉంది. కోట పరిసరాలలో గతంలో సినిమా షూటింగులు కూడా జర్గాయి.
- శిర్సనగండ్ల దేవాలయం : అపరభద్రాద్రిగా పేరుగాంచిన క్రీ.శ.14 వ శతాబ్ది కాలం నాటి శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం వంగూరు మండలంలో ఉంది. ఇక్కడ ప్రతిఏటా చైత్రశుద్ధి పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు జర్గుతాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కూడా ప్రతియేటా దిగ్విజయంగా నిర్వహిస్తారు.
- చంద్రగఢ్ కోట : ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు సమీపంలో ఎత్తయిన కొండపై 18 వ శతాబ్దంలో మొదటి బాజీరావు కాలం నాటి కోట పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇది ఆత్మకూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో నర్వ మండల పరిధిలో నిర్మించారు. జూరాల పాజెక్టు సందర్శించే పర్యాటకులకు ఇది విడిదిగా ఉపయోగపడుతుంది. 18 వ శతాబ్దం తొలి అర్థ భాగంలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో ఆత్మకూరు సంస్థానంలో పన్నుల వసూలు కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించాడు.
- రాజోలి కోట మరియు దేవాలయాలు :పురాతనమైన రాజోలి కోట మరియు కోటలోపలి దేవాలయాలు సందర్శించడానికి యోగ్యమైనవి. కోట ప్రక్కనే తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల డ్యాం కనిపిస్తుంది.
[మార్చు] పాలమూరు మహనీయులు
- బూర్గుల రామకృష్ణా రావు : ఆంధ్రరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పోరాటయోధులలో ముఖ్యుడు. 1915 నుంచే ఈయన పోరాటం ప్రారంభమైంది.పలుమార్లు జైలుకు వెళ్ళినాడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గేయాలు, రచనలు చేసి ప్రజలలో ఉత్తేజం కలిగించాడు. ఈయన స్వస్థలం షాద్‌నగర్ మండంలోని బూర్గుల గ్రామం. ఇంటిపేరు పుల్లంరాజు అయిననూ ఊరిపేరే ఇంటిపేరుగా మారిపోయింది. 1952లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ అవరతణకు వీలుగా ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు. ఆ తర్వాత కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశాడు.
- సురవరం ప్రతాపరెడ్డి : ప్రముఖ న్యాయవాది, పత్రికా సంపాదకుడు, గ్రంథాలయోద్యమనేత, రాజకీయ నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సురవరం ప్రతాపరెడ్డి పాలమూరు జిల్లా మనోపాడ్ మండలంలోని ఇటిక్యాలపాడు గ్రామంలో 1896, మే 28న జన్మించాడు. 1926లో గోల్కొండ పత్రికను స్థాపించి నిజాం ప్రభుత్వపు లోపాలను ఎండగట్టాడు. 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1952లో జరిగిన తొలి ఆంద్రరాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వనపర్తి నుంచి ఎన్నికయ్యాడు. 1953 ఆగష్టు 25న ఆయన మరణించాడు.
- రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి : ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడైన రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు. నిజాంకు కొత్వాల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. తరువాత గోల్కొండ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. హైదరాబాదు . ప్రజాచైతన్యం కల్గించడానికి అనేక విద్యాసంస్థలను స్థాపించాడు.
- వందేమాతరం రామచంద్రారావు : పాలమూరు జిల్లానుంచి స్వాతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్న ప్రముఖ నేతలలో వందేమాతరం రామచంద్రారావు ఒకడు. ఇతని అసలు పేరు రామచంద్రయ్య. తొలుత గద్వాల సంస్థానంలో సబ్‌ఇన్స్‌పెక్టర్ ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హిందూమహాసభలో చేరినాడు. పలుసార్లు జైలుశిక్ష అనిభవించాడు. విచారణ సమయంలో ఊరు, తండ్రిపేరు అడగగా అన్నింటికీ వందేమాతరం అనే సమాధానం ఇచ్చాడు. అందుచే జైలునుంచి విడుదల అనంతరం అందరూ వందేమాతరం రామచంద్రారావు అని పిల్వడం ప్రారంభించారు.
- హాస్టల్ రామారావు : స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ప్రముఖ పాత్ర వహించిన పాలమూరు వ్యక్తి హాస్టల్ రామారావు అసలు పేరు సంతపూర్ రామారావు. కొల్లాపూర్ మండలం అతని స్వస్థలం. స్వతంత్ర్య భారతదేశంలో కలిసేందుకు హైదరాబాదు సంస్థానం నిరాకరించడంతో నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి1947లో అరెస్టు వారెంట్‌కు గురై రెండేళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళినాడు. స్వాతంత్ర్యం తరువాత నాగర్ కర్నూల్ లో హరిజనుల కోసం హాస్టల్ ప్రారంభించి హరిజనోద్ధరణకు పాటుపడినందులకు అతని పేరు హాస్టల్ రామారావుగా స్థిరపడింది.
- గడియారం రామకృష్ణ శర్మ : పాలమూరు జిల్లాకు చెందిన రచయితలలో గడియారం రామకృష్ణ శర్మ ప్రముఖుడు. ఆయన రచించిన శతపత్రం పుస్తక రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది [4]. ఇతడు 1919లో అనంతపురం జిల్లాలో జన్మించి పాలమూరు జిల్లాలోని ఆలంపూర్ లో స్థిరపడ్డాడు. 2006 జూలైలో మరణించాడు. అతడు రచించిన పుస్తకాలలో మాధవిద్యారణ్య చరిత్ర ప్రముఖమైనది.
[మార్చు] రాష్ట్రంలోనే తొలి పంచాయతీ సమితి
స్థానిక సంస్థల చరిత్రలో రాష్ట్రంలో జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఆంద్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ ఎంపికైనది. 1959, అక్టోబర్ 14న అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడి సమితికి ప్రారంభోత్సవం చేసినాడు. ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి. (మొదటి సమితిని రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు).
[మార్చు] విద్యారంగం
మహబూబ్ నగర్ జిల్లాలో 1955-56 నాటికి 1160 ప్రాథమిక పాఠశాలలు, 20 ప్రాథమికోన్నత పాఠశాలలు, 5 ఉన్నత పాఠశాలలు ఉండగా, 2006-07 నాటికి ఈ సంఖ్య పెరిగి 2860 ప్రాథమిక, 987 ప్రాథమికోన్నత, 729 ఉన్నత పాఠశాలలు, 82 జూనియర్ కళాశాలకు చేరింది.[5]
[మార్చు] వర్షపాతం, వాతావరణం
మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపాతం తక్కువ. జిల్లా మొత్తంపై సగటు వార్షిక వర్షపాతం 60.44 సెంటీమీటర్లు. అందులో అధికభాగం నైరుతి రుతుపవనాల వల్ల జూన్, జూలై మరియు ఆగస్టు నెలలలో కురుస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు వాయుగుండం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదౌతుంది. జిల్లాలో సగటు వర్షపాతంలో ప్రాంతాల మద్య తేడాలున్నాయి. దక్షిణవైపున తుంగభద్ర మరియు కృష్ణానది తీరగ్రామాలు భారీ వర్షాల సమయంలో నీటమునిగితే, జిల్లా వాయువ్య ప్రాంతమైన నారాయణ పేట డివిజన్‌లో కరువు తాండవిస్తుంది.
జిల్లాలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. సముద్రతీరం చాలా దూరంలో ఉండుటవల్లనూ, సమీపంలో పెద్ద చెరువులు లేకపోవడం వల్లనూ మరియు చుట్టూ కొండలు చుట్టబడి ఉండుటచే చల్లని గాలులకు అవకాశం తక్కువగా ఉంది. ఈ వాతావరణం ప్రత్తి వంటి పంటలకు చాలా అనువైనందున జిల్లాలో ప్రత్తి విస్తారంగా సాగుచేయబడుతున్నది. వేసవి కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటుంది. శీతాకాలంలో నవంబర్, డిసెంబర్ మాసాలలో 15-18 డిగ్రీలకు చేరుకుంటుంది. మిగితా జిల్లాలతో పోలిస్తే శీతాకాలంలో చలి తక్కువగా ఉన్ననూ, వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.
[మార్చు] నీటిపారుదల సౌకర్యం
- జిల్లాలో నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి : 1.63 లక్షల హెక్టార్లు.
- భారీ నీటిపారుదల ప్రాకెక్టులు :
-
- జూరాల ప్రాజెక్టు
- రాజోలీ బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్)
- ఆర్డీఎస్ లింక్ కాలువలు
- సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
- మద్యతరహా ప్రాజెక్టులు :
-
- కోయిల్ సాగర్ ప్రాజెక్టు
- సరళా సాగర్ ప్రాజెక్టు
- చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు :
-
- 669 చిన్ననీటి పారుదల ప్రాజెక్టుల కింద సుమారు 1.5 లక్షల ఎకరాలు సాగవుతున్నది [6].
- ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులు :
-
- నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్
- కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్
- భీమా లిఫ్ట్ ఇరిగేషన్
[మార్చు] జిల్లాలో ఇటీవలి ముఖ్య పరిణామాలు
- 2008 జనవరి , 4 : నారాయణపేట మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ లలితాబాయి నామాజీ మృతి.
- 2007 డిసెంబర్, 27 : గడియారం రామకృష్ణశర్మ రచించిన శతపత్రం ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది
- 2007 డిసెంబర్, 2 : ఆమన్‌గల్ మండలాధ్యక్షుడు పంతూనాయక్ హత్య.
- 2007 జూన్, 24 : భారీ వర్షపాతం వల్ల ఆలంపూర్ జోగుళాంబ దేవాలయం నీట మునిగింది.
- 2007 జనవరి,19 : కృష్ణానదిలో పుట్టి మునిగి 60 మంది మృతిచెందారు.
[మార్చు] మూలాలు
- ↑ http://mahabubnagar.nic.in/history.html
- ↑ http://mahabubnagar.nic.in/history.html
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో మహబూబ్ నగర్ జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
- ↑ http://www.eenadu.net/district/districtshow1.asp?dis=mahaboobnagar#1 తీసుకున్న తేది 27.12.2007
- ↑ ఈనాడు దినపత్రిక జిల్లా ఎడిషన్ తేది 26.01.2008 పేజీ సంఖ్య 8
- ↑ http://irrigation.cgg.gov.in/dp/MahaboobnagarDistrictProfile.jsp
