మహబూబ్ నగర్ పట్టణం
| ?మహబూబ్ నగర్ ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | మహబూబ్ నగర్ పట్టణం |
| ప్రాంతం | తెలంగాణ |
| జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
| జనాభా | 1,39,534 (2001) |
మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర స్థానమైన మహబూబ్ నగర్ పట్టణం భౌగోళికంగా జిల్లా మధ్యలో రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు నైరుతి వైపున 100 కిలోమీటర్ల దూరంలో 16°74" ఉత్తర అక్షాంశం, 78°00" తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఉన్నది. చుట్టూ ఎత్తయిన కొండలు, గుట్టలచే ఆవరించబడిన ఈ పట్టణానికి రవాణా పరంగా రోడ్డు మరియు రైలు మార్గాన మంచి వసతులున్నాయి. వ్యవసాయికంగా మరియు పారిశ్రామికంగా ఈ పట్టణం అంతగా అభివృద్ధి చెందలేదు. పట్టణ పాలన స్పెషల్ గ్రేడు పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది. జిల్లా కేంద్రం కావడంతో మండల, డివిజన్ స్థాయి కార్యాలయాలతో పాటు అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు పట్టణంలో ఉన్నాయి. పాలమూరు అని కూడా పిల్వబడే ఈ పట్టణానికి చరిత్రలో రుక్కమ్మపేట అని పేరు ఉండేది. 1883 నుండి ఈ పట్టణం జిల్లా కేంద్రంగా సేవలందిస్తున్నది. రాజకీయంగా ఈ పట్టణం నుంచి పలువురు నాయకులు ప్రసిద్ది చెందినారు. 2009 శాసనసభ ఎన్నికలలో మహబూబ్ నగర్ స్థానం నుంచి గెలుపొందిన ఎన్.రాజేశ్వర్ రెడ్డి పట్టణానికి చెందిన వ్యక్తే. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భాజపా, తెరాసలు బలంగా ఉన్నాయి. పట్టణ సమీపంలో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన పిల్లలమర్రి పేరుతో 700 సంవత్సరాల చరిత్ర ఉన్న పురాతనమైన, విశాలమైన మర్రి చెట్టు ఉంది.[1] పిల్లలమర్రి సమీపంలో పురావస్తు మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి.[2]
[మార్చు] పట్టణ చరిత్ర
ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించుట కారణంగా ఈ పట్టణానికి పాలమూరు అని పేరు ఉండేది. హైదరాబాదును పాలిస్తున్న ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ పట్టణ నామాన్ని మహబూబ్ నగర్‌గా మార్చబడింది. ఇప్పటికీ గ్రామీణ ప్రజలు పాలమూరు నామంతోనే వ్యవహరిస్తారు. మొదట చిన్న పట్టణంగా ఉన్న మహబూబ్ నగర్‌ను జిల్లా కేంద్రం చేయడంతో క్రమక్రమంగా అభివృద్ధి చెందనారంభించింది. 1883లో జిల్లా ప్రధానకేంద్రం నాగర్‌కర్నూలు నుంచి మహబూబ్‌నగర్‌కు మార్చబడింది.[3] నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో ఇక్కడ రైలు మార్గం ఏర్పాటు కావడంతో సౌలభ్యం దృష్ట్యా జిల్లా కేంద్రాన్ని ఇక్కడికి మార్చినారు. ప్రారంభంలో లోకాయపల్లి సంస్థానంలో ఉన్న ఈ ప్రాంతం చుక్కాయపల్లిగా కూడా పిలువబడింది. ఈ ప్రాంతానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చినవారు స్థిరపడడంతో పాలమూరు, పాతపాలమూరు, న్యూటౌన్ అనే మూడు ప్రాంతాలు ఏర్పడ్డాయి. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకర్లపై జరిగిన ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన పలువులు పాల్గొన్నారు. ఆ సమయంలో ఇక్కడ ఆర్యసమాజ్ శాఖ బలంగా ఉండేది. క్రమేణా ఈ మూడు ప్రాంతాలు ఏకమైనాయి. ప్రస్తుతం సుమారు 2 లక్షల జనాభా కల ఈ పట్టణంలో 38 వార్డులు కలవు.
[మార్చు] వాతావరణం
ఈ పట్టణ వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండటం వలన ఏడాది లో 9 నెలలు (మార్చి, ఏప్రిల్, మే మినహా) ఆహ్లాదకరంగా ఉంటుంది. వేడిమి, ఇతర ప్రధాన నగరాలలాగానే కనిపించినా, వాస్తవ వేడిమి, ఏ మాత్రం తేడా లేకుండా ఉంటుంది. ఇతర జిల్లా ప్రధాన నగరాల్లో కర్నూల్, వరంగల్ నగరాలలో కనిపించే వాతావరణం కన్నా సుమారు 10 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.
[మార్చు] రవాణా వ్యవస్థ
- రోడ్డు రవాణా
రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండుట మరియు హైదరాబాదు నుంచి కర్ణాటక రాష్ట్రపు ప్రముఖ నగరాలకు వెళ్ళు రహదారి ఈ పట్టణం గుండా పోవుటచే రోడ్డు రవాణా సౌకర్యవంతంగా ఉన్నది. 7వ నెంబరు జాతీయ రహదారి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరం నుంచి (భూత్పూర్ వైపు) వెళ్ళుచున్నది. హైదరాబాదు నుంచి కర్ణాటక రాష్ట్రపు ప్రధాన నగరాలైన రాయచూరు, ఉడిపి, మంగళూరు, బళ్ళారి, గదగ్ మరియు గోవా-పనాజీ వైపు వెళ్ళు బస్సులు మహబూబ్ నగర్ పట్టణం గుండా వెళ్తాయి.
- రైలు రవాణా
దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన మహబూబ్ నగర్ సికింద్రాబాదు - ద్రోణాచలం మార్గంలో ఉంది. సికింద్రాబాదు నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనూ, కర్నూలు నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్, కాచిగూడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ రైలుబండితో సహా మొత్తం 24 రైళ్ళు రోజూ ప్రయాణిస్తాయి. ఇవి కాకుండా వారానికి రెండు, మూడు సార్లు ప్రయాణించు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు 8 సార్లు ప్రయాణిస్తాయి. మహబూబ్ నగర్ పట్టణంలో 2 రైల్వే స్టేషన్లు మరియు పట్టణ శివారులో ఒక రైల్వే స్టేషన్ ఉన్నది. ప్రధాన రైల్వే స్టేషన్ మినహా మిగితా రెండు రైల్వే స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగవు. ప్రధాన రైల్వే స్టేషన్‌లో నాలుగు ప్లాట్‌ఫారములు ఉన్నవి. ప్రారంభంలో మీటరు గేజిగా ఉన్న ఈ మార్గం తొలుత సికింద్రాబాదు-మహబూబ్‌నగర్ వరకు ఆ తర్వాత 1996లో మహబూబ్‌నగర్ నుంచి ద్రోణాచలం వలకు బ్రాడ్‌గేజీగా మార్చబడింది.
- వాయు రవాణా
మహబూబ్ నగర్ పట్టణములో వాయు రవాణా సదుపాయము లేదు. సమీపంలోని విమానాశ్రయము శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయము. ఇది పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.
[మార్చు] పట్టణ పాలన
మహబూబ్ నగర్ పట్టణపు పాలన స్పెషన్ గ్రేడ్ పురపాలక సంఘముచే నిర్వహించబడుతుంది. పట్టణములో నీటిసరఫరా, వీధిదీపముల నిర్వహణ, డ్రైనేజీ నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర కార్యకలాపాలు పురపాలక సంఘముచే చేపట్టబడుతుంది. రజాకారుల కాలంలో "ధరోగా సఫాయి"గా పిల్వబడిన పట్టణ పురపాలక స్థాయి అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. 1952లో మహబూబ్‌నగర్‌కు మున్సీపాలిటీగా గుర్తింపునిచ్చారు.[4] అప్పుడు పురపాలక సంఘంలో 15 వార్డులు ఉండగా ప్రస్తుతం 38 వార్డులు ఉన్నాయి. ప్రారంభంలో మున్సీపాలిటీ స్థాయి మూడవగ్రేడు ఉండగా, ఇది కూడా క్రమక్రమంగా పెరుగుతూ ప్రస్తుతం స్పెషల్ గ్రేడు స్థాయికి పెరిగింది. తలపండిన మేధావులు, రాజకీయ ఉద్ధండులు ఈ పురపాలక సంఘానికి చైర్మెన్లుగా వ్యవహరించారు.
[మార్చు] శాంతి భద్రతలు
పట్టణంలో శాంతిభద్రతలకై 3 పోలీస్ స్టేషన్లు, ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ రాయచూరు, భూత్‌పూర్ వెళ్ళే కూడలి అయిన పరదేశీనాయుడు చౌక్ వద్ద, టూటౌన్ పోలీస్ స్టేషన్ న్యూటౌన్ ప్రాంతంలోనూ, రూరల్ పోలీస్ స్టేషన్ హైదరాబాదు వెళ్ళు మార్గంలో ఉండగా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ న్యూటౌన్ ప్రాంతంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉంది.
[మార్చు] విద్యుత్తు సరఫరా
పట్టణంలో విద్యుత్తు సరఫరాకై 350 ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, వీటి ద్వారా 40,000 కనెక్షన్లకు విద్యుత్తు సరఫరా అవుతుంది.[5] విద్యుత్తు సరఫరాకై పట్టణాన్ని 3 విభాగాలుగా చేసి, ప్రతి విభాగంలోనూ ఎస్.ఇ.స్థాయి అధికారి నేతృత్వంలో కార్యాలయాలు ఏర్పాటుచేయబడినవి. ప్రధాన విద్యుత్ కార్యాలయము పద్మావతి కాలనీలో హైదరాబాదు వెళ్ళు మార్గంలో ఉంది.
[మార్చు] రాజకీయాలు
- ప్రధాన వ్యాసం: మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం
- ప్రధాన వ్యాసం: మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం
మహబూబ్ నగర్ పట్టణము మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. లక్షకు పైగా పట్టణ ఓటర్లు ఉండుటచే శాసనసభ స్థానంలో ఈ పట్టణము తన ఉనికిని నిరూపించుకుంటోంది. ప్రధాన రాజకీయ పక్షాలు తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఉండగా, భారతీయ జనతా పార్టీకి కూడా పట్టణంలో గుర్తింపు ఉంది. 2012 మార్చిలో జరిగిన మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో పట్టణ ప్రాంతం నుంచి భాజపా, తెరాసలకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీక కంటె అధికంగా ఓట్లు లభించాయి.
[మార్చు] క్రీడలు
పట్టణంలో క్రికెట్ క్రీడకు మంచి జనాదరణ ఉంది. ఇవే కాకుండా వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ తదితర క్రీడలకు కూడా గుర్తింపు ఉంది. పట్టణం మధ్యలో బస్టాండు సమీపంలో ఉన్న క్రికెట్ స్టేడియంలో అంతర్‌జిల్లా క్రికెట్ పోటీలు, ఇతర పోటీలు నిర్వహించబడుతాయి. బాలుర జూనియర్ కళాశాల మైదానంలో కూడా క్రికెట్, ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించబడుతాయి. ఇవే కాకుండా జిల్లా పరిషత్తు మైదానంలో వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ తదితర అంతర్రాష్ట్ర పోటీలు నిర్వహిస్తారు.
[మార్చు] పర్యాటక ప్రదేశాలు
మహబూబ్‌నగర్ పట్టణానికి సమీపంలోని పర్యాటక ప్రదేశాలు:
|
|
[మార్చు] ప్రధాన వీధులు
- మెట్టుగడ్డ
ప్రారంభంలో మహబూబ్ నగర్ పట్టణానికి ఇది చివరి ప్రాంతం కావడంతో మెట్టు, ఎత్తయిన ప్రాంతంలో ఉండుటచే గడ్డ రెండు పదాలు కల్సి మెట్టుగడ్డగా పేరువచ్చింది.[6] ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రభుత్వ బి.ఎడ్.కళాశాల, విద్యుత్తు కార్యాలయం, జిల్లా గ్రంథాలయ సంస్థ, పలు బ్యాంకులు ఉన్నాయి. మెట్టుగడ్డ చౌరస్తాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి విగ్రహం ఉంది. ఇది చెన్నారెడ్డి కూడలిగా పేరుపొందింది. పిల్లలమర్రి వెళ్ళడానికి మార్గం ఇక్కడి నుంచే ప్రారంభమౌతుంది.
- రాజేంద్రనగర్
రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు కల ప్రాంతము రాజేంద్రనగర్‌గా పిల్వబడుతుంది. రైల్వేస్టేషన్‌తో పాటు, పలు విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇటీవలికాలంలో అపార్టుమెంటు నిర్మాణాలు జోరందుకున్నాయి. పలు ప్రైవేటు విద్యాసంస్థలు, బి.ఎస్.ఎన్.ఎల్.కార్యాలయము, ఈ-సేవ కేంద్రము ఈ ప్రాంతములో కలదు.
- న్యూటౌన్
పట్టణంలో వ్యాపారపరంగా అభువృద్ధి చెందిన ప్రాంతము న్యూటౌన్. ప్రారంభంలో పట్టణ శివారులో ఉండేది కాబట్టి ఈ ప్రాంతాన్ని న్యూటౌన్‌గా వ్యవహరించబడింది, కాని నేడు ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెంది పట్టణంలో కలిసిపోయింది. పలు బ్యాంకులు, ఏ.టి.ఎం.కేంద్రాలు, వ్యాపార సంస్థలకు ఇది కేంద్రస్థానంగా ఉంది.
- క్లాక్ టవర్
గడియారం చౌరస్తా అని కూడా పిలువబడే ఈ ప్రాంతం పట్టణంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటి. ఈ ప్రాంతము పాత పాలమూరుకు, కొత్త పట్టణానికి అనుసంధానంగా ఉంది. పట్టణ పురపాలక సంఘము ఈ ప్రాంతంలోనే ఉంది. వాణిజ్యపరంగా ఈ ప్రాంతము అభివృద్ధి చెందినది. సామాన్య అవసరాల నుండి, శుభ కార్యాలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. పట్టణంలోనే ఇది అతిపెద్ద కూడలి.
- పద్మావతి కాలని
పట్టణంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటైన పద్మావతి కాలని హైదరాబాదు వెళ్ళు మార్గంలో ఉంది. ఇక్కడ విద్యావంతులు అధికం.[7] శ్రీకృష్ణ దేవాలయం, అయ్యప్పస్వామి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
- వీరన్నపేట
ఈ ప్రాంతపు అసలుపేరు గుండ్లగుట్ట. వీరశైవులు వీరభద్రస్వామిని ప్రతిష్టాపనచేసిన పిదప వీరన్నగుట్టగా పేరు వచ్చింది. క్రమేణా ఈ పేరు వీరన్నపేటగా వాడుకలోకి వచ్చింది. ఈ ప్రాంతంలో పూర్వకాలాల నుంచి శ్రీనీలకంఠేశ్వస్వామి ఉత్సవాలు ప్రతి శ్రావణమాసంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీకళాశాల, టౌన్ రైల్వేస్టేషన్ తదితర సదుపాయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
- పుట్నాలబట్టి
పాలమూరు "కోఠి" ప్రాంతంగా పేరుపొందిన మార్కెట్ రోడ్‌కే వాడుకలో పుట్నాలబట్టిగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో పూర్వకాలం నుంచి సంతలకు ప్రసిద్ధి. ఇక్కడ అన్ని రకాల వస్తువులు లభ్యమౌతాయి. వేడి వేడి పుట్నాలు, బొరుగులు రాశులుగా పోసి అమ్ముతుంటారు. పిల్లలకు, పెద్దలకు, మహిళలకు, విద్యార్థులకు కావలసిన ప్రతి సరకే కాకుండా వ్యాపారవేత్తలకు కావలసిన తక్కెడలు, తూనికరాళ్ళు కూడా ఈ ప్రాంతంలో లభ్యమౌతాయి. దీనికి సమీపంలోనే కూరగాయల మార్కెట్ ఉంది.
- షాషాబ్ గుట్ట
షాసహాబ్ దర్గా ఉన్న కారణంగా ఈ ప్రాంతం షాషాబ్ గుట్టగా పేరుపొందింది. పెద్దచెరువుని ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో అనేక ప్రైవేటు కళాశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఇది పట్టణంలోని 13వ వార్డు పరిధిలోకి వస్తుంది.
- తిరుమల దేవుని గుట్ట
టి.డి.గుట్టగా పిల్వబడే ఈ ప్రాంతం తాండూరు వెళ్ళే మార్గంలో ఉన్న రైల్వేగేట్ నుంచి ప్రారంభమౌతుంది. చిన్న చిన్న వ్యాపార సంస్థలు, పలు పాఠశాలలు, దేవాలయాలు ఈ ప్రాతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పురాతనమైన శ్రీ తిరుమలనాథస్వామి ఆలయం వెలిసినందున తిరుమలదేవుని గుట్టగా పిలుస్తుంటారు. సుమారు 300 సంవత్సరాల క్రిందటే లోకాయపల్లి సంస్థానాధీశుల కాలంలోనే ఈ ఆలయం వెలిసినట్లు చరిత్రకారుల కథనం.[8] ఇక్కడ ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రసిద్ధిగాంచిన శ్రీబాలాంజనేయస్వామి ఆలయం కూడా ఈ ప్రాంతంలో ఉంది.
[మార్చు] పట్టణంలోని ముఖ్య కార్యాలయాలు
- కలెక్టరు కార్యాలయము
1930లో మహబూబ్ నగర్‌లో కలెక్టరు కార్యాలయం స్థాపించబడింది. 1960-61లో తొలి ఐ.ఎ.ఎస్. కలెక్టరుగా డి.శంకరగురుస్వామి పనిచేశాడు. ప్రస్తుత కలెక్టరు దమయంతి. కలెక్టరు కార్యాలయం కొత్త బస్సుస్టేషన్‌కు ఎదురుగా ఉంది. దీనితో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు మంచి సౌకర్యవంతంగా ఉంది.
- జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయము
కలెక్టరు కార్యాలయమునకు సమీపంలోనే మూడంస్తుల భవనంలో జిల్లా పరిషత్తు కార్యాలయము ఉన్నది. ఇందులో కల పెద్ద సమావేశమందిరములోనే జిల్లా పరిషత్తు సమావేశం మరియు పలు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించబడతాయి. జిల్లా పరిషత్తు ఎదురుగా పాతికేళ్ళ క్రితం మినీ స్టేడియం నిర్మించబడింది. ఈ స్టేడియంలో పలు క్రీడా పోటీలు, సమావేశాలు, పాఠశాలల వార్షికోత్సవాలు నిర్వహించబడతాయి. జడ్పీ ఆవరణలోనే మండల ప్రజాపరిషత్తు కార్యాలయం కూడా ఉంది.
- జిల్లా గ్రంథాలయ సంస్థ
మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాలకు సమన్వయసంస్థగా ఇది పనిచేస్తుంది. దీని కిందుగా 80 శాఖా గ్రంథాలయాలు కలవు. శాఖా గ్రంథాలయాలకు కాలవసిన గ్రంథాల ఎంపిక, అధికారుల జీతభత్యములు, నిధుల విడుదల తదితర కార్యకలాపాలు ఈ సంస్థచే నిర్వహించబడుతుంది. ఇది వరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పాతభవనం ఉన్న ఈ సంస్థ ఇటీవలే పిల్లలమర్రి రోడ్డులోని నూతన భవనములోకి మార్చబడినది.
- పోలీస్ సూపరిండెంట్ కార్యాలయము
క్లాక్‌టవర్ నుంచి బోయపల్లి రైల్వే గేటు వెళ్ళు రహదారిలో విశాలమైదానంలో ఎస్.పి.కార్యాలయము కలదు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు దీని పరిధిలోకి వస్తాయి. ప్రతిఏటా స్వాతంత్ర్య దినోత్సవం మరియు రిపబ్లిక్ దినోత్సవం నాడు పరేడ్ ఈ కార్యాలయపు గ్రౌండ్‌లో నిర్వహిస్తారు. పరేడ్ అనంతరం ప్రభుత్వ శాఖల ఉత్తమ అధికారులకు సన్మానం కూడా చేయబడుతుంది.
- జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీకార్యాలయం
పట్టణంలోని మాడ్రన్ స్కూల్ కూడలివద్ద జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయం ఉంది. దీని పరిధిలో 5 సంచార వైద్యశాలలు, 2 రక్తనిధి కేంద్రాలు (మహబూబ్ నగర్, వనపర్తి), 3 రక్తనిల్వ కేంద్రాలు (నారాయణపేట, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్) ఉన్నాయి.[9] పట్టణంలోని పాతపాలమూరులో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆరోగ్యకేంద్రం ద్వారా మురికివాడ ప్రజలకు ఆరోగ్యసేవలందిస్తున్నారు. పట్టణ శివారులోని ఏనుగొండ గ్రామంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తున్నారు.
[మార్చు] పండుగలు, సంస్కృతి
మహబూబ్నగర్ పట్టణములో ప్రజలు తెలుగువారు జరుపుకొనే అన్నిరకాల పండుగలు జరుపుకుంటారు. జనవరి మాసంలో సంక్రాంతి పండుగ నుంచి డిసెంబరులో క్రిస్‌మస్ పండుగ వరకు అన్ని మతస్థులు, అన్ని రకాల పర్వదినాలను ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
- గణేశ్ చతుర్థి
ప్రతి ఏటా గణేశ్ చతుర్థినాడు పట్టణంలోని అన్ని ప్రధాన వీధులలో గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించి మూడురోజుల పూజల అనంతరం నిమజ్జనం చేస్తారు. మొదట ఒక మోస్తరుగా ప్రారంభమైన ఈ పండుగ ఇటీవల కాలంలో ఘనంగా జరుపబడుతుంది. పూజలు నిర్వహించే మూడు రోజులే కాకుండా నిమజ్జనంకు ముందు జరిపే గణేశ్ ఊరేగింపులో వేలసంఖ్యలో ప్రజలు హాజరౌతారు. పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద అన్ని వీధుల గణేశ్ విగ్రహాలు కలుస్తాయి. ఇక్కడే గణేశ్ విగ్రహ ప్రతిష్టపన సంఘము మరియు అధికారులు కలిసి వేదికపై నుంచి బహుమతులు అందజేయడం జరుగుతుంది.
- శ్రీరామనవమి
పట్టణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకొనే మరో పర్వదినం శ్రీరామనవమి. ఆ రోజు పట్టణంలోని శ్రీరామ ఆలయాలన్నీ అలంకరించబడి పూజలు, భజనలతో భక్తులను ఆకర్షిస్తాయి. భజనలు, కీర్తనలు ముఖ్యంగా టీచర్స్ కాలనీలోని శ్రీరామమందిరంలో ప్రతి ఏటా చక్కగా నిర్వహిస్తారు.
[మార్చు] దేవాలయాలు
- శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం (పిల్లలమర్రి రైల్వే గేట్ వద్ద)
- శ్రీ రాఘవేంద్రస్వామి దేవాలయం (పరిమళగిరి గుట్ట)
- శ్రీవీరాంజనేయస్వామి ఆలయం (పరిమళగిరి గుట్ట)
- శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం (కొత్త గంజ్)
- శ్రీ రేణుకాఎల్లమ్మ దేవాలయం (కొత్త బస్టాండు వద్ద)
- శ్రీరామాలయం (టీచర్స్ కాలనీ)
- శ్రీఅయ్యప్ప దేవాలయం (అయ్యప్ప గుట్ట)
- శ్రీకృష్ణమందిరము (కాలని)
- శ్రీఆంజనేయస్వామి దేవాలయం (రైల్వేస్టేషన్ వద్ద)
[మార్చు] చారిత్రక కట్టడాలు
- తూర్పు కమాన్
పట్టణంలోని చారిత్రాత్మక కట్టడం తూర్పు కమాన్ ఎంతో ప్రసిద్ధి చెందింది. నాటి స్వాతంత్ర్యోద్యమ స్పూర్తికి ఇది చిహ్నం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇంకనూ నిజాం నిరంకుశ పాలనలో ఉన్న రోజుల్లో కొందరు దేశభక్తి కల ఉద్యమకారులు తూర్పుకమాన్ పై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రయత్నించారు. ఇది గ్రహించిన నిజాం సైనికులు, పోలీసులు ఈ ప్రయత్నాన్ని వమ్ము చేయాలని పహరాకాశారు. అయిననూ పోలీసుల కళ్ళుగప్పి ఉద్యమకారులు తూర్పుకమాన్ పై జాతీయజెండాను రెపరెపలాడించి తమ పంతం నెగ్గించుకున్నారు. పోలీసులు సమీపించగా కమాన్‌పై నుంచి దూకి ఉద్యమకారులు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. నిజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైన పిదప జాతీయ జెండాని ఇక్కడే ఎగురవేసేవారు.[10] సంస్థానాధీశులచే నిర్మించిన మూడు కమాన్లు, రాజప్రసాదం కట్టడాలలో ఇది ఒకటి. మిగితావి మట్టిలో కలిసిపోగా ఇది మాత్రమే మిగిలింది. హైదరాబాదు-రాయచూరు రహదారిపై నుంచి వెళ్ళేవారికి ఇది కనిపిస్తుంది.
[మార్చు] వినోదం
- మహబూబ్‌నగర్ పట్టణంలోని సినిమా థియేటర్లు
|
|
[మార్చు] విద్యాసంస్థలు
|
|
[మార్చు] పట్టణ ప్రముఖులు
- ఎన్.రాజేశ్వర్ రెడ్డి:
- మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ఎన్.రాజేశ్వర్ రెడ్డి పట్టణ రాజకీయ నాయకులలో ప్రముఖుడు. 1991 నుండి రాజకీయాలలో ఉంటూ ప్రముఖ పదవులను అలంకరించాడు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షపదవిని కూడా చేపట్టినాడు. ఇటీవల భాజపాకు రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరిననూ శాసనసభ ఎన్నికలలో టికెట్టు లభించలేదు. స్వంతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మేల్యేగా ఎన్నికైనాడు.[11] అక్టోబరు 30, 2011న మరణించాడు.
[మార్చు] ఇటీవలి సంఘటనలు
- 2011, అక్టోబరు 30: మహబూబ్ నగర్ శాసనసభ్యుడు ఎన్.రాజేశ్వర్ రెడ్డి మరణం.
- 2012, ఏప్రిల్ 3: మహబూబ్‌నగర్ పట్టణ పరిధి విస్తరించబడింది. సమీపంలోని గ్రామాలు పురపాలకసంఘంలో విలీనం చేయబడ్డాయి.
[మార్చు] మూలాలు
- ↑ ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ప్రచురణ, పేజీ 140
- ↑ నా దక్షిణ భారత యాత్రా విసేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 248
- ↑ పెద్ద బాలశిక్ష ప్రథమభాగము, గాజుల సత్యనారాయణ, 100వ ముద్రణ, పేజీ 755
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 02-04-2009
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 27-04-2009
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 25-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 24-04-2009
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా తాబ్లాయిడ్, తేది 09-07-2009
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 08-05-2009
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 27-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 17-05-2009
|
||||||||||||||
|
|||||||||||||||||||||||||||||||
|
|
|
|---|---|
| తిమ్మాపూర్ · కొత్తూర్ · బూర్గుల · షాద్‌నగర్ · బాలానగర్ · రంగారెడ్డిగూడ · రాజాపూర్ · గొల్లపల్లి · జడ్చర్ల · ఏనుగొండ · మహబూబ్ నగర్ · మన్యంకొండ · కోటకద్ర · దేవరకద్ర · కౌకుంట్ల · కురుమూర్తి · కొన్నూర్ · వనపర్తిరోడ్ · అజ్జకోల్ · శ్రీరాంనగర్ · ఆరేపల్లి · గద్వాల · పూడూర్ · పెద్దదిన్నె · ఇటిక్యాల్ · మనోపాడ్ · జోగులాంబ హాల్ట్ · ఆలంపూర్ రోడ్ · కృష్ణ |